పొద్దున్నే బద్దకంగా లేచి కిటికీ తెరిచి చూస్తే.. ఆహా! ఎంత మనోహర దృశ్యం.! కదలకుండా అక్కడే నించుండిపోయా చాలాసేపు!
ఆకాశం నుంచి ఏ హిమకిన్నెరో వెండి పూల వర్షం కురిపిస్తోంది. ఎటువైపు చూసినా చిక్కగా అల్లుకుపోయి అలవోకగా జాలువారుతున్న మంచు పూల వానే!
నిన్నటి దాకా ఎంతటి నైరాశ్యం!
శిశిరం రాకతో చెట్లన్నీ పువ్వులనే కాదు ఆకుల్ని కూడా విదిల్చేసి ఆ వియోగం నింపిన శూన్యంలో ఒంటరిగా మిగిలిపోయాయి. రాలిపోయిన జ్ఞాపకాల జాడల్ని వెతుక్కుంటూ మౌనంగా దీనంగా కనిపించాయి.
ఇప్పుడు.. ఈ ఉదయాన ఎంతటి పారవశ్యం!
అల్లన ఆకాశం నుంచి ఎగిరి వచ్చిన ఈ మంచు పువ్వులు తమ అనురాగంతో మౌనముద్ర దాల్చిన ఆ మోడువారిన చెట్ల ఒంటరితనాన్ని కరిగిస్తూ సరికొత్త ప్రేమరాగాల్ని పలికిస్తున్నాయి. నిన్నటిదాకా కాటుక నలుపులో బోసిగా కనిపించిన ఆ మోడులే ఇప్పుడు తెల్లటి మంచు పూరేకులని అలంకరించుకొని ముద్దుగా ముస్తాబై కనిపిస్తున్నాయి.
ఏ దిక్కున చూసినా నల్లటి మోడులైన తరుల పైన కొలువుదీరిన తెల్లటి మంచు రవ్వల కలబోతగా సొంపుగా ప్రకృతి గీసిన సొగసైన నలుపు తెలుపుల చిత్తరువే!
నిన్నటిదాకా దిగులు ఆవరించినట్టున్న పరిసరాలన్నీ ఇప్పుడు సరికొత్త ధవళ వర్ణ కాంతులతో శాంతి స్వరాన్ని ఆలాపిస్తున్నట్టుంది. ఏ దిగులూ శాశ్వతం కాదు.. సంబరాన్ని మోసుకొచ్చే ఉదయం ఎప్పుడో ఒకప్పుడు తప్పక ఎదురొస్తుందంటూ ఆశావాదాన్ని ఉపదేశిస్తున్నట్టుంది.
నాకూ ఆ నిహారపు జల్లుల్లో తడిసిపోవాలనిపించింది.. బయటికి వెళ్ళగానే ఒక్కసారే మంచు రవ్వలన్నీ నా వైపే పరిగెత్తుకొచ్చి స్వాగతం పలికాయి. ఆ చిరుజల్లు నన్నే కాదు నా మనసుని కూడా తడిపేస్తున్నట్టుంది. ఎందుకంటే మంచు పూలన్నీ గాలిలో రివ్వున ఎగురుతూ వచ్చి, మృదువుగా మొహాన్ని తాకుతుంటే పసిపిల్లలు తమ బుల్లి పెదాలతో చెక్కిలిపై సుతారంగా ముద్దాడినట్టుంది ఆ మధురానుభూతి!
రాత్రిపూట చీకట్లు వ్యాపించాక వీధి దీపాల వెలుగులో మిలమిల మెరుస్తూ కనపడే హిమపాతం.. అది మరో అద్భుతం!
తమతో పాటు బోలెడంత సంతోషాన్నీ, సంబరాన్ని మోసుకుని దివి నుంచి భువి దాకా దిగొచ్చిన మంచు పూలు ఈ నిశ్శబ్దపు రాతిరిలో ఏవో శ్రావ్యమైన రాగాల్ని పలికిస్తున్నాయి. రెప్పైనా వాల్చకుండా తదేకంగా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది.. ఆ కిటికీ దగ్గరే నించుండిపోయి రాత్రంతా మబ్బుల నుంచి జాలువారే తుషారాన్నే చూస్తూ గడిపెయ్యాలనిపిస్తుంది.
ప్రకృతి పడుచు ప్రేమగా పంచుతున్న ఈ మంచు ముసురు మోహంలో పడి మునకలేస్తున్న నా మనసు సంబరాన్ని ఎంతని చెప్పగలను!
*********
* మంచు పూలని నా మాటల్లో చూపిస్తానని నే మాట ఇచ్చిన ఓ ప్రియనేస్తానికి అంకితం!
** నేను తీసిన మరిన్ని చిత్రాలతో మంచుపల్లకీ ఇక్కడ.