Wednesday, April 21, 2010

వీడుకోలు జ్ఞాపకాలు

వీడుకోలు.. ఎవరు ఎవరికి సందర్భంలో చెప్పినా, చెప్పే వారికీ అందుకునే వారికీ కూడా మనసు భారమౌతుంది. సాధారణంగా యీ వీడుకోలు సన్నివేశాలు జీవితంలో ఎప్పటికీ గుర్తుంటాయనుకుంటా!

మొట్టమొదటి వీడుకోలు నన్ను చిన్నప్పుడు స్కూల్లో దించేప్పుడనుకుంటాను. అప్పుడు నేనెలా ఫీలయ్యానో నాకు గుర్తు లేదు గానీ, ఇప్పటికీ మా అమ్మమ్మ నా స్కూలు రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడూ. ప్రతి రోజూ స్కూలుకెళ్ళేప్పుడు 'నువ్వు కూడా వస్తావా రావా స్కూల్ దాకా' అని తెగ మారాం చేసేదాన్న . తీరా మా అమ్మమ్మ నన్ను తీసుకుని బయలుదేరి స్కూలున్న వీధి మొగ దాకా వచ్చేసరికి 'ఇంక నువ్వెళ్ళిపో.. స్కూల్ దాకా రావద్దు. నేనొక్కదాన్నే వెళ్తా!' అని అల్లరి పెట్టేదాన్న. బహుశా.. స్కూల్లో అందరూ అమ్మమ్మని తోడు తీస్కొచ్చుకున్నావ్ అని నవ్వుతారనేమో! ఇంట్లో ఉండి స్కూలుకెళ్ళడం మూలాన స్కూలు రోజులన్నీ హాయిగా ఆడుతూ పాడుతూ దొర్లిపోయాయి. పదో తరగతికి బాబాయి వాళ్ళింట్లో ఉండి చదువుకున్నాకాబట్టి ఎంచక్కా ఇద్దరు తమ్ముళ్ళతో ఆడుకుంటూ మరింత సరదాగా గడిచిపోయింది ఏడు కూడా.

ఇహ కాలేజీ చదువులకొచ్చేసరికి మొదలయ్యాయి అసలు తిప్పలు నాకూ, ఇంట్లోవాళ్ళకీ కూడా! సరే, ఎలాగయితేనేం ఆరేడు గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఊర్లో హాస్టల్లో చేర్పించారు నన్ను ఇంటర్మీడియేట్ చదువు కోసం. ప్రైవేటు కాలేజీల్లో సీటు కోసం ముందు ప్రవేశ పరీక్ష లాంటి హడావిడి కూడా ఉండటం చేత రెండు మూడు సార్లు అటూ ఇటూ తిరగాల్సి వచ్చింది. నాకేమో అంత దూరం ప్రయాణాలు అలవాటు లేకపోవడం మూలానా, బస్సు పడకపోవడం మూలానా ఆరేడు గంటలూ కూడా నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని తీస్కెళ్ళాల్సి వచ్చేది నాన్నకి. నాకోసం నాన్న పడ్డ శతకోటి కష్టాల్లో ఇదొకటన్నమాట!

సరే, ఏమయితేనేం కాలేజీలో నాకు సీటు రావడం, హాస్టల్లో చేర్పించడం జరిగింది. ఎందుకైనా మంచిదని రెండ్రోజులు అక్కడే మా పెదనాన్న వాళ్ళింట్లో ఉండిపోయారు మా నాన్న. మొదటి రోజు కాలేజీకి వెళ్ళొచ్చాక సాయంత్రం పూట నన్ను చూడ్డానికొచ్చారు నాన్న. ఆయన్ని చూసీ చూడగానీ, ముందస్తు హెచ్చరికలు లేని తుఫానులాగా నా ఏడుపు మొదలయింది. ఎంతోసేపు బతిమాలీ బామాలీ ధైర్యం చెప్పేసరికి నేను కాస్త శాంతించి ఏడుపుకి మధ్య మధ్యలో కాసేపు బ్రేక్ ఇచ్చి నా కాలేజీ, హాస్టల్ కష్టా లిస్టు చెప్పాను. అందులో ముఖ్యమైంది తెలుగు మీడియంలో చదివిన నాకు ఇప్పుడు కొత్తగా ఇంగ్లీషు మీడియం వల్ల వచ్చిన ఇబ్బందులు. అప్పటిదాకా క్లాసులోనైనా, స్కూల్లోనైనా అందరికన్నా ముందుండి అందరి మేష్టార్ల అభిమానాన్ని చూరగొన్న నేను ఇప్పుడేదో బాగా వెనకబడిపోయినట్టు నా బాధన్నమాట! మా నాన్న చాలాసేపు నాకు బోలెడన్ని మోటివేషన్ స్టోరీలు గట్రా చెప్పి, అసలు ఇంకో వారమాగితే 'ఓస్ ఇంతేనా! ఇంగ్లీషు మీడియం అంటే ఏమీ లేదు నాన్నా.. చాలా సులువు' అని నువ్వే నాకు చెప్తావు. నీ సామర్థ్యం నీకు తెలీదు, నువ్వు ఖచ్చితంగా చేయగలవు, అదీ ఇదీ.. అని బోలెడంత ధైర్యం చెప్పారు. ఇంకా, వేరే పెద్ద పెద్ద లెక్చరర్ల దగ్గరికి తీస్కెళ్ళి మాట్లాడించారు. వాళ్ళందరూ నీలాగా తెలుగులో చదువుకున్నోళ్ళే ఇప్పుడీ స్థాయికొచ్చారు, నువ్వైనా అంతే భవిష్యత్తులో అని బాగా ధైర్యం నూరిపోసారు. ఎలాగయితేనేం మళ్ళీ మళ్ళీ అన్నీ జాగ్రత్తలు చెప్పి హాస్టల్లో వదిలి పెదనాన్న ఇంటికి వెళ్ళిపోయారు నాన్న.

నాన్న అందించిన ధైర్యంతో, ఏడ్చీ ఏడ్చీ అలసిపోయి ఉండటంతో రాత్రి నేను హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయాను. కానీ పాపం మా నాన్నకి మాత్రం నిద్ర పట్టలేదట ఎంత రాత్రైనా. 'నా బంగారు తల్లి ఇంకా ఏడుస్తున్నదేమో ఒక్కతే హాస్టల్లో' అని చాలా గాభరా వచ్చేసిందట. ఇహ అట్టే నిద్ర పట్టకపోవడంతో నా మీద బెంగ ఎక్కువైపోయి అర్ధరాత్రి దాటాక పెదనాన్న బండి తీసుకుని ఉన్నపళంగా మా హాస్టల్ దగ్గరికొచ్చారట. సమయంలో నన్ను చూసే వీలుండదని తెలిసినా రాకుండా ఉండలేకపోయారట. హాస్టలు దగ్గరికొచ్చి ఊరికే బిల్డింగ్ ఎదుట కాసేపు నించుని చూసి మళ్ళీ వెనక్కి వెళ్లిపోయారట! తెల్లారి మళ్ళీ వచ్చినప్పుడు నేను కాస్త బానే మాట్లాడేసరికి క్రమం తప్పకుండా ఉత్తరాలు రాయమని చెప్పి పెద్ద కట్ట ఎన్వలప్పులు కొనిచ్చి మరీ ఊరెళ్ళారు. అప్పటికి ప్రహసనం ముగిసాక నేనింకో ఘనకార్యం చేసాను. రోజుల్లో నేనూ, మా నాన్నా కనీసం వారానికో ఉత్తరమైనా రాసుకునేవాళ్ళం. (ఇప్పుడవన్నీ ఎక్కడో పోయాయి :() ఓసారి నాకు బాగా ఇల్లు గుర్తొచ్చినప్పుడు నా బెంగంతా ఉత్తరంలో నింపేసి పంపించాను. నింపే కార్యక్రమంలో ఉత్తరమంతా కన్నీళ్ళతో తడిసిపోయింది కూడానూ! ఉత్తరం అందుకునే వేళకి నాన్నకి బాగా జ్వరంగా ఉందట. అయినా గానీ, అమ్మా, నాన్నా కలిసి వెంటనే బయలుదేరి బస్సులో ఖాళీ లేకపోతే రాత్రంతా నుంచుని మరీ వచ్చారు నన్ను చూడ్డానికి. మొత్తానికి ఎలాగోలా తిప్పలు పడి నాకు నచ్చచెప్పి, నాలో ధైర్యాన్ని నింపి, అవసరమైనవన్నీ అమర్చి, అన్నీ జాగ్రత్తలు చెప్పి ఇంటికెళ్ళి పోయారు.

మొత్తానికి, ఈ రెండు సంఘటనల నుంచీ నేను నేర్చుకున్న జీవిత పాఠం ఏంటయ్యా అంటే... అమ్మా నాన్న మనని ఎక్కడైనా కొత్త ప్రదేశంలో వదిలి వెళ్ళేప్పుడు మనకి బాధగా ఉన్నా సరే, వాళ్ళ ముందు ఓ పడీ పడీ ఏడవకూడదు. తరవాత మనం బానే ఉన్నా గానీ, వాళ్ళు మాత్రం పదే పదే అది గుర్తు చేసుకుని బెంగ పడతారు మన గురించి. అలాగే, ఇంట్లో వాళ్లకి దూరంగా ఉన్నప్పుడు ఏదైనా బాధనిపించినా వెంటనే ఆ ఏడుపులోనే ఉత్తరాలు రాయడం, ఫోన్లు చేయడం గట్రా చేసి వాళ్ళని బెంబేలెత్తించకూడదు. కాస్త నిమ్మళించాక పరిస్థితి అదుపులోకి వచ్చాక మాత్రమే మాట్లాడాలి అని. బహుశా, అప్పటి నుంచే అనుకుంటా! 'నా గురించిన బాధ్యత నేనే తీసుకోవాలి. నాకు ఎదురయ్యే చిన్నా చితకా సమస్యలని నేనే ఎదుర్కొని పరిష్కారం కనుక్కోవాలి' అంటూ ఆలోచించే వ్యక్తిత్వం పెంపొందించుకోవడం మొదలయింది.

అమ్మా నాన్నా పాపం ఇన్ని ఇబ్బందులు పడి చదివించినా ఇంటర్ రెండేళ్ళు, తరవాత మెడిసిన్ కోసం మరో ఏడాది వెలగబెట్టిన లాంగ్ టర్మ్ కోచింగు అయ్యేసరికి ఈ విధంగా నేను పెట్టిన నానా హింసకి అమ్మానాన్న పేషంట్లయ్యే పరిస్థితి వచ్చింది కానీ నాకు మాత్రం డాక్టరు సీటు రాలేదు. ఆ తొక్కలో సీటు రానందుకు (ఇప్పుడలా ఫీల్ అవుతున్నాలెండి! ;-) ఇంక జీవితంలో చేయడానికేం మిగల్లేదన్నట్టు అస్త్రసన్యాసం చేసిన విలుకాడిలా మొహం పెట్టి శూన్యం లోకి చూస్తూ ఉండేదాన్ని ఆ రోజుల్లో. సీటు రానందుకు నాతో పాటు వాళ్ళూ బాధపడినా 'నా భవిష్యత్తేంటి? తక్షణ కర్తవ్యమ్ ఏంటి?' అని నాకోసం వాళ్ళే బాగా ఆలోచించి, వాళ్ళే మంచి కాలేజీ, మంచి గ్రూప్ సెలెక్ట్ చేసి డిగ్రీ కాలేజీలో చేర్పించారు.

ఇప్పుడిక్కడ మలుపేంటంటే, ఆ కాలేజీ కూడా దూరపు ఊర్లోనే కాబట్టి.. మళ్ళీ నేను హాస్టల్లో చేరాలన్నమాట! ఆ వీడుకోలు కబుర్లు, నే వెలగబెట్టిన ఘనకార్యాలు.. మరోసారెప్పుడైనా!

25 comments:

సుభద్ర said...

మీ బాగున్నాయి వీడుకోలు కబుర్లు.....లాస్ట్ లో మీరు చెప్పి౦ది నిజమే మనకి ఏమైనా భాధలున్న ఓపికపట్టాలి..మనమే దిద్దుకోవాలి..అమ్మకి,నాన్నకి చెప్పి వారిని బాధపెట్టకుడదు..కాని అన్ని స౦దర్భాలలో కాదు..మీ డిగ్రీ వీడుకోలు కోస౦ నేను వెయిట్ చేస్తూన్నా..

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

.నా ఎంసెట్ రోజులు గుర్తుచేశారు.ప్రతి కొడుకూ,కూతురూ ఈ స్టేజి దాటక తప్పదు.

jeevani said...

బాగా చెప్పారు...

సుజ్జి said...

బాగున్నాయ్ అమ్మాయి నీ కబుర్లు.. మొత్తానికి నీ ఘనకార్యాల చిట్టా విప్పుతావన్న మాట త్వరలో... :)

Narration was excellent.

జయ said...

వీడుకోలు అంటేనే...భరించలేనిదండీ. చదువుతూ అవన్నీ నేను కూడా బాగా ఫీల్ అయిపోయి, బాధేసింది. మరిప్పుడు అంత దూరంలో ఎలా ఉన్నారో ఏవిటో అని నా దిగులు పెరిగిపోతోంది.

అక్షర మోహనం said...

It is so nice..you shared your memories with all of us.

Anonymous said...

"ఘనకార్యాల చిట్టా"

waiting for that...

హను said...

మీ శైలిలో చక్కగా రాశారు...పాత జ్ఞాపకాలని మళ్లీ గుర్తు చేసుకునేటట్లు చేశారు...ధన్యవాదాలు...

మధురవాణి said...

@ సుభద్ర గారూ,
ధన్యవాదాలు! మిగిలిన కబుర్లు తప్పకుండా రాస్తానండీ మళ్ళీ సమయం కుదిరినప్పుడు :-)

@ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,
నిజమేనండీ! దాదాపు అందరివీ ఇవే కష్టాలు. తెచ్చి పెట్టుకున్న ఎంసెట్ కష్టాలు ;-)

@ జీవని,
ధన్యవాదాలండీ!

@ సుజ్జీ,
అవునమ్మాయ్.. నువ్వు కూడా బాగున్నాయన్నవుగా.. మిగతావి కూడా రాసేస్తా! ;-)

@ జయ గారూ,
మీదెంత సున్నితమైన మనసు జయ గారూ! అప్పట్లో మరీ చిన్నతనం మూలానా ప్రతీ చిన్న విషయానికి బాధ పడిపోడం, ఏడ్చేయడం చేసేదాన్ని. ఇప్పుడు చాలా వరకూ ఫరవాలేదు లెండి. మరి ఇన్నేళ్ళ జీవితం కొద్దో గొప్పో పాఠాలని నేర్పిందిగా! ఇప్పుడు బానే ఉన్నాను నేను. కాబట్టి, మీరేం బెంగ పడకండి. :-)Thanks for your concern.

మధురవాణి said...

@ అక్షరమోహనం, అనానిమస్,
Thank you :-)

@ హనూ,
అంతేనంటారా! పైన శ్రీకాంత్ గారన్నట్టు.. మనందరివీ ఇవే అనుభవాలూ కొద్దో గొప్పో తేడాతో!
Thanks for the comment!

కొత్త పాళీ said...

చాలా బాగా చెప్పారు చిన్నప్పటి కాలేజి కబుర్లు. కొందరు తలిదండ్రులంతే. వాళ్ళ ప్రేమకి అంతుండదు.

మురళి said...

చాలా చాలా బాగుందండీ.. నన్ను నేను చూసుకున్నాను అక్కడక్కడా...

గీతాచార్య said...

:D

మధురవాణి said...

@ కొత్తపాళీ,
గురూ గారూ,
ధన్యవాదాలు. మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషమేసింది.
'కొందరు తలిదండ్రులంతే. వాళ్ళ ప్రేమకి అంతుండదు.' --- నేను నా జ్ఞాపకాల్లో అంతర్లీనంగా దాగున్న విషయాన్ని ఎన్నో మాటల్లో కూర్చి చెప్పాలనుకున్నా! అదే విషయాన్ని మీరు భలేగా చెప్పేశారు ఒక్క మాటలో! ఎంతైనా గురువు గారు కదా మరి ;-)

@ మురళీ గారూ,
ధన్యవాదాలు. మీకు నచ్చడం నాకు చాలా సంతోషంగా ఉంది. :-)

@ గీతాచార్య,
:-D

పరుచూరి వంశీ కృష్ణ . said...

బాగా రాశారు ..నేను ఇప్పుడు కాలేజీ కి ఫ్రెండ్స్ కి అందరికీ వీడ్కోలు చెప్పి నా సుత్తి రోజు భారాయించే వాళ్ళు లేక తెగ బాధ పడిపోతున్నాను .........

సవ్వడి said...

మధురవాణి గారు! బాగా రాసారు. నేను సి.ఎ. చదవడానికి విజయవాడ వెళ్లిన రోజులు గుర్తొచ్చాయి.
మా నాన్నగారైతే మరీనూ! నేనేమో వెళ్లేటప్పటికి డిమ్ ఐపోయి.. ఏదో ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. మా నాన్నగారు వెళ్లేటప్పుడు కూడా సరదాగా ఉండమనేవారు. నేను అలా ఉండేసరికి " ఏమైంది నాన.. ఏంటి చెప్పు.." అనేవారు. నేను సరదాగా ఉండడానికి ప్రయత్నించేవాడిని. కాని నాభాద ఎవరితో చెప్పుకోను.
థాంక్స్. నాకు మళ్లీ ఆ రోజులు గుర్తు తెచ్చారు.

విశ్వ ప్రేమికుడు said...

గతం తీయనైనది కదా.!

మనకు ఏమైనా బాధలున్నా తల్లి తండ్రులకి వెను వెంటనే చెప్పకూడదు. అనేది నిజం కానీ నెమ్మదిగానైనా అక్కడి పరిస్థితులు ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉండడం నేటి పరిస్థితులలో చాలా అవసరం. :)

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగున్నాయి...
ఇంటర్లో ఇంటిలోనే ఉండి గల్లీలో కాలేజ్ లో చదవటం వల్ల నాకు అన్ని కష్టాలు లేవు...కానీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతుందనగా మా ఫ్రెండ్స్ ని చూసినా, ఆ ఊళ్ళో ప్రతీ చెట్టూ, పుట్టా చూస్తున్నా కూడా దు:ఖం తన్నుకొచ్చేసేది..వాటన్నింటినీ నాలుగేళ్ళుగా చూస్తూ రేపటినుండి ఇంక కనపడవు అన్న ఫీలింగ్ తో....

అసలు వీడుకోలు అన్న పదమే భారంగా తోస్తాది నాకు...

"వెలగబెట్టిన ఘనకార్యాలు"...వాటి కోసమే వెయిటింగ్..:-)

Anonymous said...

"ఇంక జీవితంలో చేయడానికేం మిగల్లేదన్నట్టు అస్త్రసన్యాసం చేసిన విలుకాడిలా మొహం పెట్టి శూన్యం లోకి చూస్తూ ఉండేదాన్ని ఆ రోజుల్లో"

- విలుకాడు లేక విలుకానిది?

మధురవాణి said...

@ పరుచూరి వంశీకృష్ణ,
ఏం బెంగ పెట్టుకోకండి కాలేజీ మీద.. మీ సుత్తి వినడానికి మేమందరం ఉన్నాంగా! ;-)

@ సవ్వడి,
దాదాపు ఆ వయసులో అందరివీ ఇలాంటి జ్ఞాపకాలే ఉంటాయనుకుంటానండీ! :-)

@ విశ్వ ప్రేమికుడు,
నిజమేనండీ మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింటు. మన గురించిన అన్నీ వివరాలు ఇంట్లో వాళ్లకి తెలియచెయ్యాలి. కాకపోతే నే చెప్పిన బాధలన్నీ ఇంటి గురించి బెంగ పడడమే గానీ మరీ అంత తీవ్రమైన సమస్యలు కాదుగా.. అందుకే అలా చేశానన్నమాట! :-)

@ శేఖర్,
నిజమేనండీ.. వీడుకోలు అన్న పదమే భారంగా ఉంటుంది :-(
"వెలగబెట్టిన ఘనకార్యాలు" .. అంటే మిత్రులందరూ ఏవో పెద్ద ఘన కార్యాలు అనుకుంటున్నట్టున్నారు. నాకు మరీ అంత సీన్ లేదు గానీ ఇలాంటివో ఏవో కొన్ని తింగరి పనులన్నమాట! ;-)

@ అనానిమస్,
:-) అంటే నా ఉద్దేశ్యం.. నేను విలుకాడు /విలుకానిది కాదు కదండీ.. కేవలం నేను ఆ టైపులో మోహంలో ఎక్స్ప్రెషన్ పెట్టుకు కూర్చునేదాన్నన్నమాట! అందుకే అలా పోల్చాను ;-)

మిరియప్పొడి said...

ఇంటరు కబుర్లన్న మాట ఎంజాయ్ చేశాను

Anonymous said...

నేను ఇంటర్ వేరే జిల్లా లో చదివేదాన్ని, మా అన్నయ్య చూడడానికి వచ్చి వెళ్ళేటప్పుడు చాలా బాధేసేది. ఇంకా MBA కోసం "మంగుళూరు" వెళ్లాన ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు అక్కడ నేను పడ్డ బాధలు.

హరే కృష్ణ said...

బావుంది

Adroit said...

జీవితంలొ కస్టమైన క్షనాలు ఇవి కాని తప్పదు కద. ఇంటర్నెట్ పున్యమా అని అవి కొంచెం తగ్గయనుకొండి. మీ మిగత పొస్ట్ల కొసం వేచి చుస్తున్నాం. అసలైన తీపి కస్టాలు ఇప్పుడె మొదలవుతాఇ అనుకుంట.

మధురవాణి said...

@ మిరియప్పొడి,
ధన్యవాదాలండీ!

@ రాధిక,
హమ్మో.. వేరే జిల్లాలోనే ఇన్ని కష్టాలంటే, మీరు ఏకంగా వేరే రాష్ట్రం వెళ్లి చదూకున్నారా? అలా అయితే తరచూ రాకపోకలు ఉండవుగా! మీరు పడ్డ బాధల్ని నేనూహించగలను. అన్నట్టు, మీ జ్ఞాపకాలన్నీ ఓ పోస్టు రాయకూడదూ!

@ హరేకృష్ణ,
థాంక్సండీ!

@ కమల్,
ఇంటర్నెట్ పుణ్యమా అని కష్టాలు తగ్గాయంటే, మీ ఉద్దేశ్యం ఒంటరిగా ఉండేవాళ్ళకి కాలక్షేపం గురించి అన్నారనుకుంటున్నాను. అదే అయితే, మీరు చెప్పింది ఒప్పుకుంటాను కానీ, హాస్టళ్ళలో ఉండి చదువుకునే పిల్లలకి ఎంతసేపూ క్లాసులూ, స్టడీ అవర్సే గానీ వేరే కాలక్షేపమేమీ ఉండదు కదండీ! మనం పెరిగి పెద్దయ్యే కొద్దీ కష్టాల రూపు రేఖలు కూడా మారుతుంటాయి కదండీ! ;-) వీలున్నప్పుడు తప్పక రాస్తాను.