జ్వరమొస్తే బాగుండటమేంటీ మరీ చోద్యం కాకపోతే .. యీ పిల్లకి వేపకాయంత వెర్రి ఉన్నట్టుంది అనుకుంటున్నారు కదా మీరందరూ ! ఇప్పుడు నేను చెప్పేదంతా విన్నాక , వేపకాయంత కాదు .. ఏకంగా గుమ్మడికాయంత ఉందని తెలుస్తుందిలెండి . నాకున్నలాంటి తిక్క లక్షణాలు , విచిత్రమైన కోరికలు యీ భూ ప్రపంచంలో ఎవరికీ ఉండవు .. అంటుంది మా అమ్మ . హీ హీ హీ
మీకెవరికైనా జలుబు చేస్తే ఇష్టమా ? నాకు మాత్రం భలే ఇష్టం తెలుసా జలుబు చేస్తే ! జలుబంటే నా ఉద్దేశ్యం .. ముక్కూ మొహం పింక్ కలర్లోకి మారిపోయి , గొంతు వాసిపోయి , తల బద్దలయిపోయే తలనొప్పితో విక్స్ యాక్షన్ 500 టాబ్లెట్ ఎడ్వర్టైజ్మెంట్లో లాగా అవడం కాదు . ఏదో కొంచెం లైట్ గా జలుబు చేసి ముక్కుతో మాట్లాడుతుండాలి . గొంతు కొంచెం మారిపోవాలి . అంతే ! అలా ఉంటే నాకిష్టం . కానీ , ఒకసారి జలుబొస్తే గొంతు మారడంతోనే ఆగదు కదా ! పైన చెప్పిన విక్స్ ఎడ్వర్టైజ్మెంట్ లక్షణాలన్నీ వచ్చేస్తాయి . అది మాత్రం ఇబ్బందే !
చిన్నప్పుడు ఏ ఉయ్యాల ఊగుతూనో జారిపడో దెబ్బ తగిలించుకుంటే , నాకా దెబ్బ తగ్గే లోపు ఇంట్లో వాళ్లకి పట్టపగలే చుక్కలు కనిపించేవి పాపం ! ఎందుకంటే , నాకేదైనా చిన్న దెబ్బ తగిలితే అది తగ్గేదాకా నా కళ్ళన్నీ అక్కడే ! రోజంతా నా ధ్యాస ఆ గాయం మీదే ఉంటుంది . "ఆ దెబ్బ ఎప్పుడు తగ్గుతుంది , గాయం మీద ఎందుకు చెక్కు కట్టింది , ఆ చెక్కు తీసెయ్యకూడదా , ప్లాస్టర్ పీకేస్తే ఏమవుతుంది , ఇంకా ఎన్ని రోజులకి తగ్గుతుంది .." లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఇంట్లోవాళ్ళ బుర్ర తినేసేదాన్ని . అందుకని నా యీ హింస తట్టుకోలేక మా ఇంట్లో వాళ్ళందరూ తమకి జ్వరమొచ్చినా పర్లేదు గానీ , నాకు మాత్రం రాకూడదని గట్టిగా అనుకుంటారు పాపం !
అందరూ ఏదో స్కూలో , కాలేజో ఎగ్గొట్టడానికి జ్వరం రావాలని కోరుకుంటారు కదా ! నాకేమో జ్వరం ఎందుకిష్టమో తెలుసా ! ఇంట్లో వాళ్ళు బాగా ముద్దు చేస్తారు కదా మనకి ఒంట్లో బాలేకపోతే . అందుకన్నమాట ! మళ్ళీ జ్వరమంటే నోరంతా చేదయిపోయి , బోలెడంత నీరసం వచ్చెయ్యకూడదు . స్కూలుకి వెళ్ళేంత ఓపిక ఉండకూడదు కానీ , ఆడుకునేంత , టీవీ చూసేంత ఓపిక మాత్రం ఉండాలి . అలా రావాలన్నమాట జ్వరం . ఓసారేమయిందో తెలుసా ! అలా ఫ్లాష్ బ్యాక్‌లోకి వె ళ్ళొ ద్దాం పదండి .
నాకో తొమ్మిదేళ్ళు , మా తమ్ముడికో ఏడేళ్ళు ఉన్నప్పుడు ఒకసారి మా తమ్ముడుకి ఆటలమ్మ పోసింది . అప్పుడు వాడు హాస్టల్లో ఉండి చదువుకునేవాడు . నేనేమో ఇంటిని ఏకచ్చత్రాధిపత్యంగా ఏలేస్తూ ఉండేదాన్ని . వాడికి హాస్టల్లోనే అమ్మవారు పోస్తే ఇంటికి తీసుకొచ్చారు . అప్పటికే చాలా ఎక్కువైపోయింది పాపం . ఏవో మందులు కూడా వాడారులే గానీ , తగ్గడానికి బాగానే టైం పట్టింది . అప్పుడు వాడిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇంట్లో వాళ్ళు . దాదాపు తగ్గే టైముకి వాడికి ఐస్‌క్రీములూ , బిస్కెట్లు అన్నీ కొని తెచ్చారు .
ఇదంతా చూసి నేను కూడా వాడి చుట్టూనే తిరిగేదాన్ని . అదేదో అంటించేసుకుంటే ఎంచక్కా నేను కూడా కొన్నిరోజులు బడి మానేసి వాడితో పాటే ఇంట్లో ఉండిపోవచ్చు . పైగా , ఐస్‌క్రీములూ , బిస్కెట్లూ బోనస్ కదా అనుకున్నా ! అప్పటికీ మా అమ్మ ప్రతీ క్షణం నాకు కాపలా కాస్తుండేది నేను వాడి దగ్గరికెళ్ళి అంటించుకోకుండా ! కానీ , నేను దేవాంతకురాలిని కదా ! మొత్తానికి నేనూ అంటించేసుకున్నా వాడి దగ్గర నుంచి . మొదట ఒక చిన్న పొక్కు రాగానే అబ్బో .. తెగ ఆనందపడిపోయాను నేను . మా అమ్మేమో చాలా కంగారు పడిపోయింది పాపం . మర్నాడే నాన్న నన్ను ఆసుపత్రికి తీస్కెళ్ళి అప్పట్లోనే ఒక్కో టాబ్లెట్ నలభై రూపాయలున్నవి కొని వాడి నాకు వెంటనే తగ్గిపోయేలా చేశారు . ప్చ్ .. ఏం చేస్తాం ! నేనంత రిస్కు తీసుకున్నా గానీ వర్కవుట్ కాలేదు . తరవాత నాన్న నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని "ఇలా ఐస్‌క్రీములు తినడం కోసం జ్వరాలూ , జబ్బులూ తెచ్చుకోకూడదు నానా ! ఇంకోసారెప్పుడూ ఇలా చేయకు . కావాలంటే , నీకు ఐస్‌క్రీములు నేను తెచ్చిస్తానుగా !" అని బుజ్జగిస్తూ చెప్పారు .
ఇలాంటిదే ఇంకో ముచ్చట కూడా గుర్తొస్తోంది . నేను డిగ్రీ చదివే రోజుల్లో హాస్టల్లో ఉన్నప్పుడు ఓ రోజు సాయంత్రం స్నేహితురాళ్ళందరం కలిసి డాబా ఎక్కి దిక్కులు చూస్తూ ,కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నాం . ఈ లోపు ఓ దృశ్యం మమ్మల్నందరినీ ఆకర్షించింది . అదేంటంటే , ఎదురింటి డాబా మీద చిన్న పిల్లలు కొంతమంది కరంట్ షాక్ ఆడుకుంటున్నారు . వాళ్ళని చూసేసరికి మా అందరికీ కూడా అలా ఆడుకోవాలనిపించింది . ఆలోచన వచ్చిందే తడవుగా అమలుపరిచేసాం ! వాళ్ళంటే చిన్న పిల్లలు కాబట్టి చెంగు చెంగున గెంతుతూ హాయిగా ఆడుకుంటున్నారు . కానీ వాళ్ళలా ఆడగలిగేంత సీన్ మాకు లేదన్న సంగతి కాసేపటికే అర్ధం అయింది . ఎలాగంటే , ఎవరో నాకు కరంట్ చెప్పేస్తారన్న కంగారులో నేను ఆవేశంగా పరిగెత్తుతూ ఢా మ్మని కింద పడ్డాను . దెబ్బకి మోకాలు చిప్ప పగిలింది . అంటే , ఏదో ఫ్రాక్చర్ అన్నంత ఊహించుకునేరు. అంత లేదు .. కొద్దిగా కొట్టుకుపోయింది . అంతే ! కానీ , అది నాకు తగిలింది కాబట్టి , దాదాపు ఫ్రాక్చర్ కిందే లెక్క . నేనంత హంగామా చేసే టైపు కదా మరి ! ఆ దెబ్బ తగలడం వల్ల కొంచెం ఒళ్ళు వెచ్చబడింది . అంతే .. కాలేజీకి ఎగనామం పెట్టేసి వెంటనే ఇంటికి చెక్కేసా !
ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు సెలవలేం లేకుండా ఇలా ఊడిపడ్డానేంటీ అని . నాకెంత జ్వరమోచ్చిందో తెలుసా అని ఎందుకొచ్చిందో కూడా చెప్పా ! అందరూ నవ్వారు . నాన్న టెంపరేచర్ చూసి ఒక డిగ్రీ పెరిగిందిలే .. రేపటికి అదే తగ్గిపోతుందిలే అన్నారు . డాక్టరు దగ్గరికి కూడా తీసుకె ళ్ళ లేదు . పైగా రెండ్రోజులైనా ఇంట్లో ఎవ్వరూ నాకు జ్వరం వచ్చిందనే విషయాన్నే పట్టించుకోలేదు . ఇంకంతే .. నా మనోభావాలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల ఆ రోజు రాత్రి బేర్ మని ఏడ్చేసా ! ఎవరికీ అర్ధం కాలేదు నేను ఎందుకేడుస్తున్నానో ! వెక్కుతూ మధ్యలో నేనే చెప్పా ఏడుపెందుకూ అని . నాకు దెబ్బ తగిలి , జ్వరం వచ్చి ఇంటికొస్తే మీరసలు నన్నూ , నా జ్వరాన్ని పట్టించుకున్నారా ? హాస్టల్లో ఉన్నప్పుడు ఎంత ఏడుపొచ్చిందో తెలుసా అసలు ! తీరా ఇంటికొస్తే నన్నెవరూ పట్టించుకోట్లేదు . ఇంటికి రావడం కంటే హాస్టల్లో ఉండటమే నయం అంటూ ఓ అరలీటరు కన్నీళ్లు కార్చేసా ! నేనలా ఏడుస్తుంటే అమ్మా , నాన్నా చాలా సేపు నవ్వారు . నాన్నేమో సర్లే అని చెప్పి నన్ను దగ్గరికి తీసుకుని బుజ్జగించి అన్నం తినిపించారు . అంతే ! నా జ్వరం దెబ్బకి తగ్గిపోయింది . ఆ తరవాత మళ్ళీ ఎప్పుడూ కరంట్ షాక్ ఆడే ప్రయత్నం చేయలేదు !
అప్పుడంటే అలా సరిపోయింది గానీ , ఇప్పటిలా ఇంటికి చాలా దూరంలో ఉన్నప్పుడు మాత్రం నాకు తలనొప్పి వచ్చినా సరే ఇంట్లో వాళ్ళు బాగా గుర్తొచ్చేసి తెగ ఏడుపొచ్చేస్తుంది . అప్పటికీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని తినేస్తుంటాననుకోండి . అయినాసరే , ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే 'జ్వరమొస్తే.. ఎంత బాగుంటుందీ ..' అనుకుంటాను . ఇంటికి దూరంగా ఉన్నప్పుడు మాత్రం ఏ నొప్పులూ , జ్వరాలూ రానే కూడదు !