Wednesday, December 12, 2012

నీ కోపం క్షణమనుకుంటాను.. నీతో నేనొక యుగముంటాను..


మనం ఎప్పుడైనా ఎవరికైనా కోపం తెప్పించాం అనుకోండి. అబ్బా.. అంటే ఊర్లో వాళ్ళందరికీ కాదులెండి.. మనల్ని అమితంగా ప్రేమించే వాళ్ళూ, మనం ప్రేమించే వాళ్ళూ అయిన మన ఇంట్లో వాళ్ళో, ప్రాణ స్నేహితులో.. ఇలాంటి వాళ్లకి ఎప్పుడైనా కోపం తెప్పించామనుకోండి. అప్పుడా కోపం పోగొట్టాల్సిన బాధ్యత కూడా మనదే కదా.. అప్పుడేం చేస్తాం? ఎలాగోలా బతిమాలో బామాలో వాళ్ళ అలక తీర్చడానికి ప్రయత్నిస్తాం. ముందు "నువ్వు బంగారు కొండవి, వజ్రాల తునకవి, వరాల మూటవి.." అని బోల్డు పొగిడేస్తాం. అవన్నీ ఉత్తి పొగడ్తలు అని తెలుస్తున్నా వాళ్ళ కోపం పోగొట్టడానికి మనం పడుతున్న తాపత్రయం చూసి  కోపమొచ్చిన వాళ్ళకి కూడా కొంచెం నవ్వొస్తూ ఉంటుంది. కానీ అప్పుడే కోపం మాత్రం పోదు. ఇంకా మొహం అలా ఉమ్మ్.. అని పెట్టుకు చూస్తుంటారు బింకంగా. అప్పుడేం చేస్తాం మరింక.. ఉహూ.. ఇలా పొగడ్తలతో కాదని చెప్పి నిజంగా వాళ్ళు మనకెంత అపురూపమో, వాళ్ళ మీద మనకెంత ప్రేముందో, వాళ్ళు దూరం అయితే మనకి ఎంత బాధ అవుతుందో చెప్పడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తాం. మనం ఎలాంటి మాటల్లో చెప్పినా సరే మాటల వెనకున్న నిజమైన ప్రేమలోని ఆప్యాయపు తడి వాళ్ళని తాకుతుంది. నిజాయితీగానే వాళ్ళ కోసం బెంగపడుతున్నామని, బోల్డు ప్రేమగా బతిమాలుతున్నామని గ్రహించి మనం దిగులు పడుతూ ఉంటే ఇంక చూడలేక కోపమంతా కరిగించేసి కిలకిలా నవ్వేస్తారు. ఇంకేముంది.. అప్పుడింక కథ సుఖాంతమే కదా! :-)

సరిగ్గా ఇలాంటి సన్నివేశం ప్రేమలో ఉన్న జంటకి వస్తే వాళ్ళిద్దరి మధ్యన జరిగే మాటల్ని అందమైన పాటలా రాస్తే ఇదిగో పాటలా ఉంటుందన్నమాట. పాట తేజ దర్శకత్వంలో వచ్చిన 'నీకూ నాకూ డాష్ డాష్' అనే సినిమాలోది. సినిమా పేరు కొంచెం తేడాగా ఉంది గానీ పాట మాత్రం బాగుంటుంది. సినిమా గురించి నాకస్సలేం తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఒకోసారి కొన్ని పాటలు విన్నప్పుడు చాలా నచ్చుతాయి. పొరపాటున సినిమానో, వీడియోలో చూసామంటే అప్పటి దాకా పాట మీద ఉన్న ఇష్టం కూడా పోయే ప్రమాదం ఉంది. అంత భయపెట్టేస్తాయి మరి. అంచేత సినిమా చూసే ధైర్యం చెయ్యలేను మరి. కానీ, మీకు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవాలని ఉంటే మాత్రం సినిమా గురించి రాజ్ రాసిన సమీక్ష ఇక్కడ చదవండి. :-)

సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన యశ్వంత్ నాగ్ ఇందులో కొన్ని పాటలు కూడా పాడాడు. పాట మాత్రం నరేష్ అయ్యర్, చిన్మయి చాలా చక్కగా పాడారు. రాసిందెవరో మాత్రం తెలీలేదు. సినిమా పాటల సాహిత్యం అంతా సాయి ఆనంద్, బాలాజీ అనే ముగ్గురు రాసారట. వాళ్ళ ముగ్గురిలో పాట ఎవరు రాసారో తెలీదు మరి.
సినిమా జోలికి వెళ్ళకుండా కేవలం పాటలు మాత్రం విని చూడండి. నచ్చే అవకాశం ఉంది.. "నువ్వే నేనననా. నేనే నీవననా..", "ప్రాణం అని తలచి.." అనే రెండు పాటలు కూడా బాగుంటాయి.

నేను చెప్తున్న పాట సాహిత్యం ఇదే..

నీ కోపం క్షణమనుకుంటాను.. నీతో నేనొక యుగముంటాను..
నాపై అలకే చూపెడితే ఏమౌతా..
నీలో నేననుకున్నాను.. వేరేగా లేననుకుంటాను..
నన్నే కాదనుకుంటే నేనేం చేస్తా..
నా కన్నుల్లో బొమ్మవి నువ్వు.. నా గుండెల్లో తోడువి నువ్వు..
నాలో ఉన్నది ప్రతి అణువూ నీ ప్రేమా..
నా పెదవుల్లో మాటవు నువ్వు.. నా అడుగుల్లో నడకవు నువ్వు..
నీలో నాలో ఉన్నది ఒకటే ప్రేమా..

నిన్ను చూస్తూ ఉంటే చాలు.. చిన్నబోవా మందారాలు..
వెన్నెలంతా మూట కడితే నువ్వే అంటాను..
చేతిలోనే చెయ్యే వేసి నీడలా నువ్వుంటే చాలు..
ఇంతలాగా వెంటపడుతూ పొగడొద్దంటాను..
నీ నీలి కళ్ళే నీలాకాశం అంటున్నా.. కలనైనా నిన్ను వదిలి ఒంటరిగా లేను..
లోకమంతా నన్నే కాదని అనుకున్నా.. నా లోకమే ఇక నీవని నిన్నే చేరనా..
మంచువో మత్తువో.. ఎదను వదలదు నీ ధ్యాస..
హాయివో మాయవో.. మనసు కదలదు నువ్వు లేక..
మంత్రమేసావిలా....

నీ కోపం క్షణమనుకుంటాను.. నీతో నేనొక యుగముంటాను..
నాపై అలకే చూపెడితే ఏమౌతా..
నీలో నేననుకున్నాను.. వేరేగా లేననుకుంటాను..
నన్నే కాదనుకుంటే నేనేం చేస్తా..

నీటిలో చిరు ముత్యం లాగా.. నేలపై తొలి పచ్చిక లాగా..
నువ్విలా నా పక్కన ఉంటే ఎంతో ఆనందం..
రామచిలుకకి గోరింకల్లే.. తార పక్కన చంద్రుడి మల్లే..
ఇద్దరం ఒకటైపోతే ఇంకెంతో అందం..
నీ కళ్ళతోనే లోకం మొత్తం చూస్తున్నా.. ప్రతి నిమిషం నీతో గడిపేస్తూ ఉన్నా..
నీ మాటలోనే తియ్యని భాషే వింటున్నా.. కలవరించి నీ పేరే జపమే చేస్తున్నా..
ఊపిరే నీదిలే.. నన్ను కాదని అనకెపుడూ..
ప్రాణమే లేదులే.. నువ్వు జంటగ లేనప్పుడు..
నూరేళ్ళు సాగేందుకూ....

నీ కోపం క్షణమనుకుంటాను.. నీతో నేనొక యుగముంటాను..
నాపై అలకే చూపెడితే ఏమౌతా..
నీలో నేననుకున్నాను.. వేరేగా లేననుకుంటాను..
నన్నే కాదనుకుంటే నేనేం చేస్తా..

Thursday, December 06, 2012

చేత చిక్కని తలపుల పిలుపులు కొన్ని..

మనిషి సంఘజీవి అని చెప్పిన వాళ్ళెవరో గానీ మనిషి మనస్తత్వాన్ని గురించి చాలా చాలా ఆలోచించి, ఎంతో లోతుగా అర్థం చేసుకుని చెప్పి ఉంటారేమో అనిపిస్తుంటుంది. మనిషి ఎంతసేపూ చుట్టుపక్కల వేరే మనుషుల కోసం తాపత్రయపడిపోతుంటాడు. అంటే, వాళ్ళు ఎలా బతుకుతారా అని వాళ్ళ కోసం ఆలోచించడం కాదు, చుట్టూ ఉన్న  మనుషులంతా తన మనుగడలో ముఖ్యభాగం అనే దృష్టితో జీవిస్తుంటాడు. బహుశా మనిషికున్న అత్యంత పెద్ద బలహీనత ఒంటరిగా బతకలేకపోవడం అనుకుంటా.. ఎప్పుడైనా, ఏదైనా తెలియని కొత్త ప్రదేశంలో ఇరుక్కుపోయామనుకోండి.. అమ్మో ఎలా బయట పడతామో ఇక్కడ నుంచి అని గుండె బెజారేత్తిపోతుందికానీ చుట్టూ పక్కల వేరే ఎవరైనా మనుషులు కనిపించారనుకోండి.. హమ్మయ్యా నేనొక్కడినే కాదులే ఇంకో మనిషి ఉన్నాడు నాకు తోడుగా అని కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే, ఏవైనా పెద్ద పెద్ద తుఫాన్లు, వరదలు, భూకంపాలు, సునామీలు లాంటి ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అంతటి భయంలోనూ, బాధలోనూ కూడా కష్టం నా ఒక్కడిది కాదు, నాతో పాటు ఇంత మంది మనుషులు తోడుగా ఉన్నారన్న ఆలోచన మనిషికి కొండంత ధైర్యాన్నిస్తుంది. 2012 లో యుగాంతం అదీ ఇదీ అని బోల్డు కథనాలు వినిపిస్తున్నాయి కదా.. అలాంటి యుగాంతం గానీ వస్తే గిస్తే మొత్తం భూమ్మీద ఉన్న మానవ జాతి అంతా ఒకేసారి తుడిచిపెట్టుకు పోయేట్టయితే మరీ గుండెలు బాదుకుని ఏడవాల్సిన అవసరం ఏముందిలే అనిపిస్తుంది. అదే, ప్రపంచమంతా ఉన్నది ఉన్నట్టుగానే చీకూ చింతా లేకుండా ముందుకి పోతూ మనకి ఒక్కరికే ఏదన్నా పెద్ద ప్రమాదమో సంభవించడం లేదా ప్రాణాంతకమైన జబ్బో వచ్చి మనం మాత్రమే చచ్చిపోతాం అని తెలిసిందనుకోండి.. బాధ వర్ణనాతీతం.. అయ్యో నేనొక్కడినే చచ్చిపోతానా, మిగతా ప్రపంచమంతా అస్సలేమీ జరగనట్టు, ఏమీ తేడా పడనట్టు ఇంతే మామూలుగా ఉండిపోతుందా అనేది మనసు చివుక్కుమనిపిస్తుంది. నా చుట్టూ నాతో కలిపి అల్లుకున్న నా చిన్ని ప్రపంచంలోని బంధాలన్నీ ఏమైపోతాయో, నేను లేని వెలితి నన్ను ప్రేమించే వాళ్ళ జీవితాల్ని ఎంతగా అతలాకుతలం చేస్తుందో అన్న బాధ మరీ క్రుంగదీస్తుంది మనిషినిచిత్రం ఏంటంటే, చచ్చిపోయేది మనం అయితే, లోకంలో నుంచి మాయం అయిపోయేది మనం అయితే, జీవితాన్ని కోల్పోయేది మనం అయితే, విషయం గురించి ఎవరికీ పెద్ద చింతన ఏమీ ఉండదు. మనం వెళ్ళిపోయాక కూడా ఇంకా ఇక్కడ మిగిలుండే వాళ్ళ గురించే బాధంతా! మనుషులు చచ్చిపోయాక ఏం  జరుగుతుందో, ఏమవుతామో, అసలు మనకేమైనా స్పృహ ఉండి ఇవన్నీ తెలుస్తాయా లేదా అనేది ఎవరికీ తెలియని విషయం అయినా, ప్రప్రంచ వ్యాప్తంగా మనుషులందరూ చచ్చిపోయాక స్వర్గమో, నరకమో, మరేదో దేవ లోకాలు ఉంటాయని చెప్పి 'చావు'ని బోల్డు ఆశావహ దృక్పథంతో ఎదుర్కొనేలా చెప్తుంటారుమనిషి ఎంత తెలివైన, చిత్రమైన జంతువు కదా! :-)




సరే, ఎప్పుడో చచ్చిపోయేప్పటి సంగతి ఎలా ఉన్నా, మరి బతికున్నప్పటి మాటేంటి? భూమ్మీద మనిషి అనుభవించే సుఖదుఃఖాలన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన చుట్టూ ఉన్న మనుషుల కారణంగానే పొందుతాడు. కొంత మంది మనుషుల మీద ప్రేమాభిమానాలు పెంచుకోవడంలో, వాళ్ళ సాంగత్యంలో ఎలాగైతే అంతు లేని తృప్తినీ, సంతోషాన్నీ అనుభవిస్తాడో, అచ్చం అవే కారణాల మూలంగా అంతు లేని అసంతృప్తిని, దుఃఖాన్నీ కూడా అనుభవిస్తాడు. వీటన్నీటి పాలబడి నలిగిపోయి ఆలోచించీ చించీ వాళ్ళ మెదళ్ళనీ, మనసుల్నీ చిలికిన గొప్ప గొప్ప తత్వవేత్తలు ఏమంటారంటే.. అసలు మనిషి ఎప్పుడైతే తన ఆనందాన్ని, తన సంతృప్తినీ, తన జీవితాన్నీ తనలో, తన చేతలలో చూసుకోకుండా ఇంకొక వ్యక్తిలోనో, ఇంకొక వ్యక్తి చేతల్లోనే చూసుకోవాలని ఆరాటపడటం మొదలు పెడతాడో, అదే అతని దుఃఖానికి నాంది అవుతుంది. అంతే కదా మరి.. మరో మనిషి అంటే, మళ్ళీ అతని బుర్ర వేరు, బుద్ధి వేరు. ఇద్దరు మనుషులూ ఎప్పటికీ ఒకేలా ఆలోచించడం, ఒకేలా స్పందించడం అనేది అసాధ్యమైన విషయం. అంచేత, నీ భావాల్ని, ఆశల్ని, ఆలోచనల్ని, అభిప్రాయాల్ని, ఇష్టాయిష్టాలని అచ్చంగా నువ్వు ఊహించినట్టుగానే ఎదుటి వ్యక్తిలో ఉండాలనుకోవడం సమంజసం కాదు, ఎందుకంటే అది అసంభవం కాబట్టి. అలా ఉంటాయన్న భ్రమలో ఎప్పటికీ దొరికే అవకాశం లేని non-existing beings కోసం వెతుక్కుంటూ ఎదురు చూస్తూ తనని తాని కష్టపెట్టుకోవడం తెలివైన పని కూడా కాదు. అంచేత, చివరాఖరికి చెప్పేదేంటంటే, మనిషైనా ప్రపంచంలో అత్యంత ప్రేమించేది, గౌరవించేది ముందు తనకు తానే అయ్యుండాలి. నీకు నువ్వు ఇచ్చుకోవాల్సిన విలువనీ, గౌరవాన్నీ మించింది మరొకటి ప్రపంచంలో ఏదీ లేదు. నిన్ను మించిన వారు నీ జీవితంలో మరెవరూ ఉండరు. నీ ఆశల్నీ, ఆశయాల్నీ, కలల్నీ, కలబోతల్నీ నీ బ్రతుకు తెర పైన నీకు చేతనైనంతలో నువ్వే చిత్రించుకోవాలి తప్ప ఎవరో వచ్చి అందమైన రంగుల లోకం సృష్టిస్తారన్న భ్రమల్లో ఎదురు చూస్తూ కూర్చోడం మూర్ఖత్వం అవుతుందేమో!

హ్మ్మ్.. ఏదో ఊరుకోలేక నా కరశోష గానీ.. లెక్కా పత్రం, పద్ధతీ పాడూ లేకుండా నిరంతరం వేనవేల ఆలోచనలు పుట్టుకొస్తుండే మనిషికి... ఇలాంటి చేత చిక్కని తలపుల పిలుపులు ఎన్నో! వేవేల తలపులు, తపనల మీద నాకే అస్సలు పట్టు చిక్కకపోతుంటే.. ఆలోచనలన్నీ నా అక్షరాలకి మాత్రం పట్టుబడి రాతల్లో ఒదిగిపోతాయంటారా? :-)