Thursday, November 29, 2012

ఈనాటి 'ఈ' బంధమేనాటిదో!

"ఈనాటి బంధమేనాటిదో.. ఏనాడు పెనవేసి ముడి వేసెనో.."

ఏంటో అర్ధరాత్రి పూట నిద్ర మానుకుని మరీ ఇంత అత్యవసరంగా ఘంటసాల పాటల గురించి చర్చిస్తున్నానేమిటా అని మీరు ఆశ్చర్యపోవడంలో వింతేం లేదు కానీ... అసలు విషయం ఏంటంటే, ఒకోసారి కొన్ని భావాలు ఆలోచనలుగా మారి ఆనందం, ఆవేదన, ఆవేశం, అయోమయం.. (ప్రాస బాగుందని వాడేసాన్లే.. చూసీ చూడనట్టు పోవాలి మరి.. :D) వగైరా అనుభూతులన్నీ కలగాపులగమై చివరికి ఇదిగో ఇలా అర్ధరాత్రి అపరాత్రి అని చూసుకోకుండా ఉన్నపళంగా కూర్చోబెట్టేసి అక్షర మాలలు అల్లించేస్తాయి.

చిన్నప్పుడు మనల్ని బళ్ళో చేర్చినప్పుడు పక్కన కూర్చున్న మరో పాపాయితో బలపాలు పంచుకునే పసి స్నేహాలు, ఇంకాస్త ఎదిగాక బళ్ళో పెన్సిళ్ళూ, పెన్నులూ, పుస్తకాలూ, పెరట్లో పూసే కనకాంబరాలూ, నాన్న కొనిచ్చిన సిల్కు రిబ్బన్లూ, అమ్మ పెట్టిన తీపి తాయిలాలు పంచుకునే బాల్య స్నేహాలు, తర్వాత ఇంకాస్త ముందుకెళ్ళి పరీక్షలూ, కోచింగులూ, ర్యాంకులూ, టీజింగులూ, క్రష్షులూ, ప్రేమలేఖలూవార్నింగులూ, బ్రేకప్పులూ వగైరా ఊసులన్నీ పంచుకునే టీనేజ్ స్నేహాలూ, పెళ్ళిళ్ళో, ఉద్యోగాలో మూలంగా అప్పటిదాకా ఉన్న పరిసరాలకి, స్నేహితులకి దూరంగా వెళ్ళిపోయి కొలీగ్స్ లోనో, పక్కింటి వాళ్ళలోనో వెతుక్కునే తప్పనిసరి స్నేహాలు..... ఇవన్నీ జీవితపు ప్రతి మలుపులోనూ మనందరికీ అనుభవమవుతూనే ఉంటాయి కదూ!

అప్పటికీ, ఇప్పటికీ చుట్టూ ఎవరో ఒక స్నేహితులైతే ఉంటారు గానీ స్నేహాలలో అనుభూతి మాత్రం అన్నిటా ఒకటే కాదు. ముఖ్యంగా పైన చెప్పిన జాబితాలో చివరి మలుపుకి వచ్చేసరికి ఏర్పడే స్నేహాలు కేవలం పరిస్థితుల ఆధారంగా మనుగడ సాగించేవి అయ్యి ఉంటాయి తప్ప చిన్నప్పటిలా పూర్తి అమాయకత్వంలో ఏర్పడే అందమైన స్నేహాలు కావు. అలాగని మన అభిరుచులు, మనోభావాలు, అభిప్రాయాలు నచ్చి మనం ఇష్టంగా పెంచుకున్న స్నేహాలు కూడా కావు. ఒకవేళ అలాంటి స్నేహాలున్నా ఎక్కడో నూటికో కోటికో ఒకరికి ఉంటాయేమో అలా అన్నీ కలిసొచ్చేవి.

ఇంతకీ ఇప్పుడు నే చెప్పొచ్చేది ఏంటంటే..  ఉరుకుల పరుగుల జీవితపు పరుగు పందెంలో మన మనసుకి అత్యంత సమీపంగా, భావసారూప్యత కలిగి, అభిప్రాయాలు కలిసి, ఒకరి మనసులో ఒకరికి స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు, పరస్పర గౌరవాలు ఉండి మనకి దగ్గరగా మనతో కలిసి మన పక్కన నిలబడగలిగే, మన దారిలో నడవగలిగే స్నేహితులు ఉండటం అనేది ఎంత అపురూపమైన విషయం అయిపోయింది కదా అనిపిస్తుంది.
సరే అయితే ఇప్పుడేంటీ.. అంటారా?
అదేదో టీవీ యాడ్ లో చెప్పినట్టు "మీరు అసాధ్యం అనుకున్నవన్నీ సుసాధ్యం చేస్తుంది మా ఒకే ఒక ప్రోడక్ట్.." అన్న చందంగా '-స్నేహాలు' ఉన్నాయి చూసారూ..   ఒక్క ఐడియా నిజంగా మన జీవితాన్నే మార్చేస్తుందంటే నమ్మాలి మరి!

హమ్మయ్యా... ఇప్పుడు అసలు విషయం దగ్గరికొచ్చాను. ఇహ కాస్త ఊపిరి పీల్చుకుని కులాసాగా వినండి.. :D


'' స్నేహాల గురించి, స్నేహితుల గురించి చెప్పాలంటే....
వీళ్ళు ఎక్కడో ఏదో దేశంలో భూమి ఆవలి పక్కన ఉంటారా.. మనం లేచే టైముకి వాళ్ళు నిదరోతారు. లేదా వాళ్ళు లంచు తినే టైముకి మనం నడి నిద్రలో ఉంటాం.. అయినా సరే "ఇదో.. నాకు ఫలానా ఆలోచన వచ్చింది.. నువ్వేమంటావోయ్?" అని అడగ్గానే పక్క నుంచి వాళ్ళ భవబంధాలతో సర్కస్ చేస్తూనే నిమిషం మనకోసం కేటాయించి మాట చెప్పేసి పోతారు. "నేనో పిచ్చి పని చేసాను" అనగానే అడుగు ఇటొచ్చి వర్చువల్ గా మొట్టికాయ వేసి సరిదిద్దేసి పోతారు. "నేనీ సరదా సంఘటనకి నవ్వుతున్నాను" అని చెప్పగానే రెండు స్మైలీలతో మన సంతోషాన్ని పంచుకుంటారు. "నాకు దిగులుగా ఉంది" అంటే వెంటనే భుజం తట్టి వెన్ను నిమిరి చెయ్యి పట్టుకుని నేనున్నా పదమంటూ ధైర్యంగా ముందడుగు వేయిస్తారు.

ఇంకా....
చెరో దేశంలో ఉన్నా ఒకే సినిమా చూసొచ్చి ఎంచక్కా ఇద్దరూ కలిసి సినిమా రివ్యూ పేరిట చీల్చి చెండాడి కడుపుబ్బేలా నవ్వుకోవచ్చు. ఎక్కడో ఏదో అన్యాయం జరిగిందంటే ఆవేశంగా స్పందించి ఆక్రోశం వెళ్ళగక్కొచ్చుదుర్మార్గపు రాజకీయాల మీద దుమ్మెత్తి పోయొచ్చు.. చేయగలిగిన సాయం ఉందంటే చేతులు కలిపి మరొకరికి చేయూతనందివ్వొచ్చు.. వాడి వేడి చర్చలు, సరదా కబుర్లు, ఆటలు, పాటలు, అల్లర్లూ, గొడవలూ కూడా చెయ్యొచ్చు. ఆనందం వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి అభినందిస్తే సంబరపడొచ్చు. కష్టం కలిగినప్పుడు ఆప్యాయంగా నాలుగు మంచి మాటలు చెప్తే విని సాంత్వన పొందవచ్చు. మొత్తంగా అచ్చం మనలాంటి పిచ్చో మంచో మనసున్న వాళ్ళ మధ్యన మహా ఆనందంగా రోజులు గడిపెయ్యొచ్చుమన మధ్యన ఉన్న దూరాభారాలూ, బరువులూ బాధ్యతలూ, భవబంధాలు, కర్తవ్య నిర్వహణలు ఏవీ మన స్నేహానికి అడ్డుగోడలు కాలేవు. పైపెచ్చు యాంత్రిక ఉరుకుల పరుగుల జీవనయానానికి అలవాటు పడ్డవాళ్ళందరికీ గొప్ప ప్రశాంతతని, సంతోషాన్ని అందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇదంతా బానే ఉంది గానీ ఒకటి మాత్రం భలే చిత్రంగా అనిపిస్తుంది. ముక్కూ మొహం తెలీకుండా, మొహామొహాలూ చూసుకోకుండా, ఎదురుబొదురూ కలిసి నించోకుండా, చేతులో చెయ్యేసి కలిసి తిరక్కుండా.. కేవలం అక్షరాల్లో మనుషుల్ని చూసి ఇంత ప్రేమాభిమానాలు పెంచుకోవడం, పేరుకి వర్చువల్ అని తేలిగ్గా అనగలిగినా  '' బంధాలు మనసులకి ఎంతో దగ్గరైనవనీ, రోజురోజుకీ మన జీవితాల్లో బలంగా పెనవేసుకుపోతున్న అందమైన అనుబంధాలని ఎవరికి వారికే బాగా అర్థమవుతుందేమో! చిత్రం ఏంటంటే, నాలుగు రోజులు ఊరికి వెళ్తున్నామనో, జ్వరం వచ్చిందనో, లేకపోతే ఏదొక మాటా మాటా అనుకుని తాత్కాలికంగా పోట్లాడుకుంటేనో, అలిగి మౌనవ్రతం చేస్తేనో, మెయిల్ కి రెండ్రోజులైనా జవాబు ఇవ్వలేదనో..... ఇలాంటి వాటన్నీటికి మన మనసు స్పందించే తీరులో, మన ప్రేమ, ఆప్యాయత, ఆదుర్దా, దిగులు, కోపం, బాధ వగైరా భావాల్లో ఏమైనా మార్పు ఉంటుందంటారా? చెప్పడానికి చాలా తేలిగ్గా 'వర్చువల్' స్నేహాలే కావచ్చు కానీ '' బంధాలు మన మొహాల్లో పూయించే నవ్వులు, మనసుల్లో ఊరించే సంతోషాలు, కళ్ళల్లో పొంగించే కన్నీళ్లు.. ఇవన్నీ వర్చువల్ కాదు, అన్నీ అచ్చంగా మనం మనస్పూర్తిగా అనుభవిస్తున్న, అనుభూతిస్తున్న, జీవిస్తున్న మన నిజమైన జీవితపు తాలూకూ చెరిగిపోని ముద్రలే కదూ!

నీవూ నేనూ నిజమై ఋజువై.. 
ఎన్ని యుగాలుగ ఉన్నామో..
ఎన్ని జన్మలు కన్నామో..
ఈనాటి '' బంధమేనాటిదో..
ఏనాడు పెనవేసి ముడి వేసెనో!


**అలవాటుగా ఏవో కులాసా కబుర్లు మాట్లాడుతూ ఉండగా ఊరెళుతున్నానని చెప్పి నాలో చిన్నపాటి బెంగని కలిగించి  వేళ కాని వేళలో నా చేత ఇంత మాట్లాడించిన '' స్నేహానికి ప్రేమతో.. :-)

Thursday, November 22, 2012

గారాల చిలక - వరాల గోరింక

"ఇంకెంతసేపు ఈ మౌనం.. ఆట్టే సమయం వృథా చెయ్యకుండా విషయమేంటో చెప్పొచ్చుగా.."
"నేనిక్కడ ఇంత బాధపడుతుంటే నీకు సమయం వృథా అవుతోందనిపిస్తుందా?"
"ఉహూ.. బాధని వీలైనంత త్వరగా సాగనంపాలే తప్ప మనతోనే ఉంచుకుని పెంచి పోషించకూడదు అంటున్నా.. చూడు నా చిన్నారి చిలకమ్మ మోము ఎలా చిన్నబోయిందో.."
"వద్దు వద్దు.. నువ్వేం నా కన్నీరు తుడవక్కర్లేదు.. అక్కడే ఉండు.."
"నన్ను దగ్గరికి రానివ్వవూ?"
"ఉహూ.. రానివ్వను.. అడ్డదారుల్లో సంధి ప్రయత్నాలు చేసే గోరింక గడుసుదనానికి ఇవాళ చెల్లు.. అక్కడే నించో.."
"అబ్బో.. నాకే లక్ష్మణ రేఖ గీసావే.. ఇదంతా కోపమే.. నీకే.. నా మీదే.. ఇది కలా నిజమా?"
"కల లాంటి నిజం.. ఆట్టే వాదాలెందుకు మనకింక.. పో నువ్వు.. అంతే!"
"పోపొమ్మంటే రారమ్మనే కదూ.."
"కానే కాదు.. ఇక నీకూ నాకూ జత కుదరదు అని.."
"మనిద్దరి కంటే కుదురైన జత ఈ లోకంలోనే లేదు తెలుసా.."
"ఆహా.. చాల్లే బడాయి.. నాకు బోల్డు కోపంగా ఉంది నీ మీద.."
"ఎందుకో చెబుదూ.. క్షణంలో నీ కోపాన్ని కాస్తా తాపంగా మార్చేస్తానుగా.."
"ఆ ఆ.. మా గొప్ప పొగరుబోతువి కదూ.. నువ్వు తలచుకుంటే ఏమైనా చెయ్యగలవని ధీమా కాబోలు! ఈసారి మాత్రం ఇదంత తేలిగ్గా కరిగే కోపం కాదు.. ఖోపం.."
"ఈ అందాల చిలక మనసు పారేసుకుంది కూడా ఆ పొగరు చూసే కదూ.. అందుకే నాకంత ధీమా.. ఇంతకీ అంత కోపం.. అదే అదే ఖోపం ఎందుకో చెప్పావు కాదేం!"
"ఎందుకా.. ఒకటా రెండా.. ఎన్నని చెప్పను నీ ఆగడాలు.. నీ హింస నే పడలేకున్నాను.. నన్నొదిలి వెళ్ళిపో.. పో పో పో.."
"సరే అలాగే పోతాన్లే గానీ.. ఇంత కఠిన శిక్ష విధించే ముందు అసలు నా మీద మోపే అభియోగాలు ఏమిటో చెప్పాలోయ్.. అదే న్యాయం.."
"కారణాలన్నీ చెప్తే నిజంగా నన్నొదిలి వెళ్ళిపోతావా?"
"అరే.. ముందంతా శివంగిలా గర్జించావే.. ఇంతలోనే బేలతనమా?"
"నేనేం బేలను కాను.. నాకేం భయమా.. నువ్వు లేకపోతే
నేను ఉండలేన...నుకున్నావా యేం.."
"అరెరెరే.. చిలకమ్మ కన్నులు చూడు.. ఎర్రగా కందిపోయి పెదవుల రంగులోకి వచ్చేసాయే.. ఏదీ ఓ సారిలా నా కళ్ళలోకి చూడు.. మాట చెప్తాగా.."
"ఉహూ.. నేనేం చూడను.. విన్నూ.. నువ్వు నన్ను మాయ చేస్తావు.."
"ఊ.. మాయ మంత్రం వేసి నీ దిగులుని, బెంగని మాయం చేస్తాను అమ్మడూ.."
"ఎప్పుడూ నీ కోసం ఎదురు చూపుల్లో కరిగి నీరైపోయేలా చేస్తావు.."
"నీ చెంత చేరిన క్షణంలో బిగి కౌగిట్లో కరిగించి ఆ నిరీక్షణ అంతా మరిపించి మురిపిస్తానుగా బంగారూ.."
"నన్ను చాలా ఏడిపిస్తావు.."
"అంతకంతా నవ్విస్తానుగా చిన్నారీ.."
"కలనైనా నా చేతికి చిక్కక తప్పించుకుపోయి నన్ను ఏకాంతంలో పడదోస్తావు.."
"ఇప్పుడు నిలువెత్తు నిజమై నీ కళ్ళెదుట ఉండగా ఇంకా కలల ఊసెందుకు పొన్నారీ.."
"నిన్నసలు ఎవ్వరూ భరించలేరు.. నాకొద్దు పో.."
"కదా.. అందుకే మరి.. నువ్వే కాదంటే నన్నేమైపోమన్నావ్ చిట్టీ.."
"నువ్వొట్టి అబద్ధాల పోగువి.."
"నా చిలకమ్మే నమ్మకపోతే నే చెప్పే అందమైన అబద్ధాలు నమ్మేదెవరు చెప్పు.."
"చాల్లే సంబరం.. :-)
అయినా నా కంటే ముఖ్యమైన రాచకార్యాలు ఏవిటోయ్ నీకసలు?"
"ఊ.. అది తప్పే.. ఏ శిక్ష వేసినా సరి.."
"నే వేసే శిక్షల మీద నీకసలు బొత్తిగా భయం లేకుండా పోయింది కదూ.."
"ఊ.. ఉహుహూ.."
"ఓ మాట అడగనా.. నిజంగా నా మీద ప్రేముందా నీకు? నిజ్జంగా నిజం చెప్పవూ.."
"ఈ కనిపించే చెట్లూ పుట్టలూ, రాళ్ళూ రప్పల మీద ప్రమాణం చేసి మరీ మూడువేల ముప్పై మూడోసారి చెప్తున్నా.. నిజంగా నిజ్జంగా నీ మీద బోల్డు ప్రేముంది. నన్ను నమ్మవూ.."
"ఊ.. ఈసారికి నమ్ముతున్నాలే.. మళ్ళీ నన్నొదిలి వెళ్ళవు కదూ.. నన్ను ఏడిపించవు కదూ?"
"ఉహూ.. వెళ్ళినా వెంటనే రెక్కలు కట్టుకు వచ్చి నీ ముందు
వాలిపోతాను.. కాస్తో కూస్తో ఏడిపించినా మళ్ళీ నవ్వించే పూచీ నాదే.. సరేనా!"
"ఊ.. మరేమో.. అప్పటినుంచీ నే చెప్పినవన్నీ పెదవి చివర నుంచీ వచ్చిన మాటలే.. నిజంగా మనసులోంచి వచ్చినవి కాదు తెలుసా.."
"ఊ.. తెలుసు.. నేను కూడా అప్పటి నుంచీ చెప్పిన మాటలన్నీ అలా దొర్లినవేగా మరి.."
"నిజమా... అసలు నిన్నూ ఊ ఊ... అందుకే మరి.. నిన్ను పట్టుకు తన్నాలనిపించేది.. నాకొద్దు పో నువ్వు.."
"హహ్హహ్హా... ఇందుకే మరి.. నాక్కూడా నీ చేతిలో తన్నులు తినాలనిపించేది.. :-)"




** నాకు చాలా చాలా నచ్చే ఓ పాట..
ఎందాకా ఎగిరేవమ్మా గోరింక..