"అబ్బబ్బా.. పిల్లల్ని స్కూలుకి రెడీ చెయ్యాలంటే గంటసేపు కష్టపడాల్సి వస్తోంది.."
"అదే మాయదారిపురం గోల్డ్ లోన్ అయితే రెండు నిమిషాల్లోనే తీసేస్కోవచ్చు.."
"చాలా ఆకలేస్తోంది.. బాబూ ఒక చికెన్ బిర్యాని పార్సెల్.."
"కనీసం అరగంట వెయిట్ చెయ్యాలండీ.."
"అదే మాయదారిపురం గోల్డ్ లోన్ అయితే క్షణాల్లో రెడీ.."
"హబ్బా.. హైదరాబాద్ ట్రాఫిక్లో పార్కింగ్ వెతుక్కోవాలంటే రెండు గంటలు పడుతుంది.."
"అదే మాయదారిపురం గోల్డ్ లోన్ అయితే అయిదే నిమిషాలు.."
"ఓహ్.. ఈ షాప్ కి సండే సెలవంట.. మూసేసి ఉంది.."
"అదే మాయదారిపురం స్టోర్ అయితే ఆదివారం కూడా నిమిషాల్లో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.."
**************
ఏంటీ.. ఈ పిల్లకి ఉన్నట్టుండి పిచ్చేక్కిందేమో పాపం అని కంగారు పడుతున్నారా.. ఇంకా పరిస్థితులు అందాకా రాలేదు గానీ విషయం ఏంటో వివరంగా చెప్తానుండండి.
నేను పైన చెప్పినవన్నీ ఒక బంగారం తాకట్టు దుకాణానికి సంబంధించిన రేడియో ప్రకటనలు..
అంటే వాళ్ళ ఉద్దేశ్యం.. తిండి, పిల్లలు లాంటి వాటన్నీటి కన్నా గోల్డ్ లోన్ తీస్కోడం ఈజీ కాబట్టి మీకవసరం ఉన్నా లేకపోయినా అర్జెంటుగా వచ్చి తీసేస్కోండి అనా.. లేకపోతే పనీ పాటా చేస్కోడం కష్టం.. గోల్డ్ లోన్ తీస్కోడం సులువు.. అందుకని ఆ పని చెయ్యండనా??
అసలు మీకేమన్నా అర్థమైందా ఈ ప్రకటనల సారాంశం ఏంటో.. నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మీకెవరికైనా ఈ క్రియేటివిటీలో లాజిక్కు అర్థమైతే దయ చేసి నాకు చెప్పి పుణ్యం కట్టుకోండి..
నేను వంట పనో, ఇంటి పనో చేస్తున్నప్పుడు హైదరాబాద్ FM రేడియో వింటూ ఉంటాను అప్పుడప్పుడూ. అయిదు నిమిషాలకోసారి వచ్చే వీళ్ళ ప్రకటనలు వినీ వినీ నాలో దాగున్న సృజనాత్మకత వెర్రి తలలు వేసి ఆశువుగా వీళ్ళ కోసం మరి కొన్ని ప్రకటనలు సూచించాలనిపిస్తోంది..
"అన్నం తినడం వేస్టు.. గోల్డ్ లోన్ తీస్కోడం బెస్టు.."
"స్నానం చెయ్యడానికి పావుగంట.. గోల్డ్ లోన్ కి రెండే నిమిషాలు.."
"పరీక్షలు రాయడానికి మూడు గంటలు.. గోల్డ్ లోన్ కి ఐదే నిమిషాలు.."
"ఉరేస్కోడానికి ఐదు నిమిషాలు.. గోల్డ్ లోన్ కి ఒకే నిమిషం.."
ఎలా ఉన్నాయి స్లోగన్స్.. వాళ్ళ తాహతుకి తగ్గట్టు ఉన్నాయంటారా? మీకింకా బెటర్ అయిడియాలు వస్తే చెప్పండి.. ఎంచక్కా మాయదారిపురం గోల్డ్ లోన్ వాళ్ళు వాడేసుకుని ఇంకా జనాల్ని చావగొట్టేస్తారు..
సరే సరే.. ఇప్పుడు నాకు ఆకలేస్తోంది.. మా కెఫేటీరియాలో లంచ్ కోసం పది నిమిషాలు ఎదురు చూడాల్సి వస్తుంది. అయినా మాయదారిపురం గోల్డ్ లోన్ ఉండగా అంతసేపు ఎదురు చూడాల్సిన ఖర్మ నాకేం పట్టింది చెప్పండి. అందుకని నేను అన్నం తినడం మానేసి అర్జెంటుగా వెళ్ళి మాయదారిపురం గోల్డ్ లోన్ తీసుకుని వస్తాను.
Tuesday, January 24, 2012
మాయదారిపురం గోల్డ్ లోన్
Sunday, January 22, 2012
నీ ప్రేమలో.. నిన్నా, నేడు!
నేను నిన్ను ప్రేమించాను. నీలోని అణువణువునీ ఎంతో ఇష్టంగా ప్రేమించాను. నా ప్రాణ సమానంగా ప్రేమించాను. ఇంకా చెప్పాలంటే నన్ను నేనే మర్చిపోయేంత పిచ్చిగా ప్రేమించాను.
నీ మాటా, నవ్వూ, నడకా, చూపూ, అలక, బెట్టు, పొగరు, కోపం, చిరాకు, విసుగు, తిట్లూ, బుజ్జగింపులూ, మెచ్చుకోలు... ఇలా నీ నుంచి నా వైపు వచ్చే ప్రతీదీ అపురూపంగానే కనిపించేది నా కళ్ళకీ మనసుకీ కూడా!
నీ ఇష్టాలూ, అభిరుచులూ, కోరికలూ.. నువ్వేదంటే అదే నాక్కూడా నచ్చేది. నీకు నచ్చే రంగులూ, నీకు నచ్చే సినిమాలూ, నీకు నచ్చే మనుషులూ.. ఇలా ప్రతీదీ నీ ఇష్టంలోనే నా సంతోషం ఉండేది. "తీపిని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా.. ఒకసారి తిని చూడు.. తియ్యగా ఎంత బాగుంటుందో.." అన్న నీ ఒక్క మాటకి ఎప్పుడూ లేనిది అమాంతంగా మిఠాయిల మీద ఇష్టం వచ్చేసింది నాకు. నిజంగా అవెంత అందమైన రోజులు!
ప్రతీ క్షణం నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నానన్న ఆలోచన తప్ప అసలు నేను నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాను అన్న ప్రశ్నే ఎప్పుడూ తోచలేదు. నువ్వంటే ఇష్టం.. నీతోనే నా లోకం.. అంతే! నీతో ప్రేమలో ఉన్నానన్న భావన జీవితాన్ని ప్రతీ క్షణం జీవిస్తున్నానన్న సంతృప్తిని కలిగించేది. నీ ప్రేమలో నాకు నేను పరిపూర్ణత్వాన్ని పొందినట్టు అనిపించేది.
కాలం రెప్పపాటులో కరిగిపోయింది..
నువ్వెందుకు ఇలా ఉన్నావు, ఇంకోలా ఎందుకు లేవు, నిన్నలా మొన్నలా ఈ రోజెందుకు లేవని నిన్ను నిలదీశాను. అలా ఎందుకు లేవని నాలో నేనే బెంగ పెట్టుకుని క్రుంగిపోయాను. నేను నిన్ను ఎందుకు ప్రేమించాను, అసలు నిన్నెందుకు నేను ప్రేమించాలి, నువ్వు నాకు నచ్చినట్టు ఎందుకు ఉండట్లేదు, ఇప్పుడు నువ్విలా ఉంటే నాకు నచ్చట్లేదు.. అంటూ నిన్ను పదే పదే విసిగించాను, నొప్పించాను.
నాకు తెలీకుండానే నాలో నీ మీద ప్రేమ స్థానంలో కోపాలూ, పంతాలూ, సందేహాలూ వచ్చి చేరిపోయాయి. ఒకప్పుడు నాలో మొత్తంగా నిండిపోయిన నీ మీద ప్రేమ ఎక్కడికి పోయింది? ఎంతగా వెతికి చూసినా రవ్వంతైనా కనిపించడం లేదే? అద్దం ముందు నించుని చూసుకుంటే నా బదులు నువ్వే కనిపించే రోజుల నుంచి.. నాకు నేను కూడా కనిపించకుండా శూన్యంలా మిగిలిపోయిన పరిస్థితుల్లోకి వచ్చి పడ్డాను.
కాలం కదలనని మొండికేసింది..
"నువ్వు మారిపోయావు" అని పదే పదే గొంతు చించుకుని అరుస్తున్న నన్ను నా మనస్సాక్షి నిలదీసి అడుగుతోంది. ఇంతకీ మారింది కేవలం నువ్వేనా.. నేనేం మారనేలేదా? నీలో మార్పుని ప్రశ్నించే ముందు నాలోకి ఒకసారి తొంగి చూడమంటోంది. నిజంగా నేను నిన్ను ప్రేమించడం నిజమైతే నీలో వచ్చిన మార్పుని మాత్రం నేను ప్రేమించనా.. ప్రేమించలేనా?
సరే.. ఒక వేళ కాదు కూడదు అనుకుంటే నిన్ను పూర్తిగా వద్దనుకుని దూరం చేసుకోగలనా? నిజంగా నాక్కావలసింది అదేనా? ఉహూ.. కాదు.. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నేనెప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉండాలి. నువ్వు అనే ఆలోచన లేని నేను లేనే లేను. నువ్వు లేని నేను నాకే నచ్చను.
మరి అలాంటప్పుడు నాకెందుకింత పంతం.. నా ఆలోచనలకి అనుగుణంగానే నువ్వుండాలని స్వార్ధమా? అసలు నిజమైన ప్రేమున్న చోట స్వార్ధానికి చోటు ఉంటుందా?
నా ప్రేమతో నిన్ను బంధించాలనుకోను. నీ స్వేచ్ఛని గౌరవిస్తాను. నిన్ను నిన్నుగా ప్రేమిస్తాను. నీలోని మార్పునీ, నీ ఇష్టాల్నీ, అయిష్టాల్నీ ప్రేమిస్తాను. నీలో ఉన్న లోపాల్ని, బలహీనతల్ని కూడా ఇష్టంగా ప్రేమిస్తాను.
నేను నిన్ను ప్రేమిస్తాను. నీలోని అణువణువునీ ఎంతో ఇష్టంగా ప్రేమిస్తాను. నా ప్రాణ సమానంగా ప్రేమిస్తాను. ఇంకా చెప్పాలంటే నన్ను నేనే మర్చిపోయేంత పిచ్చిగా ప్రేమిస్తాను.
నా కళ్ళల్లో నువ్వొచ్చి చేరిపోయావు.. నా మనసు తేలికైపోయి కేరింతలు కొడుతూ మబ్బుల దాకా ఎగురుతోంది.. నా చుట్టూ ఉన్న చెట్టూ పుట్టా, పక్షీ, నింగీ, నేలా నాతో కలిసి నవ్వుతున్నాయి.
అంతదాకా ఆగిపోయిన కాలం మెల్లగా కదలసాగింది.
అవును.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీలోని అణువణువునీ ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నాను. నా ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నన్ను నేనే మర్చిపోయేంత పిచ్చిగా ప్రేమిస్తున్నాను.
నాకు తెలుస్తోంది..
కాలం నా చేతికి చిక్కనంత వేగంగా పరుగులు తీస్తోంది..!
Monday, January 16, 2012
నా కథ 'ఒక ప్రయాణం - ఒక పరిచయం' 'మాలిక పత్రిక' సంక్రాంతి సంచికలో..
నేను వ్రాసిన 'ఒక ప్రయాణం - ఒక పరిచయం' అనే కథ 'మాలిక పత్రిక' సంక్రాంతి సంచికలో ప్రచురితమైంది. నా కథని ప్రచురించిన మాలిక పత్రిక సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..
Wednesday, January 11, 2012
నీవు వచ్చు మధుర క్షణమేదో.. కాస్త ముందు తెలిసెనా ప్రభూ!
నిన్నే నా తనుమనఃప్రాణాల్లో నింపుకుని, నీ మీదే ధ్యాస నిలిపి, సదా నిన్నే స్మరిస్తూ నీ రాక కోసమై ఎదురు చూస్తూ ఉంటాను. నిన్ను కన్నులారా చూడగలిగే మధుర క్షణం ఎప్పుడొస్తుందోనని వేయి కన్నులతో నిరీక్షించే నాకు నువ్వు అరుదెంచే ఆ అపురూప ఘడియేదో కాస్తంత ముందుగా తెలిసుంటే ఈ మందిరాన్ని ఇలా ఉంచేదాన్నా స్వామీ!
సుందర సుమధుర సుగంధ పుష్పాలెన్నిటినో తెచ్చి నీకు స్వాగతం పలుకుతూ పూలదారిని సిద్ధం చేద్దును కదా! నా ఇంటి వాకిట నీ పాదపూజకై నియోగించబడిన పారిజాతాలపైన క్షణమైనా నిలిచే నీ అడుగుల గురుతులే నాకు అమూల్యం కదా!
బ్రతుకంతా నీ నిరీక్షణలోనే గడుపుతూ ఎంతగా ఎదురుచూసినా ఎదుటకి రావు.. నీ తలపుల తాకిడికి బరువెక్కిన కనురెప్పలు అలా అరక్షణం సేపు ఆదమరుపుగా కన్నంటుకున్న క్షణాన్నే వచ్చి వెనువెంటనే మాయమైపోతావు. తక్షణం నే తెలివి తెచ్చుకుని కలలో కాదు ఇలలోనే నా కళ్ళెదురుగానే నా స్వామివి నువ్వు సాక్షాత్కారించావని గ్రహించి.. ఎన్నటికీ నీ సాంగత్యాన్ని నాకు అనుగ్రహించమని, మన ఈ కలయికని శాశ్వతం చెయ్యమని అర్థిస్తూ నిన్ను నా చెంతనే నిలపడానికనైనా సరే నా ప్రేమతో నిన్ను క్షణమైనా బంధించలేని అశక్తురాలను స్వామీ!
కాస్త ముందు తెలిసెనా ప్రభూ.. నువ్వు నన్ను చేరే మధుర క్షణమిదనీ..!
అసలు ఎంత అపురూపమైన భావన.. ఎంత అందమైన వ్యక్తీకరణ కదూ! ఇంతందమైన దేవులపల్లి వారి కవిత్వానికి రమేష్ నాయుడు గారి సుస్వర సంగీతమూ, సుశీల గారి అమృత గళం జోడైతే మరిహ చెప్పేదేముంది.. అలా ఆ పాట వింటూంటే మన మనసులో స్వర్గలోకపు పరిమళాన్ని నింపుతూ పారిజాతాల వాన కురిసినట్టుంటుంది. ఒకటీ, పదీ, వంద సార్లు విన్నాగానీ విన్న ప్రతీసారీ అదే తన్మయత్వంలో పడిపోతుంటాన్నేను.
1983 లో దాసరి నారాయణ రావు గారి స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో వచ్చిన 'మేఘ సందేశం' సినిమాలోని 'ముందు తెలిసెనా ప్రభూ..' అనే పల్లవితో సాగే పాట ఇది. ఈ సినిమాలో ఆకాశ దేశాన, ఆకులో ఆకునై రెండు పాటలు తప్ప మిగతావి ఎప్పుడూ వినలేదు నేను. ఒక ఆర్నెల్ల క్రితమనుకుంటాను మొదటిసారి ఈ సినిమాలోని పాటలన్నీ విన్నాను. అప్పటి నుంచీ దాదాపు ప్రతీ రోజూ ఈ పాటలు వింటూనే ఉన్నా.. మరీ ముఖ్యంగా ఈ పాటైతే మళ్ళీ మళ్ళీ ఇప్పటికి ఎన్ని వందలసార్లు విన్నానో.. ఇంకా ఇంకా వింటూనే ఉన్నా!
ముందు తెలిసెనా ప్రభూ.. ఈ మందిరమిటులుంచేనా..
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో..
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే..
సుందర మందార కుంద సుమదళములు పరువనా..
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై..
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును..
ముందు తెలిసెనా ప్రభూ.. ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో..
కాస్త ముందు తెలిసెనా ప్రభూ..
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావు..
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు..
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ..
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల చేసి..
ముందు తెలిసెనా ప్రభూ.. ఈ మందిరమిటులుంచేనా..
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో..
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!
కృష్ణశాస్త్రి గారి పేరు వినగానే భావకవిత్వం గుర్తొస్తుంది. ఎప్పుడో కాలేజీలో ఏదో తెలుగు పాఠంలో ఆయన కవిత ఒకటి చూడటం తప్పించి ఆయన కవిత్వంతో నాకు ఎక్కువ పరిచయం లేదు. మొదటిసారి ఈ సినిమా పాటలన్నీ వరసగా విన్నప్పుడు అన్నీటి కన్నా నన్ను ఎక్కువ ఆకర్షించిందీ, ఆకట్టుకుంది దేవులపల్లి వారు రాసిన పాటలే. అసలెంత చిక్కటి భావగాఢత, అంతే లాలిత్యం, అంతే అందమైన పదబంధాలు.. ఆస్వాదించడం, అనుభవించడం తప్ప మాటల్లో ఇదీ అని చెప్పడానికి రాదేమో అన్నంత అందమైన అనుభూతి!
నేను నిన్నెంత ప్రేమిస్తున్నప్పటికీ, ఆరాధిస్తున్నప్పటికీ... నువ్విలా వచ్చి అలా మాయమైనా సరే.. నన్ను విడిచి కదలకుండా నీ పాదాలని బంధించి ఉంచే ప్రయత్నం చెయ్యలేను స్వామీ!
సాధారణంగా ప్రేమ ఎక్కువైపోయి మనం ప్రేమించిన వారిని హృదయంతో బంధించడం అన్నది ఎప్పుడూ చూసేదే కదా! అలా కాకుండా ఎంత ప్రేమ కొద్దీ అయినా సరే ఎటువంటి బంధనాలు కలిగించకుండా అంత స్వేచ్ఛని ఇవ్వడం (పోనీ స్వేచ్ఛని హరించకుండా ఉండటం అనుకుందాం) అంటే.. ఆ భావనని అసలు ప్రేమనే కంటే ఆరాధన అనాలేమో! ఎంతటి స్వేచ్ఛాప్రియత్వం కదా!
ఆ ప్రేమలో ఎంత సున్నితత్వం, ఆరాధన ఉన్నాయో చూసారా... నువ్వొచ్చేదాకా నీ గురించి తలచుకుంటూ ఎదురు చూస్తానే తప్ప నిన్ను రమ్మని పిలువలేను.. నా కోసం నువ్విచ్చిందే అందుకుంటాను తప్ప నాకై నేనేమీ నిన్ను అడగను ప్రభూ! అందుకే ప్రేమతోనైనా సరే బంధించాలి అన్న ఆలోచన తనకి రాదేమో అసలు! ఎంత నిస్వార్థమైన ప్రేమ! ఎంతటి మహోన్నతమైన ప్రణయారాధన కదా!
అసలు అన్నీటికంటే నాకు బోల్డు ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే కృష్ణ శాస్త్రి గారు స్త్రీ హృదయాన్ని ఊహించి లేదా అర్థం చేసుకుని ఇంతందంగా అక్షరాల్లో పెట్టగలగడం.. ఆయన్ని పొగడటానికి ఎన్ని పదాలైనా సరిపోవేమో.. నిజంగా అద్భుతం! అసలు నిజంగా అలా ప్రేమించగలిగే వాళ్ళు, తనలో అంత ప్రేమని కలిగించగలిగేవాళ్ళు ఎవరైనా ఉంటే.. వాళ్ళెంత ధన్యులో కదా.. బహుశా కృష్ణ శాస్త్రి గారు అంతేనేమో! ;)కానీ, ఇంకోటి కూడా అనిపిస్తుంది. ఒక వేళ అలా ఎవరైనా ఉన్నా బహుశా వాళ్ళూ, వాళ్ళ ప్రేమ ఈ ప్రపంచానికి అర్థం కాదేమో, పిచ్చిలా అనిపిస్తుందేమో.. అచ్చం ఈ సినిమా కథలోలాగా! :)
ఇంకా ఈ సినిమాలోని మిగిలిన పాటల గురించి, సినిమా గురించి మరోసారెప్పుడైనా చెప్పుకుందాం.. అందాకా ఈ పాటని ఆస్వాదించండి. :)