నేనే నీ ప్రపంచమని మురిపించిన రోజున బదులు పలకడానికి మాటలు దొరక్క మౌనంగా నీకేసి చూస్తుండిపోయాను..
నన్ను మించిన మరో ప్రపంచం కావాలనుకుని దూరమైపోతున్న ఈ రోజున కూడా బదులు తోచక మౌనాన్నే ఆశ్రయిస్తున్నాను..
నా కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క జారితేనే విలవిలలాడిపోయినప్పుడు ఎలా స్పందించాలో తెలీక మౌనంగా నిలిచిపోయాను..
నా పంచప్రాణాలు కన్నీళ్ళలో కొట్టుకుపోయేలా విలపిస్తున్న నన్ను భావరహితంగా చూస్తుండిపోతున్న ఈ క్షణానా మౌనమే శరణ్యమయ్యింది..
నీ కళ్ళల్లో మెరిసిన అమాయకత్వాన్ని, స్వచ్ఛమైన ప్రేమని చూసిన రోజున మాటలు కరువై మౌనపు జల్లుల్లో తడిసిపోయాను..
నీ కళ్ళల్లో నిండిపోయిన నిర్లక్ష్యాన్ని, నిరాదరణని, లెక్కలేనితనాన్ని చూస్తున్న ఈ క్షణాన మాటలు పెగలక మూగబోతున్నాను..
కుసుమ కోమలమైన పూరెమ్మనంటూ నాలోని సున్నితత్వాన్ని అపురూపంగా తలచి లాలించిన ఆ రోజున మౌనంగా నవ్వాను..
హృదయాన్ని కఠిన పాషాణంలా మార్చుకుని శిలాపుష్పంలా మారి బతకమని శాసిస్తున్న ఈ క్షణాన మౌనంగా రోదిస్తున్నాను..
అప్పుడూ ఇప్పుడూ మౌనమే నా భాషయ్యింది... కానీ భావంలో ఎంతటి అగాథాల దూరమో కదూ!