Wednesday, March 30, 2011

ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యనైనది ఏది?

బాలల కోసం ప్రత్యేకంగా నడుపుతున్న డిజిటల్ పత్రిక "జాబిల్లి" కోసమని నేనొక చిట్టి కథ రాసాను. అందరూ చదివి ఎలా ఉందో చెప్పండి.

అలాగే, ముచ్చటైన జాబిల్లిని మీ పరిధిలో మీకు తెలిసిన పిల్లలలందరికీ, అలాగే చిన్న పిల్లలున్న తల్లిదండ్రులందరికీ పరిచయం చెయ్యండి. మరింతమంది బాలలకి జాబిల్లి వెలుగుల్ని పంచండి.

జాబిల్లి కోసం రాయాలనే నా ప్రయత్నానికి సహకరించి ప్రోత్సహించిన "జాబిల్లి" ఎడిటర్ రమ్యగీతిక గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.


Sunday, March 20, 2011

నీ కోసం..


నువ్వెక్కడున్నావో తెలీకుండానే ఎన్నెన్నో కాలాలు కరిగిపోయాయి..
ఒకే ఒక్కసారి నువ్వెలా ఉన్నావో తెలిస్తే చాలుననుకున్నాను..
నీ ఊసు తెలిసాక ఒకే ఒక్కసారి నీ స్వరం వింటే చాలుననుకున్నాను..
ఇప్పుడేమో ఒకే ఒక్కసారి నీ మోము చూస్తే బాగుండుననిపిస్తోంది..
నిన్నెలా కలుసుకోవాలో, ఎక్కడని వెతకాలో తెలీనప్పుడు కేవలం నీ తలపుల్లోనే యుగాలు గడిపేశాను..
నీ జాడ తెలిసాక మాత్రం నిన్ను గొంతెత్తి పిలవకుండా నిమిషం పాటైనా నను నేను నిలువరించుకోలేకున్నాను..
ఇన్నాళ్ళు నిదురిస్తున్నాయనుకున్న నీ జ్ఞాపకాలు ఇహ నటన మా వల్ల కాదంటూ చేతులెత్తేశాయి!

Thursday, March 17, 2011

వెన్నెల వాన!


వరుసగా కొన్ని వారాలపాటు ఎటు చూసినా తెల్లగా కుప్పలు తెప్పలుగా మంచు తప్ప ఇంకేం కనపడలేదు కంటికి. ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి మెల్లగా మంచంతా కరిగిపోవడం మొదలయింది. ఇంతలో మంచు జాతర అయిపోయి వాన జాతర మొదలైంది.

ఇన్ని రోజులూ "అబ్బబ్బా.. ఎండైనా, వానైనా కొంతవరకూ భరించవచ్చు.. అన్నీటికంటే చలినీ, మంచునీ భరించడమే కష్టం బాబూ!" అనిపించింది కాస్తా ఉన్నట్టుండి పాట మార్చినట్టయింది. "బాబోయ్.. వర్షం ఎప్పుడు తెరిపినిస్తుందో.. చాలా విసుగ్గా ఉంది.." అంటూ కొత్త పాట ఇప్పుడు..

అబ్బ.. నిజంగా అసలీ వానకెంత ఓపికనీ! పగలూ రాత్రీ తేడా లేకుండా రోజుల తరబడి కురిసింది కురిసినట్టే ఉంటుంది.. అలాగని చెప్పా పెట్టకుండా గబగబా దూసుకొచ్చేసి ధడధడా ఉరుములూ మెరుపులతో దాడి చేసి ముంచేసే జడివాన కాదు మళ్ళీ!

ఆకాశమంతా నల్లటి మబ్బులతో కమ్మేసి మొహం మాడ్చుకున్నట్టుంటుంది. తన మనసులో ఏదో పెద్ద బాధని దాచుకుని పదే పదే అదే తల్చుకుని ప్రతీ క్షణం ఒక్కో కన్నీటి చుక్క కారుస్తున్న చందాన... అలుపూ సొలుపూ అంతూ అయిపూ లేనట్టుగా మెల్లగా, సన్నగా, విరామం లేకుండా కురుస్తూనే ఉండే వాన ఇది!

రోజుల తరబడీ అలా వాన కురుస్తోంటే మనకి కూడా బోల్డు దిగులొచ్చేసి భలే బెంగగా అనిపిస్తుంది.. నిజంగానే ఆకాశం మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తుందేమో.. తన మనసునంతా కరిగిస్తూ ఇలా వాన చినుకుల్లా రాలుస్తుందేమో అనిపించేస్తుంటుంది మనసుకి!

అలా కొన్ని రోజుల పాటు ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా కురిసిన వాన రోజు మధ్యాహ్నం దాటేసరికి కొద్దిగా తెరిపినిచ్చింది. నేనేదో పన్లో ఉండిపోయి బయటికి చూడనేలేదు చాలాసేపు.. సాయంత్రమయ్యే సమయానికి అనుకోకుండా కిటికీలోంచి బయటికి చూసి ఆశ్చర్యపోయా!

చినుకుల వాన ఆగిన చోటనే మళ్ళీ మంచు పూల వాన కురుస్తోంది. అప్పుడు సమయంలో మంచు పడుతుందని ముందుగా ఊహించకపోవడం వల్లనుకుంటా.. మరీ సంబరంగా అనిపించింది..

అసలే దట్టంగా కురుస్తున్న మంచుకి కాస్తంత గాలి కూడా తోడయిందేమో.. మంచు పూరేకులన్నీ అల్లిబిల్లి ఆడుతున్నట్టుగా వయ్యారంగా మెలికలు తిరుగుతూ వచ్చి నేలని తాకుతున్నాయి.

ఉన్నట్టుండి బయటికి చూస్తే అసలది మంచు కురుస్తున్నట్టు లేదు.. ఆకాశంలో ఎవరో దేవకన్యలు నించుని చేతుల్లో పెద్ద పెద్ద పూల బుట్టలతో తెల్ల గులాబీ రేకుల్ని అలా అలా మన మీదకి ఒంపేస్తున్నట్టుంది.. అచ్చంగా అలానే భ్రమపడ్డాను చాలాసేపు!

కిటికీ దగ్గరే నించుని అలా మౌనంగా బయటికి చూస్తుంటే ఎంత బాగుందో! ప్చ్.. కానీ ఏం లాభం.. ఎంత ఆత్రంగా పరుగులు తీస్తూ వచ్చిందో అంతే హడావిడిగా కాసేపు కురిసి పారిపోయింది దొంగ వాన!

అప్పుడప్పుడే మెల మెల్లగా చీకటి తెర వాలుతోంది.. నేను బయటికెళ్ళి అలవాటుగా ఆకాశంకేసి దిక్కులు చూస్తూ నడుస్తుంటే పక్కన నుంచి అప్పుడే చంద్రోదయం అవుతోంది.జోరుగా హుషారుగా గగన విహారానికి బయలుదేరిన చందమామ ఆకాశంలో పైపైకి వస్తూ కనిపించాడు..

పుత్తడీ వెండీ కలబోసి పోత పోసినట్టుగా మెరిసిపోతూ, గుండ్రంగా బూరె బుగ్గలతో, వెన్నెల మెరుపుతో మహా ముద్దొచ్చేస్తున్నాడు చందమామ! పున్నమి చంద్రుడన్నాక మాత్రం మెరిసిపోకుండా, మురిపించకుండా ఎలా ఉండగలడు మరి!

పౌర్ణమి చంద్రుడి అందానికి ఆకర్షింపబడి తననే చూస్తూ నడుస్తున్నానా.. ఇంతలో దోవ పక్కనున్న పెద్ద పెద్ద చెట్లు అడ్డం వచ్చాయి.. కానీ, శిశిరం రోజులు కదా ఇప్పుడు! అందుకని మాత్రం ఆకుల జాడే లేకుండా బోసిగా మిగిలిపోయిన మోడులే కాబట్టి చందమామని పూర్తిగా దాచిపెట్టలేకపోయాయి.. కానీ కాస్తంత పరిశీలనగా అటుకేసే చూస్తూ ఉండగా ఒక రమణీయ దృశ్యం నా కళ్ళబడింది..

అప్పటికే చాలా రోజుల నుంచీ వర్షానికి తడిసీ తడిసీ బాగా నానిపోయి ఉన్నాయా మోడులైన చెట్లన్నీ కూడా.. ఇప్పుడేమో కాసేపటి క్రితమే మంచు కురిసింది కదా.. అప్పుడు రాలిన మంచుపూలు కొన్ని నల్లటి చెట్ల కొమ్మల మీద ఒద్దికగా పేర్చినట్టు కొలువు దీరినట్టున్నాయి..

చెట్ల వెనకాలేమో వెన్నెలకాంతుల్ని వెదజల్లుతూ మెరిసిపోతున్న పున్నమి చంద్రుడు.. ఆహా...ఎంతందమైన దృశ్యం! అది చూసి ముచ్చటపడిపోయి నాకు తెలీకుండానే అడుగులేయడం మానేసి అటుకేసే అబ్బురంగా చూస్తూ నించుండిపోయాను!

మరి కాసేపటికి ఇంకో చిత్రం గమనించాను.. చెట్లకి చిటారు కొమ్మలుంటాయి కదా బుల్లి బుల్లివి సన్నగా తీగల్లాగా.. వాటి మీద నిలిచిన మంచు కరిగిపోయి కాబోలు.. సన్నటి కొమ్మల తీగలకి కిందవైపున సన్నగా ఊగుతూ నీటి బిందువులు.. అచ్చంగా వరుసలో ముత్యాలు కూర్చినట్టే ఉంది... మళ్ళీ వెనక నుంచి నీటి బిందువులని తాకుతూ పరావర్తనం చెందుతూ మిల మిలా మెరుస్తున్న వెన్నెల కిరణాలు...

అబ్బా.. దృశ్యాన్ని చూస్తునప్పుడు మనసు పరవశించిపోయింది.. మాటలకందని ఒక గొప్ప అనుభూతి! మంత్ర ముగ్ధురాలినైపోయి రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయాను.. ఎంతలా అంటే.. దృశ్యం శాశ్వతంగా నా కంటిపాపపై ముద్రించుకుపోయిందేమో అన్నంతగా!

అక్కడి నుంచి వచ్చేసాక అప్పుడు నా చేతిలో కెమెరా ఉంటే బాగుండేదేమో అన్న ఆలోచన వచ్చింది. ఒకవేళ ఉన్నా బయట కనిపించినంత అందంగా నేను ఫోటోల్లో బంధించలేనేమో అనిపించింది. అంతలోనే.. ఉహూ.. అసలు కెమెరా లేకపోవడమే బాగుంది.. అయినా, నా కంటిపాప బంధించిన జ్ఞాపకమంత అందంగా కెమెరా మాత్రం చిత్రించగలదు అనిపించింది..

నేను వెన్నెల వాన చూసి చాలా రోజులైపోయింది.. కానీ ఇప్పుడే చూసినంత తాజాగా మిగిలిపోయింది జ్ఞాపకం.. మళ్ళీ మళ్ళీ తలపుకొచ్చినప్పుడల్లా అప్పటి అనుభూతిని అక్షరాల్లో నింపి భద్రంగా దాచుకోవాలని అనుకుంటూనే ఉన్నాను. కానీ, ఏదోక రకంగా వాయిదా పడుతూ వచ్చిన పని ఇదిగో ఇప్పటికి పూర్తి చేశాను.. హమ్మయ్యా! :)

Tuesday, March 01, 2011

నా కథ 'అక్షరస్వప్నం' 'కౌముది' పత్రిక మార్చి సంచికలో!


నేను కొద్ది నెలల క్రితం రాసి పంపిన కథ 'అక్షరస్వప్నం', సాహితీలోకంలో నెలనెలా వెన్నెల కురిపిస్తున్న 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'మార్చి' సంచికలో ప్రచురితమైంది.
నా కథని అంగీకరించి ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..