Thursday, December 30, 2010

కాలం ఒక మాయల మరాఠీ!

కాలాన్ని మించిన మాయల మరాఠీ ఇంకెవరుంటారు!?

అసలు ఈ ప్రపంచాన్నంతటినీ శాసిస్తున్నది కాలమేనేమో అనిపిస్తుంటుంది ఒకోసారి! కాలం ఎప్పుడూ ఎవ్వరి మీదా విశేషమైన ప్రేమ గానీ, ద్వేషం గానీ ప్రదర్శించదు. ఎవ్వరి పైనా కోపం, కక్షా పెంచుకోదు. అలాగే ఎవ్వరి మీదా జాలి, కరుణ లాంటివి కూడా చూపదు. ప్రపంచంలోని ఏ మనిషినైనా ఒకేలా పరిగణిస్తుంది. బహుశా స్థితప్రజ్ఞత అంటే ఏంటో కాలాన్ని చూసే మనం నేర్చుకోవాలేమో.. అన్నంత స్థిమితంగా సాగిపోతుంటుంది.

కాలం.. దేనికోసమూ, ఎవ్వరి కోసమూ, ఎక్కడా ఆగకుండా తన మానాన తను అలా ముందుకి కదిలిపోతూనే ఉంటుంది. ఎవ్వరి ప్రమేయం లేకుండానే నిత్యం క్షణాలుగా, నిమిషాలుగా, రోజులుగా, వారాలుగా, మాసాలుగా, సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా రూపాంతరం చెందుతూ యుగాల తరబడి అలుపన్నది లేకుండా ఎప్పటికీ ఒకే వేగంతో సాగిపోతూ ఉండేది ఒక్క కాలమేనేమో!

కాలాన్ని అదుపు చేయగలిగే వారూ, మదుపు చేయగలిగే వారూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు! కాలమహిమ గ్రహించి దాన్ని అనుసరించి మసలుకోవడం, మనని మనం మార్చుకుంటూ ముందుకు పోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు.

అందరి జీవితాల్లోనూ గడిచేది అదే కాలమయినా ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుంది. కాలం ఒక్కొక్కప్పుడు మనల్ని బహు పసందైన అందాల్లో, ఆనందాల్లో ముంచి తేలుస్తూ రోజుల్ని సైతం క్షణాల్లా దొర్లించేస్తుంది. అదే కాలం మరొకప్పుడు మనల్ని నిర్దాక్షిణ్యంగా భరించలేనంత బాధల్లోనూ, చిక్కుల్లోనూ తోసేసి క్షణమొక యుగంలా మిక్కిలి భారంగా మారుస్తుంది.

కొంతకాలం జీవితమంటే సుతిమెత్తటి పూలదారేమో అన్నట్టుగా మురిపించి మైమరపిస్తుంది. మరి కొంతకాలం బ్రతుకంటే కేవలం వేదన కలిగిస్తూ యమ యాతన మిగిల్చే ముళ్ళబాట తప్ప మరేం కాదన్నట్టు భ్రమింపజేస్తుంది. ఎప్పటికైనా మనిషి బ్రతుకులో సుఖమూ దుఃఖమూ రెండూ శాశ్వతం కాదనే జీవితసత్యాన్ని కాలమే మనకి అనుభవపూర్వకంగా నేర్పిస్తుంది.

కాలం బాటలో ఎదురయే ప్రతీ మలుపులోనూ ఎన్నెన్నో చెరిగిపోని అనుభూతులనూ, అనుభవాలనూ మన దోసిట్లో నింపుతుంటుంది. తను నిత్యం కరిగిపోతూ మన బ్రతుకు పొరల్లో ఎన్నెన్నో జ్ఞాపకాల ముత్యాలను భద్రంగా పోగేస్తుంది. ఒకప్పుడు తన ఒడిలోనే తగిలిన గాయాలను కాలగమనంలో మళ్ళీ తనే అక్కున చేర్చుకుని మాన్పుతుంది.

అరిచి గీపెట్టినా, బతిమాలినా, బామాలినా గడచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి ఇవ్వదు. రేపటి రోజున మన కోసం ఏం దాగి ఉందోనని ఎన్నెన్నో ఊహలూ, కలలూ, సందేహాలూ, సంశయాలూ, ఆశలూ, ఆశయాలూ పెట్టుకుని ఎదురు చూడడం తప్పించి మరో అవకాశమే లేదు మనకి. ఎప్పటికి ఏది అవసరమో అదే ప్రసాదిస్తూ మనల్ని నిరంతరం నియంత్రిస్తూ బ్రతుకులోని అన్ని రుచుల్నీ మనకి పరిచయం చేసేది కాలమే కదా మరి!

కాలం మనం వద్దన్నంత మాత్రాన ఆగదు.. రమ్మని పిలిచామని పరుగులెత్తదు. ఓ క్షణంలో కాలం అక్కడే ఆగిపోతే బాగుండునని ఆశపడినా, మరొకప్పుడు రోజులు క్షణాల్లా కరిగిపోతే బాగుండునని తపించినా, తనని కాలదేవతగా పొగిడినా, కాలరక్కసివని నిందించినా.. ఏ మాత్రం చలించకుండా మనని చూసి ఒక చిరునవ్వు నవ్వేసి తనదైన వేగంతోనే తరలిపోతూ ఉంటుంది.

ఆది అంతాలు లేవేమోననిపించే కాలం జీవనదిలా శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అంత పెద్ద ప్రవాహంలో మన మజిలీ ఎక్కడ మొదలవుతోందో ఎక్కడ ముగుస్తుందో ఎవ్వరికీ తెలీదు. మనం చేయగలిగిందల్లా ఇప్పటి ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ మన చేతులతో పట్టి ఆపలేని కరిగిపోయే కాలాన్ని అందమైన అనుభవాలుగా మార్చుకుంటూ వాటన్నీటిని మన భుజాన మూట గట్టుకునే ప్రయత్నం చేయడమే!

ఇలా నిమిత్తమాత్రురాలిలా సాగిపోతూండే కాలానికి మైలురాళ్ళ లాంటి ఆనవాలు సంవత్సరాలు మారడం. ఒకో సంవత్సరం ఎప్పుడొచ్చిందీ, ఎప్పుడు వెళ్లిందీ తెలియనే లేదనిపిస్తుంది. కొన్ని సంవత్సరాలు మన జీవితాల్లో జరిగే కొన్ని విశేషమైన మార్పులకి సాక్ష్యాలుగా నిలబడతాయి. ఒకో సంవత్సరం మనకోసం గొప్పగా ఏమీ తేకపోయినా ఘోర భీభత్సాలేమీ సృష్టించలేదు అదే పదివేలు అనిపిస్తుంది.

కాలం చేసే మాయ మనకి ఎప్పటికీ పూర్తిగా అర్థం కాకపోయినా మనలోకి మనం తరచి చూసుకోడానికి ఈ మైలురాళ్ళు కొంతవరకూ పనికొస్తాయనిపిస్తుంది. ఒక సంవత్సరం ముగిసిపోయి కొత్త ఏడాది మొదలయే సందర్భంలో ఈ గడిచిన ఏడాదిలో గుర్తు పెట్టుకోవాల్సినవి ఎన్నున్నాయి, విస్మరించాల్సినవి ఎన్నున్నాయి, నేర్చుకోవాల్సినవి ఏమున్నాయి.. ఇలాంటి సింహావలోకనానికి ఇదే సరైన సమయమన్నమాట!
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

19 comments:

రాధిక(నాని ) said...

అరిచి గీపెట్టినా, బతిమాలినా, బామాలినా గడచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి ఇవ్వదు. రేపటి రోజున మన కోసం ఏం దాగి ఉందోనని ఎన్నెన్నో ఊహలూ, కలలూ, సందేహాలూ, సంశయాలూ, ఆశలూ, ఆశయాలూ పెట్టుకుని ఎదురు చూడడం తప్పించి మరో అవకాశమే లేదు మనకి. ఎప్పటికి ఏది అవసరమో అదే ప్రసాదిస్తూ మనల్ని నిరంతరం నియంత్రిస్తూ బ్రతుకులోని అన్ని రుచుల్నీ మనకి పరిచయం చేసేది కాలమే కదా మరి!చాలా బాగుందండి మీ విశ్లేషణ ..
మీకు కూడా" నూతన సంవత్సర శుభాకాంక్షలు".కొత్తసంవత్సరం మీ జీవితంలో ఆనందాల్ని , శుభాలని నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

తృష్ణ said...

:)) slightly different ..
http://trishnaventa.blogspot.com/2010/12/blog-post_26.html

లత said...

బావుందండీ,
ఇది నిజం కూడా.కాలం తో పాటూ సాగిపోవడమే మనం చెయ్యగలిగేది.
మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఇందు said...

మధురగారు! కాలాన్ని మీరు నిర్వచించినంత అందంగా....వివరణాత్మకంగా బహుశా ఎవరూ చేయలేరేమో! ఎంత బాగా చెప్పారు? కేవలం 'కాలం ' అనే కాన్సెప్ట్ మీద ఇంత పోస్ట్ రాసారంటే నిజంగా మిమ్మల్ని అభినందించి తీరాలండీ...గ్రేట్ :)

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

బాగా వ్రాశారు మధురవాణి గారు,మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

హరే కృష్ణ said...

Wow!
A perfect ending to the year! Simply superb ;-)

Wishing you a happy and prosperous new year..have a great year ahead

హరే కృష్ణ said...

ఇందు గారు, యాభై ఏళ్ళు పాటు limbo లో మాల్&కాబ్ ఉంటారు..ఇంత కంటే కాలం గురించి నోలన్ చెప్పగలడు అని మీరు ఒప్పుకొని తీరాల్సిందే ;-)

హరే కృష్ణ said...

Congratulations on 50th post of the Year!
Way to go!

శిశిర said...

చాలా బాగా రాశారు మధురా. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఇందు said...

హరే గారూ! మీరు ఆ ఇన్సెప్షన్ కన్సెప్ట్ లో బాగా లీనమైపోయారనుకుంటా! వారు కాలంలో వెనక్కి..ముందుకీ వెళ్లగలరేమోగానీ అందంగా వర్ణించడం మాత్రం మా మధురగారే చేయాలి :) అంతే! పీరియడ్! :))

శివరంజని said...

sweet madhura మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

మనసు పలికే said...

మధుర గారు, చాలా చాలా నచ్చింది మీ టపా:). కాలం గురించి ఎంత బాగా చెప్పారో. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు:)

బులుసు సుబ్రహ్మణ్యం said...

2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

kannaji e said...

ఏవండోయ్ ఏమైనా అనండి గాని మాయల" మరాఠి" అనకండి, రాజ్ థాకరే ,బాల్ థాకరే లు తగవు కి వస్తారు...మీకు తెలియని దేముంది చాన్స్ దొరికితే చాలు ఏదో ఒక ఇస్స్యు తో బయటికి వస్తారు..!
అదంతా సరే గాని మీకు నవ ఆంగ్ల వత్సర శుభాకాంక్షలు

http://buzzitram.blogspot.com/
http://4rfactor.blogspot.com/

veera murthy (satya) said...

నిజానికి కాలం జడమైనది....
ప్రకృతి(ఖగోల) నియమాలననుసరించి ఏర్పరుచుకున్న కొలమానం కాలం...
ప్రతిక్రియ చూపదు కాబట్టి కాలం జడం.
దానిని ఏమీ నలేం...అలాగని అనకుండా ఉండలేం!

veera murthy (satya) said...

madhura vaaNi garu,happy new year!

Ennela said...

nutana samvatsara subhaakaankshalanDee...time machine loo konchem venakki velli ,mee neyyi tapa chadivi, itu vachchaanannamaata...neyyi kosam aa maatram prayaanam cheyyadam not a problem..inkaa manchi items chaala kanabaddaayi..oka lookkesi vastaa

మధురవాణి said...

@ రాధిక (నాని), లత,
తృష్ణ, ఇందు, బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్, హరేకృష్ణ, శిశిర, శివరంజని, మనసు పలికే, బులుసు సుబ్రహ్మణ్యం, కన్నాజీ, సత్య, మాలా కుమార్, ఎన్నెల,
శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు. :)

@ తృష్ణ,
నేను రాసిందానికంటే మీ పోస్టు చాలా నచ్చేసింది నాకు. :)

@ ఇందు, హరేకృష్ణ,
బాగుంది మీ ఇద్దరి జగడం.. :) మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ! :)

మధురవాణి said...

@ kannaji e,
హహ్హహ్హా.. నిజమే సుమా! నాకీ ఆలోచనే రాలేదు.. మీ కామెంట్ చూసి చాలాసేపు నవ్వుకున్నానండీ! థాంక్యూ! :)

@ సత్య,
నిజమేనండీ.. కాలాన్ని ఏమీ అనలేం.. అనకుండానూ ఉండలేం!

@ ఎన్నెల,
అయితే మీరు కూడా నెయ్యికి ఫ్యానేనన్నమాట! స్వాగతం సుస్వాగతం.. ఓపిగ్గా నా బ్లాగుని తిరగేస్తున్నందుకు థాంక్స్ :)