Friday, December 24, 2010

క్రిష్ణమస్ పండగొచ్చింది!

ఏంటలా విచిత్రంగా చూస్తున్నారు? పాపం నాకు పండగ పేరు కూడా సరిగ్గా తెలీదు.. ప్చ్.. అనుకుంటున్నారా! అలా ఏం కాదులే గానీ, నాకీ పండగ మొదటిసారి పేరుతోనే తెలిసింది మరి. అందుకే అలా మొదలెట్టానన్నమాట! ఇంకేం సందేహాలు పెట్టుకోకుండా బుద్ధిగా ముక్కు మీద వేలేసుక్కూర్చుని నేను చెప్పేది వినండి.. అదేలెద్దురూ.. చదవండి.nerd

చిన్నప్పుడు మొదటిసారి ఎవరో 'ఇవ్వాళ క్రిష్ణమస్ పండగ' అంటుంటే, కృష్ణుడి పుట్టినరోజు పండగేమో అనుకున్నా నేను.sengihnampakgigi తరవాత 'క్రిష్ణమస్' అంటే కృష్ణుడు పుట్టినరోజు కాదు.. ఏసుక్రీస్తు పుట్టినరోజు పండగని మా నాన్ననుకుంటా జ్ఞానోపదేశం చేశారు. అనుకుంటా అని ఎందుకన్నానంటే, నాన్నే చెప్పినట్టు నాకు అంత ఖచ్చితంగా గుర్తు లేదు. కానీ, ఇలాంటి విషయాలు నాకు మరొకరి ద్వారా తెలిసే అవకాశం అప్పట్లో లేదన్నమాట! ఇంతకీ మళ్ళీ 'క్రిష్ణమస్' విషయానికొస్తే పదం అలా పలకకూడదని 'క్రిస్మస్' అనాలని చెప్పారు. పైగా ఏసుక్రీస్తు అంటే మన ముక్కోటి దేవతలలో ఒకరని గుడ్డిగా అనేసుకోవద్దని, అదొక వేరే మతమనీ, వేరే దేవుడని కూడా చెప్పారు. పనిలో పనిగా అందరు దేవుళ్ళూ ఒకటేనని కూడా చెప్పేశారు. ఆయనైతే అలా చెప్పారు గానీ, అప్పట్లో పండగని అలా పిలిచినవాళ్ళు నాకైతే ఎక్కడా తగల్లేదు. అందరూ అయితే క్రిష్ణమస్ అనో, క్రిస్టమస్ అనో అనేవాళ్ళు. సరే, ఏమైతేనేం, విషయం అయితే అలా తెలిసింది గానీ, అసలీ పండగ గురించి వివరంగా తెలిసింది మాత్రం నేను ఎనిమిదో తరగతిలో కొచ్చాక.

అదెలాగంటే, మా చిన్న పల్లెటూర్లో ఉన్న ఒక చిన్న ప్రైవేటు బళ్ళో నేను ఏడో తరగతి విజయవంతంగా పూర్తి చేసాక, ఎనిమిదో తరగతికి అక్కడే ఉన్న సర్కారు బళ్ళో కాకుండా పక్క ఊరులో ఏదైనా మంచి బళ్ళో చేర్పించాలని తీర్మానం చేశారు నాన్న. నెలకో వంద రూపాయల ఫీజు కట్టి ఒక మంచి ప్రైవేటు స్కూల్లో చేర్పించాలని అన్నీ సిద్ధం చేస్కున్నారు. దాదాపు బళ్ళు తెరిచే రోజు కూడా వచ్చేసింది. అప్పుడే నాకో విషయం తెలిసింది. ఏంటంటే, ఏడోతరగతి నాతో చదువుకున్న స్నేహితులు మా పక్కూర్లో ఉన్న చర్చి స్కూల్లో చేరారని. ఇంకంతే, నేను చదువంటూ చదివితే చర్చి స్కూల్లోనే అని దాదాపు ఒక పూటంతా నిరాహార దీక్ష చేసినంత పని చేశాను. నిజానికి ముందుగా ప్రయత్నిస్తే స్కూల్లో అడ్మిషను రావడం పెద్ద కష్టమేం కాదు. కానీ, అప్పటికే ఆలస్యం అయిపోయిందన్నమాట! చివరకి నాన్న చర్చి ఫాదర్ గారు మా పక్కింటి తాతగారికి తెలుసనీ ఆయన రికమండేషను మీద స్కూల్లో చేర్పించారు నన్ను. మా స్కూల్లో నెలకి పది రూపాయలు ఫీజు. మా స్కూల్లో చదువుకునే చాలామంది పిల్లల తల్లిదండ్రులు కూలీ పని చేస్కునే వాళ్ళో ఉండేవారు. అంచేత వాళ్ళు పది రూపాయలు కట్టడానికి కూడా ఆలస్యం చేసేవారు ఒకోసారి. క్లాసులో అప్పుడప్పుడూ ఫీజు కట్టని వాళ్ళ పేర్లు చదివేవారు. పక్కన ఎవరినో అడిగేతే నేను ఇంటికి వెళ్లి గొడవ చేసేదాన్ని నా ఫీజు కట్టారా లేదా అంటూ. నీ సంగతి మాకు తెలుసు కదా.. అందుకనే సంవత్సరానికి సరిపడా మొదట్లోనో కట్టేశాం తల్లీ అని మా ఇంట్లో వాళ్ళు మొత్తుకునే వారు మళ్ళీ మళ్ళీ. ఇదొక్కటే కాదు నా స్నేహితులందరూ ఆర్టీసీ బస్సులో వెళ్తుంటే నేనొక్కదాన్ని ఇంటి ముందు ఆటో ఎక్కి, స్కూల్లో దిగడం నామోషీగా ఉందని ఇంట్లో గొడవ చేసి బస్ పాస్ తీస్కుని వెళ్ళా కొన్ని రోజులు. ఇలాంటి సుగుణాలు నాకెన్నో ఉన్నాయి గానీ, ఇది కాసేపు పక్కన పెట్టి మళ్ళీ 'క్రిష్ణమస్' దగ్గరికి వచ్చేస్తా!

చర్చి స్కూల్లో నా బెస్ట్ ఫ్రెండు పేరు వేరోనిక. వాళ్ళిల్లు స్కూలు పక్కనే ఉండటం చేత వాళ్ళింట్లో అందరూ నాకు బాగా పరిచయం. వాళ్ళింట్లో అందరి పేర్లూ సెబాస్టియన్, థామస్, సుజా మేరీ, జెసింత.. ఇలా ఉంటే నాకు భలే చిత్రంగా అనిపించేది. మా స్నేహం కొన్ని రోజులు గడిచేప్పటికి క్రైస్తవ మతం గురించి నాక్కొంచెం అవగాహన వచ్చింది. 'పిత, పుత్రా, పవిత్రాత్మ నామమున..ఆమెన్' అని ఎలా చెప్పాలో నేర్చేసుకున్నా. అలాగే, మనం కొబ్బరికాయ కొడతామని మొక్కున్నట్టు వాళ్ళు కొవ్వొత్తులు వెలిగిస్తామని మొక్కుంటారని కూడా అప్పుడే తెలిసింది. ప్రతీ ఆదివారం మా స్కూల్లోనే ఉండే చర్చిలో వాళ్ళందరూ పాటలు పాడుతూ పూజలు చేస్తారని ఒకసారి చెప్పింది తను. నాకొక పాట వినిపించమని అడిగా. ఒక్కసారి వినగానే నాకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది పాట ట్యూన్. నేను విని ఊరుకోకుండా మా తమ్ముడికి వెళ్లి చెప్పా గొప్పగా నాకో సూపర్ పాట తెలిసిందని. మన గుళ్ళో పాటల్లా సాగదీసినట్టు లేకుండా ఎంత బాగుందోరా పాట అని చెప్పా. ఏదీ ఓసారి పాడమన్నాడు వాడు. గొంతు సవరించుకుని 'కన్నెమేరీ.. సుతుడయ్యే.. ఏసు ప్రభువూ..' అని పాడగానే వాడు కాసేపు ఏదో ఆలోచనలో పడ్డాడు. మరో నిమిషం తర్వాత వాడు చెప్పింది విని ఎంత నవ్వుకున్నామో ఎంత చెప్పినా తక్కువే!gelakguling అదెందుకో మీకూ తెలియాలంటే పాట ట్యూనేంటో చెప్పాలిగా మరి! 'కన్నెమేరీ.. సుతుడయ్యే.. ఏసు ప్రభువూ..' (వానజల్లు.. గుచ్చుకుంటే.. ఎట్టాగమ్మా..)jelir

మా చర్చి స్కూలుకి అప్పుడప్పుడూ ఫారినర్స్ వస్తుంటారని చిన్నప్పటి నుంచి అదే స్కూల్లో చదివే పిల్లలు చెప్పేవారు. సంవత్సరం కూడా అలాగే ఇద్దరు అమెరికన్ అమ్మాయిలు వచ్చారు. వాళ్లకి స్వాగతం చెప్పడానికని మా డ్రిల్లు మేష్టారు ప్రాక్టీసు చేయించిన డ్రిల్లు మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను. మామూలుగానే డ్రిల్లు చేయడమంటేనే పెద్ద శిక్షలా అనిపించేది నాకు. అలాంటిది ఎండలో రెండు మూడు గంటలు వాళ్ళ కోసం ఎదురు చూసీ చూసీ, తరవాత వాళ్ళు వచ్చినప్పుడు చేతుల్లో రంగు కాగితాల రిబ్బన్లు పట్టుకుని నానారకాల విన్యాసాలు చేసేసరికి అబ్బబ్బా..nangih నా చేతులు పడిపోయాయంటే నమ్మాలి మీరు. అంటే, మీరు మరీ చైనీస్ పిల్లలో చేసే జిమ్నాస్టిక్స్ అంత ఊహించుకోకండి. మరీ అంత సన్నివేశం లేదులే అక్కడ! అమెరికా నుంచి వచ్చిన ఇద్దరమ్మాయిలూ భలే చిత్రంగా కనిపించేవారు మా కళ్ళకి. థెరీసా అనే అమ్మాయేమో చాలా పొడుగ్గా, సన్నగా ఉండేది. ఆశ్లే అనే అమ్మాయేమో చాలా పొట్టిగా, లావుగా ఉండేది. ఇద్దరూ కెమేరాలేసుకుని తిరిగేవాళ్ళు ఎప్పుడు చూసినా! ఏటికి వాళ్ళ ఆధ్వర్యంలో మా స్కూల్లో 'క్రిస్మస్' సంబరాలు జరుపుకున్నామన్నమాట!

అదెలాగంటే, వాళ్ళిద్దరూ ఇంగ్లీషులో ఒక నాటకానికి స్క్రిప్ట్ రాశారు. అందులో డైలాగ్స్ తో పాటుగా మధ్య మధ్యలో చిన్న పాటలు కూడా ఉంటాయి. క్రీస్తు పుట్టినప్పటి కథన్నమాట అది! దాంట్లో నటించడానికి మమ్మల్ని కొంతమందిని ఎంపిక చేశారు. నాకు గుర్తున్న ముఖ్య పాత్రలెవరంటే మేరీ, జోసఫ్, క్రీస్తు పుట్టినప్పుడు చూడడానికొచ్చే ముగ్గురు రాజులూ, ఇంకా కొంతమంది దేవదూతలు (ఏంజెల్స్). నా క్లాస్మేట్ ఒకమ్మాయికి ఒక శాలువా కప్పి, చేతిలో ఒక బొమ్మని పెట్టి మేరీ మాతని చేశారు. రాజులకి కిరీటాలూ గట్రా తయారు చేశారు. ఇంతకీ నేనేం వేషం వేశాననుకుంటున్నారు? అంటే, సహజంగా నాలో ఉన్న ప్రతిభని గుర్తించి అచ్చు గుద్దినట్టు సరిపోతానని నాకో దేవదూత వేషం ఇచ్చారన్నమాట!malu దేవదూతలు మధ్య మధ్యలో వచ్చి కొన్ని సంఘటనలు జరగబోతున్నట్టు ముందుగానే అక్కడుండే ప్రజలకి చెప్తుంటారు. అన్నట్టు.. మీరు ఏంజెల్ అనగానే తెల్లటి గౌనులో మిలమిలా మెరిసిపోతూ, తేలిపోయే రెక్కలతో దివి నుంచి దిగొచ్చినట్టు కరుణాకరన్ సినిమాల్లో హీరోయిన్లని గుర్తు తెచ్చుకుంటే ముద్దపప్పులో కాలేసినట్టే! దేవదూతల్ని అంత అందంగా తయారు చెయ్యడానికి పాపం బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నాయి వాళ్లకి. అందుకని మా చర్చి ఫాదర్ గారిని అడిగి ఆయన వేసుకునే తెల్ల గౌన్లు ఒక నాలుగు అరువుకి తెచ్చి తలా ఒకటీ వేసుకోమన్నారు. ప్రభువు దయ వల్ల రోజు నాటకం వేసినప్పుడు ఫోటోలు గట్రా తియ్యలేదు కాబట్టి ఇవాళ మీరంతా బతికిపోయారు.kenyit

తతంగం అయిపోయాక అందరికీ క్రిస్మస్ గిఫ్ట్లు ఇచ్చారు. అదెలాగంటే, స్కూల్ గ్రౌండ్ లో ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ (మన ఇండియాలో క్రిస్మస్ ట్రీ తెలుసుగా మీకు) పెట్టారు. దాని కొమ్మల నిండా బోల్డన్ని న్యూస్ పేపర్ కవర్లు కట్టారు. ప్యాకెట్ లోపల గిఫ్ట్ ఉంటుందన్నమాట! అందరం లైన్లో వెళ్తూ ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్యాకెట్ లాగి తీస్కోవాలి చెట్టు నుంచి. అందులో నాకేం వచ్చిందో చెప్పాలిగా మరి! చిన్నప్పుడు ఐదు పైసలకి పసుప్పచ్చ గీతలున్న ట్రాన్స్పరెంట్ తగరం కాగితం లోపల నారింజ రంగులో గుండ్రంగా ఉండే చాక్లెటు దొరికేది కదా! ఇంకా ఇంకు అయిపోయాక పడేసే రీఫిల్ లేని రెండ్రూపాయల పెన్నులు ఉండేవి కదా! రెండూ వచ్చాయి నాకు. అలాగే మిగతావాళ్ళకి కూడా పెన్సిలో, రబ్బరో ఏదోకటి వచ్చింది ప్యాకెట్లో. అబ్బో.. గిఫ్టు చూసుకుని ఎంత మురిసిపోయానో నేను.celebrate నాన్న చాక్లెట్ ప్యాకెట్లూ, డజన్ల కొద్దీ రేనాల్డ్స్ పెన్నులు కొనిచ్చినప్పుడు కూడా అంత సంబరపడలేదెప్పుడూ. అప్పట్లో మా స్కూల్లో అలా చేసుకున్నామన్నమాట క్రిష్ణమస్ పండగ!

క్రిస్మస్ తాత మనందరి జీవితాల్లోకి బోల్డన్ని ఆనందాల్ని మోసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మిత్రులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. జర్మన్ లో Frohe Weihnachten!senyum

17 comments:

Anonymous said...

you are better.
We used to call( we were told ) it as "kissmiss" pandaga.
My best friend's name ; 'Saambelu',many years later i came to know it is"Samuel".

astrojoyd said...

jesus is not god..he is the messenger of god nd a lot of contraversy is there upon his birthday.Aftr changing several dates,the creators of christianity finally selected december 25th as his b-day,but its not the true birth date of jesus madam

ఇందు said...

భలే వ్రాసారు మధురగారు! ఎంత బాగున్నయో! ఆ పాట సూపర్! నేను అచ్చు అమ్మగార్ల స్కూల్లో చదివాను చిన్నప్పటినించి.ఇక నా పరిస్థితి అలోచించండీ...మా స్కూల్లో తెలుగులో మొదట బైబిల్ పఠనం గావించిన ఘనురాల్ని కూడా నేనే! ప్రతి సంవత్సరం మాచేత క్రిస్మస్ నాటకం వేయించవారు! నేను దేవదూత/మేరీమాత అన్నమాట :)ఇలా బోలెడు ఉన్నాయిలెండీ ....నాకు ఆ గ్నాపకాలన్నీ గుర్తు చేసారు.ధన్యవదాలు :) ఇక ఎప్పటిలాగే మీ టపా కేకోకేక :) మీకు కూడ హాపీ క్రిష్ణమస్ :))

3g said...

ఏంటి మీరు చిన్నప్పుడు క్రిష్ణమస్ అనేవారా, హ్హ హ్హ.. ఐతే మేమే బెటర్ కిస్మిస్ పండగనే వాళ్ళం.

మీరేసిన దేవదూత వేషం ఫొటో తీయించుంటే మేంకూడా చూసి తరించే వాళ్ళం కదండీ. :)

సి.ఉమాదేవి said...

క్రిస్మస్ అనగానే నాకు విశాఖ సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్,కాలేజీ,అక్కడి క్రిస్మస్ ట్రీ,రంగుటద్దాల చర్చి,మేము నేర్చుకున్న ప్రార్థనలు.మధుర గారు, మీరు నా డెయిరీలోని పుటలు భలే తిరగేస్తున్నారు.Thank you.

మనసు పలికే said...

మధుర గారు, మాట్లాడితే ఙ్ఞాపకాల తుట్టెని కదిలిస్తారు.. భలే ఉంటాయి మీ ముచ్చట్లన్నీనూ..:)
మీకు కూడా మీ క్రిష్ణమస్ తాత బోల్డంత మంచిని మీ జీవితంలోకి మోసుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను:)

జయ said...

హ్యాపీ క్రిస్ణమస్. ఆమెన్:)

హరే కృష్ణ said...

పోస్ట్ భలే బావుంది
మళ్ళీ చిన్నతనం లోనికి అలా తీసుకెళ్ళిపోయారు..
మీకు కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు

వేణూశ్రీకాంత్ said...

పోస్ట్ చాలా బాగుంది మధుర గారు..హాయిగా ఆహ్లాదంగా... హ హ వానజల్లు మాత్రం గుచ్చుకుంది :D మీరు చెప్పేవరకూ ట్యూన్ ఊహించలేదు.. చదివాక నవ్వలేక చచ్చాను.

బాలు said...

టపా బాగుంది. మీరైతే తర్వాతైనా క్రిస్మస్ అనే పిలుస్తున్నారు. మా అమ్మయితే ఇప్పటికీ క్రిష్ణమస్సు అనే అంటుంది. అట్టాకాదమ్మా అంటే ’ఏదోలే, నాకలాగే వొచ్చు’ అంటుంది.
‘వానజల్లూ... గిల్లుతుంటే...’ మాత్రం సూపర్బ్.

Anonymous said...

please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.

గీతాచార్య said...

"క్రిష్ణమస్" అంటే సూపర్‍స్టార్ కృష్ణ మాస్ సినిమా ఏదన్నా రివ్యూ చేశారేమో అనుకున్నాను :D

రాధిక(నాని ) said...

బాగున్నాయి మీకిస్మిస్(మా ఉళ్ళో ఇలానే అంటారు) జ్ఞాపకాలు.మా ఉళ్ళో చర్చిలో ఐతే కొబ్బరికాయ కొట్టేస్తారు,అగరొత్తులు వెలిగిస్తారు,అరటిపళ్ళు అవికూడా పెడతారు.అలాగే సాయంత్రం జీసస్ ని ఊరేగిస్తారు.సేం మన పండగ ల్లానే చేస్తారు..
హహ్హహ్హ ..వానజల్లు గిచ్చుకుంటే ...కాదుకాదు'కన్నెమేరీ.. సుతుడయ్యే.. ఏసు ప్రభువూ..'చాలా బాగుంది .

gayatri said...

చాలా బాగుంది... భలే వ్రాసారు మధురగారు...

మధురవాణి said...

@ అనానిమస్,
క్రిస్మస్ ని కిస్మిస్ పండగ అని కూడా అంటారని ఇప్పుడు మీ అందరి కామెంట్లు చూసాకే తెలిసిందండీ! మీ ఫ్రెండ్ పేరు భలే ఉందండీ.. నా చిన్నప్పుడు 'పాంచీస్' అని ఒకాయన్ని పిలుస్తుంటే ఇదేం పేరో అనిపించేది.. తరవాత తెలిసింది అతని పేరు ఫ్రాన్సిస్ అని. :D ఇంకా నాకు చిన్నప్పుడు 'ఆరోగ్యం' అని పేరుంటుందని విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించేది.

@ astrojoyd,
Thanks for the info! :)

@ ఇందు,
థాంక్యూ! :) మీరూ అమ్మగార్ల స్కూల్లోనే చదివారా.. దేవదూతగా కూడా వేశారా? నేనిదివరకే చెప్పానా.. మీకూ, నాకూ బోల్డు పోలికలున్నాయని. :D బాబోయ్ మీరు బైబిల్ అంతా కూడా చదివేశారా.. ఘనులే అయితే! :)

@ 3g,
పైన అనానిమస్ గారేమన్నారో చూశారా? మీకంటే నేనే బెటర్ :) ఏవండీ.. అయినా మీకెంత గుండె ధైర్యం ఉంటే అంత మాటనగలిగారు.. ఫోటో ఉంటే బాగుండేదని.. ;)

మధురవాణి said...

@ C.ఉమాదేవి, మనసు పలికే, హరేకృష్ణ,
ధన్యవాదాలు. :) కాసేపు మిమ్మల్ని అలా జ్ఞాపకాల్లోకి తీస్కెళ్ళానంటే అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. :)

@ జయ,
థాంక్యూ! మరిప్పుడు ఏ మెన్ అని అడగాలా? ;)

@ వేణూ శ్రీకాంత్,
ధన్యవాదాలండీ! భలే చెప్పారండీ.. వాన జల్లు గుచ్చుకుందని. :D నాక్కూడా ఇప్పటికీ ఆ పాట గుర్తొస్తే చచ్చేంత నవ్వొస్తుందండీ! :)

@ బాలు,
ధన్యవాదాలు. నేను కూడా మీ అమ్మగారి జట్టేనండీ.. ఇప్పుడు నేనలా అనకపోయినప్పటికీ క్రిస్మస్ కంటే క్రిష్ణమస్సు అనడమే బాగుంటుందని నా అభిప్రాయం. :) వానజల్లు మీక్కూడా నచ్చిందన్నమాట! ;)

మధురవాణి said...

@ అనానిమస్ 2,
thanks for the info!

@ గీతాచార్య,
భలేవారండీ ప్రొఫెసర్ గారూ.. నాకంత సీను లేదు. :D

@ రాధిక (నాని),
మీ ఊళ్ళో కూడా అంతే అంటారా? :) భలే ఉన్నాయండీ మీరు చెప్పే ఆచారాలు. చాలామంది క్రైస్తవులు మంగళ సూత్రాలు, శిలువ కలిపి మెడలో వేసుకుంటారు కూడా కదా! అయితే వానజల్లు గిచ్చిందా మిమ్మల్ని కూడా! ;)

@ గాయత్రీ,
ధన్యవాదాలండీ! ఇదే మీ మొదటి వ్యాఖ్య అనుకుంటాను నా బ్లాగులో! నా లోకంలోకి సుస్వాగతం. :)