Thursday, December 23, 2010

నీ జ్ఞాపకాల జాడల్లో..

నేనెంతగా పట్టి బంధించాలని ప్రయత్నించినా మనసు నన్ను గతంలోకే లాక్కెళ్ళిపోతోంది..
నే వెళ్ళిపొమ్మని అరిచి గీపెడుతున్న కొద్దీ ఇంకా ఇంకా నా మనసులోకి వచ్చేస్తున్నావ్..
నా మాట పొమ్మంటున్నా మనసు మాత్రం రమ్మంటోందని నీకు తెలిసిపోతోందా!

నీ కళ్ళలోకి సూటిగా చూడకుండా ఎందుకు తప్పించుకు తిరిగానో నాకే తెలీదు..
బహుశా నీ కళ్ళలో కనిపించే అంతులేని ప్రేమని దాటి నేను ముందుకెళ్లలేనని గ్రహించానేమో!
కానీ.. అలా నిన్ను తప్పించుకుని ముందుకెళ్ళి ఏం సాధించాలన్న ప్రశ్న అప్పటికి తోచనే లేదు..
నా గమ్యాన్ని దాటి ముందుకు వెళ్లిపోతున్నానని అప్పుడు నా బుద్ధికి తెలీలేదు!

నువ్వు నా కంటికెదురుగా నిలిచినప్పుడు నా కోసం ప్రేమని పంచుతున్న నీ చూపుల్ని వదలి ఎటో చూశాను..
ఇప్పుడేమో నా కనుచూపు మేరలో నువ్వు కనపడవని తెలిసినా నిన్నొక్కసారి చూడాలని నా ప్రాణం తపిస్తోంది..
నువ్వు అడుగుల దూరంలోనే ఉన్నప్పుడు నీ పిలుపులు నా మనసును చేరనేలేదన్నట్టు మౌనం వహించాను..
ఇప్పుడేమో నా కోసం ఆకాశమంత అనుభూతిని గొంతులో పలికించే నీ స్వరాన్ని ఒక్కసారి వినాలని మనసు మారాం చేస్తోంది..
నా పిలుపుకి అందనంత దూరంలో ఎక్కడో ప్రపంచానికి ఆవలి తీరంలో ఉన్న నీకు ఏదో చెప్పాలన్న పిచ్చి ఆరాటం..

నీ జ్ఞాపకాల్ని నా నుంచి తరిమెయ్యాలనుకుంటాను.. అంతలోనే ఆ జ్ఞాపకాల చక్రబంధంలోనే చిక్కుకుపోతుంటాను..
నా తలపుల్లో స్థిరంగా కొలువై ఉన్న నిన్ను తుడిచెయ్యాలనుకుంటాను.. కానీ మళ్ళీ మళ్ళీ ఓడిపోతూనే ఉంటాను..
నా కంటిపాప నిన్నటి నీ జ్ఞాపకాల్ని కన్నీళ్ళలో కరిగించెయ్యాలని నిర్విరామంగా ప్రయత్నం చేస్తోంది..
నా చేతుల్లోంచి నేనే జారవిడిచి పోగొట్టుకున్న ప్రేమ పెన్నిధి మరెన్నటికీ తిరిగి దొరకదని తెలిసినా వెర్రిగా వెతుకుతున్నాను..
ఎప్పుడూ ముందుకే పరుగులు తీసే కాలానికి కళ్ళెమేసి నీ జ్ఞాపకాల జాడల్ని వెతుక్కుంటూ ఒక్కసారి గతంలోకి వెళ్లాలనిపిస్తోంది!

16 comments:

మనసు పలికే said...

చాలా చాలా బాగుంది మధుర గారు..:)

గీతాచార్య said...

>>>"ఎప్పుడూ ముందుకే పరుగులు తీసే కాలానికి కళ్ళెమేసి నీ జ్ఞాపకాల జాడల్ని వెతుక్కుంటూ ఒక్కసారి గతంలోకి వెళ్లాలనిపిస్తోంది"

మీకు అంతలా వెళ్ళాలనిపిస్తోందంటే మీ ఆప్యాయతనందుకోబోయే వ్యక్తి/శక్తి ఎంత...

ఇహ రెండొ విషయం... మీకు టైమ్మిషను (మీకంటే మీకే అని కాదు, ఈ కవిత/వెర్స్ లో నా౨రేటర్/ప్రొటగొనిస్టుకు) ప్రాప్తిరస్తు అని దీవించమని ఆ పెద్దాయన/ఆవిడను ప్రార్థిస్తున్నాను.
*** *** ***

ఇదే కవిత క్రింద బై గీతాచార్య అన్న ఒక్క పదం కనుక కనిపిస్తే జనాలు ఏదో సెటైరు ప్లాన్ చేశారు అయ్యవారు అని అనుకుంటారు ఎందుకో పాపం.

నా ఖర్మ కాలి ఈ ముక్క కూడా మీకు సెటైరులా అనిపిస్తే... "God save me"
*** *** ***

బాగుంది అన్నమాట చెప్పటం రొటీనే, కనుక ఈ మాటని క్రొత్తగా ఇలా చెప్తున్నాను... Well done :D అంటే బావి పూర్తైంది అని కాదు. బాగా వ్రాశారు అని

గీతాచార్య said...

వ్యాఖ్య ప్రచురించటం లేక పోవటం పెద్ద విషయం కాదు. ఈ కవితలో రిథమ్ చాలా బాగుంది. ఈ ఒక్క చోట తప్ప.

>>>"నువ్వు అడుగుల దూరంలోనే ఉన్నప్పుడు నీ పిలుపులు నా మనసును చేరలేదన్నట్టు మౌనం వహించాను..
ఇప్పుడేమో నా కోసం ఆకాశమంత అనుభూతిని గొంతులో పలికించే నీ స్వరాన్ని ఒక్కసారి వినాలని మనసు మారాం చేస్తోంది.."

ఉన్నప్పుడు బదులు ఉన్నపుడు అని, ప్లస్సూ, ఇప్పుడేమో బదులు ఇపుడు అని మార్చి చూడండి. మువ్వలు మ్రోగినంత ఫీలింగొస్తుంది :-)

చిన్న సజెషన్ మాత్రమే. ఏమనుకోకండి

Anonymous said...

బాబోయ్ .. మీరు ఇలాంటివన్నీ రాస్తే మీ ఇంటాయన ఇక వంట చేయ్యనంటారు ,, అలిగి ..

మధురవాణి said...

@ మనసు పలికే,
థాంక్యూ అపర్ణా! :)

@ గీతాచార్య,
అంత అమూల్యమైన వ్యక్తుల కోసమైతేనే కదా అలా వెళ్ళాలనిపిస్తుంది. లేకపోతే అసలీ ప్రస్తావనే లేదు కదా! ;)
'టైమ్మిషను ప్రాప్తిరస్తు' అని దీవించినందుకు థాంక్స్! నిజంగా టైం మిషన్ ఉంటే బాగుంటుంది కదా! అందరం అప్పుడప్పుడూ అలా వెనక్కి వెళ్ళి రావచ్చు సరదాగా! :)
ఇప్పుడు ఇక్కడ మీరు పెట్టిన కామెంట్లో అయితే నాకేమీ సెటైర్ లాగా కనపడలేదు. :)
ఇకపోతే రిథం గురించి మీరన్నది నిజమే!
చాలాసార్లు నాకు నువ్వు కి బదులు నువు అని, నేను కి బదుకు నే అని.. అలా రాయాలనిపిస్తుంది. మీరు చెప్పింది కూడా అలాగే అనిపించింది.
ఓపిగ్గా ఇంత వివరంగా మీ అభిప్రాయం రాసినందుకు థాంక్స్! :)

@ అనానిమస్,
కవితలు రాసేస్తేనే అలిగేస్తారంటారా? అయినా, కవితలు రాసినా రాయకపోయినా మా ఇంటబ్బాయ్ వంట చేయననే అంటాడు. ;)

ఇందు said...

కొంచెం బాధ మిళితమైనా మీరు చెప్పాలనుకున్న భావాన్ని అందంగా వ్యక్తపరిచారు.....నాకు చాలా నచ్చింది.Beautiful :)

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది మధుర గారు.

3g said...

//నా మాట పొమ్మంటున్నా మనసు మాత్రం రమ్మంటోందని నీకు తెలిసిపోతోందా//

//నా కంటిపాప నిన్నటి నీ జ్ఞాపకాల్ని కన్నీళ్ళలో కరిగించెయ్యాలని నిర్విరామంగా ప్రయత్నం చేస్తోంది..//

.......beautiful.

kiran said...

బ్యూటిఫుల్ అండి..!!

మీ అందరి తెలుగు భలేగా ఉంటోంది...!! :)
చాల బాగా express చేసారు..!!

శివరంజని said...

స్వీట్ మధుర చాలా బాగా రాశారు ......
అబ్బబ్బ....................... ఈ బ్లాగ్ కి వస్తే నాకు రాని సాహిత్యం అంతా వచ్చేసేలా ఉంది .......... చూస్తూ ఉండండి మీ బ్లాగ్ ఇలాగే చదివి చదివి ఎప్పుడో మిమ్మల్ని క్రాస్ చేసేస్తాను జాగ్రత్త

John Vincent Raj said...

Chala Adbutham ga rasaru andi..........:)

మధురవాణి said...

@ ఇందు, వేణూ శ్రీకాంత్, 3g, కిరణ్, శివరంజని, John Vincent Raj,
స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

@ శివరంజని,
నువ్వెప్పుడో నన్ను క్రాస్ చేసేసావ్ అమ్మడూ.. నీ రాతలతో మమ్మల్నందరినీ నవ్వుల్లో ముంచెత్తుతూ.. :)

చైతన్య said...

చాలా బాగుందండి...
నా బ్లాగులో మీరిచ్చిన లింక్ చూసి ఇక్కడికి వచ్చాను...
భలే కదా... ఇద్దరం ఒకేలాంటి ఫోటో పెట్టాం!! ఇంచు మించు ఇద్దరం రాసిన content feel కూడా ఒక్కటే!

మధురవాణి said...

@ చైతన్య,
కదా..! నాక్కూడా భలే చిత్రంగా అనిపించిందండీ మీ పోస్ట్ చూసాక. అందుకే ఈ లింక్ ఇచ్చి చూడమన్నాను. :)

ఏలియన్ said...

>>>నీ జ్ఞాపకాల్ని నా నుంచి తరిమెయ్యాలనుకుంటాను.. అంతలోనే ఆ జ్ఞాపకాల చక్రబంధంలోనే చిక్కుకుపోతుంటాను..
నా తలపుల్లో స్థిరంగా కొలువై ఉన్న నిన్ను తుడిచెయ్యాలనుకుంటాను.. కానీ మళ్ళీ మళ్ళీ ఓడిపోతూనే ఉంటాను..
నా కంటిపాప నిన్నటి నీ జ్ఞాపకాల్ని కన్నీళ్ళలో కరిగించెయ్యాలని నిర్విరామంగా ప్రయత్నం చేస్తోంది..
నా చేతుల్లోంచి నేనే జారవిడిచి పోగొట్టుకున్న ప్రేమ పెన్నిధి మరెన్నటికీ తిరిగి దొరకదని తెలిసినా వెర్రిగా వెతుకుతున్నాను..
ఎప్పుడూ ముందుకే పరుగులు తీసే కాలానికి కళ్ళెమేసి నీ జ్ఞాపకాల జాడల్ని వెతుక్కుంటూ ఒక్కసారి గతంలోకి వెళ్లాలనిపిస్తోంది!<<<<<

ఈ లైన్స్ ఎంతలా నచ్చాయో చెప్పలేకున్నా... :)

--
ఏలియన్

మధురవాణి said...

​థాంక్స్ ఏలియన్! :-)