Thursday, October 28, 2010

తల ఎత్తి జీవించు తమ్ముడా.. తెలుగు నేలలో మొలకెత్తినాననీ!

ఈ వాక్యం ఒక పాట పల్లవికి సంబంధించింది. యీ పాట 2009 లో శ్రీకాంత్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహాత్మ' సినిమాలోనిది. అప్పల్రాజు చెప్పినట్టు (రామ్ గోపాల్ వర్మ తీస్తున్న కొత్త సినిమా పాటలో) కృష్ణవంశీ తన సినిమాలతో సమాజాన్ని ఉద్ధరించలేకపోయినా, ఆయన పుణ్యాన అప్పుడప్పుడూ ఇలాంటి మంచి మంచి పాటలు వినే భాగ్యం కలుగుతూ ఉంటుంది నాలాంటి వాళ్లకి. ;)

ఈ సినిమాకి సంగీత సారధ్యం వహించింది విజయ్ ఆంటోని. అసలు యీ రోజుల్లో ఇంత మంచి తెలుగు పాట వినగలగడం అది కూడా తెలుగుజాతి ఔన్నత్యాన్ని తెలియజెప్పే పాట అవడం ఆశ్చర్యమూ, ఆనందకరమూ అయిన విషయం. ఇక సిరివెన్నెల గారు యీ పాటని రాసారు అనడం కంటే.. తెలుగు జాతి కీర్తిని అంతే అందమైన తెలుగు పదాల్లో పొదిగారు అనడం సరైనది. అలా ఒద్దికగా పేర్చిన సిరివెన్నెల గారి పదాలకి ప్రాణం పోసింది మాత్రం మన బాలు గారి గాత్రం. నాకైతే బాలు గారి స్వరంలో యీ పాట చెవులకు వినబడుతోంటే ఓ రకమైన ఆనందం, ఉత్సాహం, గర్వం, కాస్తంత బాధ అన్నీ భావాలు కలగాపులగమైపోయి కళ్ళు తడిసిపోతుంటాయి. పాట మొదట్లో "సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ.." అంటూ చెవిన పడగానే చాలా ఉద్వేగంగా అనిపిస్తుంది.

ఎంత గొప్పది నా మాతృభూమి, ఎంతటి కీర్తివంతం నా గత చరిత్ర అని మనసులో ఓ పక్క పొంగిపోతూనే, మరో పక్క వేరెవరి ప్రమేయం అక్కరలేకుండా మనలో మనమే కొట్టుకు ఛస్తున్న ఇప్పటి మన దుస్థితి గుర్తొచ్చి ఉస్సూరుమనిపిస్తుంది. హుమ్మ్.. మన పోట్లాట ముందు ముందు ఎంత దూరం పోనుందో మరి! రాజకీయాల గురించి నాకెక్కువ తెలీదు గానీ తెలుగు మాట్లాడే మనమంతా ఒక్క కుటుంబానికి చెందినట్టేనని నా అభిప్రాయం. నా ఒక్కదాని అభిప్రాయం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదనుకోండి. ;) ఈ పాటలో సిరివెన్నెల గారన్నట్టు భారతాంబకు పెద్ద కొడుకుగా మనగలుగు ఆత్మ గౌరవాన్ని మనం నిలబెట్టుకుంటామంటారా? సందేహమే!

మళ్ళీ పాట విషయానికొస్తే, సినిమా టైటిల్స్ పడేప్పుడు వచ్చే పాట ఇది. యీ పాట వీడియోలో తెలుగుతల్లి కడుపున పుట్టిన మహానుభావులు ఎందరినో చూపిస్తారు. వాళ్ళల్లో చాలామంది గొప్పతనం గురించి నాకు తెలీదు. పుట్టెడు అజ్ఞానంలో ఉన్న నాలాంటి ఈ తరం జనాలకి తెలిసేట్టుగా బొమ్మలతో పాటు వారి పేర్లు కూడా వేశారు. అందుకు కృష్ణవంశీకి థాంక్స్ చెప్పుకోవాలి. ఈ పాట విన్నాక అందులో చూపించిన వాళ్ళందరి జీవిత చరిత్రలు చదివితే బాగుండుననిపిస్తుంది నాకు. ఎప్పటికైనా ప్రయత్నించాలి.

ఈ పాట సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను. ఓసారి చూడండి. అంతా అర్థమైంది గానీ, తెలుగునేలని "త్రిసంధ్యాభివంద్యం" అని ఎందుకన్నారో నా మట్టిబుర్రకి అర్థం కాలేదు. తెలిసినవారు ఎవరైనా ఈ సందేహం తీరిస్తే ధన్యురాలిని. నాకైతే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత నచ్చేసింది ఈ పాట. ఇప్పటిదాకా ఈ పాట వినని వాళ్లెవరైనా ఉంటే మాత్రం ఇప్పుడు ప్రయత్నించండి. తప్పకుండా నచ్చేస్తుంది. ఈ పాట కోసం ఇక్కడ చూడండి.


సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ..

తల ఎత్తి జీవించు తమ్ముడా..
తెలుగు నేలలో మొలకెత్తినాననీ..
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ..

తల వంచి కైమోడ్చు తమ్ముడా..
తెలుగు తల్లి నను కని పెంచినాదని..
కనుక తులలేని జన్మమ్ము నాదని..

త్రైలింగ ధామం.. త్రిలోకాభిరామం..
అనన్యం.. అగణ్యం.. ఏదో పూర్వపుణ్యం..
త్రిసంధ్యాభివంద్యం... అహో జన్మ ధన్యం!

తల ఎత్తి జీవించు తమ్ముడా..
తెలుగు నేలలో మొలకెత్తినాననీ..
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ..

శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును చుట్టె నీ చరితకి..
శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారము కట్టె నీ సీమకి..
సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ..
పడతి సీతమ్మతో రామయ్య కొలువైన పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి..

తల ఎత్తి జీవించు తమ్ముడా..
తెలుగు నేలలో మొలకెత్తినాననీ..
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ..

తరతరమ్ములు దాటి తరలివచ్చిన మహాత్ముల తపఃసంపత్తి నీ వారసత్వం..
ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని ఆంధ్రులకు అందినది ఆర్య సత్వం..
మువ్వన్నె జెండాగ మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ స్వంతం..
భారతాంబకు పెద్ద కొడుకుగా మనగలుగు ఆత్మ గౌరవముతో వర్ధిల్లు నిత్యం..

తల ఎత్తి జీవించు తమ్ముడా..
తెలుగు నేలలో మొలకెత్తినాననీ..
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ..

22 comments:

మనసు పలికే said...

మధుర గారు, చాలా మంచి పాటని పరిచయం చేశారు..:) చాలా చాలా మంచి పాట. దీని గురించి చెప్పడానికి మాటలు చాలవు.
అయినా సరే, నేను మీ మీద అలిగాను. నేను ఎంచక్కా దీన్ని నా "సిరివెన్నెల" బ్లాగులో పరిచయం చేద్దామనుకుంటే ఇలా నన్ను చీట్ చేస్తారా..;) దీనికి పరిహారంగా నాకు మరో చాలా మంచి సిరివెన్నెల గారి పాట గురంచి చెప్పి ప్రాయశ్చిత్తం పొందండి..;) ఎందుకంటే మీరు రాసినంత మంచిగా నేను రాయలేను కాబట్టి ఈ పాట గురించి రాయొద్దని డిసైడ్ అయ్యాను ఇప్పుడే..:))
టపా చాలా బాగుందోచ్..:)

ఇందు said...

నాకు ఈ పాట చాల ఇష్టం.S.P చాల గంభీరంగా పాడుతారు కదా!కాని సినిమా లో టైటిల్స్ పడేటప్పుడు వేసారు ఇంత మంచి పాటని.నాకు కొంచెం బాధనిపించింది. కొంచెం మంచిగా డిజైన్ చేసుంటే మనకి మంచి తెలుగు పాట చూడటానికి ఉండేది.

Nice post Madhura garu :)

Anonymous said...

This song is not written for this movie. It was written even before he entered into the movie industry

కొత్త పాళీ said...

బాగా రాశారు. పాట సోసో. :)
త్రిసంధ్యాభివంద్యం .. మూడు సంధ్యల్లోనూ నమస్కరించ దగినది .. అని అర్ధం అనుకూంటున్నాను.
సాధారణంగా ఎవరన్నా వ్యక్తిని చాలా గౌరవనీయులు అని చెప్పాలంటే .. ప్రాతః స్మరణీయులు, పొద్దున్నే తలుచుకోవాలి - అంటారు. లేకపోతే సంధ్యవేళ దీపం పెట్టినప్పుడు వారి పేరు తలుచుకోవాలి అంటారు (పాత సినిమా షావుకారు చివర్లో ఇలాంటి డయలాగొకటి ఉంటుంది). సో, ఇక్కడ కేవలం పొద్దున్నా సాయంత్రమే కాక మూడు సంధ్యల్లోనూ నమస్కరించ దగినది తెలుగునేల అని ఒక అర్ధం.
బ్రాహ్మణులు సంధ్యావందనం చేసేటప్పుడు, ముఖ్యంగా నమస్కరించేది సూర్యభగవానుడికి. సూర్యుడితో పాటు మనకి జన్మనిచ్చిన ఈ తెలుగు నేలకి కూడా త్రిసంధ్యల్లోనూ నమస్కరించాలని ఇంకో అర్ధం .. అనుకుంటున్నాను.

హరే కృష్ణ said...

ఎంత చెప్పుకున్నా చాలదు ఈ పాట గురించి
సిరివెన్నెలకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ :)
చాలా మంచి పాట ను పరిచయం చేసారు

Jaabili said...

CHeyyetti Jaikottu Telugodaa kuda gurthu vachindi idi vinnaka..

Nice song for these times. Thank you Madhura..

..nagarjuna.. said...

విశ్వామిత్ర మహర్షి తెలుగువారని ఈ పాటద్వారా తెలిసింది...Thanks for sharing

మాలా కుమార్ said...

చాలా మంచి పాటను తెలియజేసావు . ఈ పాట ఇంతకు ముందు నేను వినలేదు . బాగుంది . తాంక్ యు .

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

వినగనే ఉద్వేగానికి గురయ్యే పాట ఇది.కానీ చిత్రీకరణలో తేలిపోయింది.టైటిల్స్ లో వేసేసి ఆ పాటకు దక్కాల్సిన ఖ్యాతిని పోగొట్టేశారు. పాట చివర్లో వైయ్యస్సార్ ఫోటోను చూడగానే దర్శకుడిలో చెప్పాలనుకున్న విషయం మీద చిత్తశుద్ధి లోపించిందని అర్థమైపోయింది,ఆ ఒక్క ఫోటోతో మిగతా సినిమా మొత్తం ఎలా ఉండబోతోందో చెప్పకుండానే చెప్పేశాడు దర్శకుడు.

శ్రీనివాస్ పప్పు said...

"nagarjuna.. said...
విశ్వామిత్ర మహర్షి తెలుగువారని ఈ పాటద్వారా తెలిసింది"...
భలే మీకింతవరకూ తెలీదా ఏంటి నేను అచ్చమైన తెలుగువాడ్నే.
మధుర గారూ మంచి పాట గుర్తుకుతెచ్చారు,మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు."త్రిసంధ్యాభివంద్యం" గురించి గురువుగారిచ్చిన వివరణ కూడా బావుంది.

రాధిక(నాని ) said...

మంచిపాట నాకు నచ్చింది.బాలు గారు అద్భుతంగా పాడారు.

మధురవాణి said...

@ మనసు పలికే,
అయ్యో అపర్ణా.. నువ్వీ పాట గురించి రాద్దామనుకుంటున్నావని ముందే తెలిస్తే నేను మానేసేదాన్ని. నిజానికి నువ్వే బాగా రాస్తున్నావు సిరివెన్నెల బ్లాగులో! నేను రాసింది కూడా నీకు నచ్చినందుకు థాంక్స్! :) సిరివెన్నెల రాసిన పాటలకి మనకి కరువా? నీకో పెద్ద లిస్టు ఇచ్చేస్తాను చూడు. ;)

@ ఇందు,
ఈ సినిమా కథకి, ఈ పాటకి నేరుగా ఏ సంబంధం లేదు కదండీ.. అందుకే అలా టైటిల్స్ పడేప్పుడు వాడి ఉంటారని నాకనిపిస్తోంది. నిజానికి ఇప్పుడు కూడా నాకు చిత్రీకరణ నచ్చింది. :)

@ అనానిమస్,
ధన్యవాదాలు. నాక్కూడా ఈ పోస్ట్ రాసాకనే ఈ విషయం తెలిసిందండి.

@ కొత్తపాళీ,
మీరన్న డైలాగ్ నాకు గుర్తు లేదు. :( అయితే షావుకారు సినిమా మళ్ళీ ఒకసారి చూడాలన్నమాట. :)

త్రిసంధ్యాభివంద్యం .. అంటే ఏంటో మీరిచ్చిన వివరణ బాగుందండీ! ఈ పాట వీడియోలో ఆ పదం వచ్చినప్పుడు మూడు సూర్య బింబాల్ని (లేదా మూడు సంధ్యలో మరి!) చూపెట్టారు. అంటే, తెలుగునేలపై మూడు వేర్వేరు సమయాల్లో సూర్యాస్తమయం అవుతుంది అంటాడా ఏవిటీ అని నాకు సందేహం వచ్చింది. మొత్తానికి నాకసలు అర్థం కాలేదు అదెలాగో! మీరిచ్చిన వివరణ సబబుగా తోస్తోంది. మరి ఆ వీడియోలో వాళ్ళ ఉద్దేశ్యం ఏవిటో వారికే తెలియాలి. ;)

ఆ.సౌమ్య said...

అయ్యో ఈ పాట విని నేను పిచ్చెక్కిపోయాననుకో ...నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. వెర్రెక్కినట్టు ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు. వినడమే కాదు నా ఫ్రెండ్స్ అందరికీ వినిపించాను. మా కుటుంబంలో అందరికీ వినిపించాను కూడా.

మధురవాణి said...

@ హరేకృష్ణ, జాబిలి, మాలా కుమార్, రాధిక (నాని)
మీకూ నచ్చిందన్నమాట ఈ పాట! స్పందించినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు. :)

@ నాగార్జున,
మన బ్లాగ్లోకపు విశ్వామిత్రుల వారు మీకేదో చెప్తున్నారు చూశారా? :)

@ శ్రీనివాస్ పప్పు,
:) :) నాగార్జున గారి కామెంట్ చూడగానే నాక్కూడా మీరే గుర్తొచ్చారు. అన్నట్టు, నాదో సందేహం. మేనక కూడా తెలుగువారేనాండీ మరి? ;)

మధురవాణి said...

@ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,
వైఎస్సార్ ఫోటో చూసి మీరలా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ఇంకో రెండు పాటల్లో (కుర్రా కుర్రా.., జజ్జనక) పాటల్లో వైఎస్సార్ తదితర నాయకులనే టార్గెట్ చేసి వ్యంగంగా రాశారని కొంతమంది అభిప్రాయం. ఆ విధంగా ఈ సినిమా వల్ల వైఎస్సార్ ఫ్యాన్స్ పాపం కొంతవరకు హార్ట్ అయ్యారన్నమాట! ;) మొత్తానికి కృష్ణవంశీ ఏమనుకున్నాడో గానీ ఈ సినిమా మాత్రం ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా అనిపించిందన్నమాట! :)

@ ఆ.సౌమ్యా,
same pinch! ఈ పాట మొదటిసారి వినగానే నేను కూడా నా ప్లే లిస్టులో ఈ ఒక్క పాట రిపీట్ పెట్టుకుని తెగ వినేశాను. మీలాగే నేను కూడా తెలీనివారికి తెలియజేద్దామని ఈ పోస్ట్ పెట్టాను. :)

..nagarjuna.. said...

@శ్రీనివాస్‌ అలియాస్ విశ్వామిత్ర గారుః మీరు '..నేను అచ్చమైన తెలుగువాడ్నే' అన్నప్పుడు ఏమి అర్దంకాలా...విశ్వామిత్రుడి గురించి అడిగితే తన గురించి చెప్తున్నాడేమిటి అనుకున్నా. తరువాత మీ బ్లాగుపేరు గుర్తొచ్చి బల్బు వెలిగింది :)

Anonymous said...

entha chakkati paatanu parichayam cheesarandi....

enni saarlu vinna thanivi teeradam ledu....

మధురవాణి said...

@ అనానిమస్,
ధన్యవాదాలండీ! ఈ పాట మొదటిసారి విన్నప్పుడు నేనూ అచ్చం మీలాగే ఫీలయ్యాను. :)

S said...

మీరన్నట్లు, అద్భుతంగా పాడారు ఎస్పీబీ. వింటూ ఉంటేనే ఉద్వేగం కలుగుతోంది (నాది సగం తెలుగు సంస్కృతి మాత్రమే అయినా కూడా!).

ఇంతకీ, అంతా చేసి...అంతమందిని చూపి చివర్లో ఎన్‌టీఆర్, వైయస్సార్ లను చూపడం లో అర్థం ఏమిటో! అంటే, గత కాలం తరువాత వీళ్ళిద్దరి దాకా చెప్పుకోదగ్గ తెలుగువారే లేరా ఏమిటి వీళ్ళ ప్రకారం!!

నా తక్షణ కర్తవ్యం...ఈ పాట కొంతమంది తెలుగువారికి వినిపించడం.

మధురవాణి said...

@ S,
హహహ్హహా! ఈ కాలంలో గొప్పవారూ మరియూ ప్రజాదరణ పొందిన వారు అంటే అర్థం వాళ్ళు సినిమా వాళ్లైనా అయ్యుంటారు లేదా రాజకీయ నాయకులైనా అయ్యుంటారు. మిగతా వాళ్ళకి గుర్తింపు ఉన్నట్టు పెద్దగా కనిపించట్లేదు కదా! NTR, YSR అయితే జనాలు బాగా కనక్ట్ అవుతారనేమో! లేదా పాపం గబుక్కున ఎవరూ తోచలేదేమో! :P నిజానికి, పాట ఐదు నిమిషాల్లో ఎక్కువమందిని కవర్ చెయ్యడం కూడా కుదరదేమో పాపం! ఈ రోజుల్లో అసలీ మాత్రమైనా తీసినందుకు మెచ్చుకోవాలి కృష్ణవంశీని.. :)

శేఖర్ (Sekhar) said...

మంచి పాట...

మధురవాణి said...

@ Sekhar,
Thanks!