ఈ వాక్యం ఒక పాట పల్లవికి సంబంధించింది. యీ పాట 2009 లో శ్రీకాంత్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'మహాత్మ' సినిమాలోనిది. అప్పల్రాజు చెప్పినట్టు (రామ్ గోపాల్ వర్మ తీస్తున్న కొత్త సినిమా పాటలో) కృష్ణవంశీ తన సినిమాలతో సమాజాన్ని ఉద్ధరించలేకపోయినా, ఆయన పుణ్యాన అప్పుడప్పుడూ ఇలాంటి మంచి మంచి పాటలు వినే భాగ్యం కలుగుతూ ఉంటుంది నాలాంటి వాళ్లకి. ;)
ఈ సినిమాకి సంగీత సారధ్యం వహించింది విజయ్ ఆంటోని. అసలు యీ రోజుల్లో ఇంత మంచి తెలుగు పాట వినగలగడం అది కూడా తెలుగుజాతి ఔన్నత్యాన్ని తెలియజెప్పే పాట అవడం ఆశ్చర్యమూ, ఆనందకరమూ అయిన విషయం. ఇక సిరివెన్నెల గారు యీ పాటని రాసారు అనడం కంటే.. తెలుగు జాతి కీర్తిని అంతే అందమైన తెలుగు పదాల్లో పొదిగారు అనడం సరైనది. అలా ఒద్దికగా పేర్చిన సిరివెన్నెల గారి పదాలకి ప్రాణం పోసింది మాత్రం మన బాలు గారి గాత్రం. నాకైతే బాలు గారి స్వరంలో యీ పాట చెవులకు వినబడుతోంటే ఓ రకమైన ఆనందం, ఉత్సాహం, గర్వం, కాస్తంత బాధ అన్నీ భావాలు కలగాపులగమైపోయి కళ్ళు తడిసిపోతుంటాయి. పాట మొదట్లో "సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ.." అంటూ చెవిన పడగానే చాలా ఉద్వేగంగా అనిపిస్తుంది.
ఎంత గొప్పది నా మాతృభూమి, ఎంతటి కీర్తివంతం నా గత చరిత్ర అని మనసులో ఓ పక్క పొంగిపోతూనే, మరో పక్క వేరెవరి ప్రమేయం అక్కరలేకుండా మనలో మనమే కొట్టుకు ఛస్తున్న ఇప్పటి మన దుస్థితి గుర్తొచ్చి ఉస్సూరుమనిపిస్తుంది. హుమ్మ్.. మన పోట్లాట ముందు ముందు ఎంత దూరం పోనుందో మరి! రాజకీయాల గురించి నాకెక్కువ తెలీదు గానీ తెలుగు మాట్లాడే మనమంతా ఒక్క కుటుంబానికి చెందినట్టేనని నా అభిప్రాయం. నా ఒక్కదాని అభిప్రాయం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదనుకోండి. ;) ఈ పాటలో సిరివెన్నెల గారన్నట్టు భారతాంబకు పెద్ద కొడుకుగా మనగలుగు ఆత్మ గౌరవాన్ని మనం నిలబెట్టుకుంటామంటారా? సందేహమే!
మళ్ళీ పాట విషయానికొస్తే, సినిమా టైటిల్స్ పడేప్పుడు వచ్చే పాట ఇది. యీ పాట వీడియోలో తెలుగుతల్లి కడుపున పుట్టిన మహానుభావులు ఎందరినో చూపిస్తారు. వాళ్ళల్లో చాలామంది గొప్పతనం గురించి నాకు తెలీదు. పుట్టెడు అజ్ఞానంలో ఉన్న నాలాంటి ఈ తరం జనాలకి తెలిసేట్టుగా బొమ్మలతో పాటు వారి పేర్లు కూడా వేశారు. అందుకు కృష్ణవంశీకి థాంక్స్ చెప్పుకోవాలి. ఈ పాట విన్నాక అందులో చూపించిన వాళ్ళందరి జీవిత చరిత్రలు చదివితే బాగుండుననిపిస్తుంది నాకు. ఎప్పటికైనా ప్రయత్నించాలి.
ఈ పాట సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను. ఓసారి చూడండి. అంతా అర్థమైంది గానీ, తెలుగునేలని "త్రిసంధ్యాభివంద్యం" అని ఎందుకన్నారో నా మట్టిబుర్రకి అర్థం కాలేదు. తెలిసినవారు ఎవరైనా ఈ సందేహం తీరిస్తే ధన్యురాలిని. నాకైతే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత నచ్చేసింది ఈ పాట. ఇప్పటిదాకా ఈ పాట వినని వాళ్లెవరైనా ఉంటే మాత్రం ఇప్పుడు ప్రయత్నించండి. తప్పకుండా నచ్చేస్తుంది. ఈ పాట కోసం ఇక్కడ చూడండి.
సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ..
తల ఎత్తి జీవించు తమ్ముడా..
తెలుగు నేలలో మొలకెత్తినాననీ..
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ..
తల వంచి కైమోడ్చు తమ్ముడా..
తెలుగు తల్లి నను కని పెంచినాదని..
కనుక తులలేని జన్మమ్ము నాదని..
త్రైలింగ ధామం.. త్రిలోకాభిరామం..
అనన్యం.. అగణ్యం.. ఏదో పూర్వపుణ్యం..
త్రిసంధ్యాభివంద్యం... అహో జన్మ ధన్యం!
తల ఎత్తి జీవించు తమ్ముడా..
తెలుగు నేలలో మొలకెత్తినాననీ..
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ..
శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును చుట్టె నీ చరితకి..
శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారము కట్టె నీ సీమకి..
సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ..
పడతి సీతమ్మతో రామయ్య కొలువైన పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి..
తల ఎత్తి జీవించు తమ్ముడా..
తెలుగు నేలలో మొలకెత్తినాననీ..
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ..
తరతరమ్ములు దాటి తరలివచ్చిన మహాత్ముల తపఃసంపత్తి నీ వారసత్వం..
ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని ఆంధ్రులకు అందినది ఆర్య సత్వం..
మువ్వన్నె జెండాగ మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ స్వంతం..
భారతాంబకు పెద్ద కొడుకుగా మనగలుగు ఆత్మ గౌరవముతో వర్ధిల్లు నిత్యం..
తల ఎత్తి జీవించు తమ్ముడా..
తెలుగు నేలలో మొలకెత్తినాననీ..
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ..