Tuesday, April 20, 2010

చినుకై వరదై సెలయేటి తరగై..

'చినుకై వరదై సెలయేటి తరగై' అనే ఈ పాట మృదుమధురంగా, హాయిగా సెలయేటి సంగీతంలా సాగిపోయే ఒక యుగళగీతం. ఈ సంవత్సరం వచ్చిన పాటల్లో ఎన్నదగిన ఈ పాట సాయికిరణ్ అడివి దర్శకత్వం వహించిన 'విలేజ్ లో వినాయకుడు' అనే సినిమాలోది. 'అవకాయ్ బిర్యాని' ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయిన మణికాంత్ కద్రి సంగీత సారథ్యంలో హరిహరన్, శ్వేతా మోహన్ ఆలపించారు ఈ పాట. గాయని శ్వేతా మోహన్ కి ఇది తెలుగులో మొదటి పాట. అంతే కాదు.. నా చెలి రోజావే, పరువం వానగా (రోజా), పువ్వుల్లో దాగున్న (జీన్స్), ఓ వానా పడితే (మెరుపు కలలు) వంటి చక్కటి పాటలతో మనకి చిరపరిచితమైన గాయని సుజాత గారి కూతురే ఈ శ్వేతా మోహన్. ఈ పాట వింటుంటే సంగీతపు బాణీ, వనమాలి గారు రాసిన సాహిత్యం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టు అనిపిస్తాయి. ప్రేమ భావన ఎంతమంది జంటల్లో చూసినా, ఎంత మంది కవుల కలం నుండి జాలువారినా మళ్ళీ మళ్ళీ కొత్తగానే కనిపిస్తుంటుంది, అలాగే దేనికదే ప్రత్యేకమనిపిస్తుంది. అలాంటిదే మరోటి ఈ పాట. సున్నితమైన భావాల్ని చాలా సరళమైన పదాల్లో కూర్చారు రచయిత వనమాలి. మొత్తంగా చెప్పాలంటే.. వీనుల విందైన సంగీతం, అందమైన సాహిత్యం, మనసుకి హాయనిపించే సుమధుర గాత్రం..వెరసి ఈ మెలోడీ..!


యీ పాట రికార్డింగ్ గురించిన ఒక ఆసక్తికరమైన సంగతి ఒకటి ఏదో పేపర్లో చదివాను. అదేంటంటే, యీ సినిమా యూనిట్ వాళ్ళు యీ పాటని మొదట శ్వేతా మోహన్ చేత పాడించి రికార్డ్ చేశాక, ఎందుకో మళ్ళీ కాస్త ఆలోచించి 'శ్రేయా ఘోషల్' తో పాడించుదామనుకున్నారట. అందుకని ముంబాయి నుంచి శ్రేయాని పిలిపించారట. తనకి ఓసారి శ్వేతా పాడిన పాట వినిపించి ఇదే మళ్ళీ మీరు పాడాలి అన్నారట. దానికి శ్రేయా 'పాట చాలా బాగా వచ్చింది. తెలుగులో మొదటి పాటే అయినా కూడా శ్వేతా బాగా పాడింది. నేను పాడినా మళ్ళీ తనని అనుకరించడమే తప్ప, గొప్పగా మెరుగుపరచగలిగేది ఏమీ ఉండదని నాకనిపిస్తోంది. మీరు యీ పాటనే వాడేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం' అని సలహా ఇచ్చిందట. ఎన్నోసార్లు జాతీయ అవార్డు సైతం గెలుచుకుని ఇవాళ దేశంలో కెల్లా నంబర్ వన్ గా ఉన్న ఓ గాయని అంత సహృదయంతో స్పందించడం అక్కడున్న వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందట. పనిగట్టుకుని ముంబై నుంచి ఆ రికార్డింగ్ కోసమే వచ్చినందుకు తన పాటేదో తను పాడేసి, తనకొచ్చే డబ్బులు తీసుకుని వెళ్లిపోవచ్చు. కానీ, శ్రేయా అలా చేయలేదట! ఏమైనా.. శ్రేయా ఘోషల్ ది తియ్యటి స్వరంతో పాటు, అందమైన మనసు కదూ!



యీ పాట సాహిత్యం ఇస్తున్నా..ఓసారి చూడండి. యీ పాట మీకు కావాలంటే ఇక్కడ చూడండి.


చినుకై వరదై సెలయేటి తరగై..
ఉరికే మదిని కడలల్లె కరిగించి కలిపేసుకున్నావు..!

వరమై వలపై అనుకోని మలుపై..
కలలే చూపే కనుపాప తెర మీద తొలి వేకువైనావు..!


తీసే ప్రతి శ్వాస.. నీ తలపౌతున్నది..
రేగే ప్రతి ఆశ.. నువు కావాలన్నది..

నా నీడ నను వీడి నిను చేరుకున్నది..
నా నీడ నను వీడి నిను చేరుకున్నది..


చినుకై వరదై సెలయేటి తరగై..

తడి లేని నీరున్నదేమో..
సడి లేని ఎద ఉన్నదేమో..
నువు లేక నేనున్న క్షణమున్నదా..!


నాలోని ఏనాటి చెలిమో..
నిను చేరి మనిషైనదేమో..
ఈ వేళ నిను వదిలి రానన్నదా..!
ఏ రూపమూ లేని ఆకాశమే నీవు..
నా నీలి వర్ణాలు నిను వీడి పోలేవు..!
ఏ బంధమూ లేని ఆనందమే నీవు..
తోడు వచ్చి నాకిపుడు.. తొలి బంధువైనావు..!
ఆకాశమే నీతో అడుగేయమన్నది..

ఆకాశమే నీతో అడుగేయమన్నది..


చినుకై వరదై సెలయేటి తరగై..

మన వలపు కథ విన్నదేమో..
ఆ కలల కబురందెనేమో..
ప్రతి ఋతువు మధుమాసమవుతున్నదీ..!


పసితనపు లోగిళ్ళలోకి..
నీ మనసు నను లాగెనేమో..
నా వేలు నిను వీడనంటున్నదీ..!
ఆరారు కాలాలు.. హరివిల్లు విరియనీ..
ఆ నింగి తారల్లె.. మన ప్రేమ నిలవనీ..!
ఈ మనసు కొలువైన.. తొలి చోటే నీదని..
నా కలలు నిజమవ్వగా..ఆ విధినైనా గెలవనీ..!

లోకాలు కనలేని తొలి జంట మనదనీ..

లోకాలు కనలేని తొలి జంట మనదనీ..


చినుకై వరదై సెలయేటి తరగై..

వరమై వలపై అనుకోని మలుపై..

16 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

చాలా బాగుందండీ!
పదాల కూర్పు బాగుంది.

శేఖర్ పెద్దగోపు said...

బ్యూటిఫుల్ సాంగ్ నిజంగా...శ్రేయో ఘోషల్ గురించి మీరు చెప్పింది నేనూ చదివాను...
>>ప్రేమ భావన ఎంతమంది జంటల్లో చూసినా, ఎంత మంది కవుల కలం నుండి జాలువారినా మళ్ళీ మళ్ళీ కొత్తగానే కనిపిస్తుంటుంది...

అవునండీ..

రాజ్ కుమార్ said...

It is my fav song....
Thanks for the lirics..

హరే కృష్ణ said...

superr

Padmarpita said...

చాలా బాగుందండీ!

Anonymous said...

సాహిత్యం చాలా బాగుంది. ట్యూన్ అంతకు మించి బాగుంది. మంచి పాట. హరిహరన్ గురించి చెప్పేదేముంది. స్వేతామోహన్ మొదట పాటైనా చాలా బాగా పాడింది.

అభిజ్ఞాన

మురళి said...

నాక్కూడా ఇష్టమైన పాటండీ.. చిన్న సవరణ ఏమిటంటే శ్రేయ ఘోషల్ ని ఇక్కడికి పిలిపించ లేదు, సంగీత దర్శకుడు, గీత రచయితా ఆమె ఇంటికి వెళ్లి ట్రాక్ వినిపించారు(అని బాగా జ్ఞాపకం నాకు).. మిగిలినదంతా యధాతధం.. మంచి పాటని గుర్తు చేశారు.. ఇక ఈరోజంతా ఇదే :-)

మధురవాణి said...

@ మందాకినీ, శేఖర్ పెద్దగోపు, వేణురామ్, హరే కృష్ణ, పద్మార్పిత, అభిజ్ఞాన,
ధన్యవాదాలండీ!

@ మురళి,
అలాగంటారా! నాకేమో ఇలానే గుర్తుండిపోయిందండీ మరి! ఏమైనా తప్పు సవరించినందుకు ధన్యవాదాలు. నేనూ అంతే.. ఏదన్నా పాట గుర్తొస్తే ఇంకా రోజంతా అదే! :-)

రాధిక(నాని ) said...

మదురవాణీ గారూ
ఈపాట నాకు కూడా ఇష్టమేనండి .కాక పోతే పాటగురించిన వివరాలు పెద్దగా తెలియవు .
ధన్యవాదాలు.

మధురవాణి said...

రాధిక గారూ,
మీ స్పందనకు ధన్యవాదాలు :-)

సవ్వడి said...

మధురవాణి గారు! మంచి పాట. నాకు కూడా బాగా ఇష్టం. రేడియోలో ఎప్పుడు వచ్చినా మిగతా పనులు ఆపేసి వినేవాడిని.
ఇంతకీ మీకు ఈ సాహిత్యం ఎక్కడ దొరుకుతుంది.

మధురవాణి said...

@ సవ్వడి,
:-) నా బ్లాగులో నేను పెట్టే పాటలకి సంబంధించిన సాహిత్యం ఎక్కడా దొరికినవి కాదండి. నేనే స్వయంగా టైపు చేస్తాను పాట వింటూ :-)

Anonymous said...

పాట చాలా బాగుంటుంది.నాకు ఈ సినిమా అన్న ఇష్టమే చాలా బాగా తీసారు :)

మధురవాణి said...

@ రాధిక,
అవునండీ.. నాకూడా ఈ పాటతో పాటు సినిమా కూడా బాగా తీశారనిపించింది. :-)

కవితాంజలి... said...

నాకీ పాటంటే ఎంతిష్టమో మాటల్లో చెప్పలేను... రోజంతా ఇదే పాటను విన్న రోజులు కూడా ఉన్నాయి..!!

మధురవాణి said...

@ కవితాంజలి,
ఈ పాట తెలిసిన కొత్తల్లో నేను కూడా మీలాగే విన్నానండీ.. :)