Tuesday, August 04, 2009

నేనో కథ రాశానోచ్..!

అవునండీ.. నేనో కథ రాశాను :) నా మొదటి ప్రయత్నాన్ని పొద్దులో ప్రచురించి, నాలాంటి కొత్తవారిని కూడా ప్రోత్సహిస్తున్నందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకోసం కథని ఇక్కడ ఉంచుతున్నాను. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా మనవి.


ఆవృతం

-- మధురవాణి


బాల్కనీ రెయిలింగ్ మీద రెండు చేతులూ ఆన్చి, నిలబడి చూస్తూ ఉంటే చక్కగా తీర్చిదిద్దిన వెనకింటివాళ్ల తోట కనిపిస్తూంది. సాయంకాలపు నీరెండలో ఆ తోటలో విరిసిన పూవులన్నీ మెరుస్తూ గాలి తెమ్మెరలు వచ్చినప్పుడల్లా తలలు ఊపుతున్నాయి. సాయంత్రంపూట కాస్త తొందరగా ఆఫీసు నుంచి వచ్చిన రోజు, బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతూ ఆ తోట చూడటం నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఉదయం నుంచీ పడ్డ కష్టమంతా ఎగిరిపోయి, మనసు హాయిగా సేదతీరుతున్నట్టుగా ఉంటుంది.


ఈ రోజు ఆ వెనకింట్లో కాస్త హడావిడిగా ఉంది. దానిక్కారణం రెండ్రోజుల క్రితమే ఆ ఇంట్లోకి దిగిన కొత్త కుటుంబం. ఆ కుటుంబ యజమాని ఓ ముప్పయ్యేళ్ళ యువకుడు. ఇంకా అతని భార్య, వాళ్ళ మూడేళ్ళ బుడతడు, ఆ యువకుడి తల్లి ఉన్నారని సీత చెప్పింది మొన్నే. కాఫీ పూర్తిచేసి ఏదో వీక్లీ చూస్తూ బాల్కనీలో కూర్చున్న నాకు, వెనకింటి తోటలోనుంచి ఆ యువకుడి తల్లికి, అతడికీ మధ్య జరిగే సంభాషణ వినిపించింది. ఏరా అబ్బాయ్.. అసలు ఈ కొత్త ఇల్లు ఏమీ బాగులేదురా నాయనా, చుట్టుపక్కలవాళ్ళు కూడా అదో మాదిరిగా అనిపిస్తున్నారుఅంటూ మొదలెట్టింది. ఆ అబ్బాయేమో అలా కాదులే అమ్మా, ఈ చుట్టుపక్కల అందరూ మర్యాదస్తులే, నువ్వేమీ కంగారు పడకుఅని సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. అసలు ఇంత పెద్ద పెరడు ఉన్న ఇల్లెందుకురా అంటే వినలేదు నువ్వు. అయినా ఎంతకాలం ఇలా అద్దె కొంపలో తిప్పుతావురా ఈ ముసలిదాన్ని. నీ తోటోడు మన సూరమ్మత్త కొడుకు రవిబాబు మొన్ననే ఒక అపార్టుమెంటు కొన్నాడంట తెలుసానువ్వేమో రెండేళ్ళు అమెరికాలో ఉండొచ్చినా ఇప్పటిదాకా ఏమీ కొనలేదు.ఇలా సాగిపోతోంది ఆవిడ వాక్ప్రవాహం. వాళ్ళ సంభాషణ నా చెవిన పడగానే, నాలో గతం తాలూకు జ్ఞాపకాల తుట్టె కదిలినట్టయింది. మనసు గతంలోకి పరుగులు తీసింది.


అమ్మచిన్నప్పటి నుంచీ అమ్మా, అమ్మాఅని ఎప్పుడూ అమ్మ వెనకాలే తిరిగేవాణ్ణి. పెద్దమ్మలూ, పిన్నులూ అందరూ అమ్మని ఏంటే జయా.. నీ కొడుకు ఎప్పుడూ నీ కొంగట్టుకు తిరుగుతాడు. ఎంత ప్రేమే నువ్వంటేఅనేవారు. అమ్మ ఎప్పుడైనా ఒక రెండ్రోజులు ఏ బంధువుల పెళ్ళికో వెళ్తే అసలు ఆ రెండు రోజులు ఎంతకీ గడిచేవే కాదు. నాన్న నాతోనే ఉన్నాగానీ, అమ్మ ఇంకెప్పుడొస్తుందా అని తెగ ఎదురుచూసేవాడిని. అమ్మ రాగానే నాన్న నువ్వు లేని ఈ రెండు రోజులు నీ కొడుకు మొహం చూడలేకపోయననుకోఅని చెప్పేవారు. అమ్మేమో ఏరాఅని అడిగితే నేను బాగానే ఉన్నానమ్మాఅని చెప్పేవాడిని. ఎప్పుడైనా అమ్మకి కాస్త ఒంట్లో నలతగా ఉంటే ఇల్లు చిమ్మడం, గిన్నెలు కడగడం, అన్నం వండటం లాంటి పనులన్నీ నేనే చేసిపెట్టేవాడిని. ఏ విషయంలో అయినా అమ్మకి ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకోవాలనిపించేది ఎప్పుడూ. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ కూడా ఇంటి ఆర్థిక పరిస్థితి తెలుసుకుని మసలుకునేవాణ్ణి. చిన్నప్పటి నుంచీ కూడా ఫలానా వస్తువు కావాలని ఎప్పుడూ మారాం చేసినట్టు గుర్తు లేదు నాకు. డిగ్రీ అయ్యేంతవరకు అమ్మ తీసుకొచ్చిన బట్టలు ఏవైనా సంతోషంగా వేసుకునేవాణ్ణే తప్ప నేనుగా కొనుక్కోడానికి వెళ్ళిన గుర్తే లేదు. ఇంట్లోవాళ్ల స్తోమతని అర్థం చేసుకుని చిన్నప్పటి నుంచీ గవర్నమెంటు స్కూల్లోనూ, కాలేజీలోనూ చదువుకుని యూనివర్శిటీలో సీటు సంపాదించి నామమాత్రపు ఫీజులతో, స్కాలర్షిప్పులతో ఎలాగో పోస్టు గ్రాడ్యుయేషన్ దాకా లాగించేసాను. యూనివర్శిటీలో హాస్టల్లో ఉండి చదువుకునే రోజుల్లో నాలుగైదు నెలలకోసారి ఇంటికెళ్ళి వచ్చేవాడిని. అప్పట్లో అమ్మని వదిలేసి మొదటిసారి రావడం వల్ల నాకూ, తనకీ కూడా కాస్త బెంగగానే ఉండేది. కాకపోతే నా ఆర్థిక పరిస్థితి రీత్యా వారం పది రోజులకోసారి మాత్రమే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉండేది. కానీ ఆ మాట్లాడే పది నిమిషాలైనా ఎంతో ఆప్యాయంగా సాగిపోయేది మా మధ్య సంభాషణ. యూనివర్శిటీ చదువయ్యాక చాలా కష్టం మీద అమెరికాలో ఉద్యోగం దొరికింది, అది కూడా డబ్బు ఖర్చు పెట్టే అవసరమేమీ లేకుండా! నా భవిష్యత్తు దృష్ట్యా, కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని అమెరికా బయలుదేరాను.


అమెరికా వెళ్ళేప్పుడు కూడా అమ్మకి దూరంగా వెళ్తున్నందుకు చాలా బాధగా అనిపించినా వాళ్లకు మెరుగైన జీవితాన్ని ఇవ్వడం కోసం కొన్నాళ్ళు దూరంగా వెళ్ళక తప్పదనిపించింది. నువ్వేం బెంగ పడకమ్మా, నేను తరచూ ఫోన్ చేస్తుంటానుఅని చెప్పి బయలుదేరాను. వెళ్ళిన రోజు మొదలు, ప్రతీరోజు ఫోన్ చేసి, కనీసం పదిహేను నిముషాలు మాట్లాడేవాడిని. మొదట్లో ఒక రెండు మూడు నెలలు బానే గడిచాయి. ఆ తరవాత ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ బాధగా, విసుగ్గానే మాట్లాడేది. నీకేం హాయిగానే ఉన్నావు అక్కడ. నేను, నాన్న ఒంటరి వాళ్ళయిపోయాము. మమ్మల్ని వదిలేసి నువ్వు ఎగిరిపోయావుఅనేది. అమ్మానాన్నలు ఉండే ఊరిలోనే అక్క, బావ ఉంటారు వాళ్ళ ఇద్దరు చిన్నపిల్లలతో. ఇంకా చాలామంది బంధువులు కూడా ఉన్నారు. పైగా దాదాపు ఇరవయ్యేళ్ళ నుంచీ ఉన్న ఊరు కావడం చేత చుట్టు పక్కలంతా కూడా అందరూ తెలిసినవాళ్ళే ఉంటారు. అయినాగానీ ఉన్న ఒక్క కొడుకు దూరంగా ఉండేసరికి అలా బాధపడుతోంది పాపం అని ఎంతో సముదాయించేవాడిని. అమ్మకి కాస్త కూడా పని ఒత్తిడి ఉండకూడదని ప్రతీదానికీ పని మనుషులు, ఇంట్లో అన్ని సౌకర్యాలు అమర్చిపెట్టాను. తరవాత కొన్ని రోజులకి బంధువుల గురించి ఎప్పుడూ చెప్పి బాధ పడేది. వాళ్ళెవరో వచ్చి పలకరించలేదనీ, ఆ మాట అన్నారనీ, అదనీ, ఇదనీ చెప్పేది. ప్రతీదానికీ ఓపికగా సర్దిచెప్పి తన బాధను తగ్గించే ప్రయత్నం చేసేవాడిని. ఒకోసారి నాన్నగారు అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారుఅని బాధపడేది. మరోసారి అక్క మీద, బావ మీద ఏవేవో చెప్పి బాధపడేది. ఎందుకమ్మా అలాగా అనవసరంగా అన్నిటికీ ఎక్కువ ఆలోచిస్తావు. నీకు ఇంతమంది ఉన్నాము కదా, ఎందుకు అనవసరంగా ఆందోళన పడతావుఅని ఎన్నెన్నో మాటలు చెప్పేవాడిని. రోజుకి గంట పైగా మాట్లాడిన రోజులెన్నో. ఎంత బిజీ పనుల్లో ఉన్నాకూడా క్రమం తప్పకుండా అమ్మకు మాత్రం ఫోన్ చేసేవాడిని. పోనీలే, ఏది ఏమైనా నేను అర్థమయ్యేట్టు వివరించి చెప్తే అమ్మ దేనికీ బెంగ పెట్టుకోకుండా ఉంటుందిఅనుకుని ఎప్పుడూ ఓపికగా ఏవేవో మాటలు చెప్తూ ఉండేవాణ్ణి.


రానురానూ ఎంత సర్దిచెప్పినప్పటికీ, రోజు రోజుకీ అమ్మ నుంచి ఫిర్యాదులు ఎక్కువవవుతూ వచ్చాయి. దాంతోపాటే, నా ఓపిక కూడా పెంచుకుంటూ వచ్చాను. అమెరికా వెళ్ళిన బంధువుల అబ్బాయెవరో ఆర్నెల్లు తిరక్కుండానే ఎన్నో లక్షలు పంపిస్తే వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కున్నారనీ, ఇంకో అబ్బాయెవరో వాళ్ళ అమ్మానాన్నల ముప్పయ్యో పెళ్లిరోజు ఘనంగా పండుగలాగా చేశాడనీ ఇలా ఏవేవో చెప్పేది. మొదట్లో నేను ఊరికే నాకు కబుర్లు చెప్తూంది అనుకున్నాను గానీ ఇలాంటివన్నీ నేను తన కోసం చేయట్లేదని అంటోందని అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత్తర్వాత తనేది మాట్లాడినా తనది కోరుకుంటుందేమోనని సాధ్యమైనంతవరకు నెరవేర్చడానికే ప్రయత్నించేవాడిని. కాస్తో కూస్తో బంగారమనీ, ఇంట్లో వస్తువులనీ ఎప్పుడు ఏది అడిగినా నేను నీకేది నచ్చితే అది చేయిఅని చెప్పేవాడిని. నాకు సాధ్యమైనంత వరకు అన్నీ సమకూర్చడానికే ప్రయత్నించేవాడిని. వాళ్లకి కాస్త సౌకర్యవంతంగా ఉంటుందని కొంచెం పెద్దయింటికి మారమని చెప్పాను. సొంత ఇల్లయితే మారతాము, లేకపోతే లేదుఅంది అమ్మ. అమ్మా, అందరితో మనకి పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ మొదలయ్యాము, ఇన్నేళ్ళు ఎలా బతికాము అనేది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకప్పటికంటే మన పరిస్థితి ఎంతో మెరుగయ్యింది కదా. ఇల్లైనా ఏదయినా మెల్లగా సమకూర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికి ఇలా కానివ్వండిఅని చెప్పాను. అలా కాదు, మనం ఏదో ఒకటి కొని తీరాల్సిందే, అయినా ఇదంతా నీ కోసమేగానీ నాకోసం కాదుఅని బాగా గొడవ చేసింది. చివరికి పరిస్థితి ఎలా అయిందంటే ఒక ఆర్నెల్ల పాటు రోజూ ఫోనులో ఇవే మాటలు. చివరికి నా వల్ల కాదని ఇల్లయితే కొనలేము గానీ ఒక లోను తీసుకుని ఏదయినా స్థలం కొందాములేఅని ఎలాగో ఒకలాగా తిప్పలు పడి ఒక చిన్న స్థలం కొన్నాము. ఇక అంతటితో అయిపోయిందిలే, అమ్మ బెంగ తీరిపోయింది ఇకనుంచి అందరం సంతోషంగా ఉండవచ్చు అనుకున్నాను. కానీ, అది నా అత్యాశే అయింది. ఇల్లు అనే అంశం మారింది అంతే గానీ అమ్మకున్న చింతలు తీరలేదు.


అసలు అమ్మకి ఉన్న సమస్యేమిటి? తనకి ఏ చీకూ చింతా లేకుండా ఉండాలని ప్రతీ క్షణం నేనెంత ఆరాటపడుతూ ఉంటానో, తనని ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని ఎంతగా తపిస్తానో కదా! అయినా, నేను తనని సంతృప్తిగా ఉంచలేకపోతున్నానా లేక తనే ఉండలేకపోతోందా?’ అని నేను ఆలోచించని రోజు లేదు. అసలు అమ్మ బాధలన్నింటికీ మూలం ఏమిటి అని తీవ్రంగా ఆలోచించాను. కనీసం రోజుకొకసారైనా నువ్వు ఇక్కడ లేవుఅంటుంది కదా, నేను తన దగ్గరికి వెళ్ళిపోతే ఈ సమస్యలన్నీ పరిష్కారమౌతాయేమోనని అనిపించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే తట్టాబుట్టా సర్దేసుకుని అమెరికా నుంచి తిరిగి వచ్చేసాను. అమ్మానాన్నలతో పాటు ఒక చిన్న ఇంటిలోకి మారాను. ఇంక అంతా సంతోషమే అనుకున్నాను. కానీ, అమ్మకి మాత్రం అప్పుడు కూడా సంతోషం లేదు. మళ్ళీ బాధల చిట్టా మొదలు. నేను ఇదివరకులా మాట్లాడటం లేదనీ, బంధువులెవరో సరిగ్గా మాట్లాడలేదనీ, అక్క మారిపోయిందనీఎప్పుడూ ఇలాంటివే కష్టాలు కాని కష్టాలు, బాధలు కాని బాధలు అమ్మకి. రోజురోజుకీ అమ్మకి అసంతృప్తి పెరిగిపోతూ ఉంటే, తనకి సర్దిచెప్పడానికి ప్రయత్నించి నా ఓపిక తరిగిపోతూ వచ్చింది. ఏ వ్యాపకమూ లేకపోతే విసుగ్గా ఉంటుందని ఏదో ఒకటి చేయమంటే అందులో కూడా పెడర్థాలు మొదలయ్యాయి. వీటన్నిటితో ఇల్లు ఒక చిన్న సైజు నరకంలాగా తయారయింది. క్రమంగా కొంతకాలానికి అమ్మ ఏది మాట్లాడినా విని ఊరుకోవడమే తప్ప నేనేమీ బదులు మాట్లాడని స్థితికి వచ్చాను. ఒకప్పుడు అమ్మ చుట్టూనే తిరిగే నా ఆలోచనల్లో ఎంతో మార్పు వచ్చింది. మునుపటిలా ఎందుకిలా జరుగుతోంది, నేను అమ్మను సంతోషంగా ఉంచలేనాఅని నాలో నేనే ప్రశ్నలు వేసుకోవడం, నాలో నేనే మధనపడిపోవడం తగ్గిపోయింది. అలా అని తన మీద కోపమేమీ పెట్టుకోలేదు. కానీ, అమ్మ ఎందుకిలా ఆలోచిస్తుంది అని తీవ్ర మానసిక క్షోభకి గురి కాకుండా తనని కేవలం ఒక వింత మనస్తత్వం ఉన్న వ్యక్తిగా మాత్రమే చూస్తూ వచ్చాను. తన మనస్తత్వం ఇంతే అని సర్ది చెప్పుకుని తనని మార్చాలనే వ్యర్థ ప్రయత్నం మానుకున్నాను.


అమ్మ నన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయిన ఇన్నేళ్ళ తరవాత ఈవేళ మళ్ళీ తన జ్ఞాపకాల వెల్లువ నన్ను ముంచెత్తింది. ఒకసారి గతంలోకి తరచి చూసి నేను తనని సంతోషంగా ఉంచగలిగానా అని నన్ను నేను ప్రశ్నించుకుంటే అవునో కాదో చెప్పలేని పరిస్థితి నాది. నా ఆలోచనలకు తగినట్టుగా తను సంతోషంగా లేకపోయినా, తనకి నచ్చినట్టుగా ఎప్పుడూ ఏదో ఒకటి సరిగ్గా లేదని బాధపడుతూ, అసంతృప్తిగా జీవితం గడపడంలోనే తనకి సంతోషం ఉందేమోననిపిస్తోంది. ఏదేమైనా ఈ క్షణం అమ్మ ఈ లోకంలో లేకపోయినా, బాధ, సంతోషం కలగలిపిన ఒక చిత్రమైన భావాన్ని నా జీవితంలో వదిలి వెళ్లిందనేది తలచుకుంటే ఇదొక విచిత్రబంధం అనిపిస్తుంది. ఇలా నా ఆలోచనా స్రవంతి సాగిపోతుండగా, సీత వచ్చి భోజనానికి రమ్మని పిలవడంతో గతంలోనుంచి ప్రస్తుతంలోకి వచ్చాను. భోజనాల దగ్గర సీత అంటోంది ఏవండీ.. వెనకింట్లోకి కొత్తగా వచ్చారే, ఆ కుటుంబం మీకు బాగా నచ్చారనుకుంటాను కదూ!అదేం..అలా అడిగావు అన్నట్లు చూసాను నేను సీత వైపు. ఏమీ లేదు.. మీరు వాళ్ళని చూడగానే రెండు గంటల సేపు యోగనిద్రలోకి వెళ్లిపోయినట్టున్నారు కదా అందుకే అలా అన్నానుఅని ముసిముసిగా నవ్వింది. ఎంతైనా సహధర్మచారిణి కదా! నాలో ఇప్పటిదాకా చెలరేగిన ఆలోచనలను ఇట్టే పసిగట్టేసింది కాబోలనుకుని నేనూ తనతో నవ్వు కలిపాను.

12 comments:

మురళి said...

మంచి ప్రయత్నం..అభినందనలు..

లక్ష్మి said...

Good One!!! inka unte bagundu anipinchindi

dj said...

Bagundi...

సుభద్ర said...

మధురవాణి గారు,
చాలా బాగు౦ది,
ఈ కధ నా ము౦దు ఎవరో ఉ౦డి చెపుతున్నట్లు అనిపి౦చి౦ది.
ఇ౦కా ఇ౦కా రాయ౦డి.

Unknown said...

మంచి ప్రయత్నం. బాగుంది

Padmarpita said...

బాగారాశారు...

భావన said...

బాగుంది అండి కథ. అయ్యో అనిపించింది అసంతృప్తి ని తలుచుకుంటే..

bharath said...

తల్లీ కొడుకుల అనుబంధాన్ని చాలా చక్క గా రాసారు...

శ్రీలలిత said...

మధురవాణిగారూ,

మీ కధ ప్రస్తుతకాలానికి సరిగ్గా సరిపొయెదిగా వుంది. ప్రయోజకుడైన కొడుకుని చూసుకుని తల్లి మురిసిపోతుంది. కాని ఒక సగటు తల్లి ఆ సతోషం అందరి ముందూ ప్రదర్సించుకొవాలనుకుంటుంది. అది ఎలాగో తెలియదు. చాలామంది ఇలాగే వాళ్ళకి వుందని వీళ్ళూ కొనుక్కుంటారు.. అలాగే ఆమె కూడ ఏది చూస్తే అది కావాలనుకుంది. అన్నీ కొడుకు అమర్చినా ఏదొ అసంతృప్తి. ఇటువంటి వాళ్ళకి కాస్త గుర్తింపు కావాలి. వాళ్ళని గుర్తించి పొగిడితే ఎంత సంబరపడిపొతారో.. అది లేకేనేమో పాపం ఆతల్లి అంత బాధపడింది. వర్తమాన కాలంలోని సంబంధ బాంధవ్యాలని చక్కగా చెప్పారు. ముందు ముందు మీ నుంచి ఇంకా మంచి కధలు వస్తాయని ఆశిస్తున్నాను. శ్రీలలిత.

మధురవాణి said...

@ మురళి, లక్ష్మి, dj, సుభద్ర, మధు, పద్మార్పిత, భావన, భరత్, శ్రీ లలిత గార్లకి,
నా కథని ఓపిగ్గా చదివి మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యానించినందుకు బోలెడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
@ శ్రీ లలిత గారూ,
మీ విశ్లేషణ చాలా బాగుందండీ.! చాలా సందర్భాల్లో మీరన్నట్టు గుర్తింపే వారి సమస్య.

స్థితప్రజ్ఞుడు said...

నిజంగా ఒక వ్యక్తి నాతో చెప్పినట్టు అనిపించింది. కథనం బావుంది గాని కథ సడన్ గా ఆగిపోయినట్టు అనిపించింది.

Identity crisis కి ఈ కథ ఒక చక్కని ఉదాహరణ.

మధురవాణి said...

@ స్థితప్రజ్ఞుడు,
చిన్న కథ కదండీ అందుకే అలా అనిపించిందేమో. పైగా, కథలో తల్లి మనస్తత్వంలో చివరిదాకా వచ్చేసరికి కూడా మార్పేమీ లేకపోవడం వాళ్ళ కూడా మీకలా అనిపించి ఉండవచ్చు. కథ చదివి మీ అభిప్రాయాన్ని తెల్పినందుకు ధన్యవాదాలు. :-)