జర్మనీలో చాలా రోజులనుంచి ఉంటున్నాను కాబట్టి, నేను చూసిన కొన్ని బాయ్ ఫ్రెండ్-గర్ల్ ఫ్రెండ్ కబుర్లు చెప్తాను. ముందుగా.. నేను ప్రత్యక్షంగా చూసిన కొన్ని విచిత్ర బంధాలు (మీకు కూడా అలానే అనిపిస్తాయి చూడండి) ఒక్కోటి చెప్తాను. తరవాత చివరగా నా విశ్లేషణ (అంటే నా అభిప్రాయం) చెప్పి ముగిస్తాను.
ఒకరోజు మా అపార్ట్మెంట్ ముందు నిలబడి మాట్లాడుతున్నాము నేనూ, మరో ఇద్దరు స్నేహితులు. ఎండాకాలం కాబట్టి కాస్త అలా బయట తీరిగ్గా నుంచుని మాట్లాడుతున్నాము. అప్పుడే ఒక జర్మన్ అబ్బాయి, అమ్మాయి (అదేనండి ప్రస్తుత కథలో వాళ్ళే వీరో-వీరోయినునూ..) బయటకొస్తున్నారు ఎదురింట్లోనుంచి. అమ్మాయి చేతిలో ఒక పెద్ద కుక్క కూడా ఉంది. వాళ్ళెక్కడికో బయలుదేరే ప్రయత్నంలో ఉన్నట్టు అనిపించింది. ఈలోపు ఆ అబ్బాయి 'డార్లింగ్.. మనం హాయిగా బయటికి షికారెళ్దాం అనుకున్నాం కదా.. మధ్యలో కుక్క ఎందుకు' అన్నాడు. వాళ్ల పరిస్థితి చూస్తుంటే ఆ కుక్క సదరు గర్ల్ ఫ్రెండ్ గారాల పట్టి అనీ, ఇతగాడికేమో ఆ కుక్క మీద పెద్దగా ఆసక్తి లేదనీ అనిపించింది. ఆ అమ్మాయేమో కావాలంటే నీతో రావడం మానేస్తాను గానీ, నా బుజ్జి కుక్కని మాత్రం వదిలి వచ్చే ప్రసక్తే లేదు అంది. దానికి ఆ అబ్బాయి 'నాకంటే ఈ తొక్కలో కుక్కే నీకు ఎక్కువా' అన్నాడు. అంతే.. అయిపోయింది. ఇంక చూస్కోండీ.. ఆ అమ్మాయి ఒక రేంజ్ లో వేస్కుంది ఆ అబ్బాయిని. నువ్వెంత నీ బతుకెంత.. నిన్న గాక మొన్నొచ్చావు, మహా అంటే.. ఇంకో రెన్నెళ్ళు ఉంటావు. నువ్వు కాకపోతే ఇంకో గొట్టం గోపాల కృష్ణ.. అంతే గానీ.. నా కుక్కని (ఆ అమ్మాయి కుక్క అనలేదు దాని పేరేదో ఉంటుందిగా టామీనో, రామీనో..) నాతో తీసుకురావద్దంటావా.. అంతే కాక తొక్కలో కుక్క అంటావా.. బ్రేక్ అప్.. అంది. అబ్బాయేమో.. అయితే ఏంటి, ఈ తొక్కలో కుక్కతో పాటు ఉన్న నువ్వు కాకపోతే ఇంక అమ్మాయిలే కరువా ఏంటి.. నేను కూడా బ్రేక్ అప్.. అన్నాడు. అంతే.. సింపుల్ గా పదే పది నిమిషాల్లో వాళ్ల విచిత్ర బంధానికి (బంధం అనడం కూడా అనవసరమేమో..) 'ది ఎండ్' పడింది. ఇలాంటి సందర్భాల్లో ఇంకో చిత్రమైన మలుపేంటంటే.. ఒక రెండు మూడు రోజులయ్యాక, ఇద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటారు. మొన్న అలా జరిగింది కదా, ఏమైనా మనిద్దరి అభిరుచులు కలవకపోవడం వల్లే అలా జరిగింది. లైట్ తీస్కుందాం.. 'లెట్స్ బి ఫ్రెండ్స్' అనుకుంటారు. నేనివాళ డిస్కోకి వెళ్తున్నాను కొత్త బాయ్ ఫ్రెండుని వెతుక్కోవడానికి, నువ్వూ రారాదూ..అంటుంది అమ్మాయి. మరి అక్కడ నుంచి మరో ప్రహసనం మొదలు.
మరో సంఘటన చెప్తాను చూడండి. నా కొలీగ్స్ తో కలిసి ఒకరోజు కాంటీన్లో లంచ్ చేస్తూ ఉండగా ఎందుకో బాయ్ ఫ్రెండుల టాపిక్ వచ్చింది ఆ రోజు. ఒక అమ్మాయి తన ప్రస్తుత బాయ్ ఫ్రెండుని ఎలా సెలెక్ట్ చేసుకుందో వివరించింది. అది విన్నాక నాకు దిమ్మ తిరిగిందంటే నమ్మండి. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే మొదట తనకి పరిచయం ఉన్న ఒక పది పదిహేనుమందిలోనుంచి.. మనిషి ఎలా ఉన్నాడు, కారైనా ఉందా లేదా.. మొదలైనవన్నీ స్క్రీనింగ్ చేసేసి చివరికి ఒక నలుగురిని సెమీ ఫైనల్ కి సెలెక్ట్ చేసిందట. ఒక రెండు-మూడు వారాలు వాళ్ళతో విడివిడిగా డేటింగులూ, డిస్కోలు, పబ్బులూ గట్రా విహరించేసి చివరిగా ఇద్దరిని ఫైనలైజ్ చేసిందట. అన్నీ రకాలుగా ఆ ఇద్దరి అబ్బాయిలకీ సమానంగా మార్కులు వచ్చాయట. ఇద్దరి మీద సమానంగా ఇష్టం అనిపించిందట. తీవ్రంగా ఆలోచించి ఒక మెరుపులాంటి ఆలోచన రాగా.. చటుక్కున డిసైడ్ చేసేసిందట. అది ఎలా అంటే.. ఆ అమ్మాయి తన పెంపుడు కుక్కని తీసుకుని విడి విడిగా ఇద్దరు అబ్బాయిలనీ కలిసిందంట. ఇద్దరిలో ఎవరి దగ్గర కుక్క కాస్త ఫ్రీగా మసలుతుందో.. ఎవరిని ఎక్కువ ఇష్టంగా ఫీల్ అవుతుందో .. ఆ అబ్బాయిని బాయ్ ఫ్రెండుగా సెలెక్ట్ చేసుకుందిట. ఈ ఐడియా బాగా వర్క్ అవుట్ అయింది. ఎంతైనా కుక్కలకి చాలా సెన్స్ ఉంటుంది తెలుసా..అని ముగించింది ఆ అమ్మాయి. ఇంకా మిగతా కొలీగ్స్ కూడా, వావ్.. వాటే సూపర్ ఐడియా.. అని మెచ్చుకున్నారు. అప్పుడు మీరు చూడాలి నా మొహం..తల తిరిగిపోయిందంటే నమ్మండి. బాయ్ ఫ్రెండుని ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చా అని.
ఈ షాక్ లోంచి ముందు మీరు తేరుకోండి. మళ్ళీ మిగిలిన కబుర్లు తరవాత చెప్తాను.
14 comments:
మీ జర్మన్ బాయ్ ఫ్రెండ్-గర్ల్ ఫ్రెండ్ కబుర్లు బాగున్నాయండి, చివరిగా రెండు సంఘటనల్లోనూ వారి కుక్కకి నచ్చిన అబ్బాయిని సెలెక్టు చేసుకున్నారన్నమాట....
ఈ సారి మీ బ్లాగ్ లోకి తొంగి చూసేముందు ఓ గ్లాసు నీళ్లు దగ్గర పెట్టుకుంటా
:) :)
నేను అర్జెంటు గా కుక్కలని ఎలా మచ్చిక చేసుకోవాలో నేర్ఛుకోవాలి :)
నాకు కుడా ఇలాంటి సంగతులు చాల తెలుసు అండీ ! మా ల్యాబ్ లోని డిప్లొమా అమ్మాయి స్టొరీ సిమిలర్ గా ఇంతే కాకపోతే కథ లో కుక్క బదులు పిల్లి, దాని గురించి వింతగా అడిగినందుకు , నా గురించి ల్యాబ్ లో ఒక వారం రోజుల పాటు చెప్పుకొన్నారు. ఆ తరువాత మన ఇండియా లో పెళ్ళి గురించి అడిగి , మీకు స్వాతంత్ర్యము లేదు సెలక్షన్ లో అని చెప్పి నా మీద చాల జాలి చూపించారు.
తొక్క ,గొట్టం ఈ పదాలు జర్మనీ వరకూ వచ్చాయన్నమాట ధన్యవాదాలు చిరంజీవి గారూ!:) :) :)
:))
మరీ మన భారత దేశంలో అత్యాస కొద్దీ జీవితాంతం కలిసి వుండాలనకుంటాం కాని... "just use for two-three months and throw it policy'ki ఇంత కంటే selection process మంచి వుండదు కదా
లేట్ గా వచ్చినా లేటెస్ట్ న్యూస్ తో వచ్చారు.. దూరం గా నిలబడి కూడా ఎదురింటి అబ్బాయి-అమ్మాయి ఏం మాట్లాడుకుంటున్నారో భలేగా చెప్పెశారండీ.. ట్రూ ట్రాన్స్లేషన్.. మీకు లిప్ రీడింగ్ తెలుసా? :) (మనసంతా నువ్వే సినిమా చూసారా? అందులో జోకిది) కుక్కల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? ఎంతైనా తెల్లోళ్ళ తెలివే తెలివి :)
హ హ భలే బాగుంది.. ముందు కుక్కలని ,పిల్లులను మచ్చిక చేసుకుని తరువాత అమ్మాయిలకు లైన్ వేయాలన్నమాట ...
@మారుతి గారూ,
అదేనండీ కాస్త చిత్రంగా అనిపించినా విషయం. ఎవరి పద్దతులు వాళ్ళవి మరి :)
@పరిమళం గారూ,
అంతేనంటారా.?
@ భాస్కర రామిరెడ్డి గారూ,
కుక్కల గురించి మాత్రమె కాదండోయ్, పిల్లుల గురించి కూడా తెలుసుకోండి.
@మేఘ సందేశం,
అవునండీ.. జర్మన్ అమ్మాయిలకి గాసిపింగ్ కూడా బాగా అలవాటే.!
@విజయమోహన్ గారూ,
అచ్చం అవే పదాలు వాళ్ళు వాడలేదులెండి. కాకపోతే, ఆ టైపులో తిట్టుకున్నారు అని చెప్పడం నా ఉద్దేశ్యం అన్నమాట. అయినా, వీటిని మించే పదాలకేం తక్కువ లేదులెండి వాళ్లకి ;)
@వంశీ కృష్ణ గారూ,
అయితే మనది అత్యాశేనని తేల్చేశారన్న మాట :)
@మురళి గారూ,
ట్రూ ట్రాన్స్లేషనా.. నా మొహమా.. అంత సీన్ లేదు లెండి నాకు. నిజానికి నాకు జర్మన్ రాదు. అప్పుడున్న ఫ్రెండ్ ట్రాన్స్లేట్ చేసి చెప్పాడు. అయినా వాళ్ళు ఒక పదిహేనడుగుల దూరంలోనే ఉన్నార్లెండి. పైగా పెద్దగానే అరిచేశారు. మనలాగా పక్కింటోళ్లు ఏమనుకుంటారు అని అంత తీవ్రంగా ఆలోచించే టైపు కాదు కదా వీళ్ళు.
@నేస్తం,
మరేనండీ.. చూడబోతే పరిస్థితి అలానే ఉంది.
Hilarious.
జర్మన్ అమ్మాయిలు ఇంత ఇంటెలిజెంట్ అనుకోలేదు :)
ha..ha..ha.. what a brilliant idea!
ఇప్పుడా అమ్మాయి వేరే కుక్కని పెంచుకుని ఆ కుక్కకి ఆ బాయ్ ఫ్రెండ్ నచ్చకపోతే పరిస్థితి ఏంటబ్బా....
@ సాయి ప్రవీణ్,
మరేంటనుకున్నారు!! ;)
@ జ్యోతిర్మయి,
ఏముంది.. వెరీ సింపుల్.. కుక్కకి నచ్చని బాయ్ ఫ్రెండ్ ని మార్చేసి నచ్చే మరో బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుంటే సరి! :D
Post a Comment