జర్మనీలో చాలా రోజులనుంచి ఉంటున్నాను కాబట్టి, నేను చూసిన కొన్ని బాయ్ ఫ్రెండ్-గర్ల్ ఫ్రెండ్ కబుర్లు చెప్తాను. ముందుగా.. నేను ప్రత్యక్షంగా చూసిన కొన్ని విచిత్ర బంధాలు (మీకు కూడా అలానే అనిపిస్తాయి చూడండి) ఒక్కోటి చెప్తాను. తరవాత చివరగా నా విశ్లేషణ (అంటే నా అభిప్రాయం) చెప్పి ముగిస్తాను.
ఒకరోజు మా అపార్ట్మెంట్ ముందు నిలబడి మాట్లాడుతున్నాము నేనూ, మరో ఇద్దరు స్నేహితులు. ఎండాకాలం కాబట్టి కాస్త అలా బయట తీరిగ్గా నుంచుని మాట్లాడుతున్నాము. అప్పుడే ఒక జర్మన్ అబ్బాయి, అమ్మాయి (అదేనండి ప్రస్తుత కథలో వాళ్ళే వీరో-వీరోయినునూ..) బయటకొస్తున్నారు ఎదురింట్లోనుంచి. అమ్మాయి చేతిలో ఒక పెద్ద కుక్క కూడా ఉంది. వాళ్ళెక్కడికో బయలుదేరే ప్రయత్నంలో ఉన్నట్టు అనిపించింది. ఈలోపు ఆ అబ్బాయి 'డార్లింగ్.. మనం హాయిగా బయటికి షికారెళ్దాం అనుకున్నాం కదా.. మధ్యలో కుక్క ఎందుకు' అన్నాడు. వాళ్ల పరిస్థితి చూస్తుంటే ఆ కుక్క సదరు గర్ల్ ఫ్రెండ్ గారాల పట్టి అనీ, ఇతగాడికేమో ఆ కుక్క మీద పెద్దగా ఆసక్తి లేదనీ అనిపించింది. ఆ అమ్మాయేమో కావాలంటే నీతో రావడం మానేస్తాను గానీ, నా బుజ్జి కుక్కని మాత్రం వదిలి వచ్చే ప్రసక్తే లేదు అంది. దానికి ఆ అబ్బాయి 'నాకంటే ఈ తొక్కలో కుక్కే నీకు ఎక్కువా' అన్నాడు. అంతే.. అయిపోయింది. ఇంక చూస్కోండీ.. ఆ అమ్మాయి ఒక రేంజ్ లో వేస్కుంది ఆ అబ్బాయిని. నువ్వెంత నీ బతుకెంత.. నిన్న గాక మొన్నొచ్చావు, మహా అంటే.. ఇంకో రెన్నెళ్ళు ఉంటావు. నువ్వు కాకపోతే ఇంకో గొట్టం గోపాల కృష్ణ.. అంతే గానీ.. నా కుక్కని (ఆ అమ్మాయి కుక్క అనలేదు దాని పేరేదో ఉంటుందిగా టామీనో, రామీనో..) నాతో తీసుకురావద్దంటావా.. అంతే కాక తొక్కలో కుక్క అంటావా.. బ్రేక్ అప్.. అంది. అబ్బాయేమో.. అయితే ఏంటి, ఈ తొక్కలో కుక్కతో పాటు ఉన్న నువ్వు కాకపోతే ఇంక అమ్మాయిలే కరువా ఏంటి.. నేను కూడా బ్రేక్ అప్.. అన్నాడు. అంతే.. సింపుల్ గా పదే పది నిమిషాల్లో వాళ్ల విచిత్ర బంధానికి (బంధం అనడం కూడా అనవసరమేమో..) 'ది ఎండ్' పడింది. ఇలాంటి సందర్భాల్లో ఇంకో చిత్రమైన మలుపేంటంటే.. ఒక రెండు మూడు రోజులయ్యాక, ఇద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటారు. మొన్న అలా జరిగింది కదా, ఏమైనా మనిద్దరి అభిరుచులు కలవకపోవడం వల్లే అలా జరిగింది. లైట్ తీస్కుందాం.. 'లెట్స్ బి ఫ్రెండ్స్' అనుకుంటారు. నేనివాళ డిస్కోకి వెళ్తున్నాను కొత్త బాయ్ ఫ్రెండుని వెతుక్కోవడానికి, నువ్వూ రారాదూ..అంటుంది అమ్మాయి. మరి అక్కడ నుంచి మరో ప్రహసనం మొదలు.
మరో సంఘటన చెప్తాను చూడండి. నా కొలీగ్స్ తో కలిసి ఒకరోజు కాంటీన్లో లంచ్ చేస్తూ ఉండగా ఎందుకో బాయ్ ఫ్రెండుల టాపిక్ వచ్చింది ఆ రోజు. ఒక అమ్మాయి తన ప్రస్తుత బాయ్ ఫ్రెండుని ఎలా సెలెక్ట్ చేసుకుందో వివరించింది. అది విన్నాక నాకు దిమ్మ తిరిగిందంటే నమ్మండి. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే మొదట తనకి పరిచయం ఉన్న ఒక పది పదిహేనుమందిలోనుంచి.. మనిషి ఎలా ఉన్నాడు, కారైనా ఉందా లేదా.. మొదలైనవన్నీ స్క్రీనింగ్ చేసేసి చివరికి ఒక నలుగురిని సెమీ ఫైనల్ కి సెలెక్ట్ చేసిందట. ఒక రెండు-మూడు వారాలు వాళ్ళతో విడివిడిగా డేటింగులూ, డిస్కోలు, పబ్బులూ గట్రా విహరించేసి చివరిగా ఇద్దరిని ఫైనలైజ్ చేసిందట. అన్నీ రకాలుగా ఆ ఇద్దరి అబ్బాయిలకీ సమానంగా మార్కులు వచ్చాయట. ఇద్దరి మీద సమానంగా ఇష్టం అనిపించిందట. తీవ్రంగా ఆలోచించి ఒక మెరుపులాంటి ఆలోచన రాగా.. చటుక్కున డిసైడ్ చేసేసిందట. అది ఎలా అంటే.. ఆ అమ్మాయి తన పెంపుడు కుక్కని తీసుకుని విడి విడిగా ఇద్దరు అబ్బాయిలనీ కలిసిందంట. ఇద్దరిలో ఎవరి దగ్గర కుక్క కాస్త ఫ్రీగా మసలుతుందో.. ఎవరిని ఎక్కువ ఇష్టంగా ఫీల్ అవుతుందో .. ఆ అబ్బాయిని బాయ్ ఫ్రెండుగా సెలెక్ట్ చేసుకుందిట. ఈ ఐడియా బాగా వర్క్ అవుట్ అయింది. ఎంతైనా కుక్కలకి చాలా సెన్స్ ఉంటుంది తెలుసా..అని ముగించింది ఆ అమ్మాయి. ఇంకా మిగతా కొలీగ్స్ కూడా, వావ్.. వాటే సూపర్ ఐడియా.. అని మెచ్చుకున్నారు. అప్పుడు మీరు చూడాలి నా మొహం..తల తిరిగిపోయిందంటే నమ్మండి. బాయ్ ఫ్రెండుని ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చా అని.
ఈ షాక్ లోంచి ముందు మీరు తేరుకోండి. మళ్ళీ మిగిలిన కబుర్లు తరవాత చెప్తాను.