ఈ వేళ మీ అందరికీ ఒక మంచి పాటని గురించి చెప్దామని వచ్చాను. పైన కనిపిస్తున్న టైటిల్ ఈ పాట పల్లవి. సూపర్ స్టార్ కృష్ణ గారి కుమార్తె మంజుల నిర్మాణంలో ఛార్మి, మంజుల ఇద్దరూ కలిసి నటించిన 'కావ్యాస్ డైరీ' అనే సినిమాలోది ఈ పాట. పాటలు రిలీజ్ అయ్యి చాలా రోజులవుతుంది కానీ.. సినిమా ఇంకా విడుదలవ్వలేదు. ఎందుకో మరి.? సినిమా సంగతేమో గానీ.. పాటలు మాత్రం అన్నీ మెల్లగా సాగే మెలోడీస్. ఈ సినిమాకి 'మను రమేశన్' అనే కొత్త సంగీత దర్శకుడు స్వరాలందించారు.
ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే పాటని అనంత శ్రీరాం రాశారు. కార్తిక్, రీటా కలిసి ఎంత బాగా పాడారంటే.. పాట అయిపోయాక కూడా మనని వెంటాడుతున్నట్టుగా ఉంటుంది. అసలు కార్తీక్ పాడిన చాలా పాటలు నాకు అలాగే అనిపిస్తాయి. మనసు పెట్టి పాడతాడేమో మరి.. అందుకే అతని గొంతులో అంత మాధుర్యం పలుకుతుంది. అసలు ఈ పాట భావం బావుంటుంది. ఇంకా పాడిన వాళ్ళిద్దరూ నిజంగా స్పందించి పాడినట్టుగా ఉంటుంది వింటుంటే. అందుకే ఆ అందం వచ్చిందనుకుంటా పాటకి..! నేను చెప్పడం ఎందుకులే గానీ.. మీరే ఓ చెవి ఇటు పడెయ్యండి ;)
అప్పుడెప్పుడో వచ్చిన మంజుల సినిమా 'షో' చూసారా? దర్శకుడు నీలకంఠకి బెస్ట్ స్క్రీన్ ప్లే జాతీయ అవార్డ్ వచ్చింది. రొటీన్ గా ఉండే సినిమాలు కాకుండా.. వైవిధ్యంగా ఉండే తెలుగు సినిమా చూడాలనుకుంటే తప్పకుండా ఈ సినిమాని ట్రై చేయండి. ఇప్పుడు రాబోయే ఈ 'కావ్యాస్ డైరీ' సినిమా కూడా బావుంటుందేమో అనుకుంటున్నాను నేనయితే. ఏమో మరి చూద్దాం విడుదలయ్యాక.! ఈ పాట సాహిత్యం చూడండి ఒకసారి మరి.!
తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి..
తెలుసుకో నన్నే నీ గుండెనే తెరిచి..
తెలపాలి నువ్వు ఐనా..
తెలపాలి నువ్వు ఐనా.. నేనే..తెలుపలేకున్నా..!
తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి..!
నీ చేరువై నేనుండగా.. ఈ దూరమేమిటో ఇంతగా..
అనుకొనే నా మనసునే వినవా.. ఓ..!
నీ శ్వాస సోకితే చాలని.. ఆ ఆశ ఇంకిపోలేదని..
నిజమునే.. నీ పెదవితో అనవా.. హో..!
తలచుకుంటాను నువు ననే తలచేవని ఈ క్షణం..!
నిదుర లేస్తాను ఎదురుగా కదలేవనీ ఈ దినం..!
నేనే..!!
అపుడేమో పెదవిపై నవ్వులే.. ఇపుడేమో నవ్వులో నలుపులే..
ఎందుకా చిరునవ్వులో మసకా.. ఆ..!
అపుడెంత కసిరినా మాములే.. ఇపుడేమి జరిగినా మౌనమే.!
ఎందుకే నీ మాటలో విసుగా.. ఓ..!
కలిసి రావాలి వెంటనే.. కాలాలు మనకోసమై..
దరికి చేరాలి అంతలో భారాలు మమకారమై..
నేనే తెలుపలేకున్నా..!
నీతో... నేనే... తెలుపలేకున్నా..!
ఈ పాటని మీరు download చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి. విని ఆనందించండి.
మళ్లీ కలుద్దాం.!
ప్రేమతో..
మధుర వాణి