మేము చాలా చిన్నప్పుడు.. అంటే నేనొక మూడో తరగతి, మా తమ్ముడేమో ఒకటో తరగతి చదివే రోజుల్లో అన్న మాట... ఓ సాయంకాలం ఎప్పటిలాగే అల్లరి చేసుకుంటూ మా నాన్న వచ్చే వేళయిందని ఎదురు చూస్తూ ఉన్నాం. బాగా చిన్నప్పటి నుండి మా తమ్ముడికి ఒక అలవాటు ఉంది. వాడే పనిలో ఉన్నా గానీ.. చివరికి అన్నం తినే పనిలో ఉన్నా గానీ.. వీధి చివర మా డాడీ స్కూటర్ హార్న్ వినిపించగానే మెరుపులా సెకన్లో పరిగెత్తి ఒక ముప్పై అడుగుల దూరంలో ఉన్న గేటు దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు. గేటు తీయడం కోసం మా డాడీ అలా ఒక హార్న్ సిగ్నల్ ఇచ్చే వాళ్ళన్నమాట ..! వీధిలో ఎన్నో స్కూటర్లు తిరిగేవి.. అదీ కాక మా ఇల్లు కార్నర్లో ఉండటం వల్ల ప్రతీ ఒక్కళ్ళు హార్న్ కొట్టేవాళ్ళు. మా తమ్ముడికి మాత్రం మా నాన్న బండేదో కరెక్ట్ గా తెలిసేది. మా నాన్న వెస్పా, చేతక్, హోండా, అలా చాలా బండ్లు మార్చారు.. ఏదయినా వాడు చిటికెలో గుర్తు పట్టేసేవాడు. నేను మాత్రం ఇప్పటికీ ఆ పని చేయలేను. నేనొక్కదాన్నే ఇంట్లో ఉంటే.. వాడు లేకపోతే.. పాపం మా నాన్న గేటు దగ్గరికొచ్చాక ఒక మూడు నాలుగు సార్లు హార్న్ కొడితే గానీ.. వెళ్ళేదాన్ని కాదు. నాది చాలా చురుకైన బుర్ర కదూ :)
ఇంతకీ.. అసలు కథలోకి వస్తే.. ఆ రోజు మా నాన్న చేతిలో ఒక పెద్ద పైపు లాంటిది తీసుకొచ్చారు. అలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ చూళ్ళేదు. ఇంకేముంది వెంటనే గబ గబా పొలోమని గోల మొదలెట్టేసాం... నాన్నా.. ఏంటి అది.. ఎందుకు.. అదీ ఇదీ అని ప్రశ్నల వర్షం కురిపించేసాం. తరవాత ఇంట్లోకి వచ్చేసాక ట్యూబు లైటు వెలుతురులో చూస్తే.. అదేదో.. పెద్ద పేపరుని అలా పైపు లాగా చుట్టారని అర్ధం అయింది. నాన్న స్నానం చేసి వచ్చి.. అందరం కలిసి అన్నం తిన్నాక గానీ దాని సంగతి చెప్పనన్నారు. ఇంకేముంది.. ఆ రోజుకి.. ఏ పేచీలు లేకుండా.. కూరలో కరివేపాకు తినము అని, పెరుగన్నం వద్దని గోల చేయకుండా.. త్వర త్వరగా అన్నం తినేశాం నేనూ మా తమ్ముడూ ఇద్దరమూ. అప్పట్లో మా ఇంట్లో హాల్లో ఒక పెద్ద బల్ల ఉండేది.. మా అమ్మమ్మకి నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు కాబట్టి.. ఆ బల్ల మీదే పడుకునేది. తనకి మంచం ఇష్టం ఉండదన్నమాట..! అందరం అన్నాలు తినేసాక మా నాన్న ఆ చుట్టబెట్టిన పేపరుని తీసుకొచ్చి.. దానికున్న రబ్బరు బ్యాండులు తీసి మొత్తం పేపరుని బల్లపై పరిచారు. ఇంతకీ అదేంటనుకున్నారు.. ఒక పే..ద్ద.. పోస్టరు.. అంత పెద్దది మా స్కూల్ లో కూడా ఎప్పుడూ చూళ్ళేదు మేము. మా ఊరి బస్టాండులో సినిమా పోస్టర్లు చూశాం.. అంతే..!
నేను, మా తమ్ముడూ చాలా థ్రిల్ అయిపోయాము మొత్తానికి ..! ఇంక చెరొక వైపు దాన్ని పట్టుకు కూర్చున్నాం మళ్లీ రోల్ అయిపోకుండా..! అసలే అంత పెద్ద పోస్టరు కదా.. అదంతా ఆక్రమించుకుని క్లోజ్-అప్ షాట్ లో ఒక అందమైన బ్రౌన్ కలర్ గుర్రం. అది పెయింటింగే అనుకుంటా.. కానీ.. అచ్చు నిజం గుర్రం ఫోటోలానే ఉంది. పోస్టర్లో క్రిందన పచ్చటి గడ్డి.. అంటే అదొక పచ్చిక బయలు అనే ఫీల్ వచ్చేలాగానన్నమాట..! దాని మీద గుర్రం నిలబడి ఉంది. పైన ఆకాశం కనిపిస్తుంది. అంత పెద్ద సైజులో ఉండటం వల్ల.. మా ఇద్దరికీ నిజంగా గుర్రాన్నే బయట చూసినంత ఆనందం, ఆశ్చర్యం కలిగాయి. ఇద్దరం మా నాన్నని అడుగుతూనే ఉన్నాం.. ఎందుకు నాన్నా ఇది.. అని.. మీరు చూస్తూ ఉండండి.. అని చెప్పి మా నాన్న ఒక చిన్న డబ్బా తీసుకొచ్చారు. పోస్టర్ని వెనక్కి తిప్పి.. వెనకాల అంతా ఆ డబ్బాలోని పేస్టు లాంటిదాన్ని పూసారు. జాగ్రత్తగా గోడపైన అంటించారు. మేమేమో క్రిందనుంచి చూస్తూ.. పెద్ద పోటుగాళ్ళ లాగా డైరెక్షన్స్ ఇచ్చాం ఎలా అంటించాలో సున్నం గోడ మీద చక్కగా అంటుకొని, మళ్ళీ ఊడి రాకుండా ఉండటానికి మా నాన్న సినిమా పోస్టర్లు అంటించే అబ్బాయిని అడిగి ఆ మైదా తీసుకొచ్చారట. ఆ తరవాత పదేళ్ళకి పైగా.. ఆ పోస్టరు మా ఇంట్లో ఉంది ఆ గోడ మీద.
ఇక మేము బొమ్మలోని గుర్రం మీద రోజూ.. చర్చా కార్యక్రమాలు పెట్టేవాళ్ళం. ఒకరోజు అలా అనుకుంటూ గమనించిన సంగతి ఏంటంటే.. ఆ గుర్రం మూడు కాళ్ళు గాల్లోనే ఉన్నాయి. కేవలం ఒక్క కాలే నేల మీద ఆన్చి నుంచుంది. పైగా.. దాని తోక కూడా గాల్లోనే ఉంది. మెడ మీద జూలు కూడా ఎగురుతూ ఉంది. ఇంకా ఆ వేళ మా నాన్నని అడిగేశాం.. ఆ గుర్రం సంగతేంటి.. సరిగ్గా నిలబడలేదేంటి.. పాపం.. దాని కాళ్ళకి దెబ్బలు తగిలాయా.. ఒక్క కాలితో ఎలా నడుస్తుంది.. తోక ఎందుకు గాల్లో ఉంది.. గుర్రం తోక అలాగే ఉంటుందా.. లాంటి చొప్పదంటు ప్రశ్నల్ని సంధించేశాం మా నాన్న పైన. అప్పుడు మా నాన్న ఏం చెప్పారంటే.. ఆ గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతూ ఉంది ఆ పచ్చిక బయళ్ళలో.. ఎంత వేగం అంటే.. ఆ పరిగెత్తడంలో మూడు కాళ్ళు గాలిలోనే ఉన్నాయి. అందుకే మీకు అలా కనిపిస్తుంది. ఆ వేగానికే.. తోక, జూలు ఎగురుతున్నాయి..ఒక సారి ఊహించి చూడమని చెప్పారు. ఇంకేముందీ.. ఆ పోస్టరు కాస్తా వీడియో అయింది మా పాలిట..! ఆ గుర్రం మంచి యవ్వన రూపంతో, కపిల వర్ణంలో, రాజ ఠీవీతో భలే మెరిసిపోతూ ఉండేది. నాకూ, మా తమ్ముడికీ అదంటే ఎంతిష్టమో అప్పట్లో..! ఇంటికెవరన్నా స్నేహితులొచ్చినా అది చూపించేవాళ్ళం లోపలికి తీస్కెళ్ళి..!
ఏదో పల్లెటూర్లో చిన్న స్కూల్లో చదువుకున్నాం కాబట్టి.. ఒకటో తరగతిలోనే ఇంగ్లీషు మాట్లాడేంత సీన్ లేదు అప్పట్లో.. మూడో, నాలుగో తరగతిలో.. వాక్యాలు నేర్చుకునే వాళ్ళం. ఇదెందుకు చెప్తున్నానంటే.. మా గుర్రం బొమ్మ పక్కన ఇంగ్లీషులో ఏదో రాసి ఉండేది.. చాలా రోజులు దాన్ని పట్టించుకోలేదు. మెల్లగా ఇంగ్లీషు నేర్చుకునే రోజుల్లో.. నేను మా తమ్ముడూ దాన్ని చదవడానికి ప్రయత్నించే వాళ్ళం. ఆ వాక్యం ఏంటంటే.. "Each must find his own road" అని.. మేము "ఈ, ఏ, సి, హెచ్.. ఈచ్, ఏం, యు, ఎస్, టి.. మస్ట్.." అలా కష్టపడి మొత్తం చదివగాలిగాం కానీ.. 'own' అనే పదం తప్ప.. మా నాన్నని అడిగితే దాన్ని 'ఓన్' అని చదవాలని.. దానర్ధం 'సొంత' అని చెప్పారు. మొత్తంగా ఆ వాక్యానికి అర్ధం.. "ప్రతీ ఒక్కరూ తమ సొంత దారిని కనుక్కోవాలి" అని కూడా చెప్పారు. అలా చదవగలిగాక ఏళ్ళు గడిచిపోయాయి కానీ.. ఆ వాక్యములోని నిజమైన భావం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ.. ఇప్పుడెందుకో నిన్న రాత్రి గుర్తొస్తే.. చాలా చిత్రంగా అనిపించింది. మా నాన్నకి ఎంత మంచి అభిరుచి ఉందో కదా..! ఎంత చక్కని బొమ్మని తీసుకొచ్చి పెట్టారు.. ఎంత గొప్ప భావం.. అనిపించింది.
అలాంటి గుర్రం బొమ్మ దొరుకుతుందేమో ఈ పోస్టులో పెడదాం అనుకుంటే దొరకలేదు