నమస్కారం అందరికీ..!
నేను ఇప్పుడు సభా కార్యక్రమం ఏమీ పెట్టట్లేదు కానీ.. చిన్నప్పటి.. మా పల్లెటూరి ఇంట్లోని పెరటి కబుర్లు చెప్దామనుకుంటున్నాను.. మీరు వినడానికి రెడీ అయితే.. కాస్కోండి మరి..!!
ఒక మూడేళ్ళ క్రితం దాకా మా కుటుంబం ఒక పల్లెటూర్లోనే ఉండేది. అది మా అమ్మమ్మ వాళ్ల సొంత ఇల్లు. కానీ.. మా మామయ్యలెవరూ అక్కడ ఉండేవాళ్ళు కాదు. నాకు నాలుగేళ్ళున్నప్పుడు ఆ ఇంట్లోకి మేము వచ్చాం. కాబట్టి నా చిన్నతనం అంతా ఆ ఇంట్లోనే.. అదొక ఆరు చిన్న గదులున్న ఇల్లు. ఆ ఇంటి వెనకాల చాలా ఖాళీ స్థలం ఉండేది. అందులో ఒక మూలాన ఒక నీళ్ళ తొట్టి (మేము 'గాబు' అనేవాళ్ళం), ఒక మూలాన స్నానాల గది ఉండేవి. నా చిన్నతనంలో ఒక పెద్ద పశువుల కొట్టం ఉండేది గానీ.. చాలా ఏళ్ళ క్రితమే పశువుల్నీ.. కొట్టాన్నీ కూడా తీసేశారు.
ఇంక మా ఇంట్లో మొక్కల సంగతి చెప్పాలంటే.. ఆయా కాలాన్ని బట్టి.. అన్నీ రకాల పూల మొక్కలు, ఆకు కూరలు, కాయగూరలు ఉండేవి. ఫలానా పూల మొక్క లేదు అనడానికి అవకాశం ఉండేది కాదు :) అంత చక్కటి నందనవనం లాంటి తోటని పెంచి పెద్ద చేసిన ఘనత మాత్రం మా అమ్మకీ, అమ్మమ్మకే దక్కుతుంది. మా పెరట్లో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. కాయలు కాసినా ఎక్కడో పైన ఉండేవి కాబట్టి మాకు అందే అవకాశమే ఉండేది కాదు :( అందకపోయినా.. రోజూ చెట్టు మీద నిఘా వేసేవాళ్ళం ఎన్ని కాయలు కాస్తున్నాయి, ఎన్ని కాయలు ఎండటానికి దగ్గరపడుతున్నాయి అని. ఎప్పుడో ఎండిపోయి రాలి కిందపడితే.. అప్పుడు వాటిల్లో దూదిని తీసి భలేగా ఆడుకునే వాళ్ళం. ఆ దూది చాలా తేలికగా ఉండి ఉఫ్.. అని ఊదితే ఎగురుతూ ఉండేది :) ఒకసారి మా అమ్మమ్మ చెప్పింది ఆ బూరుగు పత్తితో దిండు తయారు చేసుకుంటే బావుంటుంది. చాలా మెత్తగా ఉంటుంది అని. ఇంక చూస్కోండీ.. అప్పటి నుంచి పోటీలు పడి మరీ బూరుగు కాయలు ఏరి, పత్తిని జాగ్రత్తగా దాచి ఎలాగో మొత్తానికి ఒక చిన్న దిండు తయారు చేశాము. చాలా రోజులవరకూ ఉండేది ఆ దిండు మా ఇంట్లో..!
ఇంకా ఒక పెద్ద కరివేపాకు చెట్టు ఉండేది. ఇంటి చుట్టుప్రక్కల వాళ్లు కూడా చాలామందే వచ్చి తీసుకెళ్తుండేవారు. నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే.. నేను రోజూ స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికొచ్చాక.. తను వంట కోసం కూరలు తరుగుతూ.. "ఒక రెండు రెబ్బలు కరివేపాకు కోసుకుని రామ్మా.. తాలింపు వెయ్యాలి" అని నన్ను పిలిచేది. అప్పుడప్పుడూ.. నేను టీవీ ముందు కూర్చొని వెంటనే రాకపోతే "రా..నానా..ఒక్కసారి.. మా అమ్మవి కదూ.. తాలింపు మొదలెట్టేసాను" అని మళ్ళీ పిలిచేది. అప్పుడు నేను రెండే అంగల్లో గెంతుకుంటూ వెళ్లి వెంటనే రెండు రెబ్బలు కోసి గాబు దగ్గర నీళ్ళతో కడిగేసి... పరిగెత్తుకుంటూ వచ్చి ఇచ్చేదాన్ని. కరివేపాకు చెట్టు చాలా పెద్దగా ఉండటం వల్ల, దాని వేర్ల నుంచి బోలెడు చిన్న కొత్త మొక్కలోచ్చేవి . అవి చాలా లేతగా ఉంటాయి.. వాటి నుంచి రెబ్బలు తెంపేదాన్ని నేను. అలాంటి చిన్న చిన్న పిలకల్ని చాలా మంది అడిగి తీసుకెళ్ళేవారు వాళ్ళిళ్ళల్లో నాటుకోవడం కోసం. ఏంటో వదినా.. ఎన్ని సార్లు నాటిన బతికి చావట్లేదు మా ఇంట్లో.. అనుకుంటూ తీసుకెళ్ళేవాళ్లు :) నిజంగానే చాలా తక్కువమంది ఇళ్ళల్లో మాత్రమే అవి బ్రతికేవి ఎందుకో మరి..!!
ఇక్కడ దేశం కాని దేశంలో తాజా కరివేపాకు వేసుకుని కూర చేసుకోవాలంటే అదొక పెద్ద ప్రహసనం. ఎక్కడో సిటీ సెంటర్లో ఉండే ఇండియన్ షాప్ కి వెళ్లి తెచ్చుకోవాలి. అది కూడా ఎంత ముదురుగా ఉంటుందో.. అది దొరకడమే మహా అదృష్టం అని అనుకుని ఆనందిస్తాననుకొండీ.. కానీ.. అప్పటికప్పుడు చెట్టు నుండి కోసి వేసి కూర చేసే రోజులు, మా అమ్మ వంట అన్నీ గుర్తొచ్చీ భలే బాధగా ఉంటుంది అప్పుడప్పుడూ.. :( అంతేలే.. మరపురాని మధురమైన రోజులు.. అనుకుంటూ ఒక నిట్టూర్పు విడుస్తుంటాను. అంత కన్నా ఏం చేస్తాం చెప్పండి.?
అలాగే, గులాబీ ఎవరింట్లోనన్నా పూలు పూస్తున్నాయంటే ఎంత గొప్పగానో అనుకునేవారు అందరూ.. ఎందుకంటే.. ఎంత జాగ్రత్తగా పెంచినా.. ఊరికే చనిపోతూ ఉండేవి అవి. నానా తిప్పలూ పడేవాళ్ళు గులాబీలని బ్రతికించడానికి..! మా ఇంట్లో రెండు రకాల గులాబీలు ఉండేవి. రాణీ కలర్ (రోస్ పింక్), లేత గులాబీ రంగు పువ్వులు పూచేవి. ఇంక చామంతులయితే.. ఎన్ని రకాలు ఉండేవో.. చిట్టి చామంతి, బిళ్ళ చామంతి (తెల్లవి మధ్యలో పసుపు రంగు), ఎర్ర చామంతి.. దాదాపు ఎప్పుడు చూసినా ఒక రెండు మూడొందలు పూలుండేవి అన్నీ చామంతులూ కలిపి. రోజూ చుట్టూ పక్కల అమ్మాయిలు ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు గిన్నె పట్టుకుని.. పూల కోసం. ఇంకా.. కనకాంబరాలు అయితే బోలెడు ఉండేవి.
మా ఇంట్లో మా అమ్మమ్మ, అమ్మ, నాన్న ముగ్గురూ ఎవరి పూజ వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి.. అన్నీ రకాల పూలనూ రోజూ కోసి దేవుడికి పెట్టేవారు. మా అమ్మేమో మధ్యాహ్నం తీరిక సమయాల్లో బంతి పూలు, చామంతులు, కనకాంబరాలు లాంటివి మాలలు కట్టి మా ఇంట్లో ఉండే పెద్ద పెద్ద దేవుళ్ళ ఫొటోలకి దండలుగా వేసేది. ఆ పూలు ఒక వారం దాకా అందంగా ఉండేవి చూడడానికి. ఇంకా.. చాలా రకాల మొక్కలు, పూలు ఉండేవి. మిగిలిన వాటి గురించి మళ్ళీ వచ్చే టపాలో చెప్తాను.
అందాకా సెలవు మరి..!
ప్రేమతో..
మధుర వాణి
11 comments:
పుష్ప రాగం భాగం బావుంది.
పల్లెట్టూళ్ళలో జనానికి మొక్కలకి,పశువులకి ఎంత అవినాభావ సంబంధం వుంటుందో కదా. కొమ్ముగేది కి బుల్లి దూడ పుట్టినప్పుడే మా చిన్నది పుట్టింది అని చెప్పుకోవడంలోను,గులాబీ మొక్కకి కొత్త మొగ్గేసిందన్నావు గా అది విరిసిందా అని అడగడం లోనూ,చిక్కుడుగింజలు,బీరకాయ గింజలు విత్తనాలు పంచిపెట్టి వాటి యోగక్షేమాలు అడగడంలోనూ , నందివర్ధనం మొక్క ఆకులు రాలేస్తుందని బాధపడడంలోనూ ఎంత అందం వుంటుందో.
వావ్ రెండు మూడు వందల చామంతులా !! అన్ని పువ్వులతో మీ పెరడు చూడటానికి రెండు కళ్ళూ సరిపోయేవి కాదేమో.. బాగున్నాయండీ కబుర్లు.
ఈ కబుర్లను ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా
వినాలనిపిస్తుంది. మా అమ్మమ్మగారింట్లో కూడా
ఇంతే. వీదిలో ఆడపిల్లలంతా జడలు కుట్టేసుకునేవాళ్ళం
ఎక్కువ పూలు పూస్తే. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు
కృతజ్ఞతలు.
భలే బాగ చెప్పారు :)
మీరు పల్లెటూళ్ళో విషయం చెప్పారు... కానీ ఈ హైదరాబాదు మహానగరంలో మాకూ పెద్ద ఆవరణతో ఇల్లు ఉండేది. మా చిన్నప్పుడు అసలు ఎన్ని స్మృతులో...! అవన్నీ రాయాలంటే ఒక పెద్ద టపా అయిపోతుంది... !! మంచి రోజులని గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు... !!
మిత్రులందరికీ ధన్యవాదాలు వాఖ్యలు రాసినందుకు. అయితే మీ అందరికీ కూడా బోలెడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయన్నమాట. అలా అయితే నాకు సంతోషమేగా మరి..!
@ శ్రీకాంత్ గారూ,
అవునండీ.. వందలలోనే ఉండేవి. మా ఇంట్లో దేవుడి గదిలోనే కాకుండా.. హాల్లో ఓ పక్కన కూడా పైన గోడకి పెద్ద పెద్ద దేవుడి పటాలుండేవి వరసగా.. పెద్ద పెద్ద దండలు కట్టి అన్నీ పటాలకీ వేసేది మా అమ్మ.
ఇప్పుడవన్నీ ఏమీ లేవు :( కానీ.. అప్పుడన్ని కాకపోయినా.. ఇప్పుడు కూడా చాలా రకాల పూల మొక్కలు పెంచుతున్నారు మా ఇంట్లో.
అప్పట్లో మా ఇంట్లో కెమెరా ఉండుంటే ఎన్ని ఫోటోలు తీసి ఉండేదాన్నో నేను :(
రాధిక గారూ..
మీరు చెప్పింది నిజమేనండీ.. మొక్కల గురించీ.. పూల గురించీ ఎంత ఆపేక్షగా మాట్లాడుకునేవారో..!
హమ్మ్ మీరు దేశం కాని దేశంలో ఉన్నారని గుర్తించలేదు ఇంత వరకూ. అప్పుడే చెట్టు నించి కోసి డైరెక్టుగా తిరగమోతలో వేసిన కరేపాకు సువాసనే వాసన! నేను పెరిగింది పల్లెటూర్ కాకపోయినా మా నాయనగారు బోటనీ మేష్టారు కావడంతో మా తోట కూడా చాలా బాగుండేది.
ఇలాంటి జ్ఞాపకాలు ఇక ముందు ముందు ఫొటోలు లేదా సినిమాల కే పరిమితమయ్యేలా వుంది
mari akada ala undi kashtalu pade daani kante enchakka india ki vachheyyochuga, ikada karivepakulu baga dorukutayiga :) karivepakula kosamane india ki rammani cheppadam ledule ;)
Post a Comment