మొన్న మా పెరటి కబుర్లు కొన్ని చెప్పాను కదా.. మరి.. అన్నింటిలో.. నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే.. మా గాబు పక్కనే ఉండే ఎర్ర జాంకాయ చెట్టు. అబ్బా.. ఇప్పుడు గుర్తొచ్చినా.. ఎంత బావుంటుందో ఆ అనుభూతి..! కానీ.. అదిప్పుడు లేదులెండి.. నేను డిగ్రీకి వచ్చాకనుకుంటా.. నేలలో సారం దిగిపోడం వల్లనో, మరేదో కారణంగా.. కాయలన్నీ బాగా చిన్న చిన్నగా కాయడం.. గడ్డుల్లాగా మారడం మొదలుపెట్టాయి. అదీ కాక ఆ స్థలంలో చెట్టు ఉండకూడదని ఏ పనికిమాలిన వాళ్ళో చెప్తే.. అది కొట్టేసారు :( నేను హాస్టల్ నుంచి ఇంటికెళ్ళి చూసాక నాకు భలే ఒళ్ళు మండిపోయింది.. మా నాన్నతో అన్నాను కూడా.. ఏమైనా.. కొట్టేసింది తిరిగి రాదుగా :( అప్పటి జ్ఞాపకాలు కొన్నింటిని చెప్తాను వినండి మరి..!
ఆ జాం చెట్టుకి చిన్న చిన్న కాయలే కాసేవి. అంటే.. మన బజారులో దొరికేవాటిలాగా పెద్దగా ఉండవన్నమాట.. పెద్ద సున్నుండ సైజులో ఉండేవి :) మా నాన్న పొద్దున్నే బ్రష్ చేసుకుంటూ.. చెట్టుని ఓ సారి పరీక్షించి.. దోరగా ఉన్న కాయల్ని కోసిపెట్టేవారు. మా తమ్ముడు చిన్నప్పటి నుండీ హాస్టల్ అవడం వల్ల.. ఇలాంటి విషయాల్లో నాకు కాంపిటీషన్ ఉండేది కాదు. కానీ.. వాడు సెలవల్లో వచ్చినప్పుడు మాత్రం.. కాయలు కోసారంటే.. రెండు కొయ్యాల్సిందే.. పూర్తిగా పండినా పండక పోయినా :)పండినవి మాత్రం ఎంత బావుండేవో.. లోపల పింక్ గా.. మ్మ్.. గుర్తొస్తే.. ఉన్నపళంగా ఇప్పుడొక జాం కాయ తినాలనిపిస్తుంది. కానీ.. కుదరదుగా..ఇక్కడ దొరకవు :(
ఇంకా జాంచెట్టు మీద బోలెడు ఆటలాడే వాళ్ళం. ఆ చెట్టు మరీ అంత పెద్దది కాకపోవడం వల్ల, బలమైన కొమ్మలు లేకపోవడం వల్ల మా అమ్మ వాళ్లు మమ్మల్ని ఆ చెట్టు ఎక్కనిచ్చేవాళ్ళు కాదు. అయితే మధ్యాహ్నం పూట మా అమ్మమ్మ పురాణ కాలక్షేపానికి వాళ్ళ భక్తి సంఘం స్నేహితురాళ్ళ (మా తమ్ముడు పెట్టిన పేరు) దగ్గరికి వెళ్ళేది. మా అమ్మ కాసేపు పడుకునేది. ఇంక చూడండి.. మాకు అప్పుడు స్వాతంత్ర్యం వచ్చేసినట్టే..! మా అమ్మ పడుకునే దాకా ఏ టీవీనో చూస్తున్నట్లు నటించి.. ఆవిడకి అలా కన్నంటుకోగానే.. పిల్లుల్లాగా ఇంటి తలుపు మెల్లగా దగ్గరికి వేసి ఉరుక్కుంటూ వెళ్లి జామ చెట్టు ఎక్కేవాళ్ళం. ఒక కొమ్మ కాస్త పెద్దదిగా ఎత్తు మీద ఉండేది. దాని మీద కూర్చునే వాళ్ళు రాజు గారన్న మాట. ఇంకాస్త కింద ఉండే చిన్న కొమ్మ మీద కూర్చునే వాళ్లు మంత్రి అన్న మాట. నేనూ, మా తమ్ముడూ ఇద్దరం మార్చి మార్చి రాజు మంత్రి సింహాసనాల్లో కూర్చునే వాళ్ళం జాం చెట్టు మీద :) ఆ చెప్పండి రాజు గారూ.. ఆ చెప్పండి మంత్రి గారూ.. అనుకుంటూ ఏవేవో మాట్లాడుకునే వాళ్ళం. అవన్నీ సరిగ్గా గుర్తు లేవు ఇప్పుడు :(
ఇక పోతే ఆ కొమ్మల మీద కూర్చుని చేసే విశిష్టమైన పని మరోటి ఉంది. అదేంటంటే 'జామాకు పాన్' తయారు చేసుకుని తినడం. అన్నట్టు.. మీరెప్పుడైనా తిన్నారా మరి?? చెప్తాను చూడండి. లేత జామ ఆకు ఒకటి తీసుకుని.. దాని మధ్యలో కాస్త చింత పండుకి ఉప్పు అద్ది పెట్టి.. ఆకుని మడిచి నోట్లో పెట్టుకుని గబ గబా తినెయ్యడమే :) జామ ఆకు వగరు, ఉప్పు, చింత పులుపు కలిసి అదొక రకమైన రుచి వస్తుంది. జీలకర్ర, చింతపండు, ఉప్పు తింటామే పుల్లకి పెట్టుకుని.. కాస్త ఆ టైపులో అన్నమాట..! కానీ.. ఇంట్లోంచి చింతపండు తెచ్చుకోడానికి కాస్త కష్టపడే వాళ్ళం. ఎందుకంటే.. అమ్మ చూస్తే ఊరుకోదు.. అలా అంతంత చింతపండు తింటే మంచిది కాదు.. కడుపు చెడిపోతుంది అంటుంది. కానీ.. అవన్నీ వినం కదా మనం.. అందుకని మా అమ్మ పడుకోగానే మా ఇంటి మధ్య గదిలో ఒక పెద్ద అల్యూమినియం క్యానులో ఉండే చింతపండుని కాస్త దొంగతనం చేసేసి ఒక ప్లేట్లో ఉప్పు, చింతపండు పెట్టేసుకుని వచ్చి జాం చెట్టు ఎక్కేవాళ్ళం. అప్పట్లో ఇప్పట్లాగా ఒకటి రెండు కేజీలు చింతపండు కొనుక్కోడం కాదు. మా పొలం దొడ్డిలో ఉన్న చింత చెట్ల నుంచి బోలెడు చింతపండు వచ్చేది అంతా తీసి పెద్ద క్యానుల్లో పెట్టేవారు. ఇంక వచ్చే ఏడు దాకా అదే..! కాబట్టి.. అంత పెద్ద క్యానులోంచి కాస్త తీసినా ఎంత తీసామో వెంటనే తెలిసేది కాదు ఇంట్లో వాళ్ళకి :) అంతే కాదు ఆ చింతపండులోంచి వచ్చే బోలెడు చింత పిక్కలేమో నా ఆటకి అన్నమాట :) మేము అలా తినేవాళ్ళమని తరువాత మా అమ్మకి తెలిసేది గానీ.. వద్దంటుందని చూడనప్పుడు చేసేవాళ్ళం ఇలాంటి పనులన్నీ. మొత్తానికి అమ్మ లేచేదాకానో, అమ్మమ్మ పురాణ కాలక్షేపం నుంచి వచ్చేదాకానో జాం చెట్టు మీద ఊగుతూనే ఉండేవాళ్ళం. అదన్న మాట..మా జాంచెట్టు కథ.
మీకూ మీ చిన్నప్పటి గాధలు బోలెడు గుర్తొచ్చి ఉంటాయి కదా..! ఆ జ్ఞాపకాల్లో కాసేపు విహరించండి రండి మరి..
మళ్లీ కలుద్దాం..
ప్రేమతో..
మధుర వాణి