Wednesday, April 21, 2010

వీడుకోలు జ్ఞాపకాలు

వీడుకోలు.. ఎవరు ఎవరికి సందర్భంలో చెప్పినా, చెప్పే వారికీ అందుకునే వారికీ కూడా మనసు భారమౌతుంది. సాధారణంగా యీ వీడుకోలు సన్నివేశాలు జీవితంలో ఎప్పటికీ గుర్తుంటాయనుకుంటా!

మొట్టమొదటి వీడుకోలు నన్ను చిన్నప్పుడు స్కూల్లో దించేప్పుడనుకుంటాను. అప్పుడు నేనెలా ఫీలయ్యానో నాకు గుర్తు లేదు గానీ, ఇప్పటికీ మా అమ్మమ్మ నా స్కూలు రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడూ. ప్రతి రోజూ స్కూలుకెళ్ళేప్పుడు 'నువ్వు కూడా వస్తావా రావా స్కూల్ దాకా' అని తెగ మారాం చేసేదాన్న . తీరా మా అమ్మమ్మ నన్ను తీసుకుని బయలుదేరి స్కూలున్న వీధి మొగ దాకా వచ్చేసరికి 'ఇంక నువ్వెళ్ళిపో.. స్కూల్ దాకా రావద్దు. నేనొక్కదాన్నే వెళ్తా!' అని అల్లరి పెట్టేదాన్న. బహుశా.. స్కూల్లో అందరూ అమ్మమ్మని తోడు తీస్కొచ్చుకున్నావ్ అని నవ్వుతారనేమో! ఇంట్లో ఉండి స్కూలుకెళ్ళడం మూలాన స్కూలు రోజులన్నీ హాయిగా ఆడుతూ పాడుతూ దొర్లిపోయాయి. పదో తరగతికి బాబాయి వాళ్ళింట్లో ఉండి చదువుకున్నాకాబట్టి ఎంచక్కా ఇద్దరు తమ్ముళ్ళతో ఆడుకుంటూ మరింత సరదాగా గడిచిపోయింది ఏడు కూడా.

ఇహ కాలేజీ చదువులకొచ్చేసరికి మొదలయ్యాయి అసలు తిప్పలు నాకూ, ఇంట్లోవాళ్ళకీ కూడా! సరే, ఎలాగయితేనేం ఆరేడు గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఊర్లో హాస్టల్లో చేర్పించారు నన్ను ఇంటర్మీడియేట్ చదువు కోసం. ప్రైవేటు కాలేజీల్లో సీటు కోసం ముందు ప్రవేశ పరీక్ష లాంటి హడావిడి కూడా ఉండటం చేత రెండు మూడు సార్లు అటూ ఇటూ తిరగాల్సి వచ్చింది. నాకేమో అంత దూరం ప్రయాణాలు అలవాటు లేకపోవడం మూలానా, బస్సు పడకపోవడం మూలానా ఆరేడు గంటలూ కూడా నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని తీస్కెళ్ళాల్సి వచ్చేది నాన్నకి. నాకోసం నాన్న పడ్డ శతకోటి కష్టాల్లో ఇదొకటన్నమాట!

సరే, ఏమయితేనేం కాలేజీలో నాకు సీటు రావడం, హాస్టల్లో చేర్పించడం జరిగింది. ఎందుకైనా మంచిదని రెండ్రోజులు అక్కడే మా పెదనాన్న వాళ్ళింట్లో ఉండిపోయారు మా నాన్న. మొదటి రోజు కాలేజీకి వెళ్ళొచ్చాక సాయంత్రం పూట నన్ను చూడ్డానికొచ్చారు నాన్న. ఆయన్ని చూసీ చూడగానీ, ముందస్తు హెచ్చరికలు లేని తుఫానులాగా నా ఏడుపు మొదలయింది. ఎంతోసేపు బతిమాలీ బామాలీ ధైర్యం చెప్పేసరికి నేను కాస్త శాంతించి ఏడుపుకి మధ్య మధ్యలో కాసేపు బ్రేక్ ఇచ్చి నా కాలేజీ, హాస్టల్ కష్టా లిస్టు చెప్పాను. అందులో ముఖ్యమైంది తెలుగు మీడియంలో చదివిన నాకు ఇప్పుడు కొత్తగా ఇంగ్లీషు మీడియం వల్ల వచ్చిన ఇబ్బందులు. అప్పటిదాకా క్లాసులోనైనా, స్కూల్లోనైనా అందరికన్నా ముందుండి అందరి మేష్టార్ల అభిమానాన్ని చూరగొన్న నేను ఇప్పుడేదో బాగా వెనకబడిపోయినట్టు నా బాధన్నమాట! మా నాన్న చాలాసేపు నాకు బోలెడన్ని మోటివేషన్ స్టోరీలు గట్రా చెప్పి, అసలు ఇంకో వారమాగితే 'ఓస్ ఇంతేనా! ఇంగ్లీషు మీడియం అంటే ఏమీ లేదు నాన్నా.. చాలా సులువు' అని నువ్వే నాకు చెప్తావు. నీ సామర్థ్యం నీకు తెలీదు, నువ్వు ఖచ్చితంగా చేయగలవు, అదీ ఇదీ.. అని బోలెడంత ధైర్యం చెప్పారు. ఇంకా, వేరే పెద్ద పెద్ద లెక్చరర్ల దగ్గరికి తీస్కెళ్ళి మాట్లాడించారు. వాళ్ళందరూ నీలాగా తెలుగులో చదువుకున్నోళ్ళే ఇప్పుడీ స్థాయికొచ్చారు, నువ్వైనా అంతే భవిష్యత్తులో అని బాగా ధైర్యం నూరిపోసారు. ఎలాగయితేనేం మళ్ళీ మళ్ళీ అన్నీ జాగ్రత్తలు చెప్పి హాస్టల్లో వదిలి పెదనాన్న ఇంటికి వెళ్ళిపోయారు నాన్న.

నాన్న అందించిన ధైర్యంతో, ఏడ్చీ ఏడ్చీ అలసిపోయి ఉండటంతో రాత్రి నేను హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయాను. కానీ పాపం మా నాన్నకి మాత్రం నిద్ర పట్టలేదట ఎంత రాత్రైనా. 'నా బంగారు తల్లి ఇంకా ఏడుస్తున్నదేమో ఒక్కతే హాస్టల్లో' అని చాలా గాభరా వచ్చేసిందట. ఇహ అట్టే నిద్ర పట్టకపోవడంతో నా మీద బెంగ ఎక్కువైపోయి అర్ధరాత్రి దాటాక పెదనాన్న బండి తీసుకుని ఉన్నపళంగా మా హాస్టల్ దగ్గరికొచ్చారట. సమయంలో నన్ను చూసే వీలుండదని తెలిసినా రాకుండా ఉండలేకపోయారట. హాస్టలు దగ్గరికొచ్చి ఊరికే బిల్డింగ్ ఎదుట కాసేపు నించుని చూసి మళ్ళీ వెనక్కి వెళ్లిపోయారట! తెల్లారి మళ్ళీ వచ్చినప్పుడు నేను కాస్త బానే మాట్లాడేసరికి క్రమం తప్పకుండా ఉత్తరాలు రాయమని చెప్పి పెద్ద కట్ట ఎన్వలప్పులు కొనిచ్చి మరీ ఊరెళ్ళారు. అప్పటికి ప్రహసనం ముగిసాక నేనింకో ఘనకార్యం చేసాను. రోజుల్లో నేనూ, మా నాన్నా కనీసం వారానికో ఉత్తరమైనా రాసుకునేవాళ్ళం. (ఇప్పుడవన్నీ ఎక్కడో పోయాయి :() ఓసారి నాకు బాగా ఇల్లు గుర్తొచ్చినప్పుడు నా బెంగంతా ఉత్తరంలో నింపేసి పంపించాను. నింపే కార్యక్రమంలో ఉత్తరమంతా కన్నీళ్ళతో తడిసిపోయింది కూడానూ! ఉత్తరం అందుకునే వేళకి నాన్నకి బాగా జ్వరంగా ఉందట. అయినా గానీ, అమ్మా, నాన్నా కలిసి వెంటనే బయలుదేరి బస్సులో ఖాళీ లేకపోతే రాత్రంతా నుంచుని మరీ వచ్చారు నన్ను చూడ్డానికి. మొత్తానికి ఎలాగోలా తిప్పలు పడి నాకు నచ్చచెప్పి, నాలో ధైర్యాన్ని నింపి, అవసరమైనవన్నీ అమర్చి, అన్నీ జాగ్రత్తలు చెప్పి ఇంటికెళ్ళి పోయారు.

మొత్తానికి, ఈ రెండు సంఘటనల నుంచీ నేను నేర్చుకున్న జీవిత పాఠం ఏంటయ్యా అంటే... అమ్మా నాన్న మనని ఎక్కడైనా కొత్త ప్రదేశంలో వదిలి వెళ్ళేప్పుడు మనకి బాధగా ఉన్నా సరే, వాళ్ళ ముందు ఓ పడీ పడీ ఏడవకూడదు. తరవాత మనం బానే ఉన్నా గానీ, వాళ్ళు మాత్రం పదే పదే అది గుర్తు చేసుకుని బెంగ పడతారు మన గురించి. అలాగే, ఇంట్లో వాళ్లకి దూరంగా ఉన్నప్పుడు ఏదైనా బాధనిపించినా వెంటనే ఆ ఏడుపులోనే ఉత్తరాలు రాయడం, ఫోన్లు చేయడం గట్రా చేసి వాళ్ళని బెంబేలెత్తించకూడదు. కాస్త నిమ్మళించాక పరిస్థితి అదుపులోకి వచ్చాక మాత్రమే మాట్లాడాలి అని. బహుశా, అప్పటి నుంచే అనుకుంటా! 'నా గురించిన బాధ్యత నేనే తీసుకోవాలి. నాకు ఎదురయ్యే చిన్నా చితకా సమస్యలని నేనే ఎదుర్కొని పరిష్కారం కనుక్కోవాలి' అంటూ ఆలోచించే వ్యక్తిత్వం పెంపొందించుకోవడం మొదలయింది.

అమ్మా నాన్నా పాపం ఇన్ని ఇబ్బందులు పడి చదివించినా ఇంటర్ రెండేళ్ళు, తరవాత మెడిసిన్ కోసం మరో ఏడాది వెలగబెట్టిన లాంగ్ టర్మ్ కోచింగు అయ్యేసరికి ఈ విధంగా నేను పెట్టిన నానా హింసకి అమ్మానాన్న పేషంట్లయ్యే పరిస్థితి వచ్చింది కానీ నాకు మాత్రం డాక్టరు సీటు రాలేదు. ఆ తొక్కలో సీటు రానందుకు (ఇప్పుడలా ఫీల్ అవుతున్నాలెండి! ;-) ఇంక జీవితంలో చేయడానికేం మిగల్లేదన్నట్టు అస్త్రసన్యాసం చేసిన విలుకాడిలా మొహం పెట్టి శూన్యం లోకి చూస్తూ ఉండేదాన్ని ఆ రోజుల్లో. సీటు రానందుకు నాతో పాటు వాళ్ళూ బాధపడినా 'నా భవిష్యత్తేంటి? తక్షణ కర్తవ్యమ్ ఏంటి?' అని నాకోసం వాళ్ళే బాగా ఆలోచించి, వాళ్ళే మంచి కాలేజీ, మంచి గ్రూప్ సెలెక్ట్ చేసి డిగ్రీ కాలేజీలో చేర్పించారు.

ఇప్పుడిక్కడ మలుపేంటంటే, ఆ కాలేజీ కూడా దూరపు ఊర్లోనే కాబట్టి.. మళ్ళీ నేను హాస్టల్లో చేరాలన్నమాట! ఆ వీడుకోలు కబుర్లు, నే వెలగబెట్టిన ఘనకార్యాలు.. మరోసారెప్పుడైనా!

Tuesday, April 20, 2010

చినుకై వరదై సెలయేటి తరగై..

'చినుకై వరదై సెలయేటి తరగై' అనే ఈ పాట మృదుమధురంగా, హాయిగా సెలయేటి సంగీతంలా సాగిపోయే ఒక యుగళగీతం. ఈ సంవత్సరం వచ్చిన పాటల్లో ఎన్నదగిన ఈ పాట సాయికిరణ్ అడివి దర్శకత్వం వహించిన 'విలేజ్ లో వినాయకుడు' అనే సినిమాలోది. 'అవకాయ్ బిర్యాని' ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయిన మణికాంత్ కద్రి సంగీత సారథ్యంలో హరిహరన్, శ్వేతా మోహన్ ఆలపించారు ఈ పాట. గాయని శ్వేతా మోహన్ కి ఇది తెలుగులో మొదటి పాట. అంతే కాదు.. నా చెలి రోజావే, పరువం వానగా (రోజా), పువ్వుల్లో దాగున్న (జీన్స్), ఓ వానా పడితే (మెరుపు కలలు) వంటి చక్కటి పాటలతో మనకి చిరపరిచితమైన గాయని సుజాత గారి కూతురే ఈ శ్వేతా మోహన్. ఈ పాట వింటుంటే సంగీతపు బాణీ, వనమాలి గారు రాసిన సాహిత్యం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టు అనిపిస్తాయి. ప్రేమ భావన ఎంతమంది జంటల్లో చూసినా, ఎంత మంది కవుల కలం నుండి జాలువారినా మళ్ళీ మళ్ళీ కొత్తగానే కనిపిస్తుంటుంది, అలాగే దేనికదే ప్రత్యేకమనిపిస్తుంది. అలాంటిదే మరోటి ఈ పాట. సున్నితమైన భావాల్ని చాలా సరళమైన పదాల్లో కూర్చారు రచయిత వనమాలి. మొత్తంగా చెప్పాలంటే.. వీనుల విందైన సంగీతం, అందమైన సాహిత్యం, మనసుకి హాయనిపించే సుమధుర గాత్రం..వెరసి ఈ మెలోడీ..!


యీ పాట రికార్డింగ్ గురించిన ఒక ఆసక్తికరమైన సంగతి ఒకటి ఏదో పేపర్లో చదివాను. అదేంటంటే, యీ సినిమా యూనిట్ వాళ్ళు యీ పాటని మొదట శ్వేతా మోహన్ చేత పాడించి రికార్డ్ చేశాక, ఎందుకో మళ్ళీ కాస్త ఆలోచించి 'శ్రేయా ఘోషల్' తో పాడించుదామనుకున్నారట. అందుకని ముంబాయి నుంచి శ్రేయాని పిలిపించారట. తనకి ఓసారి శ్వేతా పాడిన పాట వినిపించి ఇదే మళ్ళీ మీరు పాడాలి అన్నారట. దానికి శ్రేయా 'పాట చాలా బాగా వచ్చింది. తెలుగులో మొదటి పాటే అయినా కూడా శ్వేతా బాగా పాడింది. నేను పాడినా మళ్ళీ తనని అనుకరించడమే తప్ప, గొప్పగా మెరుగుపరచగలిగేది ఏమీ ఉండదని నాకనిపిస్తోంది. మీరు యీ పాటనే వాడేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం' అని సలహా ఇచ్చిందట. ఎన్నోసార్లు జాతీయ అవార్డు సైతం గెలుచుకుని ఇవాళ దేశంలో కెల్లా నంబర్ వన్ గా ఉన్న ఓ గాయని అంత సహృదయంతో స్పందించడం అక్కడున్న వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందట. పనిగట్టుకుని ముంబై నుంచి ఆ రికార్డింగ్ కోసమే వచ్చినందుకు తన పాటేదో తను పాడేసి, తనకొచ్చే డబ్బులు తీసుకుని వెళ్లిపోవచ్చు. కానీ, శ్రేయా అలా చేయలేదట! ఏమైనా.. శ్రేయా ఘోషల్ ది తియ్యటి స్వరంతో పాటు, అందమైన మనసు కదూ!



యీ పాట సాహిత్యం ఇస్తున్నా..ఓసారి చూడండి. యీ పాట మీకు కావాలంటే ఇక్కడ చూడండి.


చినుకై వరదై సెలయేటి తరగై..
ఉరికే మదిని కడలల్లె కరిగించి కలిపేసుకున్నావు..!

వరమై వలపై అనుకోని మలుపై..
కలలే చూపే కనుపాప తెర మీద తొలి వేకువైనావు..!


తీసే ప్రతి శ్వాస.. నీ తలపౌతున్నది..
రేగే ప్రతి ఆశ.. నువు కావాలన్నది..

నా నీడ నను వీడి నిను చేరుకున్నది..
నా నీడ నను వీడి నిను చేరుకున్నది..


చినుకై వరదై సెలయేటి తరగై..

తడి లేని నీరున్నదేమో..
సడి లేని ఎద ఉన్నదేమో..
నువు లేక నేనున్న క్షణమున్నదా..!


నాలోని ఏనాటి చెలిమో..
నిను చేరి మనిషైనదేమో..
ఈ వేళ నిను వదిలి రానన్నదా..!
ఏ రూపమూ లేని ఆకాశమే నీవు..
నా నీలి వర్ణాలు నిను వీడి పోలేవు..!
ఏ బంధమూ లేని ఆనందమే నీవు..
తోడు వచ్చి నాకిపుడు.. తొలి బంధువైనావు..!
ఆకాశమే నీతో అడుగేయమన్నది..

ఆకాశమే నీతో అడుగేయమన్నది..


చినుకై వరదై సెలయేటి తరగై..

మన వలపు కథ విన్నదేమో..
ఆ కలల కబురందెనేమో..
ప్రతి ఋతువు మధుమాసమవుతున్నదీ..!


పసితనపు లోగిళ్ళలోకి..
నీ మనసు నను లాగెనేమో..
నా వేలు నిను వీడనంటున్నదీ..!
ఆరారు కాలాలు.. హరివిల్లు విరియనీ..
ఆ నింగి తారల్లె.. మన ప్రేమ నిలవనీ..!
ఈ మనసు కొలువైన.. తొలి చోటే నీదని..
నా కలలు నిజమవ్వగా..ఆ విధినైనా గెలవనీ..!

లోకాలు కనలేని తొలి జంట మనదనీ..

లోకాలు కనలేని తొలి జంట మనదనీ..


చినుకై వరదై సెలయేటి తరగై..

వరమై వలపై అనుకోని మలుపై..