'అమ్మ' - ప్రపంచంలోని ప్రతీ మనిషీ ఒక్కో రకంగా నిర్వచనం చెప్పే పదం. 'అమ్మ' అనే పదం ఒకటే అయినా అమ్మ గురించి చెప్పమంటే.. ఒక్కొక్కరి తలపుల్లో ఒక్కో భావం పలుకుతుంది. అమ్మ గురించి ఎంతమంది ఎన్నిరకాలుగా ఎన్నికబుర్లు చెప్పినా చెప్పేవారికీ, వినేవారికీ కూడా తనివి తీరదు. అసలు అమ్మ లేకపోతే సృష్టే లేదు కదా.! మరి అలాంటి మాతృమూర్తులందరికీ వందనాలర్పించేందుకు ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించడం సబబే అనిపిస్తుంది. ఏ రోజైనా అమ్మ అమ్మే.. కానీ, అమ్మ పేరుతో ఒక పండుగలాగా ప్రపంచం అంతటా ఒకే రోజు జరుపుకోవడం కూడా సరదాగా బానే ఉంటుంది కదా..! ఏమంటారూ..? సరే మరి.. ఈ శుభ సందర్భంలో మా అమ్మను గురించి కాసిన్ని కబుర్లు మీతో పంచుకుంటాను ఈ వేళ.
అసలు మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చేదే అమ్మ కదా..! మా అమ్మ మాత్రం నేను ఈ ప్రపంచంలోకి రాకముందు నుంచే.. నా కోసం ఎన్నో కష్టాలు పడింది. అదెలాగో చెప్తాను చూడండి. అప్పుడెప్పుడో 'అనగనగా' కాలంలో మా అమ్మకి పధ్నాలుగేళ్ళప్పుడు మా నాన్నతో పెళ్లి జరిగిందట. తరవాతా యథావిధిగా అందరిలాగానే వీళ్ళకి కూడా చిట్టి పాపాయిలు పుడతారని ఎదురుచూసేవాళ్ళట. అప్పుడేమో.. అమ్మా వాళ్లు ఉండేది కరెంటు కూడా లేని ఒక మారు మూల పల్లెటూరిలో. ఆ ఊరి నుంచి వేరే ఊరికెళ్ళాలంటే బండి కట్టుకుని ఒక పెద్ద వాగు దాటి మరీ వెళ్ళాల్సిన పరిస్థితి. అప్పట్లో ఇంక్యుబేటర్లు గట్రా లాంటి సదుపాయాలు పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఉండేవట. అలాంటి పరిస్థితుల్లో అమ్మకి మొదటిసారి నెలలు పూర్తిగా నిండకుండానే ఒక బాబు పుట్టి ఒక పూట కూడా గడవకముందే చనిపోయాట్ట. అమ్మా, నాన్న ఎలాగో దుఃఖం దిగమింగుకుని మళ్ళీ పాపాయి కోసం ఎదురుచూడసాగారట. దురదృష్టవశాత్తూ రెండోసారీ, మూడవసారీ కూడా ఒక పాప, ఒక బాబు పుట్టి అలాగే పోయారట. ఇంక ఆ పరిస్థితుల్లో అమ్మానాన్న మనోవేదన వర్ణనాతీతంగా ఉండేదట. అమ్మకి చాలా చిన్న వయసవడం మూలాన ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిని చాలా నీరసించిపోయిందట. ఆ సమయంలో నాన్నేమో 'మనకి పిల్లలు లేకపోయినా పర్లేదులే కానీ ప్రతీ సారి ఇన్ని నెలలు ఎదురు చూసి కళ్ళ ముందే పసికూనలు పోవడం.. ఈ నరకయాతన మనకొద్దు' అనేవారట. అప్పటి సమాజ పరిస్థితుల దృష్ట్యా, మా నాన్న వాళ్ల పెద్ద కుటుంబం దృష్ట్యా, పిల్లలు లేరని అమ్మా, నాన్న వాళ్లు ఎన్నో మాటలు పడాల్సి వచ్చేదట. నాన్నకి కూడా పద్దెనిమిదేళ్ళకే పెళ్లవడం మూలాన పాపం చిన్నతనం కూడానూ ఇద్దరికీ. ఇవన్నీ కాకుండా, నాన్నమ్మ వాళ్లు మా నాన్నకి మరో పెళ్లి చేస్తారేమోనని కూడా చాలా భయంగా ఉండేదట అమ్మకి. ఏది ఏమైనప్పటికీ, డాక్టరు దగ్గరికి వెళితే ఆరోగ్యపరంగా అపాయకరమైన పరిస్థితే అని తేల్చి చెప్పారట. అమ్మ పట్టుబట్టడంతో డాక్టరు మొత్తం తొమ్మిది నెలలు అసలు కదలకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పిందట. ఈ లోపు అమ్మ, అమ్మమ్మ కలిసి అందరు దేవుళ్ళకూ మొక్కులు, ముడుపులూ లాంటివి కట్టేసి, పిల్లలు పుట్టడం కోసం ఎవరు ఏమి చేయమని చెప్పినా చేసేవారట. వరుసగా రెండు రోజులు ఖాళీ కడుపుతో ఉండి ఏదో పసరు పోయించుకుంటే ఫలితం ఉంటుందని ఎవరో చెప్తే చాలా దూరం ప్రయాణించి ఆ ఊరెళ్ళొచ్చారట. సరే, ఏదయితేనేం.. చివరికి వాళ్ల మొర ఆలకించి దేవుడు ఒకానొక శుభ ముహూర్తంలో నన్ను ప్రసాదించాడు ;)
నేను పుట్టగానే పెద్దగా సంతోషపడకపోగా విపరీతమైన ఆందోళన పడ్డారట అందరూ. ఎందుకంటే, ఇదివరకు పుట్టిన పిల్లలు వెంటనే పోయారు కదా పాపం, ఇంకా ఆ భయం వెంటాడుతూ ఉండేదన్నమాట. ఎప్పుడూ ఎవరో ఒకరు తెల్లవార్లూ మేలుకుని నన్ను చూస్తూనే ఉండేవారట. రాత్రింబవళ్ళు ఆంజనేయ స్వామి పూజలో ఉంచిన దీపారాధన ఆరకుండా చూసేవారట. ఒక ఐదారు నెలలు వచ్చేదాకా ఇదే తంతు. కాసేపు ఎక్కువ నిద్రపోయినా, కాసేపు కదలపోయినా, నిద్ర పోకపోయినా.. ఈ రకంగా ప్రతీ చిన్న విషయానికీ ఊర్లో ఉన్న డాక్టరు దగ్గరికి పరిగెత్తుకెళ్ళేవాళ్ళట. మొత్తానికి కొంతకాలానికి అమ్మ వాళ్లు ఈ రకమైన భయంలోంచి బయటపడి నన్ను చూసుకుని ఆనందంగా ఉండసాగారు. కాస్త పెరిగానో లేదో.. సరిగ్గా అప్పుడే నేనొక పెద్ద ఆగడం చేశాను.
అప్పటికి నా అంతట నేను కాస్త నడవగలిగి, కూర్చోగలిగే వయసు. తెల్లవారు ఝామునే అమ్మ లేచి ఇంట్లో కిరసనాయిలు దీపం వెలిగించి ఇంటి వెనక్కెళ్ళి పెరట్లో గిన్నెల కడుగుతోందట. కాస్త తెల్లవారినా ఇంట్లో చీకటిగా ఉండటంతో దీపం పెట్టి వెళ్లిందట. ఇంతలో నేను లేచి వెళ్లి ఆ దీపం దగ్గర కూర్చున్నా. అప్పట్లో అదొక చిన్న పూరిల్లు. కాబట్టి తిరగడానికి పెద్ద ఎక్కువ స్థలమేమి ఉండేది కాదు. ఊరికే కూర్చుని చూడచ్చు కదా.. అలా ఉంటే అది నేనెలా అవుతాను మరి ;) అక్కడ కాల్చేసిన అగ్గి పుల్లలేవో ఉంటే వాటిని దీపం మంటలో పెట్టి ఆడుతున్నాను. ఆ ఆటలో ఎలాగో మంట అంటుకున్న పుల్ల ఒకటి వచ్చి వళ్ళో పడింది గౌను మీద. కాటన్ గౌను అవడం చేత వెంటనే అంటుకుంది. అప్పుడు భయంతో గట్టిగా ఏడవడం మొదలెట్టాను. పెరట్లో ఉన్న అమ్మేమో.. ఏంటబ్బా పిల్ల లేవడమే కాకుండా ఒకేసారి అంత గట్టిగా ఏడుస్తుంది అని గభాల్న ఇంట్లోకి వచ్చి చూసి ఒక్క క్షణం స్థాణువయిపోయిందట. చీకటిగా ఉన్న గదిలో దీపం పక్కన నేను, నా వళ్ళో పెద్ద మంటలు.. ఒక్క క్షణం ఏమీ అర్ధం కాకపోయినా మరుక్షణంలోనే నా దగ్గరికొచ్చి రెండు చేతుల్తో మొత్తం మంట ఆర్పేసిందట. అది ఎంత పెద్ద మంటంటే.. అమ్మ అరచేతులు రెండూ కాలి బొబ్బలెక్కిపోయాయట. ఆ తరవాతేముంది ఇంక.. సినిమాలో చూపించినట్టు పెద్ద పెద్ద కట్లేస్కుని కొన్ని రోజులు తిరగాల్సి వచ్చింది నేను. సమయానికి ఎవరూ లేకపోయినా గానీ, మా అమ్మ విస్తుపోయి చూడకుండా, వెనువెంటనే అంత ధైర్యం చేసింది కాబట్టే.. ఇవ్వాళ నేను ఇంకా ఈ భూమ్మీద ఉన్నాను. మరీ చిన్నప్పుడు కావడం చేతా, అమ్మ వెంటనే ఆర్పేయడం చేతా కొన్ని చిన్న మచ్చలతో బయటపడిపోయాను. మరోసారి కూడా వంటింటి గట్టు మీద ఉన్న వేడి పాల గిన్నెను లాగానట, సరాసరి వేడి పాలొచ్చి మొహం మీద పడ్డాయట. మొత్తానికి నా కోసం ఎన్నో పాట్లు పడింది. ఎన్నో బాధలకోర్చి ఈ ప్రపంచంలోకి నన్ను తీసుకురావడమే కాక.. అనుక్షణం నాకు రక్షగా ఉంటూ నన్ను ఇంతదాన్ని చేసింది మా అమ్మ.
అసలు అమ్మ ప్రేమ ఎంత పిచ్చిదో మా అమ్మను చూస్తే తెలుస్తుంది. చిన్నప్పట్నుంచీ నన్నెప్పుడూ కొట్టలేదట మా అమ్మ. కానీ, బాగా మూడు నాలుగేళ్ళ వయసప్పుడు నేను పెరట్లోకెళ్ళి మట్టి తీసుకుని తినేదాన్నట. ఎన్ని సార్లు చెప్పినా వినేదాన్ని కాదట. అప్పుడప్పుడూ మా తమ్ముడిని కూడా తీస్కెళ్ళి, వాడు ఇష్టపడకపోయినా మట్టి తినడం నేర్పించే ప్రయత్నం చేసేదాన్నట :) అప్పుడిక లాభం లేదని చేతుల మీద చిన్నగా రెండు దెబ్బలేసేదట అమ్మ. నేనేమన్నా తక్కువదాన్నా మరి.. దెబ్బలకి ఏడ్చి కళ్లు తడి ఆరకముందే మళ్ళీ వెళ్ళేదాన్నట మట్టి కోసం :) సరే.. అప్పుడెప్పుడో అలా జరిగిపోయింది కదా.. ఇప్పుడు ఇరవై ఏళ్ళ పైనే అయింది కదా.! అయితే మా అమ్మ ఏమంటుందంటే, ఇప్పటికీ మధ్యాహ్నం పూట అప్పుడప్పుడూ ఒంటరిగా కూర్చున్నప్పుడు అవన్నీ గుర్తొస్తాయట. ఊరికే గుర్తు రావడం కాకుండా, అయ్యో నేనెంత పాపిష్టిదాన్ని.. చిట్టి తల్లిని పట్టుకుని అలా కొట్టాను అప్పుడు అని ఇప్పుడు ఏడుపొచ్చేస్తుందట. ఎంత పిచ్చి ప్రేమ నా మీద. ఇప్పటికీ అమ్మ అలా చెప్పిన సంగతి గుర్తొస్తే నాకు కళ్లు చెమరుస్తాయి. ఈ ప్రపంచంలో, ఈ జన్మకి ఇంతకన్నా విలువైనది ఉంటుందా అనిపిస్తూంటుంది నాకు. అమ్మ అంటే అమ్మే.. మరిక దేనితోనూ పోల్చలేము, సరితూచలేము. మా అమ్మ ఎంత సాత్వికమంటే.. ఎవరు కోప్పడ్డా గానీ, అరిచినా గానీ, గొడవకొచ్చినా గానీ, తనని బాధ పెట్టినా గానీ, ఎవరినీ పల్లెత్తు మాట కూడా అనదు ఎప్పుడూ. నిజంగా భూదేవంత ఓపిక మా అమ్మకి. అసలు నాకేమనిపిస్తుందంటే.. అమ్మ నన్ను చూసుకున్నదానిలో ఒక శాతం నేను భవిష్యత్తులో నాకు పుట్టబోయే బిడ్డకి చేయగలిగితే చాలు.. ఒక తల్లిగా నా జీవితానికి సార్థకత్వం వస్తుంది. అంత మాత్రం చేయగలిగినంతనే నేను నిజంగా ఒక అత్యుత్తమ తల్లిని కాగలననిపిస్తుంది. అలాంటి నా బంగారు తల్లికి వందనాలు, నమస్కారాలు, అభినందనలు, కృతజ్ఞతలు ఏది చెప్పినా.. చిన్నదే అవుతుంది. కానీ, ఆకాశమంత దేవుడికి ఆకాశమంత పత్రితో పూజ చేయలేము కదా..! కాబట్టి, నా చిట్టి చేతులతోనే మా అమ్మకి జేజేలు.. అభినందన మందారమాలలు.!