Monday, September 26, 2011

మౌనమే నా భాష!


నేనే నీ ప్రపంచమని మురిపించిన రోజున బదులు పలకడానికి మాటలు దొరక్క మౌనంగా నీకేసి చూస్తుండిపోయాను..
నన్ను మించిన మరో ప్రపంచం కావాలనుకుని దూరమైపోతున్న ఈ రోజున కూడా బదులు తోచక మౌనాన్నే ఆశ్రయిస్తున్నాను..
నా కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క జారితేనే విలవిలలాడిపోయినప్పుడు ఎలా స్పందించాలో తెలీక మౌనంగా నిలిచిపోయాను..
నా పంచప్రాణాలు కన్నీళ్ళలో కొట్టుకుపోయేలా విలపిస్తున్న నన్ను భావరహితంగా చూస్తుండిపోతున్న ఈ క్షణానా మౌనమే శరణ్యమయ్యింది..
నీ కళ్ళల్లో మెరిసిన అమాయకత్వాన్ని, స్వచ్ఛమైన ప్రేమని చూసిన రోజున మాటలు కరువై మౌనపు జల్లుల్లో తడిసిపోయాను..
నీ కళ్ళల్లో నిండిపోయిన నిర్లక్ష్యాన్ని, నిరాదరణని, లెక్కలేనితనాన్ని చూస్తున్న ఈ క్షణాన మాటలు పెగలక మూగబోతున్నాను..
కుసుమ కోమలమైన పూరెమ్మనంటూ నాలోని సున్నితత్వాన్ని అపురూపంగా తలచి లాలించిన ఆ రోజున మౌనంగా నవ్వాను..
హృదయాన్ని కఠిన పాషాణంలా మార్చుకుని శిలాపుష్పంలా మారి బతకమని శాసిస్తున్న ఈ క్షణాన మౌనంగా రోదిస్తున్నాను..
అప్పుడూ ఇప్పుడూ మౌనమే నా భాషయ్యింది... కానీ భావంలో ఎంతటి అగాథాల దూరమో కదూ!

12 comments:

  1. ఎలా వుందో చెప్పడానికి భాష కరువయ్యి౦ది. గుండె గొంతుకలోన కోట్లాడుతున్నాది.

    ReplyDelete
  2. అప్పుడూ ఇప్పుడూ మౌనమే నా భాషయ్యింది... కానీ భావంలో ఎంతటి అగాథాల దూరమో కదూ!

    i have never seen expressing the dichotomy like this before.
    really fentasitc.

    కాముధ

    ReplyDelete
  3. ఇంత భాద నిజంగా ఎవ్వరికి రాకుడదు...

    ReplyDelete
  4. మీ మనసులోని బావాన్ని అద్బుతంగా అక్షరాలుగా మలిచారు. చాలా చాలా బాగుందండి.

    ReplyDelete
  5. మౌనానిని రెండు భాషలు. ఒకటి వేదన, మరొకటి ఆనందం.

    __నీ కళ్ళల్లో నిండిపోయిన నిర్లక్ష్యాన్ని, నిరాదరణని, లెక్కలేనితనాన్ని చూస్తున్న ఈ క్షణాన మాటలు పెగలక మూగబోతున్నాను..__

    Superb.

    ReplyDelete
  6. చాలా బావుంది మధురా

    ReplyDelete
  7. మౌనంలో కూడా ఎన్నెన్నీ భావాలో...చాలా బావుందండీ!

    ReplyDelete
  8. మౌనం గా విజిల్స్...

    ReplyDelete
  9. @ జ్యోతిర్మయి,
    నా అక్షరాలు మీకంత అనుభూతి కలిగించినందుకు సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు. :)

    @ వేణూరాం, మాలా కుమార్, కాముధ, రఘు, అవినేని భాస్కర్, వంశీ కిషోర్, లతా, చిన్ని ఆశ..
    అభినందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. :)

    @ రాజ్,
    :)

    @ కిరణ్,
    నీ విజిల్స్ వినిపించాయ్ కిరణ్.. థాంక్యూ!

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!