Friday, November 21, 2008

సుమతీ శతకం పద్యం 17

హాయ్ హాయ్..
నమస్కారం. వేళ మరో సుమతీ పద్యం మన మధుర వాణిలో..!

ఒల్లనిసతి నొల్లనిపతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ!
తాత్పర్యం: తన్ను ప్రేమించని భార్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు.

పైన చూసారుగా..! స్నేహమైనా, ప్రేమైనా, చివరికి ఉద్యోగం చేయాల్సిన చోట కూడా ఇరువైపులా నుండి పరస్పర అంగీకారం, ఇష్టం ఉండాలని పద్యంలో చెప్తున్నారు.

విషయాన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా.. ఇంకా మన చుట్టూ ఉన్న సమాజంలో బలవంతపు ప్రేమలు, పెళ్ళిళ్ళు, లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. మనిషికైనా ప్రతీ విషయంలో తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. రంగు డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, సినిమా చూడాలి, ఏమి తినాలి... ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతీ ఒక్క విషయంలో మనకి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. వీటిల్లో ఒక్క అభిరుచికి గానీ, అభిప్రాయానికీ గానీ కారణాలు అడిగితే మనమెవ్వరమూ సమాధానం చెప్పలేము. ఎందుకంటే మనిషి భావాలకు, మనసు స్పందనకు కారణాలు ఉండనవసరం లేదు.

యాధృచ్చికంగా దీనికి సంబంధించిందే రోజు పొద్దునే 'మధురవాణి' లో ఒక quotation పోస్ట్ చేశాను. మనలో ఏదయినా ఒక అలవాటుని గానీ, అభిరుచిని గానీ మన ఇష్టానికి వ్యతిరేకంగా మార్చుకోవాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. పెద్ద పెద్ద విషయాల దాక వెళ్లనవసరం లేదు కానీ.. పొద్దున్నే లేవడం, ఇష్టం లేని టిఫిన్ చేయడం.. ఇలాంటి చిన్న చిన్నవాటిని కూడా మార్చుకోవాలంటే మన తల ప్రాణం తోకకి వస్తుంది. కానీ.. మరి మనం వేరే వాళ్ళయితే మార్చుకోవాలని బాగా expect చేస్తాము. చాలా అసహనానికి గురవుతుంటాం కూడా.. వేరే ఎవరి దగ్గరో కాదు గానీ, ఇది ఎక్కువగా మన కుటుంబ సభ్యుల దగ్గర గానీ, స్నేహితుల దగ్గర గానీ చేస్తూ ఉంటాం. వాళ్లు ఒక విషయంలో మారట్లేదని విసుగు చెందేముందు ఒక్కసారి మన మార్పు గురించి ఆలోచిస్తే మనం వాళ్ళని వాళ్లుగానే సంతోషంగా స్వీకరిస్తాం. అసలు నిజమైన అభిమానం, ప్రేమ అంటే.. వారి సుగుణాలతో పాటు బలహీనతల్ని కూడా ప్రేమించడమే.

మరో సంగతి ఏంటంటే.. వాళ్ల అభిప్రాయం మనకి నచ్చనంత మాత్రాన అది తప్పని కాదు కదా..! కోణంలో మాత్రం ఎప్పుడూ ఆలోచించం అసలు. ఎందుకో ఒప్పుకోబుద్ది కాదు. కానీ.. దాన్ని మనం అధిగమించగలగాలి. అప్పుడే విసుగు, చిరాకులాంటివి మన దరిచేరవు. మనమేదో గొప్పగా కష్టపడిపోయి వాళ్ళని భరిస్తున్నట్టు చాలాసార్లు భావిస్తూ ఉంటాం కూడా..! ముందు అసలు భావం మనకి రాకుండా ఉండాలి. అప్పుడు మనకి regrets ఉండవు బంధంలోనైనా.. రోజు రోజుకీ మన సంతోషం నిల్వలు పెంచుకుంటూ పోవచ్చు.

అంచేత.. నేను చెప్పొచ్చేదేంటంటే.. అధ్యక్షా..! మనందరం మన మనసు గదుల్లో మనం ఇష్టపడేవారితో పాటు వారి ఆసక్తులకీ, అనాసక్తులకీ, అభిప్రాయాలకీ, కోరికలకీ, ఇష్టాలకీ, అయిష్టాలకీ, భావాలకీ, ప్రేమకీ, బలహీనతలకీ, కోపతాపాలకీ, విసుగుకీ, చిరాకుకీ... అన్నీటికీ చోటుని పంచుదాం..! ఒకేసారి మహాత్ములం అయిపోలేం కానీ.. కనీసం ప్రయత్నిద్దాం.. ఏదో ఒక రోజు పూర్తిగా ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకోగలమనే గమ్యం వైపు..!

ప్రేమతో...
మధుర వాణి

5 comments:

  1. Elevated thinking..
    I am already your fan....
    Enlightened lady there!!!

    ReplyDelete
  2. @ coolvivek,

    Thanks! that's so nice of you!:-)

    ReplyDelete
  3. :) బాగుంది.
    నాకు ఒల్ల...గొల్ల... ఈ రెండు పదాలతో పద్యం అల్లిన తీరు నచ్చింది..పద్యం కంటే :))
    అయితే, సుమతీ శతక కాలానికే ప్రేమ గుడ్డిది, వెర్రిది అని తీర్మానించేసుకున్నారు అనమాట ;)

    ReplyDelete
  4. @ S,
    అంటే ప్రేమ గురించి అప్పుడైనా ఇప్పుడైనా అభిప్రాయం మారలేదంటే అది నిజమని మనం ఘట్టిగా నిర్ణయించుకోవాలన్నమాట.. :D

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!