Friday, June 14, 2013

కలవేనా!




మనసు తీరంలో తుంటరి చేపపిల్లల్లా ఎగిరెగిరి పడుతున్న తలపుల్లోంచి జారి తలగడ మీదకి చేరావు..
గాలి చప్పుళ్ళకి ఊయలూగుతున్న మేపిల్ ఆకుల గుసగుసలతో కలిసి చెవిలో చేరి నువ్వేదో చెబుతుంటే ఊ కొడుతున్నాను..
కిటికీ సందుల్లోంచి దొంగతనంగా చొరబడుతున్న వెన్నెల తుంపరలు నీ చేతి స్పర్శలో కలిసి గారాబంగా జోకొడుతుంటే సోలిపోతున్నాను..
కనులారా నీ మోము చూడాలని ఎంతగా అనుకున్నా నిదురలో జోగుతున్న కనురెప్పల తలుపులు తెరుచుకోనంటున్నాయి..
రజాయి వెచ్చదనంలో మరింతగా కూరుకుపోతూ నీకోసం సాచిన చేతిని ఖాళీ వెక్కిరించేసరికి కలవరపడి కలలోంచి జారి నిజంలోకొచ్చిపడ్డాను..
తెలి మంచు రాతిరి కౌగిలో తొలి సంధ్య పొద్దు గిలిగింతో తేల్చుకోలేని అయోమయంలో నీ జాడ లేని గదంతా ఘనీభవించిన ఏకాంతం వింతగా తోచింది..
కలలో విచ్చుకున్న కలువ నవ్వు వియోగపు వెలుతురు సోకి పెదవంచు నుంచి ఒలికి నిశబ్దంగా నేలజారింది!

12 comments:

  1. ఆకుల గుసగుసలు ,వెన్నెల తుంపరలు ,మత్తుమగత,కనురెప్పల తలుపులు,వియోగపు వెలుతురు ....అన్నీ ఇవన్నీ కవితావస్తువులే!మధురవాణీయం బంగరువీణియ కొనగోట మీటినట్లుంది!

    ReplyDelete
  2. ’కల’వేనా? ’కలవే’నా కలవు, ఇలలో కలలో

    ReplyDelete
  3. బావుందండీ !కవిత్వంతో పెద్దగా పరిచయం లేని నాకు సులభంగా అర్థమైంది . చాలా నాజూకుగా ఉందని అనిపించింది .

    ReplyDelete
  4. బావుందండీ !కవిత్వంతో పెద్దగా పరిచయం లేని నాకు సులభంగా అర్థమైంది . చాలా నాజూకుగా ఉందని అనిపించింది .

    ReplyDelete
  5. మీ పదాల కూర్పు చాలా అద్భుతంగా ఉంటుంది.
    ఈ మధ్య కౌముది వ్యాసాలతో మీ బ్లాగ్ లో మీరెక్కువగా రాయటం లేదు, కదూ!
    ఈ పోస్ట్ కి మంచి బొమ్మా పెట్టనేలేదు. అందుకే ఏదో లోపం లా అనిపించింది చూస్తుంటే. మరేం అనుకోకండి.
    మీరు మరిన్ని అందమైన ఊసులు తరచూ రాస్తుండాలని ఆశిస్తూ...

    ReplyDelete
  6. ​@ surya prakash apkari,
    మీ అభినందనకి ధన్యవాదాలండీ..

    @ కష్టేఫలే,
    భలే చెప్పారే శర్మ గారు! ధన్యవాదాలండీ.. ​:​)

    @ ​నాగరాణి గారూ,
    నాక్కూడా కవిత్వంతో పెద్ద పరిచయం లేదండీ. ;-)
    నేను రాసింది మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ.

    ReplyDelete
  7. ​@ ​చిన్నిఆశ, ​
    ఈ ​మధ్య రకరకాల కారణాల వల్ల తీరిగ్గా కూర్చుని ఏదన్నా రాసుకునే వీలే చిక్కడం లేదండీ. కౌముది వ్యాసాల వల్ల రాయకపోవడం కాదు కానీ అవి రాయాలన్న కమిట్మెంట్ ఉంది కాబట్టి ఎంత హడావుడిలోనైనా రాయక తప్పడం లేదంతే! ;-)
    ఈ పోస్ట్ కూడా హడావుడిగా రాసేసి పోస్ట్ చేసానండీ. అప్పుడు బొమ్మ వెతికి పెట్టేంత టైం లేదు. తర్వాత వెతికి పెట్టాను చూడండి. నాక్కూడా బొమ్మ లేకపోతే వెలితిగానే అనిపిస్తుంటుంది.
    మీ ఆప్యాయతాభిమానాలకి కృతజ్ఞురాలిని. ధన్యవాదాలు.

    @ ప్రేరణ,
    ధన్యవాదాలండీ..

    ReplyDelete
  8. హ హా...బొమ్మతో ఈ పోస్ట్ కి నిండుదనం వచ్చిందండీ!

    ReplyDelete
  9. @ చిన్ని ఆశ,
    Thank you! :-)

    ReplyDelete
  10. మీ యొక్క కవిత చిన్న చిన్న పదలతొ చాల చక్కగ వుంది ఇతువంతి పదల కూర్పు నా చిన్నప్పుదు చదవిన కొనంగి, హిమబిందు,నారయనరావు, ఆదవిబాపిరాజు నవలలొ కనిపించై

    ReplyDelete
  11. @ Kollabathula rajendra kumar,
    ​ధన్యవాదాలండీ.

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!