Tuesday, April 23, 2013

రెండు సరదా పాటలు


 మధ్య ఒక రెండు పాటలు తరచూ వినపడుతున్నాయి నేను వినే రేడియోలో. వినగా వినగా రొటీన్ కి భిన్నంగా ఇలాంటి పాటలు సృష్టించాలన్న ఆలోచన వచ్చిన డైరెక్టర్ క్రియేటివిటీకి ​బహు ముచ్చటేసింది. వివరాల్లోకి వెళ్తే ఈ రెండు పాటలకి కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ రెండు పాటల్నీ గాయకులు మనో, చిత్ర పాడగా, రెండీటికీ సాహిత్యాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అందించారు. తొంభైల్లో వచ్చిన ఈ పాటలు క్రియేటివిటీకి మారుపేరని చెప్పగలిగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపు దిద్దుకున్నవే! వర్మ, సిరివెన్నెల కలయికలో వచ్చిన పాటలన్నీ దాదాపు అన్నీ బాగుంటాయనిపిస్తుంది నాకు.

మొదటి పాట 1999 లో సుమంత్, అంత్రా మాలి జంటగా నటించిన 'ప్రేమకథ' సినిమాలో సందీప్ చౌతా స్వరపరచిన పాట. ప్రేమలో ఉన్న ఒక అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ కలిసి ఏ రోజు ఏ టైములో సినిమా ప్రోగ్ర్రాం పెట్టుకుందామని చర్చించుకునే సన్నివేశాన్ని పాటగా మలిచారు. సండే మొదలుకొని శనివారం దాకా ఏ పూట అయితే ఎవరికీ ఏం అడ్డంకులున్నాయో చెప్పుకుంటూ చివరికి క్రికెట్ మ్యాచ్ పుణ్యమా అని అమ్మాయి అబ్బాయి మీద అలిగి వెళ్ళిపోవడంతో పాట ముగుస్తుంది. ఈ సినిమా గానీ, పాట వీడియో గానీ నేనెప్పుడూ చూడలేదు కానీ పాట వినడానికి మాత్రం చాలా సహజంగా నిజంగా బయట ఎలా మాట్లాడుకుంటామో అలాగే ఉంటుంది. పెద్ద పెద్ద పదాలేవీ వాడకుండా వాళ్ళ వయసుకి తగ్గట్టు సరదా సరదాగా భలే రాసారు సిరివెన్నెల గారు. చిత్ర గాత్రం ఎప్పట్లాగే ముద్దుగా ఉన్నా ఈ పాటలు మనో గారితో పాడించడం వల్ల ఒక కొత్త ఫీల్ వచ్చిందనిపించింది నాకు. పాట సాహిత్యం చూడండి.
సండే మండే వదిలెయ్.. నేను బిజీ మై రోజీ..
ట్యూస్ డే ఫిల్మ్ ప్రోగ్రాం ఈ రోజే ఫిక్స్ చేద్దాం..
ట్యూస్డే వెరీ సారీ.. హాలిడే డాడీకి..
వెన్స్ డే కి మన ప్రోగ్రాం.. మారిస్తే నో ప్రాబ్లం..

నాకు వీలైనదే నీకు జైలైనదే..
నాకు వీలెప్పుడో నీకు పనులప్పుడే..
అయితే మరేం చేద్దాం.. నీతో మహాకష్టం..
రానన్నానా బుధవారం.. కాదన్నానా నీ ఇష్టం..

ధర్స్ డే మార్నింగ్ ఓకే కదా..
పొద్దున ఇంట్లో పనుండదా..
ఆ రోజు ఈవినింగ్ బాగుండదా..
బాబా గుడికి వెళ్ళాలి కదా..
మర్నాడు ఐనా సరే..
మనకా రోజు చుక్కెదురే..
మరి ఏం కొంప మునిగిందట?
ఆ రోజు రాఖీ కదా..
ఐతే మరేం చేద్దాం.. నీతో మహా కష్టం..
రానన్నానా బుధవారం..

శనివారం నీకు హాఫ్ డే కదా.. 
సగం రోజుతో ఏం సరదా..
ఆదివారమంతా మనదే కదా..
నో ఛాన్స్ ముందే చెప్పా కదా.. 
ఏం ఉద్ధరిస్తావట.. 
చెబితే అదో తంటా.. 
ఏం పాడు సీక్రెట్టదీ..
క్రికెట్టుమ్యాచ్ వుంది.. 
క్రికెట్ నే లవ్ చేసుకో.. నీ ముఖాన్ని చూడనుపో..
నూరేళ్ళ లవ్ అనుకో.. వన్ డే ఇస్తే ఏం రిస్కో​.. 
​​
​​ఈ పాట ఇక్కడ వినొచ్చు.


మరొక పాట 1994 లో జె.డి. చక్రవర్తి, ఊర్మిళ జంటగా నటించిన 'అనగనగా ఒక రోజు' సినిమాలో శ్రీ సంగీత సారథ్యం వహించిన పాట. పైన చెప్పిన పాట కన్నా కూడా  పాట అప్పట్లో కుర్రకారుని ఒక ఊపు ఊపేసిందనుకుంటా. ఇది కూడా ప్రేమికులిద్దరి మధ్యన వచ్చే డ్యూయెట్. డ్యూయెట్ అనడం కన్నా ఇద్దరూ పోట్లాడుకునే పాట అనాలేమో. మామూలు సంభాషణలోని మాటలనే పాటగా మలిచారు సిరివెన్నెల గారు. కోపం, అలక, నిష్టూరం అన్నీ కలగలిపి చిత్ర గారు భలే పాడారు.

అమ్మాయిల మనస్తత్వాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో అనిపిస్తుంది సిరివెన్నెల గారి పాటలు కొన్ని విన్నప్పుడల్లా. వినడానికి సరదాగా ఉన్నా కొంచెం గమనిస్తే గమ్మత్తైన విషయం ఒకటుంది ఈ పాటలో. అబ్బాయి కోసం ఎదురు చూసీ చూసీ కోపమొచ్చిన అమ్మాయి అతగాడు రాగానే విరుచుకుపడుతుంది. ఆలస్యంగా వచ్చిన తప్పు తనదే కాబట్టి అబ్బాయి బతిమాలడటం మొదలెడతాడు. కానీ అమ్మాయి అలక ఎంతకీ తీరకపోగా అబ్బాయికి విసుగొచ్చి తనే తిరిగి కోప్పడే పరిస్థితి వస్తుంది. ఇంకప్పుడు తప్పక అమ్మాయి మళ్ళీ అబ్బాయిని బతిమాలుకుంటుంది. సాధారణంగా చాలా సందర్భాల్లో అచ్చం ఇలానే జరుగుతుంటుంది. బతిమాలుతున్నంతసేపు ఇంకా బెట్టు చెయ్యాలనిపిస్తుంది అమ్మాయిలకి. ఆ మురిపెం కాస్తా ముదిరి అబ్బాయికి ఓపిక నశించేదాకా దాకా వస్తుంది. ఇంకేముంది.. ఎప్పట్లాగే అమ్మాయిలే మళ్ళీ దిగొచ్చి ఎదురు బతిమాలుకోవాలి. :-) నిజానికి అసలు వాస్తవం ఏంటంటే అబ్బాయిలకి సరిగ్గా బతిమాలడం రాదు కాబట్టి ఈ తిప్పలన్నీ.. :D
ఈ పాట సాహిత్యం చూడండి.

ఏమ్మా కోపమా​..
లేదు చాలా సంతోషం​.​​.
లేటయ్యిందనా​..​
యే ​ఛీ నాతో మాట్లాడకు..​
మా ఫ్రెండు చెల్లెల్ని కొందరేడిపించారు.. ​
​​వీడెళ్ళి​​ వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు.. ​
​ఆ విలన్ గ్యాంగు వచ్చి మావాణ్ని కొట్టబోతే
చేశాను పెద్ద ఫైటు..​ కాబట్టి ఇంత లేటు..​

​​
ఓ చెలీ క్షమించమన్నానుగా​..​
నీకిది ఇవాళ కొత్త కాదుగా..​ 
అయ్యబాబోయ్.. ఎంత వేడి.. ఏం చేస్తే చల్లారుతుందది.. 
​​పోపోవోయ్ చాలు గాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది​.. ​
సరేలే..​ ​టుమారో ఇలా​ లేటు చెయ్యనింక ఒట్టు.. ​
​​ఓ చెలీ క్షమించమన్నానుగా..

నీకిది ఇవాళ కొత్తకాదుగా..

స్టోరీ చెప్పవద్దు.. బోరే కొట్టవద్దు.. వదిలేసేయ్ నన్నిలా..
సారీ చెప్పలేదా.. ఫైరింగ్ ఆపరాదా.. ఫైటింగ్ ఎంతసేపిలా..
నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు..
వచ్చేశాను కదా ఇంకా బాదుడెందుకు..
ఏమి చేసినా అహో అని మెచ్చుకోమనా మహాశయా..
చిన్న తప్పుకే మరీ ఇలా దుంప తెంచితే ఎలాగట..
పూటకో సాకుతో ఆడుకోవద్దు నాతో..
నీతో లవ్వంటే మరీ కత్తి మీద సాము కాదా..
ఓ చెలీ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్తకాదుగా..

నీకూ నాకు మధ్య వేరే మాట లేదా టాపిక్ మార్చవెందుకు..
స్విచ్చే వేసినట్టు మూడేం మారిపోదు వెయిట్ చెయ్యి మంచి మూడుకు..
దొరికే కాస్త టైము ఆర్గ్యుమెంటుతోనే సరా..
ఆ తెలివే ఉంటే ముందే రాకూడదా..
కలుసుకున్నది డిబేటుకా.. ప్రేమ అన్నది రివెంజుకా..
ఎంతసేపని భరించను.. ఛస్తున్నదే నా ఓపిక..
టెంపరే మారదే లెంపలే వేసుకున్నా..
ఓకే అనేస్తే ఎలా.... లోకువేగా నీకు ఇంక..

ఓ డియర్ క్షమించమన్నానుగా..
నీకిది ఇవాళ కొత్త కాదుగా..
అయ్యబాబోయ్.. ఎంత వేడి.. ఏం చేస్తే చల్లారుతుందది..
పోపోమ్మా చాలు గాని ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది..
సరేలే టుమారో ఇలా బెట్టు చెయ్యనింక ఒట్టు..
ఓ డియర్ క్షమించమన్నానుగా....


5 comments:

  1. modati paata sariga gurtuledu kaani, rendo paata naaku kooda chaala istamaina paatandi, asalu start to end lekunda entha chakkaga maatalni allero sirivennela gaaru.. ee paata choosthe paata raayadam intha suluvaa anipinchela untundi.

    ReplyDelete
  2. రెండు పాటలలోని వచన సారాంశం, నేటి జంటల తంటాలను క్రోడికరించినది. నిజానికి అభిప్రాయ బేధాలతో రావాలసిన మనస్పర్ధలు ఇలా చిన్న విషయాలలో చిలికి చిలికి గాలి వానగా మారి పలికితే పలకని అగాధాల లోయలలో పడిపోతున్నారు. వయసుకు పదును పెట్టవలసిన యువ జంటలు ఉబిసిపొణి విషయాలలో బిగదీసుకుని కూర్చుంటున్నారు. విరహ గీతాలలోని లాలిత్యం ఈ తరహా గీతాలలో కనబడనిది ఔన్నత్యం. ఒకవిధంగా పైత్యం.

    ReplyDelete
  3. ఈరెండు పాటలూ బావున్నాయ్. నెనర్లు.

    ReplyDelete
  4. @ sharma, N.V. SIVA RAMA KRISHNA, Anonymous, బాల..
    Thank you all for your response.

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!