Thursday, November 22, 2012

గారాల చిలక - వరాల గోరింక

"ఇంకెంతసేపు ఈ మౌనం.. ఆట్టే సమయం వృథా చెయ్యకుండా విషయమేంటో చెప్పొచ్చుగా.."
"నేనిక్కడ ఇంత బాధపడుతుంటే నీకు సమయం వృథా అవుతోందనిపిస్తుందా?"
"ఉహూ.. బాధని వీలైనంత త్వరగా సాగనంపాలే తప్ప మనతోనే ఉంచుకుని పెంచి పోషించకూడదు అంటున్నా.. చూడు నా చిన్నారి చిలకమ్మ మోము ఎలా చిన్నబోయిందో.."
"వద్దు వద్దు.. నువ్వేం నా కన్నీరు తుడవక్కర్లేదు.. అక్కడే ఉండు.."
"నన్ను దగ్గరికి రానివ్వవూ?"
"ఉహూ.. రానివ్వను.. అడ్డదారుల్లో సంధి ప్రయత్నాలు చేసే గోరింక గడుసుదనానికి ఇవాళ చెల్లు.. అక్కడే నించో.."
"అబ్బో.. నాకే లక్ష్మణ రేఖ గీసావే.. ఇదంతా కోపమే.. నీకే.. నా మీదే.. ఇది కలా నిజమా?"
"కల లాంటి నిజం.. ఆట్టే వాదాలెందుకు మనకింక.. పో నువ్వు.. అంతే!"
"పోపొమ్మంటే రారమ్మనే కదూ.."
"కానే కాదు.. ఇక నీకూ నాకూ జత కుదరదు అని.."
"మనిద్దరి కంటే కుదురైన జత ఈ లోకంలోనే లేదు తెలుసా.."
"ఆహా.. చాల్లే బడాయి.. నాకు బోల్డు కోపంగా ఉంది నీ మీద.."
"ఎందుకో చెబుదూ.. క్షణంలో నీ కోపాన్ని కాస్తా తాపంగా మార్చేస్తానుగా.."
"ఆ ఆ.. మా గొప్ప పొగరుబోతువి కదూ.. నువ్వు తలచుకుంటే ఏమైనా చెయ్యగలవని ధీమా కాబోలు! ఈసారి మాత్రం ఇదంత తేలిగ్గా కరిగే కోపం కాదు.. ఖోపం.."
"ఈ అందాల చిలక మనసు పారేసుకుంది కూడా ఆ పొగరు చూసే కదూ.. అందుకే నాకంత ధీమా.. ఇంతకీ అంత కోపం.. అదే అదే ఖోపం ఎందుకో చెప్పావు కాదేం!"
"ఎందుకా.. ఒకటా రెండా.. ఎన్నని చెప్పను నీ ఆగడాలు.. నీ హింస నే పడలేకున్నాను.. నన్నొదిలి వెళ్ళిపో.. పో పో పో.."
"సరే అలాగే పోతాన్లే గానీ.. ఇంత కఠిన శిక్ష విధించే ముందు అసలు నా మీద మోపే అభియోగాలు ఏమిటో చెప్పాలోయ్.. అదే న్యాయం.."
"కారణాలన్నీ చెప్తే నిజంగా నన్నొదిలి వెళ్ళిపోతావా?"
"అరే.. ముందంతా శివంగిలా గర్జించావే.. ఇంతలోనే బేలతనమా?"
"నేనేం బేలను కాను.. నాకేం భయమా.. నువ్వు లేకపోతే
నేను ఉండలేన...నుకున్నావా యేం.."
"అరెరెరే.. చిలకమ్మ కన్నులు చూడు.. ఎర్రగా కందిపోయి పెదవుల రంగులోకి వచ్చేసాయే.. ఏదీ ఓ సారిలా నా కళ్ళలోకి చూడు.. మాట చెప్తాగా.."
"ఉహూ.. నేనేం చూడను.. విన్నూ.. నువ్వు నన్ను మాయ చేస్తావు.."
"ఊ.. మాయ మంత్రం వేసి నీ దిగులుని, బెంగని మాయం చేస్తాను అమ్మడూ.."
"ఎప్పుడూ నీ కోసం ఎదురు చూపుల్లో కరిగి నీరైపోయేలా చేస్తావు.."
"నీ చెంత చేరిన క్షణంలో బిగి కౌగిట్లో కరిగించి ఆ నిరీక్షణ అంతా మరిపించి మురిపిస్తానుగా బంగారూ.."
"నన్ను చాలా ఏడిపిస్తావు.."
"అంతకంతా నవ్విస్తానుగా చిన్నారీ.."
"కలనైనా నా చేతికి చిక్కక తప్పించుకుపోయి నన్ను ఏకాంతంలో పడదోస్తావు.."
"ఇప్పుడు నిలువెత్తు నిజమై నీ కళ్ళెదుట ఉండగా ఇంకా కలల ఊసెందుకు పొన్నారీ.."
"నిన్నసలు ఎవ్వరూ భరించలేరు.. నాకొద్దు పో.."
"కదా.. అందుకే మరి.. నువ్వే కాదంటే నన్నేమైపోమన్నావ్ చిట్టీ.."
"నువ్వొట్టి అబద్ధాల పోగువి.."
"నా చిలకమ్మే నమ్మకపోతే నే చెప్పే అందమైన అబద్ధాలు నమ్మేదెవరు చెప్పు.."
"చాల్లే సంబరం.. :-)
అయినా నా కంటే ముఖ్యమైన రాచకార్యాలు ఏవిటోయ్ నీకసలు?"
"ఊ.. అది తప్పే.. ఏ శిక్ష వేసినా సరి.."
"నే వేసే శిక్షల మీద నీకసలు బొత్తిగా భయం లేకుండా పోయింది కదూ.."
"ఊ.. ఉహుహూ.."
"ఓ మాట అడగనా.. నిజంగా నా మీద ప్రేముందా నీకు? నిజ్జంగా నిజం చెప్పవూ.."
"ఈ కనిపించే చెట్లూ పుట్టలూ, రాళ్ళూ రప్పల మీద ప్రమాణం చేసి మరీ మూడువేల ముప్పై మూడోసారి చెప్తున్నా.. నిజంగా నిజ్జంగా నీ మీద బోల్డు ప్రేముంది. నన్ను నమ్మవూ.."
"ఊ.. ఈసారికి నమ్ముతున్నాలే.. మళ్ళీ నన్నొదిలి వెళ్ళవు కదూ.. నన్ను ఏడిపించవు కదూ?"
"ఉహూ.. వెళ్ళినా వెంటనే రెక్కలు కట్టుకు వచ్చి నీ ముందు
వాలిపోతాను.. కాస్తో కూస్తో ఏడిపించినా మళ్ళీ నవ్వించే పూచీ నాదే.. సరేనా!"
"ఊ.. మరేమో.. అప్పటినుంచీ నే చెప్పినవన్నీ పెదవి చివర నుంచీ వచ్చిన మాటలే.. నిజంగా మనసులోంచి వచ్చినవి కాదు తెలుసా.."
"ఊ.. తెలుసు.. నేను కూడా అప్పటి నుంచీ చెప్పిన మాటలన్నీ అలా దొర్లినవేగా మరి.."
"నిజమా... అసలు నిన్నూ ఊ ఊ... అందుకే మరి.. నిన్ను పట్టుకు తన్నాలనిపించేది.. నాకొద్దు పో నువ్వు.."
"హహ్హహ్హా... ఇందుకే మరి.. నాక్కూడా నీ చేతిలో తన్నులు తినాలనిపించేది.. :-)"




** నాకు చాలా చాలా నచ్చే ఓ పాట..
ఎందాకా ఎగిరేవమ్మా గోరింక..



12 comments:

  1. ఈసారి మాత్రం ఇదంత తేలిగ్గా కరిగే కోపం కాదు.. ఖోపం.."

    హ హ.. బావుందందీ.. ఖోపం :-)

    ReplyDelete
  2. చిలకమ్మ అలుకలు..గోరింక పలుకులు..
    భలేగా ఉన్నాయి..మధుర గారూ..
    ఇంత బాగా ఎలా రాస్తారో...:)

    ReplyDelete
  3. బాగున్నాయ్ గారాలూ...వరాలూ...
    ముచ్చటైన జంట అలకలూ...పలుకులూ...
    చివర ఇచ్చినపాట లింక్ తో చాలా రోజులకి మళ్ళీ మంచి పాట గుర్తుచేయటమే కాక వినిపించారు...

    ReplyDelete
  4. Hehe bagunay alakalu :P chilakamma ;)

    ReplyDelete
  5. "ఊ.. మరేమో.. అప్పటినుంచీ నే చెప్పినవన్నీ పెదవి చివర నుంచీ వచ్చిన మాటలే.. నిజంగా మనసులోంచి వచ్చినవి కాదు తెలుసా.."
    "ఊ.. తెలుసు.. నేను కూడా అప్పటి నుంచీ చెప్పిన మాటలన్నీ అలా దొర్లినవేగా మరి.."

    ........ ఎంత నవ్వొచ్చిందో.. చిలుకమ్మ, గోరింకల చిలిపి తగాదాలు, అల్లర్లు.. ఆ అందమైన జంటలా భలే ముద్దుగా, స్వీట్‌గా ఉన్నాయి మధురా.... :)

    ReplyDelete
  6. బాగున్నాయి మీ చిలిపి తగాదాల ఊసులు.

    ReplyDelete
  7. బాగుందండి.చిలకా-గోరింకల అలకలు..గారాలు..కబుర్లు.

    ReplyDelete
  8. felt like the cool spring full moon breeze..! and ఖోపం :D good one..! :)

    ReplyDelete
  9. @ శ్రీకాంత్,
    ధన్యవాదాలండీ..

    @ ధాత్రి,
    ఎలా రాస్తానంటే మరి చిలకమ్మనో, గోరింకనో అడిగి చెప్పాలండీ.. ధన్యవాదాలు.. :))

    @ చిన్ని ఆశ,
    అయితే మీక్కూడా నచ్చే పాటా ఇది.. సంతోషం.. ధన్యవాదాలండీ..

    @ ఇందు,
    నన్నే చిలకమ్మ అంటావా.. హన్నా.. :D
    థాంక్స్ డియర్!

    @ శోభ,
    మిమ్మల్ని అంత నవ్వించినందుకు సంతోషంగా ఉందండీ.. ధన్యవాదాలు. :)

    ReplyDelete
  10. @ జీవన పయనం - అనికేత్, రాధిక (నాని),
    ధన్యవాదాలండీ..

    @ మంచు,
    :-)

    @ నాగార్జున,
    థాంక్యూ.. :)

    @ అనంత్,
    నే రాసింది మీకంత నచ్చినందుకు సంతోషంగా ఉందండీ.. ధన్యవాదాలు.. :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!