Thursday, July 19, 2012

మా నిజ్జం తమ్ముడు


మొన్నొక రోజు ఎక్కడో ఫోటో చూసి చాలాసేపు నవ్వుకున్నాను. వెంటనే మా తమ్ముడికి పంపాను మెయిల్లో. "భలే ఫోటో పంపావక్కా.." అంటూ వాడు కూడా ఒకటే నవ్వు. ఇంత నవ్వుకోడానికి కారణమైన మా చిన్నప్పటి జ్ఞాపకం ఒకటుంది. అదేంటో చెప్తానిప్పుడు.. శ్రద్ధగా వినెయ్యండి మరి.. :)

అప్పటికి మా తమ్ముడూ, నేనూ ఇద్దరం పదేళ్లలోపు పిల్లలమే. ఒక రోజు సాయంత్రం యథావిధిగా మా ఇంటి వెనకాలుండే పందిరి కింద మంచాల్లో కూర్చుని నేనూ, మా తమ్ముడూ మా కబుర్లు మేం చెప్పుకుంటూ అమ్మా, అమ్మమ్మా, నాన్న వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో కూడా మధ్య మధ్యలో ఆలకిస్తున్నాం. వాళ్ళు ఏదో ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఎవరికో పాపో బాబో పుట్టారని ఏదో మాట్లాడుకుంటున్నారు. అటు తిరిగీ ఇటు తిరిగీ చర్చ పిల్లలు పుట్టడం వైపు మళ్ళింది.
అప్పుడు నేను మా అమ్మని "అమ్మా.. మరి నేనెక్కడ పుట్టాను?" అనడిగితే "నువ్వు వేరే ఊర్లో మన పెదనాన్న వాళ్ళిల్లుంది కదా.. ఇంట్లో ఉత్తరం పక్క గది ఉంది చూసావా.. ఇప్పుడు అక్కా వాళ్ళు ఉంటున్నారే.. గదిలో పుట్టావు.." అని చెప్పింది. నేనలా అడిగాక ఇంక మా తమ్ముడు ఆగుతాడా.. వాడు కూడా మా అమ్మ ఒళ్ళో చేరి "అమ్మా అమ్మా.. మరి నేనెక్కడ పుట్టాను?" అనడిగాడు. "నువ్వు మన పక్కూర్లో ఉన్న గవర్నమెంటు ఆసుపత్రిలో పుట్టావు.." అని చెప్పింది. దానికి వాడు "అక్క ఇంట్లోనే పుడితే మరి నేనెందుకు ఇంట్లో పుట్టలేదు? ఆసుపత్రిలో ఎందుకు పుట్టాను" అనడిగితే నాన్న నవ్వుతూ "అక్కడైతే చాలామంది పిల్లలు పుడతారు. నువ్వు మా అబ్బాయివి కాదులే.. ఎవరో చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గర దొరికితే మేము తెచ్చుకుని పెంచుకుంటున్నాం.." అని చెప్పారు. అప్పుడు వాడు బిక్కమోహమేస్తే "అదేం కాదులేరా.. నాన్న సరదాగా అంటున్నారు. అప్పుడు ఒంట్లో బాలేదని ఆసుపత్రికి వెళ్ళాం అన్నమాట.. అందుకే నువ్వు అక్కడ పుట్టావు.." అని అమ్మ సర్ది చెప్పింది. రోజుతో సరదా సంభాషణ అయిపోయిందనుకుని పెద్దవాళ్ళందరూ మర్చిపోయారు. కానీ, మేమిద్దరం మాత్రం మర్చిపోలేదుగా! ;-)

చిన్నప్పుడు మా తమ్ముడికి ఒక గొప్ప అలవాటుండేది. ఏంటంటే ప్రతీ ఐదు నిమిషాలకోసారి ఏదో ఒక కారణానికి అలిగేసేవాడు. మా బావ వాళ్ళందరూ వీడి పేరు మార్చేసి అలుగు అని పెట్టాలని చెప్పి సరదాగా ఏడిపిస్తూ ఇవ్వాళ ఎన్ని సార్లు అలిగాడని లెక్క పెడుతుండేవారు. అలవాటుతో మేమిద్దరం ఆడుకునేప్పుడో, కబుర్లు చెప్పుకునేప్పుడో ఏదో ఒకదానికి అలిగేసేవాడు. అయితే, ఒకసారి మా ఇద్దరికీ ఆటలో గొడవొచ్చిందో తెలీదు గానీ ఇద్దరం తెగ కొట్టేసుకోడం మొదలెట్టాం. నీదే తప్పంటే నీదే తప్పని, నీ మీద అమ్మకి చెప్తా అంటే, నీ మీదే నాన్నకి చెప్తాననీ.. ఇద్దరం తిట్టుకుంటూ తిట్టుకుంటూ కాసేపటికి గిచ్చుకోడం, కొట్టుకోవడం దాకా వెళ్ళిపోయాం. చిన్నప్పటి నుంచీ మా ఇద్దరి పోట్లాటలు ఎలా ఉంటాయంటే, వాడేమో దెబ్బలేస్తాడు. నేనేమో మాటలతో కొట్టే రకాన్ననమాట. అలా గొడవలో అప్పుడు మా నాన్న సరదాగా అన్న మాట గుర్తొచ్చి "పోరా.. నువ్వసలు నా సొంత తమ్ముడివి కాదు. అప్పుడు రోజు నాన్న చెప్పలేదూ.. నువ్వు ఎవరో చేపలు పట్టుకునే వాళ్ళ అబ్బాయివి. పోన్లే కదా పాపం అని నిన్ను మా ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటున్నారు." అని తిట్టాను నేను వాడిని. "చీ చీ.. నువ్వు మరీ ఇంత దుర్మార్గురాలివా.." అన్నట్టు అలా క్రూరంగా చూడకండి నన్ను. ఏదో అక్క జులుం ప్రదర్శించడంలో భాగంగా అలా రెచ్చిపోయానన్నమాట కొంచెం.. హిహ్హిహ్హీ.. :)

ఇంక నేనలా అనేసరికి వాడు పోట్లాడటం ఆపేసి అలిగేసి ఇంట్లోంచి బయటికొచ్చి ఇంటి వెనకాల మెట్ల మీద కూర్చున్నాడు. అలగడం అంటే దూరంగా వెళ్ళి మౌనంగా కూర్చోడమే కదా మరి. అప్పుడు సాయంత్రం చీకటి పడే సమయం. అమ్మ వంటింట్లో పని పూర్తి చేసుకుని మేం స్నానాలు చేసేసి వస్తే ఇంక అన్నాలు పెడతానంటూ వచ్చింది. అమ్మ వచ్చేసరికి నేనేమో ఇంట్లో కూర్చుని దూరంగా బయట కూర్చున్న వాడికేసి చూస్తున్నా.. వాడు కూడా అక్కడ కూర్చుని అదే పని చేస్తున్నాడు. ఏంటసలు మీ గొడవ అని అడిగి తెలుసుకుని నన్ను కొంచెం కోప్పడి వాడిని బుజ్జగించి అలక పోగొట్టడానికి ప్రయత్నించింది. ఉహూ.. కుదరదు అన్నాడు వాడు. వాడి మంకు పట్టు అంత సామాన్యంగా వదిలేది కాదు కదా మరి! "నేను నాన్నొచ్చేదాకా ఇక్కడే బయటే ఉంటాను. అయినా నేను మీ సొంత అబ్బాయిని కాదు కదా.. ఇంట్లోకి రాను" అన్నాడు. :)

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మేం బాగా చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో పాడి కోసమనీ, చేలో పనుల కోసమని  జీతగాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంట్లో పనులన్నీ చేస్తూ, మనింట్లోనే ఉంటూ ఏడాదికి ఇంత జీతానికి అని పనికి కుదురుతారన్నమాట. అలాగ చిన్నప్పుడు గేదెల కోసమని ఒక పదిహేనేళ్ళ వయసున్న అబ్బాయి ఉండేవాడు మా ఇంట్లో. అందరూ బుడ్డోడు అని పిలిచేవాళ్ళు అబ్బాయిని. జీతానికి ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ కంచం వేరేగా పెట్టుకుని రోజూ అందులో అన్నం పెట్టించుకుని తింటారు. అందరూ తినేది అదే అన్నం గానీ వాళ్ళు మనింట్లో లోపల కాకుండా బయట వసారాలో భోజనం చేస్తారు. ఇప్పుడు మా తమ్ముడు అలిగాడు కదా మీ అబ్బాయిని కాను నేను అని.. అందుకని "నేనిక్కడే బయటే ఉంటాను. నాకో కంచం ఇస్తే ఇక్కడే బయటే అన్నం తినేసి, నా కంచం నేనే కడిగేసి అదిగో కిటికీలో పెట్టుకుంటాను. అదిగో, మంచం బయటే వేసుకుని పడుకుంటాను. ఇంట్లోకి రాను. రేపటి నుంచి స్కూలుకి కూడా వెళ్ళను. చేనికి వెళ్తాను.. ఇంట్లో పనులన్నీ చేస్తాను." రకంగా చిన్నప్పుడు బుడ్డోడు చేసే పనులన్నీ నేను చేస్తానంటూ పెద్ద లిస్టు చదివాడు. అమ్మ ఎంత బతిమాలినా ఇంట్లోకి రాలేదు. అందరం కలిసి నాన్న కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ప్రతీ రోజూ నాన్న స్కూటర్ శబ్దం వీధి మలుపులో వినిపించగానే ఆనందంగా ఒక్క గెంతులో గేటు దాకా పరిగెత్తుకెళ్ళే వాడు కాస్తా రోజు అలిగిన మొహంతోనే ఎదురెళ్ళాడు. నాన్న స్కూటర్ దిగీ దిగగానే "నేనేం మీ నిజం కొడుకుని కాదు కదా.. అక్క ఒక్కతే మీ సొంత కూతురు కదా.." అని మొత్తం వాడి ఆక్రోశమంతా వెళ్ళగక్కాడు. నాన్న వాడిని దగ్గరికి తీసుకుని అదంతా ఉట్టిదేనని చాలాసేపు ఓపిగ్గా వివరించి చెప్పి పన్లో పని నన్ను కూడా దగ్గరికి పిలిచి "పెద్దదానివయ్యుండీ నువ్విలా ఏడిపించొచ్చా తమ్ముడిని.. మన తమ్ముడు కదా.. ఎంత కొట్టుకుంటే మాత్రం అలా అనడం తప్పు కదా.." అని కాసేపు సుద్దులు చెప్పి ఇద్దరికీ కలిపి అన్నం తినిపించారు. వాడి అలకా, మా ఇద్దరి పోట్లాట రెండూ తీర్చేసి కథ సుఖాంతం చేసారు.
అదన్నమాట మా ఫ్లాష్ బ్యాక్ కథ.. అందుకని పైనున్న బొమ్మ చూసి మా ఇద్దరికీ అంత నవ్వొచ్చింది. :)

ఒరేయ్ తమ్ముడూ.. నిజ్జంగా నువ్వు మా సొంత తమ్ముడివేరా.. దొరికిన తమ్ముడివి అస్సలు కాదు.. బంగారు తమ్ముడివి. :)
నువ్వెప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వెయ్యేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. :)

35 comments:

  1. మధురవాణి గారు నిజం తమ్ముడికి పుట్టినరోజు దీవెనలు :-)

    ReplyDelete
  2. మీ నిజమైన తమ్ముడు కి పుట్టిన్ రోజు శుభాకాంక్షలు ... WISH YOU HAPPY BIRTHDAY TO BHARATH .... MANY MANY HAPPY RETURNS OF THE DAY DEAR BROTHER :))

    ReplyDelete
  3. మీ తమ్ముడికి జన్మదినశుభాకాంక్షలు :))

    ReplyDelete
  4. ఇప్పుడు మా తమ్ముడు అలిగాడు కదా మీ అబ్బాయిని కాను నేను అని.. అందుకని "నేనిక్కడే బయటే ఉంటాను. నాకో కంచం ఇస్తే ఇక్కడే బయటే అన్నం తినేసి, నా కంచం నేనే కడిగేసి అదిగో ఆ కిటికీలో పెట్టుకుంటాను. అదిగో, ఆ మంచం బయటే వేసుకుని పడుకుంటాను. ఇంట్లోకి రాను. రేపటి నుంచి స్కూలుకి కూడా వెళ్ళను. చేనికి వెళ్తాను.. ఇంట్లో పనులన్నీ చేస్తాను." ఈ రకంగా చిన్నప్పుడు ఆ బుడ్డోడు చేసే పనులన్నీ నేను చేస్తానంటూ పెద్ద లిస్టు చదివాడ>>>>>>>>>>>>>>>>> నేను చిన్నప్పుడు మా చెల్లిని చెవులపిల్లిని అనేదాన్నట ..... కాని అంతే విచిత్రంగా మా అన్నయ్య కూడా నన్ను చెవులపిల్లి అని పిలిచినప్పుడు షాక్ అయ్యా .... సరే మా ఫేమిలీ తరపున కూడా భరత్ కి పుట్టినరోజు దీవెనలు :-)

    ReplyDelete
  5. బాగుంది మీ మధుర జ్ఞాపకం మధురవాణి గారు! మీ తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

    ReplyDelete
  6. Hey Bro Happy birthday man. njoy D day. Have a blast

    ReplyDelete
  7. అబ్బబ్బా.. ఎక్కడికో తీసుకెళ్ళారు...
    చాలా బాగా రాసారు..
    మీ తమ్ముడికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు :)

    ReplyDelete
  8. "అంతే.. నిజ్జం తమ్ముడి కధ అయిపోయిందీ"
    అని కమెంట్ పెడదాం అనుకున్నాను.. పోస్టు మధ్య లో...
    క్యాన్సిల్.. క్యాన్సిల్...

    తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ;)

    ReplyDelete
  9. తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు...

    ReplyDelete
  10. తమ్ముడికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు :-)

    " నేనేమో మాటలతో కొట్టే రకాన్ననమాట..."
    నమ్మమంటావా!!? నాకైతే డౌటే! ;-)

    ReplyDelete
  11. అమ్మా మధురవాణీ,
    మీ పోస్టు చదవక ముందు ఆ బొమ్మని చూడగానే పొట్టచెక్కలయ్యేలా నవ్వొచ్చింది. ఇక చదివేక నవ్వలేక కడుపునొప్పి వస్తోంది. అందుకే Life is interesting than fiction అంటాను నేను. మీ తమ్ముడికి నా తరపున కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తుగా ఆశీస్సులు.

    ReplyDelete
  12. మీ తమ్ముడి కి జన్మదిన శుభాకాంక్షలు,
    మీ తమ్ముడు , ఇంటిబయటే కూర్చున్నాడు,
    మా అమ్మ మీలానే ఏదో అంటే నేను రైల్వేస్టేషన్ కి వెళ్లానంట.

    ReplyDelete
  13. మీ తమ్ముడికి పుట్టిన రోజు శుభకామనలు. ఎంత అందంగా ఉందండి ఆ అలక, దాన్ని మీ తల్లి తండ్రులు తీర్చిన విధం, మీ తమ్ముడిపై మీ అభిమానాన్ని మరింత పెంచింది. మంచి అనుభూతి పంచుకున్నారు.

    ReplyDelete
  14. Many Many Happy Returns Of The Dear Brother...

    Have A Wonderful Life Ahead... :)))

    Read Half....will read later :)

    ReplyDelete
  15. తమ్ముడికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  16. చిలిపి తగాదాలు,అలుకలు,కోపాలు..అన్నీ క్షణం లో మరిపించే రక్త సంబంధం .
    Blood is thicker than water !!
    మధుర వాణి గారు.. మీ అనుబందం.. చాలా బాగుంది
    తమ్ముడికి హృదయ పూర్వక శుభాకాంక్షలు .

    ReplyDelete
  17. మీ తమ్ముడి కి జన్మదిన శుభాకాంక్షలు .

    ReplyDelete
  18. ఆడపడుచు దీవెన , మీతమ్మునికి అష్తైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. శుభాకాంక్షలు

    ReplyDelete
  19. మీ తమ్ముడి కి జన్మదిన శుభాకాంక్షలు!!

    ReplyDelete
  20. మీ నిజ్జమయిన తమ్ముడికి నా నిజ్జమయిన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భలే ఉన్నాయండీ మీ చిలిపి తగాదాలు, అలకలు అన్నీను. ఇలాంటివన్నీ చూసినప్పుడు/చదివినప్పుడు నాకూ ఒక నిజం అన్నో, తమ్ముడో ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది.

    ReplyDelete
  21. అందరికీ మీ మధుర జ్ఞాపకం కనిపించింది కానీ, నాకేమో మీ తమ్ముడికి మీరు శుభాకాంక్షలు చెప్పిన తీరు భలే నచ్చింది. ఇది చదివాక మీ తమ్ముడి మొహంలో విరిసిన మతాబులూ కనపడ్డాయి. ఇలాంటి అక్క దొరికినందుకు మీరు చాలా లక్కీ అండి మధుర తమ్ముడు గారూ(మరేమో నాకు మీ పేరు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా మరి). నా తరపునించి కూడా జన్మదిన శుభాకాంక్షలు.:-)

    ReplyDelete
  22. మీ తమ్ముడికి "పుట్టినరోజు శుభాకాంక్షలు"!
    ఫొటోలో మీరు మీ తమ్ముడుని ఏడిపించి భలే నువ్వుతున్నారండోయ్, ఆ ఫొటో మీదేలే, మాకు తెలుసు ;) ;)
    చిన్న నాటి సరదాలు పెద్దయ్యాక మధురమైన జ్ఞాపకాలుగా మారుతాయి.
    ఇలా ఈరోజు మీరు గుర్తుచేసుకోవటం చాలా బాగుంది.

    ReplyDelete
  23. చిన్నప్పుడు నేనూ, మా అక్క కూడా ఇంతే. నువ్వు పొలంలో దొరికావే అంటే, పోరా నువ్వు మాకు గుడిమెట్ల మీద దొరికావు అని కొట్టుకునేవాళ్ళాం.

    మీ నిజ్జం తమ్ముడికి జన్మదినశుభాకాంక్షలు

    ReplyDelete
  24. అందరు అక్కాతమ్ముళ్లు ఇలాగే ఉంటారన్నమాట! మేమే అనుకున్నాను... నేను గొల్లపిల్లాడినిట! ఓ పెద్దింటి పెళ్లిలో దొరికానట. మా అక్క నమ్మకం. ఏమైనా లాజిక్ ఉందా అసలు? :)

    మీ తమ్ములుంగారికి పుట్టినరోజులు జేజేలు అమ్మాయిగారు. :)

    ReplyDelete
  25. క్రాంతి కుమార్ మలినేని గారూ,
    పాండురంగమాహాత్మ్యంలో పాపం నిగమశర్మ అక్క అని ఒకామె ఉంది. ఆమె ఎప్పుడూ నిగమశర్మ అక్కే, ఆమెకి పేరు లేదు.(ఆమె తమ్ముణ్ణి ఏమిరా తమ్ముడూ చాలా రోజులయింది రాలేదేమని అద్భుతమైన పద్యంలో అడుగుతుంది.) ఇక్కడ మధురవాణి తమ్ముడంటే తప్పేమిటి? అదికూడ ఒక క్వాలిఫికేషనే.
    with happy birthday wishes (19th July) once more

    ReplyDelete
  26. ఓహ్ తమ్ముడి బర్త్డేనా.. జన్మదిన శుభాకాంక్షలు నా తరుపున చెప్పు :)

    nestam

    ReplyDelete
  27. చిన్నప్పుడు చేసిన అల్లరి పెద్దయ్యాక గుర్తు చేసుకుంటే బంధాలు మరింత బలపడటం అంటే ఇదేనేమో.

    మీరు చెప్పిన శుభాకాంక్షలు చాల బాగున్నాయి.
    లక్కీ తమ్ముడు ఇలా చెప్పించుకోవటానికి కూడా.

    ఇంకొకసారి తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

    ReplyDelete
  28. నిజ్జం తమ్ముడికి నిజ్జం దీవెనలు.. :)

    ReplyDelete
  29. మీ పోస్ట్స్ చదువుతూ ఉంటె మా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని గుర్తు వస్తూ ఉంటాయి. మా చిన్న తనం లో మా తమ్ముడిని కూడా adopted అని అనేవాళ్ళు. వాడిని హాస్పిటల్ దగ్గర ఒక ఆంగ్లో ఇండియన్ ని అడిగి కొనుక్కున్న మని చెప్పేవారు. ఆ ఆంగ్లో ఇండియన్ ఎప్పుడు వచ్చిన నేను దాక్కుని ఏడిచే దాన్ని . మా తమ్ముడిని ఇచ్చేయాలేమో అని. కొంచం ఊహ వచ్చేసరికి ఆ భయం పోయింది. కాని మా తమ్ముడు ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. వాడు పెద్ద సీరియస్ గా తీసుకునే వాడు కాదు.

    ReplyDelete
  30. @ అవినేని భాస్కర్, శివరంజని, బంతి, నిరంతరమూ వసంతములే, శ్రీనివాస్, ఫోటాన్, రాజ్ కుమార్, శ్రీలలిత, నిషిగంధ, nsmurty, the tree, కష్టేఫలే, శేఖర్, చిలమకూరు విజయమోహన్, వనజవనమాలి, మాలా కుమార్, దుర్గేశ్వర, సునీత, రసజ్ఞ, క్రాంతి కుమార్ మలినేని, చిన్ని ఆశ, మురళీ, చాణక్య, నేస్తం, coolvivek, HarshaBharatiya, అనానిమస్..
    మా నిజ్జం తమ్ముడికి నిజ్జం శుభాకాంక్షలూ, ఆశీస్సులూ అందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. మీ జ్ఞాపకాలన్నీ తలచుకుంటూ మా సరదా జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు మా ఇద్దరి తరపునా హృదయపూర్వక కృతజ్ఞతలు. :)

    @ శివరంజని,
    హహ్హహ్హా.. చెవుల పిల్లా.. బాగుంది మీ చెల్లికి నువ్వు పెట్టిన పేరు.. :D

    @ ఫోటాన్,
    మీ చెల్లి గుర్తొచ్చిందా? :D

    @ రాజ్ కుమార్,
    హిహ్హిహ్హీ.. అదింకా మర్చిపోలేదా రాజ్ నువ్వు.. చాలా నవ్వుకున్నా నీ కామెంట్ చూసి.. ఆ డైలాగ్ కథలు చెప్పుకున్నప్పుడే చెప్పుకోవాలన్నమాట మనం.. :D :D

    ReplyDelete
  31. అరేయ్ తంబి .. నీకు జన్మదిన శుభాకాంక్షలు రా.. ఆలస్యం గా చెప్పా అని ఫీలవ్వకేం. ఈ అక్కలంతా అంతే.. మనం తమ్ముళ్ళ యూనియన్ పెడదాం. చిన్నప్పుడు ఎంచక్కా బోల్డన్ని సార్లు కొట్టుకునేవాళ్ళం నేను, మా చిన్నక్క. పెళ్లి అయ్యాక నన్ను పట్టించుకోడం తగ్గించేసింది. నాతో రోజుకి అరగంటే మాట్లాడుతోంది ఇపుడు ఫోన్ లో.

    మధు గారూ! ఎవరూ గమనించట్లేదు గాని, మీ టపా లో సందర్భానుసారం గా మీరు పెట్టే స్మైలీస్ ని బాగా మిస్ అవుతున్నా.. we want smilies. we want smilies. we want smilies. we want smilies.

    ...... హరీష్.

    ReplyDelete
  32. @ నిషిగంధ,
    హహ్హహ్హా.. భలే డౌటే వచ్చిందిగా నీకు.. ఇప్పుడు కాదులే నిషీ.. చిన్నప్పుడు పోట్లాటల్లో గెలవాలంటే ఏదో ఒక మార్గం వెతుక్కోవాలిగా మరి.. మగపిల్లలతో పోట్లాడి గెలవడం కష్టం కదా.. అందుకని తెలివిగా మాటలతో కొట్టడం అన్నమాట! :D

    @ nsmurty,
    నేను కూడా ఈ బొమ్మ చూసినప్పుడు అసలెంత నవ్వానో.. ఎన్నిసార్లు చూసినా భలే నవ్వొస్తోంది. So true.. Life is interesting than fiction. మీరు చెప్పినదాంతో ఏకీభవిస్తున్నాను.
    హహ్హహ్హా.. మీరు చెప్పిన పాండురంగ మహత్యం సంగతి తెలీదు గానీ, భలే ఉందండీ వినడానికి. అయితే ఇప్పుడు మా తమ్ముడి పేరుని 'మధుర తమ్ముడు' గా చేసేద్దామంటారా? వాడి పేరు భరత్ అండీ. :)
    Thank you so much for your affectionate response.

    @ the tree,
    అయ్యో మీరు రైల్వే స్టేషనుకే వెళ్ళిపోయారా? మళ్ళీ ఇంటికేవారు తీసుకొచ్చారు మరి? ఆ కథా కమామీషు ఏవిటో మీరు వివరంగా చెప్పకూడదూ మా అందరికీ.. :)

    @ కష్టేఫలె,
    అవునండీ శర్మ గారూ.. అంత అందమైన కుటుంబంలో పుట్టి పెరగడం నా అదృష్టంగా భావిస్తాను. :)

    @ వనజ వనమాలి,
    బాగా చెప్పారండీ.. రక్త సంబంధంలోని తీపే అదేమో.. :)

    ReplyDelete
  33. @ రసజ్ఞ,
    అవునండీ.. ఇంట్లో అన్నలూ, తమ్ముళ్ళూ ఉంటే చాలా సరాదాగా ఉంటుంది. నేనూ మీలాగే నాకొక అన్నయ్యుంటే బాగుండు అనుకుంటూ ఉంటాను అందరి అన్నయ్యలనూ చూసినప్పుడల్లా.. :)

    @ క్రాంతి కుమార్ మలినేని,
    హహ్హహ్హా.. మా తమ్ముడు సంగతేమో గానీ నేను మాత్రం మీ కామెంట్ చాలాసార్లే చదువుకుని మురిసిపోయానండీ.. మా తమ్ముడి పేరు భరత్. :)

    @ చిన్ని ఆశ,
    అవునండీ.. ఇవన్నీ అమూల్యమైన మధుర జ్ఞాపకాలు. ఆ ఫోటోలో ఉన్నది మేమే.. అచ్చం అలాగే చేసేదాన్ని నేను చిన్నప్పుడు.. :ద

    @ మురళి, చాణక్య,
    భలే సంబరంగా అనిపించింది మీ కామెంట్స్ చూసి. మాలాగా ఇలా కొట్టుకునేవాళ్ళు ఉన్నారని తెలిసినందుకు. గుడి మెట్లు, పొలం, గొల్ల పిల్లాడు.. హహ్హహ్హా.. భలే భలే ప్లోకలు దొరికాయిగా మీకసలు.. :)))

    @ చాణక్య,
    అక్కలు చెప్పే దాంట్లో లాజిక్కులు వెతక్కూడదు పాపాయి గారూ మీరు.. మారు మాట్లాడకుండా ఒప్పేసుకోవాలంతే.. :D

    ReplyDelete
  34. @ శేఖర్,
    ఇప్పుడు ఇంతంత దూరాభారాల్లో ఉండటం మూలానా చిన్నప్పటి అల్లరి అప్పుడప్పుడూ గుర్తు చేసుకోడం చాలా సంతోషాన్నిస్తుంది. :)

    @ అనానిమస్,
    అబ్బా.. ఎంత మంచి అక్కండీ మీరు. మీ తమ్ముడిని అస్సలు ఏడిపించకపోడమే కాకుండా, అంత చిన్న వయసులోనే బోల్డు అపురూపంగా చూసుకునేవారన్నమాట. సో స్వీట్! :)
    నా బ్లాగ్ పోస్ట్స్ చదివి మీ మధుర గ్నాపకాల్ని గుర్తు చేస్తున్నందుకు సంతోషంగా ఉందండీ..

    @ హరీష్ బలగ,
    ఆహా.. తమ్ముళ్ళ సంఘం పెడతారా.. అలాగలాగే.. మేము మాత్రం అక్కల సంఘం పెట్టలేమా ఏంటి చెప్పండి. :))
    బాధ్యతలు పెరిగే కొద్దీ చిన్నప్పటిలా అంతసేపు టైం ఇవ్వలేరు కదండీ మరి ఎవరైనా.. మీరు మాత్రం తక్కువ, చదువులూ, ఉద్యోగాలని ఎప్పుడు చూసినా చాలా బిజీ అక్కా అని చెప్తుంటారు కదా.. రోజుకి అరగంట మాట్లాడుతున్నారంటే మీ అక్కని చాలా మెచ్చుకోవాలి. :)
    హహ్హహ్హా.. స్మైలీల సంగతి మీకు బాగానే గుర్తుందే.. నాక్కూడా స్మైలీలు వాడటం చాలా ఇష్టమే కానీ ఈ కొత్త బ్లాగర్ ఇంటర్ఫేస్ లో ఎలా వాడాలో తెలీదండీ.. నేర్చుకునే ప్రయత్నం చెయ్యాలి.
    Thanks for the wishes! :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!