Tuesday, June 12, 2012

కనుబొమ్మల పల్లకిలోన కన్నెసిగ్గు వధువయ్యింది..


'హాస్యబ్రహ్మ' జంధ్యాల దర్శకత్వంలో 1983 లో వచ్చిన 'నెలవంక' సినిమాలోని పాట ఇది. రమేష్ నాయుడు గారి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలు, జానకి ఆలపించారు. రాజేష్, తులసి జంటగా నటించిన ఈ చిత్రం హిందూ ముస్లిం మతాలకి చెందిన ఇద్దరు మిత్రుల కుటుంబాల మధ్య జరిగిన కథ. మతాలకి అతీతంగా ఆ ఇరువురి మధ్యన స్నేహం, తర్వాత చోటు చేసుకునే అపార్థాలూ, తద్వారా ఊర్లో మత కలహాలూ, చివరికి మతం కన్నా మానవత్వం గొప్పదనే విషయాన్ని అందరూ గుర్తించేలా చెయ్యడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమాలో సుత్తి జంట హాస్యం చాలా సరదాగా ఉంటుంది. సుత్తి మీద ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంది. :)

ఇంక ఈ పాట విషయానికొస్తే వినసొంపైన సంగీతంతో ఆహ్లాదంగా సాగిపోతుంటే, అలతి అలతి పదాలతో రాసిన అందమైన సాహిత్యం పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేస్తుంది. ఎప్పట్లాగే జానకి గారు చాలా సున్నితంగా, భావయుక్తంగా పాడారు. ప్రముఖ తెలుగు రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఈ పాటని రాసారు. ఈయన రేడియో కోసం కూడా ఎన్నో రచనలు చేసారట. వీరి తల్లిదండ్రులు, సతీమణి కూడా రచనా వ్యాసంగంలో ఉన్నవారేనట. గ్రహణం, మాయాబజార్ (కొత్తది), అష్టా చెమ్మా, గోల్కొండ హైస్కూల్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించి ఈ తరంలో వైవిధ్యమున్న దర్శకుడిగా పలువురి ప్రశంసలు అందుకుంటున్న ఇంద్రగంటి మోహనకృష్ణ వీరి కుమారులే.

ఇది చాలా పాత పాటే అయినా నాకీ మధ్యనే తెలిసింది. నాలాంటి వాళ్ళుంటే ఇప్పుడు తెలుసుకుంటారని బ్లాగులో రాస్తున్నా. ఇంత చక్కని పాటని నాకు పరిచయం చేసిన నా స్నేహితురాలికి బోల్డు థాంకులు. :)

ఈ పాట సాహిత్యంలో ఉపయోగించిన ఉపమానాలు చాలా కొత్తగా, వైవిధ్యంగా అనిపించడం వల్లే నాకీ పాట ఎక్కువ నచ్చింది. అసలు పల్లవిలోని రెండు వాక్యాలు ఎంతందంగా ఉన్నాయో కదా.. కన్నెసిగ్గు కనుబొమ్మల పల్లకిలో వధువయ్యిందట.
 
పాట సాహిత్యం మొత్తం చూడండి ఓసారి.

ఈ కోవెల వాకిలిలో ఏదో అడుగు సవ్వడి..
ఏ దేవుడు దయతో నా ఎదలో.. అడుగిడు.. వడి వడి..

కనుబొమ్మల పల్లకిలోన కన్నెసిగ్గు వధువయ్యింది.. విరిమొగ్గల మధువయ్యింది..
హరివిల్లై పెదవి వదిలిన చిరునవ్వే వరమయ్యింది.. సిరిమువ్వల వరదయ్యింది..

నీ కన్నుల వెన్నెల చూసి మనసే చిరు తరగయ్యింది.. కృష్ణవేణి పరుగయ్యింది..
దయ నిండిన గుండెని చూసి.. తనువే ఒక పులకయ్యింది.. నునుసిగ్గుల మొలకయ్యింది..

కనురెప్పల గొడుగులు వేసి తోడునీడనవుతాను..
అడుగులకే మడుగులుగా నా అరచేతులు పడతాను..
నీ జడలో మొగలిరేకునై నీ బతుకు పంచుకుంటాను..
నీ జడలో మొగలిరేకునై నీ బతుకు పంచుకుంటాను..

కనుబొమ్మల పల్లకిలోన కన్నెసిగ్గు వధువయ్యింది.. విరిమొగ్గల మధువయ్యింది..
హరివిల్లై పెదవి వదిలిన చిరునవ్వే వరమయ్యింది.. సిరిమువ్వల వరదయ్యింది..

అంతరంగమిదిగో స్వామీ.. నేడు నీకు నెలవంటాను..
మూగవడిన నా గుండెలలో.. రాగలహరివనుకుంటాను..
అవధి లేని అంబరమే నా ఆనందపు పరిధంటాను..
అవధి లేని అంబరమే నా ఆనందపు పరిధంటాను..

నీ కన్నుల వెన్నెల చూసి మనసే చిరు తరగయ్యింది.. కృష్ణవేణి పరుగయ్యింది..
దయ నిండిన గుండెని చూసి.. తనువే ఒక పులకయ్యింది.. నునుసిగ్గుల మొలకయ్యింది..

ఈ పాటని చిమట మ్యూజిక్ సైట్లో వినొచ్చు.

Youtube లో చూడొచ్చు.

16 comments:

  1. Song chala bagundi.....manchi sahityam...

    And "Jegantalu" ane oka movie lo "Vandanaalu" ane song kooda chaala baguntundi...kudirithe vinandi.....

    PS: meeru ichina link click cheste emi open avvadam ledu....

    ReplyDelete
  2. పాట చాలా బాగుంది... నేను youtube లో విన్నాను....
    ధ్యాంక్యూ....

    ReplyDelete
  3. @ అనానిమస్,
    ధన్యవాదాలండీ.. మీరు చెప్పిన పాట నాకు తెలీదు. తప్పకుండా విని చూస్తాను.
    నేనిచ్చిన లింక్స్ బాగానే పని చేస్తున్నాయండీ.. వేరే ఫ్రెండ్స్ కి కూడా బాగానే ఓపెన్ అవుతున్నాయంట. మీ బ్రౌజర్లో ఏదన్నా సమస్యేమో ఓసారి చూడండి.

    @ సాయి,
    ధన్యవాదాలండీ.. :)

    ReplyDelete
  4. నాగేస్రావ్June 12, 2012 at 3:04 PM

    పాట సాహిత్యం చాలా నచ్చింది, కానీ వింటే పాట నాకంత నచ్చలేదు.

    ReplyDelete
  5. @ నాగేస్రావ్ గారూ,
    పాట ఒక్కసారే విన్నారా? నాకు ఓ నాలుగైదు సార్లు విన్నాక బాగా పట్టేసింది.. :)
    మీరూ ప్రయత్నించి చూద్దురూ.. :P

    ReplyDelete
  6. వినలేదు ఈ పాట ఇంతకు ముందు, బాగుందండి!
    జంధ్యాల సినిమాలో పాట అనగానే బాగుండక పోయే chance లేదు కదా..
    నాకు జంధ్యాల గారి direction లో ముద్దమందారం సినిమాలో పాట "నీలాలు కారేనా" చాల చాల ఇష్టం!

    ReplyDelete
  7. నాకెంతో ఇష్టమయిన సినిమాల్లో నెలవంక ఒకటి. అందరూ తప్పక చూడవలసిన సినిమా అది. అందులో ఈ పాట, మనిషి నెత్తురే మనిషికి ప్రియమైతే నరుడికి నరుడే యముడై ఎదురైతే సోదరులే శత్రువులై కలబడితే మతం వద్దు గతం వద్దు మారణహోమం వద్దు అన్న పాటా చాలా చాలా ఇష్టం.

    ReplyDelete
  8. పాట చాలా బాగుంది... మంచి సాహిత్యం..మీకుధన్యవాదాలు ..

    ReplyDelete
  9. సాహిత్యం చాలా బాగుందండి! మీకు ధన్యవాదాలు..

    ReplyDelete
  10. ఈ చెమటల్లో మంచు కురిపించిన చిమట వారికి ధన్యవాదాలు

    ReplyDelete
  11. చాలా బావుంటుంది కదా! జానకి వాయిస్ అమేజింగ్... లిరిక్స్ కూడా బావుంటాయి..
    "అంతరంగమిదిగో స్వామీ.. నేడు నీకు నెలవంటాను..
    మూగవడిన నా గుండెలలో.. రాగలహరివనుకుంటాను..
    అవధి లేని అంబరమే నా ఆనందపు పరిధంటాను.."


    హరేకృష్ణ, మీ కామెంట్ భలే :)))

    ReplyDelete
  12. మంచి సాహిత్యం, సంగీతం మరియూ చిత్రీకరణా...ఎప్పుడూ వినలేదు ఈ పాట, కానీ విన్న మొదటిసారే ఆకట్టుకుంది.
    ఇలా వినపడక తప్పించుకున్న ఆణిముత్యాలు పరిచయం చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు.

    ReplyDelete
  13. నేనసలు ఈ సినిమా గురించి కూడా వినలేదు . పాట సాహిత్యం బాగుంది .

    ReplyDelete
  14. నేనూ ఈ పాట మొదటిసారి వింటున్నాను బాగుంది మధురా..

    ReplyDelete
  15. @ జలతారు వెన్నెల,
    ధన్యవాదాలండీ.. ముద్దమందారం పాటలు చాలా ఫేమస్ కదా.. ఎందుకనో ఈ పాట ఎక్కువమందికి తెలిసినట్టు లేదు.

    @ రసజ్ఞ,
    ధన్యవాదాలు. సినిమా మరీ అద్భుతం అనిపించలేదు గానీ బానే ఉందనిపించిందండీ.. ఆ ఊరి పరిసరాలు మాత్రం భలే నచ్చేసాయి నాకు.

    @ అక్షరమోహనం, చిన్ని ఆశ, మాలా కుమార్, వేణూ శ్రీకాంత్, శేఖర్..
    మాక్కూడా పాట నచ్చినందుకు సంతోషం. స్పందించినందుకు ధన్యవాదాలు. :)

    @ చిన్నిఆశ,
    నాకు నచ్చే పాటలు మీక్కూడా నచ్చుతుండటం సంతోషంగా ఉంది. అప్పుడప్పుడూ పాటల గురించి చెప్తూనే ఉంటాలెండి. థాంక్స్.. :)

    @ హరేకృష్ణ..
    హహ్హహ్హా.. నువ్వసలు కెవ్వు బాబూ... :)))))))


    @ నిషిగంధ,
    అవును.. వినగా వినగా మరింత నచ్చేస్తుంది. నీకు డబుల్ థాంక్స్ డియర్.. :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!