Monday, April 16, 2012

అందుకేనేమో!

ఈ ఉదయం శతసహస్ర వర్ణాల్లో ప్రకాశిస్తోంది.. నీ చూపుల కిరణాలు ప్రసరించినందుకేమో..
నా మోమున కోటి కాంతులు విరిసాయి.. నిన్ను కన్నులారా కన్నందుకేమో..
వేసంగి ఎండ చలువ పందిరిలా మారింది.. నీ ఎలనవ్వు తెమ్మెరలు వీచినందుకేమో..
నా చీర కుచ్చిళ్ళు తడబడుతున్నాయి.. నిన్ను చేరాలనే తొందరలోనేమో..
మబ్బులు నా పాదాల కిందకి వచ్చి చేరాయి.. నీ సందిట నిలిచినందుకేమో..
వాన చినుకులు వెచ్చగా తాకుతున్నాయి.. నీతో కలిసి తడుస్తున్నందుకేమో..
వాలుజడన దాగిన సంపంగి మొగ్గ పురి విప్పింది.. నీ ఊపిరి తాగినందుకేమో..
నా మేనులో మల్లెలు పూసాయి.. నీ చేతుల్లో అల్లుకుపోయినందుకేమో..
నా ప్రేమ ఫలించింది.. ఈ జన్మ తరించింది.. నీకు సొంతమైనందుకేనేమో!

22 comments:

  1. మధురవాణి గారు, ముందుగా చిత్రం ఎంతో బాగుంది. అమ్మయకంగా, అందంగా, రంగులతో చాలా చాలా బాగుంది. మీ కవిత కూడా ఆ చిత్రం అంత బాగుంది. మీకు అభినందనలు.

    ReplyDelete
  2. ఈ కవిత ఇంత అందంగా ఉండ బట్టేనేమో! ఆ బొమ్మ కంత అందమొచ్చింది.
    ఆ అమ్మాయి వెలుగులు ఈ కవిత నిండా ఎన్ని జిలుగులు నింపేసాయో!
    అందుకేనేమో! అంత సౌందర్యముంది మీ రచనలో.

    ReplyDelete
  3. రవి వర్మ కే అందని ఒకే ఒక అందానివో !అంత బాగా వుంది చిత్రం.కవిత హాయిగా వుంది.

    ReplyDelete
  4. మీ కవిత చాలాబాగుంది!

    ReplyDelete
  5. WOW చాలా బాగుంది అండి

    ReplyDelete
  6. "నా చీర కుచ్చిళ్ళు తడబడుతున్నాయి.. నిన్ను చేరాలనే తొందరలోనేమో..
    మబ్బులు నా పాదాల కిందకి వచ్చి చేరాయి.. నీ సందిట నిలిచినందుకేమో..
    వాన చినుకులు వెచ్చగా తాకుతున్నాయి.. నీతో కలిసి తడుస్తున్నందుకేమో..
    వాలుజడన దాగిన సంపంగి మొగ్గ పురి విప్పింది.. నీ ఊపిరి తాగినందుకేమో.."

    అవి నచ్చాయి నాకు

    ReplyDelete
  7. మా 'మథుర వాణి 'మదిలో
    ప్రేమామృత ధార లొలుక విరిసిన 'కవితా
    రామ గులాబీ'- 'అందుకె
    నేమో !'మనసునకు హాయి నింపెను చదువన్

    బ్లాగు సుజన-సృజన

    ReplyDelete
  8. @ జలతారు వెన్నెల, జయ, oddula ravisekhar..
    అమ్మాయి బొమ్మ గూగుల్ నుంచి తీసుకున్నదేనండీ.. నాక్కూడా చాలా నచ్చేసింది. నేను రాసింది కూడా నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలండీ.. :)

    @ పద్మార్పిత, తెలుగు పాటలు, కష్టేఫలే, శేఖర్..
    అభినందించిన మిత్రులకు కృతజ్ఞతలు. :)

    @ KumarN,
    చాలా సంతోషం.. థాంక్సండీ.. :)

    @ వెంకట రాజారావు . లక్కాకుల,
    మీరు మాత్రం అలవోకగా భలే పద్యాలు రాసేస్తారండీ.. చాలా సంతోషమయ్యింది. ధన్యవాదాలు.. :)

    ReplyDelete
  9. ఫోటోలో కుందనపు బొమ్మ కొంచెం దిగాలుగా వుంది...మీ కవిత అంత అందంగా లేననేనేమో!

    ReplyDelete
  10. చాలా బాగుందండి!ఇందులోని కొన్ని పదాలకు నాకు అర్ధం తెలియదు కాని,మొత్తం లైన్ చదివాక అర్ధం తెలిసింది.
    *నాకు మొట్టమొదట తెలిసిన తెలుగు బ్లాగ్ మీదేనండి.దేనికోసమో వెతుకుతుంటే మీ బ్లాగ్ కనిపించింది.అప్పుడు నేను చదివింది మీరెప్పుడో రాసిన 'మిస్ పనివంతురాలు'.ఇంక రెగ్యులర్ follower ని అయిపోయా.

    ReplyDelete
  11. @ నిరంతరమూ వసంతములే,
    హహ్హహ్హా.. భలే చెప్పారుగా.. ఏమో మరి నాకైతే దిగాలుగా ఏం అనిపించలేదు. :))
    స్పందించినందుకు ధన్యవాదాలండీ..

    @ అనుదీప్,
    చాలా థాంక్సండీ.. ఏదైనా పదం అర్థం తెలీకపోతే అడగండి.. అయినా నా భాషా పరిజ్ఞానం కూడా తక్కువేలెండి.. నాకు వచ్చినవే తేలిక పదాలు.. :)
    ఓహో.. అయితే అలా పరిచయం అయిందన్నమాట నా బ్లాగు మీకు.. బావుంది తెలుసుకోవడం.. Thanks for following my blog. :)

    @ ఫోటాన్,
    థాంక్యూ.. :)

    ReplyDelete
  12. నా చేతులు తొందరపడుతున్నాయి వ్యాఖ్య రాయడానికి.. 'మధుర' కవితాధారను గ్రోలినందుకేమో! :))

    ReplyDelete
  13. nice pic and nice post madhura gaaru

    ReplyDelete
  14. @ చాణక్య,
    హహ్హహ్హా... థాంక్సండీ.. :))

    @ HarshaBharatiya,
    ధన్యవాదాలండీ.. :)

    ReplyDelete
  15. మధురవాణి గారూ! ఎప్పటిలానే మీ అక్షర భావకుసుమాలు మధురం, సుమధురం...

    ReplyDelete
  16. @ రాజ్ కుమార్,
    థాంక్యూ.. :)

    @ చిన్ని ఆశ,
    ఎప్పట్లానే మీ స్నేహపూర్వకమైన పలకరింపు కూడా మనోహరం. ధన్యవాదాలండీ.. :)

    ReplyDelete
  17. "వాలుజడన దాగిన సంపంగి మొగ్గ పురి విప్పింది.. నీ ఊపిరి తాగినందుకేమో"

    ఈ వాక్యం లొ ఉపమానాన్ని చాల అందం గా వాడినారు :)


    చాల రోజుల తర్వాత మీ బ్లాగ్ చూస్తున్న నాకు మీ మరొక అందమైన కవిత స్వాగతం చెప్పింది

    ReplyDelete
  18. @ భరత్,
    ధన్యవాదాలండీ.. :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!