Tuesday, October 18, 2011

Happy Birthday To You.. నాన్నా!

చిన్నప్పుడు పుట్టిన రోజు వస్తుందంటే ఎంత ఆనందంగా ఆరాటంగా ఎదురు చూసే వాళ్ళమో నేనూ, మా తమ్ముడూ. మా ఇద్దరి పుట్టినరోజులూ జూన్, జూలైల్లో ఉండటం వల్ల ఆ నెలల కోసం కొత్త కేలండరు వచ్చిన దగ్గర నుంచి మహా ఎదురు చూసేవాళ్ళం. మాకు బర్త్డే కేకులు కట్ చేసే అలవాటు లేకపోయినా ప్రతీ పుట్టినరోజుకీ కొత్త బట్టలు, స్కూల్లో పంచి పెట్టడానికి బోల్డు చాక్లెట్లు కొనిచ్చేవారు నాన్న. అయితే, ఎంతసేపూ మా పుట్టినరోజు హడావిడే తప్ప మాకెప్పుడూ నాన్న పుట్టినరోజు ఎప్పుడు, అమ్మ పుట్టిన రోజెప్పుడు అన్న ఆలోచన రాలేదు చిన్నప్పుడు. దాదాపు నాకు పన్నెండేళ్ళప్పుడు అనుకుంటా మొదటిసారి మా నాన్న పుట్టినరోజు అక్టోబర్ 18 న అని తెలిసింది. మా అమ్మ పుట్టినరోజేమో ఎవరూ రాసి పెట్టని కారణంగా ఎవరికీ తెలీదు. :(

మరి నేనసలే చిన్నప్పటి నుంచీ కూడా నాన్న కూతుర్ని కదా.. చిన్నప్పుడు ఎప్పుడన్నా నాకేదైనా దెబ్బ తగిలితే అమ్మా అనకుండా నాన్నా అని ఏడ్చేదాన్నని మా అమ్మ ఇప్పటికీ దెప్పుతూనే ఉంటుంది. :) అయితే ఇంతకీ అసలు విషయానికొస్తే.. ఎప్పుడైతే నాన్న పుట్టినరోజు తేదీ తెలిసిందో అప్పుడు రాబోయే పుట్టినరోజుకి ప్రత్యేకంగా ఏదోకటి చెయ్యాలని గట్టిగా నిర్ణయించేసుకున్నానన్నమాట! అప్పుడు నేనొక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని. మా తమ్ముడు హాస్టల్లో ఉండేవాడు. సరే, ఏం చెయ్యాలన్నది తర్వాత ఆలోచించుకోవచ్చు గానీ ముందు నేను కష్టపడి డబ్బులు దాచిపెట్టాలి అనుకున్నా. ఇంకో రెండు నెలల్లో పుట్టిన రోజు వస్తుందనగా ఇంక అప్పటి నుంచి స్కూల్ కి వెళ్ళేప్పుడు నాకిచ్చిన పాకెట్ మనీ అయితే ఏంటి, కొట్టుకెళ్ళి ఏదన్నా కొనుక్కు రమ్మని చెప్పినప్పుడల్లా మిగిలిన చిల్లరలోంచి 'నాకు రూపాయిస్తానంటేనే వెళ్తా' అని అమ్మని బెదిరించి తీసుకున్న డబ్బులు అయితేనేంటి.. అలా మొత్తం దాదాపు అరవై రూపాయలు పోగయ్యాయి.

పుట్టినరోజు దగ్గరికొచ్చేసరికి బాగా ఆలోచించాను ఈ డబ్బులతో ఏం కొనాలా అని. ఏం కొనాలన్నా సరే మేముండే పల్లెటూర్లో పెద్దగా ఏముండవు కదా మరి.. టౌనుకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే నాన్నే తీసుకెళ్ళాలి. ఎప్పుడన్నా ఏదన్నా కావాలంటే నాన్న తెచ్చివ్వడమే గానీ నన్ను తీసుకెళ్ళేది చాలా తక్కువ అప్పట్లో. పైగా, ఎప్పుడైనా పండగలప్పుడు బట్టలు కొనడం లాంటి పనులున్నప్పుడు తమ్ముడిని మాత్రం తీస్కెళ్ళి నన్ను ఇంటి దగ్గరే వదిలి వెళ్ళేవారు. వాడిని తీసుకెళ్ళకపోతే ఇళ్ళు పీకి పందిరేస్తాడని భయం మరి. :) ఎప్పుడూ లేనిది నేను కారణం ఇదీ అని చెప్పకుండా నాన్న పుట్టినరోజున బయటికి తీస్కెళ్ళమని గొడవ చేసి మరీ వెళ్లాను. ఇంకోటేంటంటే, పుట్టినరోజు జరుపుకోడం లాంటి అలవాటు లేకపోవడం వల్ల ఆ రోజు నాన్న పుట్టినరోజని ఇంట్లో ఎవరూ గమనించనే లేదు.

మొత్తానికి స్వీట్ షాపుకి వెళ్ళి ఏం కొందామా అని చూసాను. బోల్డు కేకులూ అవీ ఉన్నాయి కానీ అక్కడున్నవన్నీ చూసాక మళ్ళీ నా చేతిలో ఉన్న డబ్బులు చూసుకుంటే ఈ అరవై రూపాయలకి మరీ పెద్ద కేకులూ అవీ రావు కదా అనిపించింది. ఈ లోపు బన్నుకి ఎక్కువ, కేకుకి తక్కువ అన్నట్టు అరచేతిలో పట్టేంత సైజులో ఉన్న ఒక చిన్న ప్లమ్ కేక్ కనిపించింది. నాన్నా.. ఇది కావాలి అంటే సరేనని వేరే స్వీట్స్ తో పాటు ఇది కూడా తీసుకుని బిల్లు కట్టబోతుంటే నేను మహా సీరియస్ గా నా దగ్గరున్న డబ్బులు ఇచ్చాను. మరీ చిల్లర పైసలు కాదులెండి.. నేను కూడబెట్టిన చిల్లరంతా పది రూపాయల నోట్లు, ఐదు రూపాయల నోట్లుగా మార్చి పెట్టుకున్నా తెలివిగా ముందే. ;) ఇంతకీ మా నాన్నకి అర్థం కాలేదు పాపం.. నా దగ్గర అన్ని డబ్బులెందుకున్నాయో, ఎందుకు అప్పుడు ఇస్తున్నానో. ఊరికే నా దగ్గరున్నాయ్ కదాని మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి ఇచ్చాను. అన్నీ కొనుక్కుని ఇంటికెళ్ళాక తీరిగ్గా ఈ బుల్లి కేకుని ఒక ప్లేట్లో పెట్టి మా అమ్మని కూడా పిలిచి, నాన్నని కూడా పిలిచి "హ్యాపీ బర్త్డే టు యు" అని చెప్పి ఈ బుల్లి కేక్ కట్ చెయ్యమని అడిగేసరికి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఏమన్నారో నాకిప్పుడు మరీ అంత వివరంగా గుర్తు లేదు గానీ వాళ్ళు ఆనందపడినట్టు మాత్రం గుర్తుంది. ఆ తర్వాత ఎంచక్కా ఆ బుల్లి కేక్ సగం నేనే తినేసాననుకోండి. అది వేరే విషయం! :)

ఆ తర్వాత చదువుల పేరు చెప్పి ఇల్లొదిలేసి హాస్టళ్ళు పట్టుకుని తిరగడం మూలానా చాలా పుట్టినరోజులకి ఫోన్లో విష్ చెయ్యడం మాత్రమే కుదిరింది. నేను డిగ్రీ చదివేప్పుడు మాత్రం ఒకసారి ముందే నాన్న పుట్టినరోజుకి ఇంటికెళ్ళాలని ప్లాన్ చేసుకుని అంతకు చాలా రోజుల ముందు నుంచే మళ్ళీ డబ్బులు దాచిపెట్టుకుని స్వయంగా నేనే షాపింగ్ చేసి ఒక చొక్కా కొని తీసుకెళ్ళాను. జీవితంలో మొట్టమొదటిసారి అబ్బాయిలకి సంబంధించిన బట్టల షాపింగ్, అదొక సరదా జ్ఞాపకం. నాకు బాగా గుర్తు. అప్పుడు అమ్మా, నాన్నా ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. :)

మళ్ళీ ఆ తర్వాత నేను ఎమ్మెస్సీ చదువుకునే రోజుల్లో మా తమ్ముడు ఇంజనీరింగ్ చేస్తూ ఇద్దరం హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళం. నాన్న పుట్టినరోజు టైముకి మాకు ఇంటికెళ్ళడం కుదరదని మేము దసరా సెలవలకి వెళ్ళినప్పుడే ఒక చొక్కా కొని తీసుకెళ్ళాం. మా ఇంట్లో ఒక చెక్క అల్మారా ఉండేది చిన్నది. అందులో ఫోటో అల్బములూ, మా చిన్నప్పటి వెండి గిన్నెలూ లాంటి వస్తువులు ఉండేవి. దానికి తాళం వేసి ఉండేది. ఎప్పుడో గానీ అది తెరిచే అవసరం ఉండేది కాదు. అందుకని షర్టు ఉన్న అట్ట పెట్టెని అందులో దాచిపెట్టి తాళం వేసి వచ్చేసాం. లోపల ఒక పేపర్ మీద విషెస్ కూడా రాసి పెటినట్టు గుర్తు. పుట్టినరోజు నాడు మేమిద్దరం ఫోన్ చేసి విష్ చేసి ఆ అల్మారా తెరిచి చూడమని సర్ప్రైజ్ చేసామన్నమాట! :)

ఆ తర్వాతి ఏడాదేమో అమ్మా వాళ్ళే హైదరాబాద్ వచ్చారు ఏదో పని మీద. అప్పుడు మా తమ్ముడు, వేరే కజిన్ వాళ్ళతో కలిసి ఒక ఇంట్లో ఉండేవాడు. అందరం అక్కడున్నాం కదాని రహస్యంగా కేక్ తీసుకొచ్చి పెట్టి రాత్రి పన్నెండింటికి నిద్ర లేపి కేక్ కట్ చేయించాం అందరం కలిసి. అప్పుడైతే అమ్మమ్మ కూడా ఉంది. ముందే ప్లాన్ చేసి ఫొటోస్ కూడా తీసుకున్నాం. అదొక అందమైన జ్ఞాపకం. :)
ఇంక ఆ తర్వాత నేను ఏకంగా దేశం దాటి వచ్చేసాక ఫోన్లో విష్ చెయ్యడమే తప్ప ప్రత్యేకంగా ఏం చెయ్యలేదు. ఈ సారి మాత్రం నాన్నకి చాలా ఇష్టమైన నా బ్లాగులో తనకి ఈ జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనిపించింది.

నాన్నా.. ఇవాళ నావి అనుకునే నా ఆలోచనలూ, కొద్దో గొప్పో చదువు, తెలివితేటలూ, జ్ఞానం, స్పందించే మనసూ.. ఈ రోజు నాదంటూ కనిపించే ప్రతీదాని వెనుకా నువ్వే ఉన్నావ్.. అసలు నాకు దక్కిన గొప్ప అదృష్టం నీ కడుపున పుట్టడమే. నా ప్రతీ అడుగులో నువ్వే ఉంటావ్ నాన్నా.. నేనెవరో తెలియని వాళ్ళు కూడా నన్ను చూసీ చూడగానే నా మోహంలో నిన్ను పోల్చుకుని నువ్వు ఫలానా వారి అమ్మాయివా అని అడిగితే ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా! అన్నట్టు, కాలేజ్లో నా ఫ్రెండ్సందరూ నిన్ను చూసి మీ అన్నయ్య వచ్చారు అని చెప్పినప్పుడు కూడా మహా గర్వంగా ఉండేదనుకో.. హిహ్హిహ్హీ.. అమ్మ, తమ్ముడూ చూసావా మనిద్దరినీ ఎలా చూస్తున్నారో ఉక్రోషంగా! ;)
ఒక్కటి మాత్రం నిజం. ఎన్ని జన్మలకైనా నేను నీ కూతురిగానే పుట్టాలి నాన్నా! :)

నాన్నా.. నీకు యాభై ఒకటో పుట్టినరోజు శుభాకాంక్షలు. హేప్పీ హేప్పీ బర్త్ డే అబ్బాయ్..
(నాన్న మరి ఎప్పుడూ మా అమ్మవి నువ్వు అని అంటారు కదా.. అందుకని అప్పుడప్పుడూ మాటల్లో అబ్బాయ్ అని పిలిచేస్తూ ఉంటానన్నమాట! ;)
నువ్విలాగే వెయ్యి పుట్టిన రోజులు సంతోషంగా జరుపుకోవాలని, ఎప్పట్లాగే మా అందరికీ బోల్డు ప్రేమని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నా తరపున, తమ్ముడి తరపునా నీకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.


48 comments:

  1. చాలా బావుంది ... చాలా టచింగ్ గా ఉంది పోస్ట్... అమ్మాయిలకి నాన్న మీద ప్రత్యేకమయిన మమకారం ఉంటుంది అంటారు. అది ఎంత స్పెషల్ గా ఉంటుందొ ఈ పొస్ట్ చూస్తే అర్ధం అయింది.

    మీరు ముందు గా ప్లాన్ చేసారో.. లేక యాధృచ్చికం గా జరిగిందో కానీ.. ఇది మీ రెండు వందలవ టపా కదా.. అది మీ నాన్న గారికి పుట్టిన రోజు సందర్భం గా శుభాకాంక్షలు చెబుతూ వెయ్యడం మీ బ్లాగ్ కి మరింత శోభ తెచ్చింది.

    మీ నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు... డబల్ సెంచరి సాధించినందుకు తమరికి స్పెషల్ అభినందనలు. మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  2. రెండు వందలవ టపా.. kevvvvvvvvvvv డబల్ సెంచరి సాధించినందుకు స్పెషల్ అభినందనలు
    .
    మొట్ట మొదటి సారి మధుర బ్లాగ్ కి వెళ్ళినప్పుడు మీ పేరులోనే కాదు మీ పోస్ట్ లలో కూడా స్వీట్ ఉందండి అని కామెంట్ పెట్టాను ..అప్పడినుండి స్వీట్ మధు అని పిలవడం మొదలు పెట్టాను ...

    మధురమైన కవితలు అల్లేస్తూ ఆ అల్లికలలో మనకి తెలియకుండానే మనల్ని బందిస్తూ
    మనోహరమైనా చిత్రాలతో మనసుని దోచేస్తూ
    మృదు మధురమైనా పాటలతో మనసుని దోచేస్తూ
    చిట్టి చిట్టి కథలతో చంటి పిల్లలా పెదవులపై చిరు నవ్వులా


    తన పోస్ట్ లు చదువుతుంటే నాకే కవితలోస్తున్నయంటే అబ్బబ్బా తన టాలెంట్ గురించి చెప్పడానికి నేను సరిపోను ...టాలెంట్ అనే పదానికి కి కూడా టాలెంట్ అంటే ఎలా ఉంటుందో చూసి నేర్చుకోవాల్సిందే నా మధు దగ్గర .. అనిపిస్తుంది అప్పుడప్పుడు

    నేను నాన్న కూతురినే ........నాన్నారికి జన్మదిన శుభాకాంక్షలు ..ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకావాలని కోరుకుంటున్నా

    ReplyDelete
  3. మీ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మధురా

    (మిగతాదంతా మంచు గారి కామెంట్ కాపీ పేస్ట్)

    ReplyDelete
  4. మీ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

    ReplyDelete
  5. మధురస్మృతులు... చాలా చక్కటి ఆలోచన. నాన్న గారికి చాలా మంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు మధురవాణి గారూ.. మీ నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు !
    తమరికి అభినందనలు :)

    ReplyDelete
  7. కంగ్రాట్స్ మధురా
    మీ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. మధుర..మీ నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు! మా నాన్న గుర్తొచ్చారు. మా నాన్న పుట్టినరోజు అక్టోబర్ ఒకటిన. చాలా యేళ్ళ తరువత ఈసారి నా దగ్గర ఉన్నారు. మా నాన్నగారు ఎప్పటినుండో టీషర్ట్ వేసుకోవాలని సరదాపడుతుంటే ఈసారి కొనిచ్చాను. రహస్యంగా కేక్ తెప్పించి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాం. మేము కూడా చిన్నప్పుడు నాన్న పుట్టినరోజుని చేసుకునేవాళ్లం కాదు. కానీ మేను పెద్దయ్యాక ఆయనకి శుభాకాంక్షలు తెలుపడం...ఏదైనా కొనివ్వడం చేస్తూ వచ్చాము. ఈ యేడాది నా చేతులతో నేనే పండుగ చేసాను..ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పలేను. నీ పోస్ట్ తో అవన్నీగుర్తొచ్చి కళ్ళలో సన్నటి నీటి పొర నిలిచింది.

    last but one para...అచ్చు నా మనసులోని మాటలే!

    రెండు వందల టపా శుభాకంక్షలు నీకు!

    ReplyDelete
  9. Soooooooooo Sweet మధురా.... మీ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన విధానం ఎంత బాగుందో.. మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది... చివరి నుండి రెండో పేరా చదివినపుడు మరీ...
    మీ నాన్నారికి నా తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
    రెండువందల టపాల మైలు రాయి చేరుకున్నందుకు మీకు అభినందనలు.

    ReplyDelete
  10. నా తరఫున మీ నాన్నగారికి పుట్టినరోజు జేజేలు, మీకు అభినందన మందారాలు.

    ReplyDelete
  11. స్వరాల వీణ మీటానండి. బ్యాగ్రౌండ్‌లో మంచి పాటలు వింటూ మంచి పోస్ట్ చదివాను. మీ నాన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. డబుల్ సెంచురీ కొట్టినందుకు మీకు అభినందనలు. సచిన్‌లా డబుల్ సెంచురీ అభివాదం చేస్తూ ఒక ఫోటో కూడా తీస్కోండి. బావుంటుంది. :p

    ReplyDelete
  12. Many more happy returns of the day to our God Father.. :)

    ReplyDelete
  13. Excellent and Touching Post..
    Birthday wishes to your father...

    ReplyDelete
  14. మీ నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు .
    మీ డబుల్ సెంచరీ కి అభినందనలు .

    ReplyDelete
  15. మీ నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు .
    మీ డబుల్ సెంచరీ కి అభినందనలు .

    ReplyDelete
  16. నాన్న గారికి శుభాకాంక్షలు నీకు అభినందనలు మధు

    చిన్నప్పటి నుండి మా ఇంట్లోనూ పుట్టినరోజులు చేసేవారు కాదుమధు ..ఇప్పటికీ నాకు అమ్మా నాన్న పెళ్ళిరోజు కూడా తెలియదు..ఈ మధ్య ఈ మధ్య మా చెల్లెళ్ళు గుర్తు పెట్టుకుని నాకు కాల్స్ చేస్తున్నారు ...ఇప్పటికీ నేను చెప్పను....నాకు చెప్పకపోయినా పట్టించుకోను..కాని మొదటిసారి నేను దాచిన డబ్బుతో వాళ్ళకు కొన్నప్పుడు ఎంత ఆనందం వేసిందో...చాల బాగా రాసావ్ మధు

    >>>>కాలేజ్లో నా ఫ్రెండ్సందరూ నిన్ను చూసి మీ అన్నయ్య వచ్చారు అని చెప్పినప్పుడు కూడా మహా గర్వంగా ఉండేదనుకో

    ఎందుకో నాన్నలు కూతుళ్ళ కంటికి మహా అందంగా అనిపిస్తారు కదా... ఇప్పటికీ మా నాన్న అంత అందంగా ఎవరూ నాకు కనిపించలేదు..:))

    ReplyDelete
  17. మీ నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు రెండువందల టపా మైలురాయిని చేరుకున్నందుకు అభినందనలు.

    మీ నాన్నగారి మీద మీకున్న ప్రేమ చూస్తే ముచ్చటగా ఉంది. ఈ పోస్ట్ చదువుతుంటే చాలా ఉద్వేగంగా అనిపించింది. బావుంది. నాకు నచ్చింది.

    ReplyDelete
  18. మీ నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు .
    మధుర వాణి అని, మీ స్వభావానికి సరిపోయే అతి చక్కటి పేరును ముందుగానే ఊహించి పెట్టినందుకు కూడా మీ నాన్న గారికి అభినందనలు తెలపాలి.

    SriRam

    ReplyDelete
  19. ఈ రోజు మా అమ్మాయి పుట్టిన రోజు భీ..

    ఇప్పుడే పిల్లల పార్టీ నుండి బయట పడ్డాను.. Congrats on 200th post, and happy birthday to your father!

    ReplyDelete
  20. Excellent!
    మీ నాన్న గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకంక్షలు :)
    Many Happy Returns of the day and congratulations :)

    ReplyDelete
  21. మనసుకి హత్తుకునేలా మీ నాన్నగారికి శుభాకాంక్షలు చెప్పిన విధానం చాలా బాగుందండీ. మా తరపు నుంచి కూడా మీ నాన్న గారికి జన్మదిన 'సుభా' కాంక్షలు.

    ReplyDelete
  22. Happy birthday to your Dad madhuraa!maa naannagaari puTTina roeju kooDaa eenelaloenae!

    ReplyDelete
  23. sentiment tho pindesav baby...:P

    Nee Intabbay

    ReplyDelete
  24. నాన్నగారికి హార్థిక,మధురమైన జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  25. మీ నాన్న గారికి మా జన్మదిన శుభాకాంక్షలు.
    ఇలా పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ మధురంగా శుభాకాంక్షలు చెప్పటమూ ఓ అందమైన అనుభూతే.

    ReplyDelete
  26. ప్రేమని అక్షరాల్లో పొందుపరిచిన ఈ మీ టపా చాలా మధురం గా ఉంది.

    మీ నాన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.

    ద్విశత టపాల నుంచి సహస్ర టపాలు దాకా దిగ్విజయం గా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభాభినందనలు.

    ReplyDelete
  27. Super andi...kallallo neellu theppincharu..

    ReplyDelete
  28. మా అమ్మ నాన్నల పుట్టిన రోజులు మాకు తెలియవు..వాళ్ళు కూడా మర్చిపోయారుట...!!!
    నాకు అమ్మాయిలు లేరని యీ రోజుతెగ ఫీలింగ్...(మీ పోస్టు చదివాక)
    నాన్న గారికి జన్మ దిన శుభాకాంక్షలు.మీకు ద్విశత టపా శుభాభినందనలు..

    ReplyDelete
  29. మీ నాన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.

    Congratulations for 200th post..

    ReplyDelete
  30. ఓహో హో మీ రెండు వందలో పోస్ట్కు ఒక స్పెషల్ కామెంట్ వచ్చినట్లుంది :))))

    ReplyDelete
  31. @ మంచు,
    బోల్డు బోల్డు ధన్యవాదాలండీ.. ముందుగా అనుకోలేదు రెండు వందలో పోస్ట్ ఇదే రాయాలని.. రెండ్రోజుల ముందే తెలిసింది అనుకోకుండా అలా కలిసొచ్చిందని. :)

    @ శివరంజని,
    నువ్వు కాదు నేను కెవ్వ్ వ్వ్.. నీ కామెంట్ చూసి.. అమ్మయ్యో.. ఈ పొగడ్తలన్నీ అచ్చంగా నాకేనా! హిహ్హిహ్హీ... నీకు బోల్డు థాంకులు.. :)

    @ పప్పు గారూ, నాగార్జున, జ్యోతిర్మయి, శ్రావ్య, లత, రమ్య, రాజేష్ మారం, మాలా కుమార్, అరుణ్ కుమార్, హరేకృష్ణ, శుభ, విజయమోహన్ గారు, చిన్ని ఆశ, బులుసు గారు, అనానిమస్ 2, జ్యోతి గారూ..

    మీ అందరి ప్రేమాభిమానాలకి చాలా సంతోషంగా ఉంది. మీ శుభాకాన్క్షలన్నీ నాకి అందించాను. తన తరపునా, నా తరపునా మిత్రులందరికీ బోల్డు ధన్యవాదాలు. :)

    ReplyDelete
  32. @ సౌమ్యా,
    మీ ఆనందాన్ని, మీ ఫీలింగ్స్ ని నేను సరిగ్గా ఊహించగలను. నిజంగా జీవితంలో వేల కట్టలేని అనుభూతులు అంటే ఇలాంటి క్షణాలేమో.. నాన్న మీ కామెంట్ చదివి నవ్వారు. :)
    థాంక్యూ.. :)

    @ వేణూ శ్రీకాంత్, శంకర్.S,
    థాంక్యూ సో మచ్.. రాసేప్పుడు నాక్కూడా ఉద్వేగంగా అనిపించింది. :)

    @ కౌశిక చాణక్య,
    హహ్హహః..స్వరాల వీణ మీటారా... థాంక్యూ! ఫోటో తీసుకోమంటారా.. ఉండండి.. మన రాజ్ ని పిలుద్దాం.. ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని తీసి పెడతారు.. :))

    @ అనానిమస్ 1,
    థాంక్యూ! ఈ కామెంట్ చూడగానే నువ్వే అనుకున్నా.. :))

    @ నేస్తం,
    నిజమే.. అమ్మానాన్నల కోసం ఏదన్నా చేసినప్పుడు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం కదా.. :)
    హహ్హహ్హా.. నిజమే ప్రతీ అమ్మాయికి ఫస్ట్ హీరో నాన్నేనేమో కదా! కానీ మా నాన్న నా ఒక్కదానికే కాదు అందరికీ చాలా అందంగా కనిపించేవారు. కాలేజ్లో అందరూ.. మీ డాడీనా.. నిజం చెప్పు..మీ అన్నయ్య కదూ.. He is very handsome.. అనేవారు.. :)))

    ReplyDelete
  33. @ జయహో,
    శ్రీరాం గారూ.. థాంక్యూ! అవునండీ మా నాన్న గారు నాకు చాలా మంచి పేరే పెట్టారు. :)

    @ కృష్ణప్రియ,
    మీ అమ్మాయికి ఆలస్యంగా పుట్టినరోజు జేజేలు.. ఇంతకీ చిన్నమ్మాయిదా పెద్దమ్మాయిదా..
    థాంక్స్ ఫర్ యువర్ విషెస్! :)

    @ ఎన్నెల గారూ,
    హహ్హహ్హా.. అమ్మాయిలైతేనే ఇంత ప్రేమగా ఉంటారంటారా అయితే.. అలా అనేస్తే అబ్బాయిలందరూ మన మీదకి పోట్లాటకి వస్తారేమో.. ;) థాంక్యూ సో మచ్!

    @ సునీత గారూ,
    థాంక్యూ! అయితే మన నాన్న గార్ల పుట్టినరోజులకి సేమ్ పించ్ అన్నమాట.. :)

    @ ఇంటబ్బాయ్ గారండీ..
    అంతేలే.. సచిన్ 200 కొడితే ఆ రోజంతా గాల్లో నడుస్తావా.. అదే నేను 200 పోస్టులు రాస్తే నన్నేం మెచ్చుకోలేదుగా.. :(
    ఏంటో, పెట్టక పెట్టక తమరు నా బ్లాగులో కామెంట్ పెడితే అది మెచ్చుకోలో, వెక్కిరింతో కూడా అర్థం కాలేదు నాకు..
    సరేలే.. ఏదోకటి.. కామెంట్ రాసినందుకు చాలా థాంక్స్.. :))

    @ శ్రావ్య,
    హహ్హహ్హా.. మరే.. స్పెషల్ కామెంటే వచ్చింది. నేను కూడా షాక్ అయ్యా.. :)))

    ReplyDelete
  34. chaala bagundi ...inthaki mee nannagari peru blog lo rayaledu enti ? maaku telusukovalani unnadi :-)

    ReplyDelete
  35. మధురవాణి గారూ,
    మీ పోస్ట్ ఆపాత మధురంగా ఉండటమేకాదు, మనసును ఆర్ద్రంగా తాకింది. నిజం చెప్పొద్దూ, నాకు మీలాంటి అమ్మాయిలేదే అన్న విచారం, ఉన్నతల్లిదండ్రులపట్ల కించిత్తు అసూయకూడా వేసింది.
    శుభాభినందనలు.

    ReplyDelete
  36. @ అనానిమస్,
    ధన్యవాదాలండీ.. హహ్హహ్హా.. మీ కోరిక బావుంది గానీ కనీసం మీ పేరైనా చెప్పనేలేదే మాకు.. ;)

    @ తెలుగనువాదాలు,
    మీ వ్యాఖ్య చాలా ఆనందాన్ని కలిగించిందండీ.. ధన్యవాదాలు.. :)

    @ S,
    థాంక్స్ మేడమ్! :)

    ReplyDelete
  37. @Madhuravani garu

    Naa peru Lakshmi andi :-)

    ReplyDelete
  38. @ లక్ష్మి గారూ,
    మనిద్దరికీ పరిచయం ఉందా? కొంపదీసి మీరు గానీ తెలుగులో సరిగ్గా రాయడం రాని నా ఫ్రెండ్ లక్ష్మి కాదు కదా!? :P

    ReplyDelete
  39. @ మధురవాణి గారు : హ్హ హ్హ లేదండి ... నాకు మీరు కేవలం ఈనాడు పేపర్ ద్వారా పరిచయం.

    లక్ష్మి

    ReplyDelete
  40. @ లక్ష్మి గారూ,
    నాకెందుకో అంతిదిగా నాన్నగారి పేరు చెప్పమని అడిగితేనూ నా ఫ్రెండ్ లక్ష్మి నన్ను ఆట పట్టిస్తుందేమోనని సందేహం వచ్చింది. :P
    మీరేం అనుకోకపోతే మీ ఈమెయిలు ఐడీ కామెంట్ పెట్టగలరా? నేను మీతో మెయిల్లో మాట్లాడతాను. మీ ఐడీ పబ్లిష్ చెయ్యను లెండి. :)

    ReplyDelete
  41. sweeeeet మెమోరీస్ కదా...!!! :))
    అన్ని క్యూట్ క్యూట్ పనులే చేస్తున్టావా? :P
    చాల ఆలస్యంగా మీ నాన్నగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు :)

    ReplyDelete
  42. @ కిరణ్,
    థాంక్యూ కిరణూ.. నిజంగానే చాలా స్వీట్ మెమోరీస్.. అందుకే అవన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది. :)
    హిహ్హిహ్హీ...అదేంటో కిరణూ.. చిన్నప్పటి నుంచీ అలా క్యూట్ క్యూట్ పనులు చెయ్యడం అలవాటైపోయింది నాకు.. (రాజేంద్రప్రసాద్ స్టైల్లో ఊహించుకో) :))))

    ReplyDelete
  43. మీ నాన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు!
    (కొంచెం ఆలస్యం గా చెప్పాను కదూ! నా విషెస్ అందచేయండి :) )
    చాలా బాగా రాసారు, ఇంతకు మునుపే చదివాను.. ఇది రివిజన్ అన్నమాట :))

    ReplyDelete
  44. @ ఫోటాన్,
    That's so sweet of you.. Thank you so much! :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!