Thursday, March 17, 2011

వెన్నెల వాన!


వరుసగా కొన్ని వారాలపాటు ఎటు చూసినా తెల్లగా కుప్పలు తెప్పలుగా మంచు తప్ప ఇంకేం కనపడలేదు కంటికి. ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి మెల్లగా మంచంతా కరిగిపోవడం మొదలయింది. ఇంతలో మంచు జాతర అయిపోయి వాన జాతర మొదలైంది.

ఇన్ని రోజులూ "అబ్బబ్బా.. ఎండైనా, వానైనా కొంతవరకూ భరించవచ్చు.. అన్నీటికంటే చలినీ, మంచునీ భరించడమే కష్టం బాబూ!" అనిపించింది కాస్తా ఉన్నట్టుండి పాట మార్చినట్టయింది. "బాబోయ్.. వర్షం ఎప్పుడు తెరిపినిస్తుందో.. చాలా విసుగ్గా ఉంది.." అంటూ కొత్త పాట ఇప్పుడు..

అబ్బ.. నిజంగా అసలీ వానకెంత ఓపికనీ! పగలూ రాత్రీ తేడా లేకుండా రోజుల తరబడి కురిసింది కురిసినట్టే ఉంటుంది.. అలాగని చెప్పా పెట్టకుండా గబగబా దూసుకొచ్చేసి ధడధడా ఉరుములూ మెరుపులతో దాడి చేసి ముంచేసే జడివాన కాదు మళ్ళీ!

ఆకాశమంతా నల్లటి మబ్బులతో కమ్మేసి మొహం మాడ్చుకున్నట్టుంటుంది. తన మనసులో ఏదో పెద్ద బాధని దాచుకుని పదే పదే అదే తల్చుకుని ప్రతీ క్షణం ఒక్కో కన్నీటి చుక్క కారుస్తున్న చందాన... అలుపూ సొలుపూ అంతూ అయిపూ లేనట్టుగా మెల్లగా, సన్నగా, విరామం లేకుండా కురుస్తూనే ఉండే వాన ఇది!

రోజుల తరబడీ అలా వాన కురుస్తోంటే మనకి కూడా బోల్డు దిగులొచ్చేసి భలే బెంగగా అనిపిస్తుంది.. నిజంగానే ఆకాశం మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తుందేమో.. తన మనసునంతా కరిగిస్తూ ఇలా వాన చినుకుల్లా రాలుస్తుందేమో అనిపించేస్తుంటుంది మనసుకి!

అలా కొన్ని రోజుల పాటు ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా కురిసిన వాన రోజు మధ్యాహ్నం దాటేసరికి కొద్దిగా తెరిపినిచ్చింది. నేనేదో పన్లో ఉండిపోయి బయటికి చూడనేలేదు చాలాసేపు.. సాయంత్రమయ్యే సమయానికి అనుకోకుండా కిటికీలోంచి బయటికి చూసి ఆశ్చర్యపోయా!

చినుకుల వాన ఆగిన చోటనే మళ్ళీ మంచు పూల వాన కురుస్తోంది. అప్పుడు సమయంలో మంచు పడుతుందని ముందుగా ఊహించకపోవడం వల్లనుకుంటా.. మరీ సంబరంగా అనిపించింది..

అసలే దట్టంగా కురుస్తున్న మంచుకి కాస్తంత గాలి కూడా తోడయిందేమో.. మంచు పూరేకులన్నీ అల్లిబిల్లి ఆడుతున్నట్టుగా వయ్యారంగా మెలికలు తిరుగుతూ వచ్చి నేలని తాకుతున్నాయి.

ఉన్నట్టుండి బయటికి చూస్తే అసలది మంచు కురుస్తున్నట్టు లేదు.. ఆకాశంలో ఎవరో దేవకన్యలు నించుని చేతుల్లో పెద్ద పెద్ద పూల బుట్టలతో తెల్ల గులాబీ రేకుల్ని అలా అలా మన మీదకి ఒంపేస్తున్నట్టుంది.. అచ్చంగా అలానే భ్రమపడ్డాను చాలాసేపు!

కిటికీ దగ్గరే నించుని అలా మౌనంగా బయటికి చూస్తుంటే ఎంత బాగుందో! ప్చ్.. కానీ ఏం లాభం.. ఎంత ఆత్రంగా పరుగులు తీస్తూ వచ్చిందో అంతే హడావిడిగా కాసేపు కురిసి పారిపోయింది దొంగ వాన!

అప్పుడప్పుడే మెల మెల్లగా చీకటి తెర వాలుతోంది.. నేను బయటికెళ్ళి అలవాటుగా ఆకాశంకేసి దిక్కులు చూస్తూ నడుస్తుంటే పక్కన నుంచి అప్పుడే చంద్రోదయం అవుతోంది.జోరుగా హుషారుగా గగన విహారానికి బయలుదేరిన చందమామ ఆకాశంలో పైపైకి వస్తూ కనిపించాడు..

పుత్తడీ వెండీ కలబోసి పోత పోసినట్టుగా మెరిసిపోతూ, గుండ్రంగా బూరె బుగ్గలతో, వెన్నెల మెరుపుతో మహా ముద్దొచ్చేస్తున్నాడు చందమామ! పున్నమి చంద్రుడన్నాక మాత్రం మెరిసిపోకుండా, మురిపించకుండా ఎలా ఉండగలడు మరి!

పౌర్ణమి చంద్రుడి అందానికి ఆకర్షింపబడి తననే చూస్తూ నడుస్తున్నానా.. ఇంతలో దోవ పక్కనున్న పెద్ద పెద్ద చెట్లు అడ్డం వచ్చాయి.. కానీ, శిశిరం రోజులు కదా ఇప్పుడు! అందుకని మాత్రం ఆకుల జాడే లేకుండా బోసిగా మిగిలిపోయిన మోడులే కాబట్టి చందమామని పూర్తిగా దాచిపెట్టలేకపోయాయి.. కానీ కాస్తంత పరిశీలనగా అటుకేసే చూస్తూ ఉండగా ఒక రమణీయ దృశ్యం నా కళ్ళబడింది..

అప్పటికే చాలా రోజుల నుంచీ వర్షానికి తడిసీ తడిసీ బాగా నానిపోయి ఉన్నాయా మోడులైన చెట్లన్నీ కూడా.. ఇప్పుడేమో కాసేపటి క్రితమే మంచు కురిసింది కదా.. అప్పుడు రాలిన మంచుపూలు కొన్ని నల్లటి చెట్ల కొమ్మల మీద ఒద్దికగా పేర్చినట్టు కొలువు దీరినట్టున్నాయి..

చెట్ల వెనకాలేమో వెన్నెలకాంతుల్ని వెదజల్లుతూ మెరిసిపోతున్న పున్నమి చంద్రుడు.. ఆహా...ఎంతందమైన దృశ్యం! అది చూసి ముచ్చటపడిపోయి నాకు తెలీకుండానే అడుగులేయడం మానేసి అటుకేసే అబ్బురంగా చూస్తూ నించుండిపోయాను!

మరి కాసేపటికి ఇంకో చిత్రం గమనించాను.. చెట్లకి చిటారు కొమ్మలుంటాయి కదా బుల్లి బుల్లివి సన్నగా తీగల్లాగా.. వాటి మీద నిలిచిన మంచు కరిగిపోయి కాబోలు.. సన్నటి కొమ్మల తీగలకి కిందవైపున సన్నగా ఊగుతూ నీటి బిందువులు.. అచ్చంగా వరుసలో ముత్యాలు కూర్చినట్టే ఉంది... మళ్ళీ వెనక నుంచి నీటి బిందువులని తాకుతూ పరావర్తనం చెందుతూ మిల మిలా మెరుస్తున్న వెన్నెల కిరణాలు...

అబ్బా.. దృశ్యాన్ని చూస్తునప్పుడు మనసు పరవశించిపోయింది.. మాటలకందని ఒక గొప్ప అనుభూతి! మంత్ర ముగ్ధురాలినైపోయి రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయాను.. ఎంతలా అంటే.. దృశ్యం శాశ్వతంగా నా కంటిపాపపై ముద్రించుకుపోయిందేమో అన్నంతగా!

అక్కడి నుంచి వచ్చేసాక అప్పుడు నా చేతిలో కెమెరా ఉంటే బాగుండేదేమో అన్న ఆలోచన వచ్చింది. ఒకవేళ ఉన్నా బయట కనిపించినంత అందంగా నేను ఫోటోల్లో బంధించలేనేమో అనిపించింది. అంతలోనే.. ఉహూ.. అసలు కెమెరా లేకపోవడమే బాగుంది.. అయినా, నా కంటిపాప బంధించిన జ్ఞాపకమంత అందంగా కెమెరా మాత్రం చిత్రించగలదు అనిపించింది..

నేను వెన్నెల వాన చూసి చాలా రోజులైపోయింది.. కానీ ఇప్పుడే చూసినంత తాజాగా మిగిలిపోయింది జ్ఞాపకం.. మళ్ళీ మళ్ళీ తలపుకొచ్చినప్పుడల్లా అప్పటి అనుభూతిని అక్షరాల్లో నింపి భద్రంగా దాచుకోవాలని అనుకుంటూనే ఉన్నాను. కానీ, ఏదోక రకంగా వాయిదా పడుతూ వచ్చిన పని ఇదిగో ఇప్పటికి పూర్తి చేశాను.. హమ్మయ్యా! :)

23 comments:

  1. "రోజుల తరబడీ అలా వాన కురుస్తోంటే మనకి కూడా బోల్డు దిగులొచ్చేసి భలే బెంగగా అనిపిస్తుంది.. నిజంగానే ఆకాశం మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తుందేమో.. తన మనసునంతా కరిగిస్తూ ఇలా వాన చినుకుల్లా రాలుస్తుందేమో అనిపించేస్తుంటుంది మనసుకి!"

    ఈ interpretation చాలా బాగుంది.

    ReplyDelete
  2. మధు మేము చూడలేకపోయిన .. నీ పోస్ట్ చదివి .. ఆ అనుభూతిని పొందేము .. అంత అద్బుతంగా రాసావు ..

    నేకో విష్యం తెలుసా .. భావుకత కి కావలసిన .. ముక్యమైనవి అన్ని నీ అనుభూతిలో ఉన్నాయ్ కదా .. మంచు వర్షం .. వాన .. వెన్నెల .. శిశిరం ... నువ్వు :)

    నేను ఇప్పటి దాక మంచు పడడం చూడలేదు తెలుసా :( హ్మ్ చూడడం నాకెప్పుడు ఈ అదృష్టం కలుగుతుందో ..

    ReplyDelete
  3. చాలా చాలా బావుందండీ

    ReplyDelete
  4. చాలా బాగా వ్రాశారు..

    ReplyDelete
  5. ఇంత అందమైన ప్రకృతి అందాలను చూడగలగటం, అందుకు సమయం దొరకటం కూడా అదృష్టం అండీ. మాకు కూడా మీ టపా ద్వారా ఆ ఆనందాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  6. మేము చూడలేకపోయిన .. మీ పోస్ట్ చదివి .. ఆ అనుభూతిని పొందేము .. అంత అద్బుతంగా రాశారు ..

    ReplyDelete
  7. చాలా బాగా రాసారు మీ పోస్ట్ చదివి వెన్నెల వాన ని ఎంజాయ్ చేశాను

    ReplyDelete
  8. bhaavaanni bhandhinchadam chala baagundi
    elanti elements unna bhaavaanni feel ayyettu chese aatmanu pattukoni bandhinchadam chaala baagundi ade andari manassulni matalakandani madhuraranubhutini ruchi chupistondi madhura garu......!!!!


    chaala baaga vrasaru ....

    ReplyDelete
  9. మా కంటికి ఆనని ప్రకృతి అందాలన్నీ మీ మాటలతో చూపించేశారు. చాలా బాగా వ్రాసారు.

    ReplyDelete
  10. చాలా బాగుంది. నా క్కూడా చూడాలని ఎంతో ఆశగా ఉంది. రేపటి సూపర్ మూన్ గురించి కూడా తప్పకుండా రాయాలి. ఆ ఫొటోలన్నీ చూపించాలి మరి.

    ReplyDelete
  11. మధురా, మంచి అనుభూతి, చక్కగా వ్రాసారు, నేను చూసింది మళ్ళీ పునశ్చరణ చేసుకున్నా!మంచుని ఎంత విసుక్కున్నా, ఎక్కడో ఇష్టం గా ఉంటుంది.ఆ విషయం గట్టిగా అంటే, ఇక్కడ అందరూ."పోవోయ్ పెద్ద బార్న్ కెనడియన్ లా పోసు"అంటారు!..నిజమే, ఫొటో తీయడం కంటె, గుర్తుంచుకోటం బాగుంటుంది కొన్ని సార్లు...

    కావ్యా..అందుకే మరి కెనడా రమ్మని చెప్పింది...మంచు అయిపోతోంది..తొరగా రావాలి!

    ReplyDelete
  12. చాలా చాలా బావుందండీ..
    మేము చూడలేకపోయిన .. నీ పోస్ట్ చదివి .. ఆ అనుభూతిని పొందేము ..

    ReplyDelete
  13. అబ్బ . . . నీ వెన్నెల వాన ఎంత బాగుందో ! అంతటి అందాన్ని చూడలేక పోయాను అన్న దిగులు ను , నీ పోస్ట్ పోగొట్టింది .
    థాంక్ యు మధురవాణి .

    ReplyDelete
  14. మదురవాణి గారు,

    మదురాతి మదురముగా ఉన్నది మీ మదురమైన రచన...

    - అనుదీప్

    ReplyDelete
  15. మా కళ్ళకి కట్టినట్టు చూపించారు ఆ సుందర దృశ్యాన్ని...

    ReplyDelete
  16. ఎక్కడికో తీసుకేల్లిపోయారు మమ్ముల్నందరినీ....

    ReplyDelete
  17. "...కానీ ఇప్పుడే చూసినంత తాజాగా మిగిలిపోయింది ఆ జ్ఞాపకం.. మళ్ళీ మళ్ళీ తలపుకొచ్చినప్పుడల్లా అప్పటి ఆ అనుభూతిని అక్షరాల్లో నింపి భద్రంగా దాచుకోవాలని అనుకుంటూనే ఉన్నాను"

    అందమైన భావన.

    ReplyDelete
  18. @ మురళీ, కావ్య, లత, గిరీష్, తృష్ణ, అరుణ్, సుమలత, క్రాతికుమార్ మలినేని, తేజస్వి, బులుసు సుబ్రహ్మణ్యం, జయ, హరే కృష్ణ, ఎన్నెల, గాయత్రి, మాలా కుమార్, అనుదీప్, స్ఫురిత, ప్రవీణ, తెలుగు కార్టూన్...

    నా అనుభూతిని మీదిగా భావించి స్పందించిన ప్రియ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. :)

    ReplyDelete
  19. @ కావ్య,
    మంచు వర్షం .. వాన .. వెన్నెల .. శిశిరం ... నేనా! హహహ్హా.. ఎంత పెద్ద పొగడ్త.. నేను నీ కామెంట్ చూసి అలా అలా ఆకాశం దాకా వెళ్లి ఇవాళే కిందకి దిగొచ్చా.. :)
    నీకు తొందర్లోనే మంచు వర్షం చూసే అదృష్టం కలగాలని ఆశీర్వదిస్తున్నా! :)

    @ తృష్ణ,
    నిజమేనండీ.. ఈ చలిదేశంలో ఉండటం ఒకోసారి విసుగనిపించినా మంచు వర్షాన్ని చూడగలుగుతున్నందుకు అదృష్టంగానే అనిపిస్తుంటుంది.. :)

    @ తేజస్వి,
    భలే అందంగా చెప్పారండీ! మీ ప్రశంసకి ధన్యవాదాలు.. :)

    ReplyDelete
  20. @ జయ,
    మీ సూపర్ మూన్ పోస్ట్ ఎక్కడా ఎక్కడా? తొందరగా రాసెయ్యండి మరి.. :)

    @ ఎన్నెల,
    సేమ్ పించ్! ఇక్కడినించి వెళ్ళిపోయాక మంచు ఉండదు కదా అని తలచుకుంటే, నాకిప్పుడే దిగులేస్తూ ఉంటుంది.. :(

    @ మాలా కుమార్,
    మంచు వాన నేరుగా చూసేద్దురు గానీ, బట్టలు సర్దేసుకుని ఇక్కడికి వచ్చేయ్యండి.. :)

    ReplyDelete
  21. @ సత్యవాణి,
    ధన్యవాదాలండీ! :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!