Friday, November 19, 2010

మా ఇంటబ్బాయ్ వంట!

ఇప్పుడు కార్తీక మాసం రోజులు కదా.. అందుకని బ్లాగుల్లో సరదాగా వనభోజనాల్లాగా ఉంటుంది. అందరం రకరకాల వంటల గురించి రాద్దామని జ్యోతి గారు ఒక అయిడియా ప్రకటించారు కదా! ఇవ్వాళ పొద్దున్న చాట్లో కనపడినప్పుడు ఆదివారం కోసం పోస్ట్ రాస్తున్నవుగా అనడిగారు. 'అంటే, అదీ, మరి.. అసలేంటంటే జ్యోతి గారూ.. నా బ్లాగులో వంటల జోలికి ఎప్పుడూ వెళ్ళలేదు కదా! అదీ గాక నా పనితనం గురించి బ్లాగ్జనులకు తెలీనిదేముంది పాపం.. అందుకని ఎంచక్కా మీరందరూ పెట్టే వంటలన్నీ భోం చేస్తానేం..' అని చెప్పి తప్పించుకుందామనుకున్నా. 'ఏం పాపం రోజూ ఇంట్లో తినట్లేదా తిండి. నీది కాకపోతే మీ ఆయన వంట గురించి రాయి' అన్నారు జ్యోతి గారు. ఆఫీసులో ఉన్నానని కూడా చూసుకోకుండా పాత సినిమాల్లో మాంత్రికుడిలాగా పగలబడి, విరగబడి నాలో నేనే నవ్వేసుకున్నా.gelakguling ఎందుకంటే, వెంటనే మా ఇంటబ్బాయ్ గారి పాకశాస్త్ర ప్రావీణ్యం గుర్తొచ్చి. మీకో అవగాహన రావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లి అలా ట్రైలర్ చూసొద్దాం పదండి.

మా ఇంటబ్బాయ్ గారి ఉద్దేశ్యం ఏంటంటే తనకి వంట చేయడం మీద అస్సలు ఆసక్తి లేదు. అసలు తను గట్టిగా తల్చుకోవాలే గానీ వంటయినా చిటికెలో చేసి అవతల పారెయ్యగల సత్తా ఉందట. (నిజంగానే పారేయ్యాల్సి వస్తుందేమోననే నా భయం కూడా jelir) ఏదోకటి పొట్టలో వేసెయ్యాలి బ్రతకడానికి అన్నట్టు ఉండాలట. దానికి తోడు, ఏదో అయిదు నిమిషాల్లో తినేసేదాని గురించి ఇన్నేసి గంటలు వంట కోసం ఇంత శ్రమ పడిపోవడం అవసరమా అని ఒక తర్కం కూడా. పాపం నేను కష్టపడి వంట చేస్తున్నా అదే మాట చెప్తాడనుకోండి. పర్లేదు.. కొంచెం మంచబ్బాయే లెండి!malu సర్లే, కథ పక్కదారి పట్టకుండా అసలు సీన్లోకి వచ్చేద్దాం. ఒకరోజు నీకు కనీసం ఆమ్లెట్ వెయ్యడమయినా రాదు.. అని నేను ఎద్దేవా చేస్తుంటే, ఇహ తన శౌర్య పరాక్రమాలని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించిన అబ్బాయ్ గారు అప్పటికప్పుడు ఆమ్లెట్ వేసేద్దామని కంకణం కట్టుకున్నారు. వంటగదిలోకెళ్ళి సీరియస్ గా ఆమ్లెట్ వేయడానికి అవసరమైన పెనం, ఒక గిన్నెలో పగలగొట్టిన గుడ్లు అన్నీ సిద్ధంగా పెట్టుకుని ల్యాబ్లో ఏదో పెద్ద ఎక్స్పెరిమెంటు సెటప్ చేస్తున్నప్పటిలా ఫోజు పెట్టి కాసేపు తీవ్రంగా ఆలోచించాడు.nerd తర్వాత నా దగ్గరికొచ్చి ఆమ్లెట్ వేయడం మొత్తం నేనే సొంతంగా చేసేస్తాను గానీ చిన్న విషయం మాత్రం చెప్పు అన్నాడు. సర్లే పాపం అని ఓకే అన్నా. రెండు గుడ్లు ఆమ్లెట్ కి ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా కారం వేస్తే చాలు కదా.. అన్నాడు. ఇంక చూసుకోండి.. నాకు 'రెండు రెళ్ళ ఆరు' సినిమాలో శ్రీలక్ష్మి గుర్తొచ్చి పావుగంటసేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వాను. తరవాత సర్లే పాపం అని ఆమ్లెట్ శిక్షణ ఇచ్చేశాన్లెండి.encem

ఇంకోరోజేమో పెసరట్టు వేస్తున్నా! అబ్బా.. దోసెలెయ్యడం ఏముంది.. చిటికెలో పని.. ఎలా వెయ్యాలో ఒక్కసారి చెప్పి నువ్వు పక్కకి జరుగు.. నేను వేసిస్తాను.. నువ్వు పండగ చేసుకుందువు గానీ.. అని చెప్పి నన్ను సోఫాలో కూర్చోబెట్టాడు. సర్లే అంత ధీమాగా చెప్తున్నాడు కదా పెసరట్ల పండగేదో చేస్కుందామని నేనూ ముచ్చటపడిపోయా! పెనం వేడెక్కాక ఒక గరిటెడు పిండి తీసుకుని పెనం మధ్యలో వేసి వెంటనే ఆలస్యం లేకుండా గబగబా గుండ్రంగా తిప్పాలి.. అంటూ అట్టెలా వెయ్యాలో వివరంగా చెప్పా. తరవాత ఎంతసేపైనా పెసరట్టు నా కంచంలోకి వచ్చిపడట్లేదేంటా అని ఎదురు చూసీ చూసీ అసలేం జరుగుతుందో చూద్దామని నేనే పొయ్యి దగ్గరికెళ్ళా! అబ్బాయి గారు జాలిగా మొహం పెట్టి 'సరిగ్గా రావట్లేదు' అన్నాడు. ఎందుకు రావట్లేదా అని చూద్దును కదా.. నాకు కళ్ళు తిరిగినంత పనైంది.hah అబ్బాయ్ గారు వేడి వేడి పెనం మీద గరిటెడు పిండి వేసి, అచ్చంగా నా సలహా పాటించి వెంటనే గబా గబా గుండ్రంగా తిప్పేస్తున్నారు. కాకపోతే గరిటె ఉన్న చోటే గిరగిరా తిరుగుతోంది తప్పించి పెనం అంతా తిరగట్లేదు.jelir మళ్ళీ నా పొట్ట చెక్కలైపోయింది నవ్వీ నవ్వీ! నీకంటే స్కూల్ పిల్లలు నయం.. సరిగ్గా చేసుండేవారు అని ఆటపట్టించా నేను. చివరికి తను తేల్చిందేంటంటే గైడ్ సరిగ్గా లేకపోవడం వల్లే ప్రయోగం పాడయింది తప్పించి అందులో రీసెర్చ్ స్కాలర్ తప్పేమీ లేదట!kenyit

ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది.. ఇహ ప్రెజెంట్ లోకి వచ్చెయ్యండి. ఇప్పుడు అర్థమయ్యిందిగా మీకు.. వనభోజనాలకి వంట రెసిపీ, అదీ మా ఇంటబ్బాయ్ గారి రెసిపీ అంటే.. నేనెందుకు అంతటి వికటాట్టహాసం చేయాల్సి వచ్చిందో! రోజు పొద్దున్నే మరీ అంత బడాయిగా నవ్వేశానా.. సాయంత్రం ఇంటికొచ్చాక ఇవాళ అనూహ్యంగా తన చేతి వంటే తినాల్సి వచ్చింది. అదెలాగో, రెసిపీ ఏంటో నేను కూడా మన బ్లాగ్మిత్రులందరితో పాటు ఎల్లుండే పోస్ట్ చేస్తాను. కాస్కోండి మరి!celebrate

27 comments:

  1. మధురవాణి,
    " మా ఇంటబ్బాయ్ గారి ఉద్దేశ్యం ఏంటంటే తనకి వంట చేయడం మీద అస్సలు ఆసక్తి లేదు. అసలు తను గట్టిగా తల్చుకోవాలే గానీ ఏ వంటయినా చిటికెలో చేసి అవతల పారెయ్యగల సత్తా ఉందట. (నిజంగానే పారేయ్యాల్సి వస్తుందేమోననే నా భయం కూడా....."
    ఈ మగవాళ్ళందరికీ సేమ్ టు సేమ్ డైలాగులు వస్తాయి కాబోలు...మా ఇంట్లో కూడా ఇవే డైలాగులు వినిపిస్తూ ఉంటాయి. మనం ఏదైనా చేయమని అడిగితే మాత్రం...ఫలితాలు...:-))
    ఆదివారం రాయబోయే విషయాల కోసం ఎదురుచూస్తాను..

    ReplyDelete
  2. వహ్వా...వహ్వా...బాగుంది, బాగుంది. రెండో భాగం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తాను. తొందరగా వదలండి మరి:)

    ReplyDelete
  3. hahaha. ilanti valle tarvatha baga chestaru thelusa :)

    nadi naku gurtu vastundi ee post chaduvuthunte, oka sari nenu kuda gaarelu cheddam ani vantintloki velli nune vedi chesi travtaha gaare chesi pi nunchi vesa anthe tap mani aa vedi nune vachhi na cheyi mida padi, akada gaatu padindi. ika appati nunchi baga thelisindi ela veyyalo :)

    ReplyDelete
  4. నా సపోర్టు మీ ఇంటబ్బాయికే! గైడుని ఎందుకు ఎందుకు గౌరవిస్తాం? ? సరిగ్గా చెప్పడానికే కదా! గైడు దే తప్పు ఈ కేసులో!

    గైడు డౌన్ డౌన్!

    ReplyDelete
  5. హహ్హహ్హ.....హిహిహి..మీ ఇంటబ్బాయ్ గారి పాట్లు ఉహించుకుంటున్నానండి.
    నేను వేసిస్తాను.. నువ్వు పండగ చేసుకుందువు గానీ..పోన్లెండి!ఈ మాటన్నా అన్నారు.ఏదో పాపం ట్రై చేసారు:).

    ReplyDelete
  6. పాపం కదా మంచబ్బాయ్ అనిచెప్పి ఇంటబ్బాయ్ చేత వంట మొదలుపెట్టించేసారా?? ఇలా పని చేయించడం లో కూడా మీరు చాలా పనిమంతులు అన్నమాట మధుర గారు

    ReplyDelete
  7. మీకు అసలు సంగతి అర్థం కావట్లేదు. పొరపాటున వున్న పాక శాశ్త్ర ప్రావీణ్యం ప్రదర్శించామనుకోండి .. అది టైం పాస్ వ్యాపకం దాటి పర్మనెంట్ పనైపోద్ది అని మా భయం. మా అన్నొకడు అలానే వంటగదికి బుక్ ఐపొయ్యాడు పాపం.

    ఐనా వండి పెడుతుంటే తిని పెట్టడం లో ఉన్న మజా .. అనుభవిస్తేనె తెలియునులే .... ల ల లా లా లా....

    ReplyDelete
  8. అలా చేసి మంచబ్బాయ్ అని మార్కులు కొట్టేసి పనంతా నీతో నే చేయిస్తున్నాడా మీ ఇంటబ్బాయ్ . హుం పిచ్చిపిల్ల !

    ReplyDelete
  9. పాపం ఏదో మీకు సహాయం చేసి పెడదాం అని ట్రై చేస్తే అమాయకుడిని చేసి ఏడిపిస్తారా? :)

    ReplyDelete
  10. వధ్ధు మధురా వద్దు వాళ్ళకు వంట నేర్పించద్దు...ఈ మధ్య తను ఆంలెట్ వేయడం నేర్చుకుని ..నీ మొహానికి ఎప్పుడన్నా ఇంత బాగా వేయడం వచ్చా.. నేను కాబట్టి నేను కాబట్టి నేను కాబట్టి అని ఒక రేంజ్ లో నస ..సాయం మాట దేవుడెరుగు.. ఓరిబాబోయ్ ఆ గోల భరించలేకపోతున్నా

    ReplyDelete
  11. అవును ఈ విషయంలో గైడుదే తప్పు. మాసపోర్టంతా మీ ఇంటబ్బాయికే. ఇంకా మూడునెలలైనా కాలేదు అప్పుడే ఇంటబ్బాయిని చంటబ్బాయ్ చేద్దామని కుట్రపన్నారన్నమాట.:)

    ReplyDelete
  12. ఇంటమ్మాయి(గైడ్)డౌన్ డౌన్,ఇంటబ్బాయ్ జిందాబాద్ జిందాబాద్.

    ReplyDelete
  13. హహ్హ! మధురగారు...సూపరండీ మీ ఇంటబ్బాయిగారు.మీకొక సీక్రెట్ చెప్పనా? వంట వచ్చిన మగవారితో వేగలేమండీ...'ఇది ఇలా ఉందెం? అల చేస్తే బాగుండేది....నేనైతె ఇలా చేసేవాడిని..' ఇలా అన్నమాట(ఉదాహరణ మా ఇంటబ్బాయి :P).అదే మీ ఇంటబ్బాయిలా ఐతే..మనం ఏంచేస్తే అదే ఫైనల్.బాగున్నా...బాగోకపోయినా...'అది అంతే.అలగె చేస్తారూ ' అని చెప్పేయొచ్చు :))

    ReplyDelete
  14. ఆహా ఏమి భాగ్యము, నేస్తంగారు ఐతే మా అద్దెచ్చులు వంట కుడా అదరగొట్టేస్తున్నారన్నమాట, ఇంతకీ శొంఠి మీద ప్రయోగాలు ఏమైనా చెయ్యమని నా కోరికగా చెప్పండి.

    ReplyDelete
  15. హ హ మధురగారు బాగున్నాయండి మీ ఇంటబ్బాయ్ కబుర్లు :-) నా సపోర్ట్ కూడా తనకే (గైడ్ దే తప్పు:)

    ReplyDelete
  16. :) - నాదీ ఒకేమాట: గైడుదే తప్పు!

    ReplyDelete
  17. ఏదో సాయం చేద్దామని ప్రయత్నిస్తుంటే మీరు మరీనూ. :) మెల్లిగా నేర్పించేయండి. :)

    ReplyDelete
  18. నలభీములకు ఏకలవ్య శిష్యులుగా ఉండి బొటన వేలు కూడా దానం ఇచ్చేసా partial గా... onions తరుగుతున్నప్పుడు

    pcch :(
    నా ప్రఘాడ సానుభూతి తెలియచేసుకుంటున్నా

    మీరు డెమో ఇచ్చి వదిలేయడమేనా..స్లిప్ లు గట్రా లేవా అని ప్రశ్నిస్తున్నా అధ్యక్షా!

    ReplyDelete
  19. @ కల్పన రెంటాల,
    హహ్హహ్హా.. నిజమేనండీ.. వంటనే కాదు.. ఏ విషయంలోనైనా సరే అబ్బాయిలందరికీ ఈ డైలాగ్ మాత్రం ఎప్పుడూ నాలిక చివరే ఉంటుంది. :)

    @ జయ,
    అయితే మా ఇంతబ్బాయ్ వంట మీకు నచ్చిందన్నమాట! ధన్యవాదాలండీ! :)

    @ swapna@kalalaprapancham,
    బాబోయ్ కొత్తలోనే గారెలు వేసే ప్రయోగం చేశారా! ఏదో అమ్లెట్టు, అట్టూ అంటే సేఫే గానీ, మరీ గారెలు, బూరెలు చేయడమంటే కొంచెం ప్రాక్టీస్ కావాలి. ముఖ్యంగా వేడినూనెతో మహా డేంజరు. జాగ్రత్త సుమా!

    @ రాధిక (నాని),
    మరేనండీ! ఆ మాటన్నాడు కదా అనే నేను ఈ పండగ చేస్కోవాల్సి వచ్చింది. :) :)

    @ శివరంజని,
    మరేంటనుకున్నారు! అసలు పనిమంతురాలికి ఉండాల్సిన మొదటి లక్షణం ఇదే! మొత్తానికి మీరు నా పనితనాన్ని గుర్తించేశారు. థాంక్యూ! :)

    ReplyDelete
  20. పొరటు చెయ్యడంలోను ... ఆమ్లెట్ వెయ్యడంలోను.. నూటొక్క జిల్లాల్లో నన్ను కొట్టేవోడే పుట్టలేదు :-))

    ReplyDelete
  21. నీతి: ఒక పీహెచ్డీ వారికి మరియొక పీహెచ్డీ వారు వంట నేర్పకూడదు. నేర్పిన యిట్లే యగును.

    ReplyDelete
  22. @ అనానిమస్,
    మీరు చెప్పిన లాజిక్ కూడా నిజమే కానీ, మా ఇంటబ్బాయ్ కి ఇది వర్తించదనుకుంటా! ఎందుకంటే.. పాపం నేనలా తనని పర్మనెంట్ వంటబ్బాయ్ ని చెయ్యను కదా! :)

    "ఐనా వండి పెడుతుంటే తిని పెట్టడం లో ఉన్న మజా .. అనుభవిస్తేనె తెలియునులే .... ల ల లా లా లా...."
    ఇది మాత్రం వందకి వెయ్యి శాతం నిజం! :)

    @ మాలా కుమార్,
    అంతేనంటారా? అయినా పాపం, వంట పని ఒక్కటే లెండి పూర్తిగా నేనొక్కదాన్నే చేస్తున్నది. కాబట్టి.. క్షమించేద్దాం లే! :)

    @ సాయి ప్రవీణ్,
    ఇది మరీ బాగుంది.. నేనెక్కడ ఏడిపించానూ! :)

    @ నేస్తం,
    ఇది మాత్రం నిజం.. సాయం మాట దేవుడెరుగు.. వాళ్ళ కోతలు మాత్రం కోతలు దాటతాయి. వినలేక చావాలి. ;) ఏదో అవసరంలో పనికొస్తుందని ఆమ్లెట్టు, పొరటు నేర్పించాలెండి. ఇంకా ఆ తరవాతవి నేను నేర్పించాలనుకున్నా అబ్బాయి గారికి అస్సలంటే అస్సలు ఆసక్తి లేదు. :)

    @ ఇందు,
    హీ హీ హీ.. ఈ సీక్రెట్ నాకు ముందే తెలుసుగా! అందుకే మా ఇంటబ్బాయ్ వంటలో ప్రావీణ్యం సంపాదించి నలభీముల రేంజ్ లో వంట చేసెయ్యాలని అస్సలు అనుకోవట్లేదు. ;) పైగా మీరన్నట్టు.. నేను చేసే వంట ఎలా ఉన్నా.. 'అదంతే చేస్తారు.. రుచి అలాగే ఉంటుంది..' అని చాలా ఘట్టిగా చేప్పేస్తుంటాను. ;)

    ReplyDelete
  23. @ సవ్వడి,
    :) :) థాంక్యూ!

    @ శిశిర,
    :) :) ఇలాంటి పెంకి విద్యార్థులకి నేర్పించడం అంత వీజీ కాదండి. దాని బదులు ఆ పనేదో మనం చేస్కోడమే సుఖం! :)

    @ హరేకృష్ణ,
    ఏకలవ్య శిష్యరికం అంటే ఇదా.. ఇప్పటిదాకా తెలీనే లేదే! ;)
    మీ సానుభూతిని అందజేస్తాం. :)
    ఏంటి సార్.. స్లిప్పులూ గట్రానా.. ఇంతోటి పరీక్షకి మళ్ళీ స్లిప్పులు కూడానా! ఇంకా నయం డబ్బులిచ్చి పాస్ చేయించమన్లేదు. :)

    @ రామకృష్ణారెడ్డి కోట్ల,
    అవునా! అయితే ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటే మీ దగ్గర శిష్యరికానికి చేరితే బెటర్ అన్నమాట! :)

    @ కొత్తపాళీ,
    హహ్హహ్హా.. కథలో నుంచి భలే నీతిని సంగ్రహించారు గురువు గారూ! :) :)

    ReplyDelete
  24. @ సుజాత, 3g, శ్రీనివాస్ పప్పు, వేణూశ్రీకాంత్, జేబి - (JB),

    హన్నా.. గైడ్ డౌన్ డౌన్ అంటారా.. అసలు మీ అందరికీ ఈ క్రింది విషయాలు గుర్తున్నాయా!

    గైడ్ దగ్గర చేరే ముందు ఏ రీసెర్చ్ స్కాలర్ అయినా తెలుసుకోవాల్సిన రూల్స్:
    1. ఏదైనా ప్రయోగం వికటించిన యెడల, దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది ఎప్పుడైనా స్కాలరే గానీ, గైడు కాదు.
    2. ఏదైనా ప్రయోగము ఫలించిన యెడల ఆ క్రెడిట్ మొత్తం గైడుదే తప్ప ఆ స్కాలరుది ఏ మాత్రమూ కాదు.
    ౩. గైడు వచ్చిస్కాలరుతో గొడవపడినా, స్కాలరే వెళ్లి గైడుతో వాదన పెట్టుకున్నా.. చివరికి నష్టం స్కాలరుకే!
    ఎవరైనా పీహెచ్డీలో చేరాలంటే ఇవి మాత్రం గుర్తుంచుకోవాలి కదా! :D
    అంచేత గైడు ఎప్పుడూ తప్పు చేసే అవకాశమే లేదని మనవి చేస్తున్నాను అధ్యక్షా! ;)

    ReplyDelete
  25. wow chala bagundi mee intabbay katha inthaki mee intabbay peru cheppaney ledhu?

    ReplyDelete
  26. @ హర్షా,
    ధన్యవాదాలండీ! అంటే.. ఇక్కడ వంట ముఖ్యం గానీ, పేరు కాదు కదండీ.. అందుకే చెప్పలేదన్నమాట! ;) :D

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!