Tuesday, March 31, 2009

తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి.. తెలుసుకో నన్నే నీ గుండెనే తెరిచి..!!

హాయ్ హాయ్..!

వేళ మీ అందరికీ ఒక మంచి పాటని గురించి చెప్దామని వచ్చాను. పైన కనిపిస్తున్న టైటిల్ పాట పల్లవి. సూపర్ స్టార్ కృష్ణ గారి కుమార్తె మంజుల నిర్మాణంలో ఛార్మి, మంజుల ఇద్దరూ కలిసి నటించిన 'కావ్యాస్ డైరీ' అనే సినిమాలోది పాట. పాటలు రిలీజ్ అయ్యి చాలా రోజులవుతుంది కానీ.. సినిమా ఇంకా విడుదలవ్వలేదు. ఎందుకో మరి.? సినిమా సంగతేమో గానీ.. పాటలు మాత్రం అన్నీ మెల్లగా సాగే మెలోడీస్. సినిమాకి 'మను రమేశన్' అనే కొత్త సంగీత దర్శకుడు స్వరాలందించారు.



ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే పాటని అనంత శ్రీరాం రాశారు. కార్తిక్, రీటా కలిసి ఎంత బాగా పాడారంటే.. పాట అయిపోయాక కూడా మనని వెంటాడుతున్నట్టుగా ఉంటుంది. అసలు కార్తీక్ పాడిన చాలా పాటలు నాకు అలాగే అనిపిస్తాయి. మనసు పెట్టి పాడతాడేమో మరి.. అందుకే అతని గొంతులో అంత మాధుర్యం పలుకుతుంది. అసలు పాట భావం బావుంటుంది. ఇంకా పాడిన వాళ్ళిద్దరూ నిజంగా స్పందించి పాడినట్టుగా ఉంటుంది వింటుంటే. అందుకే ఆ అందం వచ్చిందనుకుంటా పాటకి..! నేను చెప్పడం ఎందుకులే గానీ.. మీరే చెవి ఇటు పడెయ్యండి ;)


అప్పుడెప్పుడో వచ్చిన మంజుల సినిమా 'షో' చూసారా? దర్శకుడు నీలకంఠకి బెస్ట్ స్క్రీన్ ప్లే జాతీయ అవార్డ్ వచ్చింది. రొటీన్ గా ఉండే సినిమాలు కాకుండా.. వైవిధ్యంగా ఉండే తెలుగు సినిమా చూడాలనుకుంటే తప్పకుండా సినిమాని ట్రై చేయండి. ఇప్పుడు రాబోయే 'కావ్యాస్ డైరీ' సినిమా కూడా బావుంటుందేమో అనుకుంటున్నాను నేనయితే. ఏమో మరి చూద్దాం విడుదలయ్యాక.! పాట సాహిత్యం చూడండి ఒకసారి మరి.!

తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి..
తెలుసుకో నన్నే నీ గుండెనే తెరిచి..
తెలపాలి నువ్వు ఐనా..
తెలపాలి నువ్వు ఐనా.. నేనే..తెలుపలేకున్నా..!

తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి..!

నీ చేరువై నేనుండగా.. దూరమేమిటో ఇంతగా..
అనుకొనే నా మనసునే వినవా.. ..!
నీ శ్వాస సోకితే చాలని.. ఆశ ఇంకిపోలేదని..
నిజమునే.. నీ పెదవితో అనవా.. హో..!
తలచుకుంటాను నువు ననే తలచేవని క్షణం..!
నిదుర లేస్తాను ఎదురుగా కదలేవనీ దినం..!
నేనే..!!

అపుడేమో పెదవిపై నవ్వులే.. ఇపుడేమో నవ్వులో నలుపులే..
ఎందుకా చిరునవ్వులో మసకా.. ..!
అపుడెంత కసిరినా మాములే.. ఇపుడేమి జరిగినా మౌనమే.!
ఎందుకే నీ మాటలో విసుగా.. ..!
కలిసి రావాలి వెంటనే.. కాలాలు మనకోసమై..
దరికి చేరాలి అంతలో భారాలు మమకారమై..
నేనే తెలుపలేకున్నా..!
నీతో... నేనే... తెలుపలేకున్నా..!


పాటని మీరు download చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి. విని ఆనందించండి.
మళ్లీ కలుద్దాం.!
ప్రేమతో..
మధుర వాణి

8 comments:

  1. పాటని చక్కగా పరిచయం చేశారు. యువ సిని కవుల్లో అనంత శ్రీరామ్ బాగా రాస్తున్నాడండి.. క్లాస్, మాస్ రెండూ కూడా.. ఎప్పటినుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా.. ఇప్పుడు సందర్భం వచ్చింది. 'రాజ మకుటం' లో లీల పాడిన 'సడి సేయకే గాలి' పాట ఎమ్పీత్రీ ఫార్మేట్ లో దొరుకుతుందా?

    ReplyDelete
  2. మురళి గారూ..
    ఆ పాట ఉంది కానీ.. మరీ అంత గొప్ప క్వాలిటీ కాదు.
    మీ మెయిల్ ఐడీ ఇవ్వండి. పంపిస్తాను.

    ReplyDelete
  3. మధురవాణి గారూ ! ఈ పాట నేనూ విన్నానండీ ...చాలా బావుంది .సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా ...

    ReplyDelete
  4. మధురవాణి గారూ నేనూ ఆ సినిమా కోసం చాన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నానండీ. ఆ మధ్య రిలీజ్ అన్నారు కాని ఎందుకో మళ్ళీ ఆపేసారు. ఈ పాట టి.వి. లో ఇచ్చేవాడు. ఇప్పుడు ఇవ్వటం లేదు. మంజుల, చార్మి ఇద్దరూ అక్కా చెల్లెళ్ళలా భలే వున్నారుకదా .

    ReplyDelete
  5. సరిగ్గా గుర్తు చేసారు మధురవాణిగారూ,

    చూసాను కాని, మీ వ్యాఖ్య చూసాక, దానిని కూడా జతచేయాలనిపి౦చి౦ది. అడగకనే ఆత్రేయ గారు అ౦గీకరిస్తారనే నమ్మక౦తో చేసిన పని ఇది. ఎవరికీ అభ్య౦తర౦ లేదనే అనుకు౦టున్నాను. మెచ్చుకున్న౦దుకు ధన్యవాదాలు!

    ఈ పాటల పరిచయ కార్యక్రమ౦ బావు౦ద౦డీ. ఆ సినిమా కోస౦ ఎ౦తమ౦ది ఎదురు చూస్తున్నారూ? కాని వచ్చాక నచ్చదేమో అనిపిస్తో౦ది నాకు ఒక మాట విన్నప్పటిను౦చీ. ఇ౦దులో ఛార్మీ విలనట కదా. మ౦జుల భర్తని చ౦పటానికి తనతో స్నేహ౦ చేస్తు౦దట. నాకె౦దుకులె౦డి, అసలే ఎదురుచూసే వాళ్ళున్నారిక్కడ, కొట్టినా కొడతారు.

    ReplyDelete
  6. @పరిమళం, లలిత..
    అవునండీ.. మంజుల, ఛార్మీ ఆక్కాచెల్లెళ్ళలాగా భలే ముచ్చటగా ఉన్నారు. మనమైతే ఎదురు చూస్తున్నాం కానీ..సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మరి..!
    @ఆనంద్
    సినిమా బావుంటుందని ఏదో అలా ఆశిస్తున్నాం.అయినా అసలు రిలీజ్ అయితే ఏ సంగతీ చెప్పలేం నచ్చుతుందా లేదా అని.
    ఎంత ఎదురు చూసే వాళ్ళమైనా.. మిమ్మల్ని ఎందుకు కొడతామండీ మీరు మరీనూ ;)
    ఏది ఏమైనా సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ చర్చించుకుందాంలెండి..!

    ReplyDelete
  7. Wow..nice song madhura..
    now this song is haunting me too..
    chaala baaga nachindi naaku ee paata.
    Album lo migatha songs baagunnayi..
    Thanks for introducing this song..
    You have got nice taste..

    ReplyDelete
  8. కావ్యాస్‌డైరీలో పాటను ఇది వరకు విన్నాను గానీ... మీరు ఆ పాటను పరిచయం చేసిన తర్వాత ప్రత్యేకంగా మళ్లీ మళ్లీ విన్నాను. ప్రేమలో వున్నపుడు... ఆ తర్వాత చిన్న గొడవలు పడినపుడు ఎలాంటి పరిస్థితులు, ఫీలింగ్స్‌ వుంటాయో ఆ పాటలో కన్పించింది. బై...

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!