Saturday, November 01, 2008

మా తెలుగు తల్లికి మల్లెపూదండ...!!!

నమస్కారం..!
ఈ రోజు మనం ఆనందోత్సాహాలతో గడపడానికి రెండు కారణాలు ఉన్నాయి.
మొదటిది ఇవ్వాళ తెలుగు భాషను మాట్లాడే వాళ్ళందరి కోసం ప్రత్యేక రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజు. మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి మరీ మనకి ఈ భాగ్యాన్ని కలిగించారు. ఆ మహానుభావుని ఒకసారి స్మరించుకుని మన జోహార్లు తెలుపుదాం.
మరో సంతోషకరమైన వార్త ఏంటంటే.. ఈ ఏడు ఆంధ్ర అవతరణ దినోత్సవానికి మనకొక అపురూపమైన బహుమతి లభించింది. అదేంటంటే... మన కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకి ప్రాచీన హోదాని కలిగించింది. 1500 వందల సంవత్సరాల మన గత చరిత్రని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు కమిటీ సభ్యులు. సంస్కృతం, తమిళం తరవాత ఈ ప్రాచీన హోదాని పొందిన భారతీయ భాషలుగా తెలుగు, కన్నడ ని మన ప్రభుత్వం గుర్తించింది.మరి మనం గర్వించదగ్గ విషయమే కదా ఇది..!
ఈ సంతోషంలో.. మన శంకరంబాడి సుందరాచారి గారు రాసిన తెలుగు తల్లి గీతంతో అభివందనం చేద్దాం..!

మా తెలుగుతల్లికీ మల్లెపూదండ
మా కన్నతల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లీ

గల గలా గోదారి కదలిపోతుంటేనూ
బిర బిరా కృష్ణమ్మా పరుగులిడుతుంటేనూ
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి ఉండే దాకా

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం - నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లీ..! జై జై తెలుగు తల్లీ..!!
చివరగా ఒక చిన్నమాట.. తెలుగువారందరం తెలుగులోనే మాట్లాడదాం..!!

ప్రేమతో..
మధుర వాణి

2 comments:

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!