స్వాగతం..!
ఇవ్వాళ నేను చెప్పే పాట గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది చాలా ప్రజాదరణ పొందిన పాట.
"ఇది మల్లెల వేళయనీ..ఇది వెన్నెల మాసమనీ..తొందరపడి ఒక కోయిల ముందే కూసింది..విందులు చేసింది..."
ఈ పాట 1968 లో వచ్చిన సుఖదుఃఖాలు అనే చిత్రం లోనిది. S.P.కోదండపాణి గారు స్వరపరిచిన ఈ పాటను మన గాన కోకిల P.సుశీల గారు పాడారు. ఈ సినిమా లో supporting role లో చెల్లెలు పాత్రలో నటించిన వాణిశ్రీ గారి మీద ఈ పాటని చిత్రించారు. ఈ పాట చాలా hit అవడంవల్లనే వాణిశ్రీ గారికి నటిగా break వచ్చింది. ఈ పాటని రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. తెలుగులో భావకవిత్వ (romantic poetry) ఒరవడిని తీసుకురావడంలో దేవులపల్లి వారిని ప్రసిద్ధంగా చెప్తారు. దేవులపల్లి గారు సినిమాల కోసం ప్రత్యేకంగా పాటలు రాసేవారు కాదట. ఆయన రచనల్లోని పద్యాలను సినిమా నిర్మాతలు అడిగి తీసుకుని యధాతధంగా పాటలుగా వాడుకునేవారట. ఈ విషయం ఈనాటి మేటి సినిమా పాటల రచయిత అయిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో చెప్తుంటే నేను ఒకసారి విన్నాను. ఆయన పద్యాలంటే అంత మక్కువ మరి అందరికీ. ఈ పాట గురించి ఒక ఆసక్తికరమైన సంగతి ఒకటి నేను ఎక్కడో చదివాను ఒకసారి. అది ఏంటంటే ఈ పాట పల్లవిలో ఇది మల్లెల వేళయనీ..ఇది వెన్నెల మాసమనీ..అని వస్తుంది కదా..! ఇది విన్నప్పుడు మీకేమైనా సందేహం వచ్చిందా? మల్లెలు వేసవి మాసాల్లోనే వస్తాయి కదా..వెన్నెలేమో రాత్రి వేళల్లోనే వస్తుంది. అందుకని దేవులపల్లి వారు ఇది వెన్నెల వేళయనీ...ఇది మల్లెల మాసమనీ.. అని రాసారట. అయితే ఆయన దగ్గర రాసేవారో, లేక సినిమాకి పని చేసేవారో ఎవరోగానీ పొరపాటున అటుది ఇటు ఇటుది అటు చేసేశారన్నమాట. ఇంకేముందీ..చివరికి పాట ఇలా అయిపోయింది. కానీ విచిత్రమేమిటంటే, ఈ పాట విన్నవారెవరికీ అలాంటి సందేహం రాదు. పైగా ఇప్పుడు అలా అనుకుందామని ప్రయత్నించినా ఇప్పుడు ఉన్నట్టుగా ఉంటేనే పాట బావుంది అనిపిస్తుంది. అదే మరి దేవులపల్లి వారు రాసిన ఈ పాటలో దాగున్న మాయ. సరే మరి మీరందరూ కూడా ఈ పాటని విని ఆనందించండి. ఊరికే విని ఆనందించి ఊరుకోకుండా మీ అభిప్రాయం చెప్పచ్చుగా.. ఒక్క రెండు వాక్యాలు రాస్తే మీ కంప్యూటర్ అరిగిపోదులెండి.. :) సరే మరి.. చూద్దాం...ఎవరు రాస్తారో..!
ఇది వెన్నెల వెళయనీ మల్లెల మాసమనీ......ఈ వాక్యాలే బాగున్నాయండీ....ఐతే ఒక్కసారి కూడా అనుమానం రాలేదండీ...మల్లెలకి వేళ ఏంటి..వెన్నెలకి మాసమేంటి అని...నన్నడిగితే అది కె.వి. మహదేవన్, సుశీల గారి మ్యాజిక్. ఏమంటారు.
ReplyDelete@ శ్రీ గారూ,
ReplyDeleteమీరన్నది నిజమేనండీ.! పాటలోని మాధుర్యానికి కట్టుబడి మనకి అసలా ఆలోచనే రాదు.
Thanks for visiting and for commenting :)
తొందర పడ్డ కోయిల గొంతులో పదాల తడబాటు సహజమే కదండీ :)
ReplyDeleteచక్కని పాటను మరొక్కసారి గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
@Shanky,
ReplyDelete"తొందర పడ్డ కోయిల గొంతులో పదాల తడబాటు సహజమే కదండీ"
వావ్.. భలే బాగా చెప్పారండీ.!
No no NO!!!
ReplyDeleteOMG .. where the heck is the younger generation going???
మల్లెలు సాయంత్రంలోనే విచ్చుకుంటాయి .. అందుకని మల్లెల వేళ.
వెన్నెల మధుమాసం (కార్తీక మాసానికి తరవాత)లోనే బహు శోభాయమానంగా ఉంటుంది .. అందుకని వెన్నెల మాసం ..
ఏంటో ఖర్మ .. ఇట్లాంటి ప్రత్యక్ష సత్యాలు కూడా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యాల్సి వస్తోంది!!
one more thing .. దేవులపల్లి ఆల్రెడీ రాసేసిన పద్యాల్నే పాటలుగా వాడుకునే వారు అన్నది కూడ ఇంచుమించు అబద్ధమే. నాకు తెలిసి ఒక్క మేఘ సందేశం సినిమాలో (అప్పటికే శాస్త్రిగారు పరమపదించారు) ఆకులో ఆకునై పాటని అలా వాడుకున్నారు. నాకు తెలిసినంతలో శాస్త్రిగారు ఆయా సినిమాలకి పనిగట్టుకుని పాటలు రాశారు. ఇదంతా మొదలెట్టింది బియెన్ రెడ్డిగారి మల్లీశ్వరి.
ReplyDelete@ కొత్తపాళీ గారూ,
ReplyDeleteఅయితే మల్లెల వేళ గురించీ, వెన్నెల మాసం గురించీ, నేనేదో పత్రికలో చదివింది తప్పన్నమాట! :( ఏం చేస్తాం చెప్పండి.. పత్రికలో రాసారంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళే రాసి ఉంటారని అది నిజమేననుకున్నా నేను. పత్రికల్లో రాసినవన్నీ నిజాలని నమ్మేయడం అజ్ఞానం అని మరోసారి రుజువైంది. :( విషయం వివరంగా చెప్పి నా కళ్ళు తెరిపించినందుకు చాలా థాంక్స్! :)